హనుమాన్ చాలీసా

హనుమంతుడి మీద తులసి దాస్ రాసిన స్తోత్రము

హనుమాన్ చాలీసా, (దేవనాగరి: हनुमान चालीसा; సాహిత్యపరంగా హనుమంతుని నలుబది శ్లోకాలు).[2][3][4] ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసిందని నమ్ముతారు[5]. తులసీదాసు ప్రసిద్ధ రచన రామచరితమానస[6][7]. "చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది. దీని అర్థం హిందీ భాషలో నలభై అని. అనగా హనూమన్ చాలీసాలో నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి.[8]

హనుమాన్ చాలీసా
రాముడిని తన గుండెలు చీల్చి చూపిస్తున్న హనుమంటుడు.
సమాచారం
మతంhey. Bhggvహిందూ
రచయితతులసీదాసు
భాషఅవధి [1]
పద్యాలు40

హనుమంతుడు రామ భక్తుడు. అతను రామాయణంలోని ప్రధాన పాత్రలలో ఒకడు. శైవ సంప్రదాయం ప్రకారం, హనుమంతుడు కూడా శివుని అవతారమే. జానపద కథలు హనుమంతుని శక్తులను కీర్తిస్తాయి[9]. హనుమంతుని గుణాలు - అతని బలం, ధైర్యం, జ్ఞానం, బ్రహ్మచర్యం, రాముని పట్ల అతని భక్తి, అతనికి గల అనేక పేర్లు - హనుమాన్ చాలీసాలో వివరంగా ఉన్నాయి[10]. హనుమాన్ చాలీసా పఠించడం లేదా జపించడం ఒక సాధారణ మతపరమైన ఆచారం[11]. హనుమాన్ చాలీసా అనేది హనుమంతుని స్తుతించే అత్యంత ప్రజాదరణ పొందిన శ్లోకం, దీనిని ప్రతిరోజూ మిలియన్ల మంది హిందువులు పఠిస్తారు.[12]

వివరణ

హనుమాన్ చాలీసాను తులసీదాస్ రచించాడు. అతను 16వ శతాబ్దం లో నివసించిన కవి-సన్యాసి. శ్లోకం యొక్క చివరి పద్యంలో అతను తన పేరును పేర్కొన్నాడు. హనుమాన్ చాలీసా 39వ శ్లోకంలో ఎవరైతే హనుమంతునిపై పూర్తి భక్తితో జపిస్తారో వారికి హనుమంతుని అనుగ్రహం కలుగుతుందని చెప్పబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో, చాలీసాను పఠించడం వలన తీవ్రమైన సమస్యలలో హనుమంతుని దైవిక జోక్యాన్ని ప్రేరేపిస్తుందని చాలా ప్రజాదరణ పొందిన నమ్మకం.

రచయిత

ఎక్కువగా వాడబడే తులసీదాసు చిత్రం

తులసీదాస్[13] (1497/1532-1623) ఒక హిందూ కవి-సన్యాసి, సంస్కర్త. అతను రామభక్తికి ప్రసిద్ధి చెందిన తత్వవేత్త. అనేక ప్రసిద్ధ రచనల స్వరకర్త. అతను రామచరితమానస్ అనే ఇతిహాసం రచయితగా గుర్తింపు పొందాడు. ఇది తన మాతృభాష అయిన అవధి భాషలో రామాయణాన్ని రామచరిత మానస్ గా రచించాడు[14]. తులసీదాస్ తన జీవితకాలంలో సంస్కృతంలో అసలు రామాయణాన్ని రచించిన వాల్మీకి పునర్జన్మగా ప్రశంసించబడ్డాడు. తులసీదాసు మరణించే వరకు వారణాసి నగరంలోనే నివసించాడు[15]. వారణాసి లోని తులసి ఘాట్‌కి అతని పేరు పెట్టారు[13]. అతను వారణాసిలో హనుమంతునికి అంకితం చేయబడిన సంకట్ మోచన్ హనుమాన్ ఆలయాన్ని స్థాపించాడు. అతను హనుమంతుని దర్శనం పొందిన ప్రదేశంలో ఉన్నాడని నమ్ముతారు[16]. తులసీదాస్ రామాయణం జానపద-నాటకం అనుసరణ అయిన రాంలీలా నాటకాలను ప్రారంభించాడు[17]. అతను హిందీ, భారతీయ, ప్రపంచ సాహిత్యంలో గొప్ప కవులలో ఒకరిగా ప్రశంసించబడ్డాడు.[18][19][20][21] భారతదేశంలోని కళ, సంస్కృతి, సమాజంపై తులసీదాస్ రచనల ప్రభావం విస్తృతంగా ఉంది అతని ప్రభావాన్ని అతని మాతృభాష, రాంలీలా నాటకాలు, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, టెలివిజన్ ధారావాహికలలో ఇప్పటి వరకు చూడవచ్చు.[17][22][23][24]

భాష

హనుమాన్ చాలీసాలోని 40 శ్లోకాలలో ప్రారంభంలో 2 ద్విపదలు, ముగింపులో ఒక ద్విపద ఉన్నాయి[25]. చాలీసా వివరాలు అతని జ్ఞానం, రాముని పట్ల, కోరిక లేకుండా మనిషి పట్ల ఉన్న భక్తి. భక్తి సాహిత్యం విషయానికొస్తే, తులసీదాస్ తన గురువును స్తుతిస్తూ రెండు ద్విపదలతో పద్యం ప్రారంభించాడు[26][27]. చాలీసా భాష అవధి భాషలో ఉంది.[28]

దైవం

హనుమాన్ చాలీసాలో ప్రధానంగా సంబోధించే దైవం హనుమంతుడు. అతను రామాయణంలో ప్రధాన పాత్ర అయిన రాముని (విష్ణువు యొక్క ఏడవ అవతారం) భక్తుడు. లంకలో రామణాసురునితో జరిగిన యుద్ధంలో వానర సేనాపతిగా హనుమంతుడు రామునికి సహకరిస్తాడు. హనుమంతుడు రామ రావణ యుద్ధంలో పోరాట యోధునిగా కనిపిస్తాడు. వివిధ మతపరమైన, సాంస్కృతిక సంప్రదాయాలలో, ముఖ్యంగా హిందూ మతంలో కొన్ని భక్తి సంప్రదాయాల ప్రకారం తరచుగా పూజించే వ్యక్తి హనుమంతుడు.[29] [30] హనుమంతుడు ప్రధాన దైవంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. అతను ఏడుగురు చిరంజీవులలో (అమరులు) ఒకడు. హనుమంతుడు మహాభారతంలో అర్జునుడి రథంపై గల ధ్వజం (జెండా) పై కూడా చిత్ర రూపంలో కనిపిస్తాడు.

రచనా శైలి

ఈ రచనలో నలభై మూడు పద్యాలు ఉన్నాయి. అందులో రెండు పరిచయ దోహాలు, నలభై చౌపాయిలు, చివరికి ఒక దోహా[31]. మొదటి పరిచయ దోహా హనుమంతుని గురువుగా పరిగణించబడే శివుడిని సూచించే శ్రీ అనే పదంతో ప్రారంభమవుతుంది[32]. హనుమంతుని మంగళకరమైన రూపం, జ్ఞానం, సద్గుణాలు, శక్తులు, శౌర్యం మొదటి పది చౌపాయిలలో వివరించబడ్డాయి.[33][34][35] పదకొండు నుండి ఇరవై చౌపాయిలు రాముని సేవలో హనుమంతుని చర్యలను వివరిస్తాయి. పదకొండవ నుండి పదిహేనవ చౌపాయిలు లక్ష్మణుడిని స్పృహలోకి తీసుకురావడంలో హనుమంతుని పాత్రను వివరిస్తాయి[33][36]. ఇరవై ఒకటవ చౌపాయ్ నుండి, తులసీదాస్ హనుమంతుని కృపా అవసరాన్ని వివరిస్తాడు[37]. చివరలో, తులసీదాస్ హనుమంతుడిని నిగూఢమైన భక్తితో నమస్కరించి, అతని హృదయంలో, భక్తుల హృదయంలో నివసించమని అభ్యర్థించాడు[38]. రాముడు, లక్ష్మణుడు, సీతతో పాటు హనుమంతుని హృదయంలో నివసించమని ముగింపు దోహా మళ్లీ అభ్యర్థిస్తుంది.[39]

వ్యాఖ్యానాలు

హనుమంతుడు, సీత, లక్ష్మణునితో ఉన్న రాముడిని భరతుడు దర్శించుట.

1980లకు ముందు, హనుమాన్ చాలీసాపై ఎలాంటి వ్యాఖ్యానాలు రూపొందించబడలేదు, రామభద్రాచార్య తులసీదాస్ రచించిన రచనలను సేకరించిన ముద్రిత సంచికలలో ఈ రచనను చేర్చలేదు[40]. హనుమాన్ చాలీసాపై మొదటి సంక్షిప్త వ్యాఖ్యానాన్ని ఇందుభూషణ్ రామాయణి రచించాడు[40]. 1983లో రచించిన హిందీలో రామభద్రాచార్య రాసిన మహావీరి వ్యాఖ్యానం రామ చంద్ర ప్రసాద్ చేత హనుమాన్ చాలీసాపై ఉత్తమ వ్యాఖ్యానంగా పిలువబడింది.[41]

జనాదరణ పొందిన సంస్కృతిలో

హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ మిలియన్ల మంది హిందువులు పఠిస్తారు[42]. భారతదేశంలోని చాలా మంది అభ్యసిస్తున్న హిందువులు దాని వచనాన్ని కంఠస్థం చేసి పఠిస్తారు[43]. ఈ పని విభిన్న విద్యా, సామాజిక, భాషా, సంగీత, భౌగోళిక సమూహాలకు చెందిన వ్యక్తులలో ప్రసిద్ధి చెందింది.[43]

రచనా నేపథ్యం

తులసీదాసు తీర్థాటన చేస్తూ పండరీపురం చేరి, అక్కడ కొంతకాలం నివసించాడు. ఒక రోజున తన నిత్యకృత్యాల్లో భాగంగా 'చంద్రభాగా' నదిలో స్నానం చేసి, విఠలనాథుని ధ్యానిస్తూ నదీ తీరాన కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో ఒక అంధుడు ఇంట్లో తగాదాపడి, నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని అక్కడికొచ్చాడు. ధ్యానంలో ఉన్న తులసీదాసును ఆ అంధుడి పాదాలు తగిలాయి. అతడు పడిపోయాడు. తులసి వెంటనే ఆ అంధుణ్ని పైకిలేపి, ఆలింగనం చేసుకుని 'క్షమించు నాయనా! నీ కృపాదృష్టిని నాపైన ప్రసరింపజెయ్యి... ఇటు చూడు' అన్నాడు. అంతే... అంధుడికి చూపు వచ్చింది. పరమానందంతో తులసీదాసు పాదాలపైనపడి "స్వామీ! మీరు నా పాలిట సాక్షాత్తు పాండురంగస్వామే. నాకు దృష్టిని ప్రసాదించారు. మరో జన్మకు నన్ను అర్హుణ్ని చేశారు. ఈ పునర్జన్మను ఆధ్యాత్మిక సేవతో సద్వినియోగం చేసుకుంటాను" అని అన్నాడు. దానికి తులసీదాసు "నాయనా. ఇది నా మహిమ కాదు. నేను సామాన్యుణ్ని. విఠల ప్రభువు అనుగ్రహ ప్రాప్తి కలిగింది నీకు. అది దివ్యదృష్టి. నీ శేష జీవితాన్ని దైవచింతనతో ధన్యం చేసుకో!" అని చెప్పాడు. ఈ విషయం ఆ కాలంలో భారతదేశాన్ని పాలిస్తున్న అక్బరు పాదుషాకు తెలిసింది. తన కొలువుకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. కొన్ని మహిమలు చూపి పారితోషికాలను స్వీకరించవలసినదిగా ఆయనను కోరాడు. దానికి తులసీదాసు తన వద్ద మహిమలు లేవనీ, నిమిత్తమాత్రుడననీ తెలియజేశాడు. ఏవైనా మహిమలు జరిగితే అవి శ్రీరామ చంద్రుని లీలలేనని తెలియజేసాడు. దానికి అక్బరుకు ఆగ్రహం కలిగింది. తన ఆజ్ఞను ధిక్కరించినందుకు భటుల్ని పిలిచి తులసీదాసును కొరడాలతో కొట్టవలసిందిగా ఆదేశించాడు. తులసి రెండు చేతులు జోడించి రామనామ స్మరణం చేశాడు. భటుల చేతుల్లోని కొరడాలు లేచినవి లేచినట్లే ఉండిపోయాయి. అక్బరుతో సహా భటులను భయంకరమైన చూపులతో, అరుపులతో అసంఖ్యాకమైన కోతులు బెదిరించసాగాయి. అంతా నిలువునా కంపించిపోసాగారు. చుట్టూ చేరిన కోతులు వాళ్లను అడుగైనా కదలనివ్వడం లేదు. అక్బరు దిగ్భ్రాంతి చెంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. తన పొరపాటు తెలుసుకున్నాడు. తులసీదాసు పాదాల మీద పడిపోయి కన్నీరు, మున్నీరుగా విలపించసాగాడు. తులసికేమీ అర్థం కాలేదు. కారణమడిగితే తన దయనీయస్థితిని వివరించాడు అక్బరు. తనకే కోతులు కనిపించడం లేదే. భక్తి ప్రపత్తులతో హనుమను ప్రార్థించాడు- 'స్వామీ! నాపైన ఎందుకింత నిర్దయ? వీరందరికీ దర్శనమిచ్చి కరుణించావు కదా, నాకెందుకా సౌభాగ్యం ప్రసాదించవు? నేను చేసిన అపరాధం ఏదైనా ఉంటే క్షమించు' అంటూ దుఃఖ బాష్పధారలు స్రవిస్తూంటే, ఎలుగెత్తి వాయునందనుణ్ని అనేక విధాల స్తుతిచేశాడు. ఆంజనేయుని దర్శనమొంది పరమానందభరితమైనాడు. అదే హనుమాన్‌ చాలీసాగా జగత్ప్రసిద్ధి పొందింది.

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసా పూర్తి శ్లోకాల కొరకు: హనుమాన్ చాలీసా

దోహా: శ్రీగురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధార
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచార |
బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ విహార |
చౌపాయీ:
జయ హనుమాన జ్ఞానగుణసాగర
జయ కపీశ తిహుఁ లోక ఉజాగర | 1

రామదూత అతులితబలధామా
అంజనిపుత్ర పవనసుత నామా | 2

మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతి కే సంగీ | 3
-----------------
-----------------
-----------------

యహశతవార పాఠ కర కోయీ
ఛూటహి బంది మహా సుఃఖ హోయీ | 38

జో యహ పఢై హనుమాన చలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39

తులసీదాస సదా హరి చేరా
కీఁజై నాథ హృదయ మహ డేరా | 40
దోహా: పవనతనయ సంకట హరణ మంగళ మూరతి రూప్
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్ |

తెలుగు అనువాదం

ఎమ్మెస్ రామారావు గారు హనుమాన్ చాలీసాని తెలుగులోకి అనువాదం చేశారు[44]. అదియే క్రింద ఇవ్వబడినది.

శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాథక శరణములు
 
బుద్దిహీనతను కల్గిన తనువులు
బుద్భుదములని తెలుపు సత్యములు
 
||శ్రీ హనుమాను||
 
జయహనుమంత ఙ్ఞాన గుణవందిత
జయ పండిత త్రిలోక పూజిత
 
రామదూత అతులిత బలధామ
అంజనీ పుత్ర పవన సుతనామ
 
ఉదయభానుని మధుర ఫలమని
భావన లీల అమృతమును గ్రోలిన
 
కాంచన వర్ణ విరాజిత వేష
కుండలమండిత కుంచిత కేశ
 
||శ్రీ హనుమాను||
 
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి
 
జానకీ పతి ముద్రిక దోడ్కొని
జలధిలంఘించి లంక జేరుకొని
 
సూక్ష్మ రూపమున సీతను జూచి
వికట రూపమున లంకను గాల్చి
 
భీమ రూపమున అసురుల జంపిన
రామ కార్యమును సఫలము జేసిన
 
||శ్రీ హనుమాను||
 
సీత జాడగని వచ్చిన నిను గని
శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని
 
సహస్ర రీతుల నిను కొనియాడగ
కాగల కార్యము నీపై నిడగ
 
వానర సేనతో వారధి దాటి
లంకేశునితో తలపడి పోరి
 
హోరు హోరునా పోరు సాగిన
అసురసేనల వరుసన గూల్చిన
 
||శ్రీ హనుమాను||
 
లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ
సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
 
రామ లక్ష్మణుల అస్త్రధాటికీ
అసురవీరులు అస్తమించిరి
 
తిరుగులేని శ్రీ రామ బాణము
జరిపించెను రావణ సంహారము
 
ఎదురిలేని ఆ లంకాపురమున
ఏలికగా విభీషణు జేసిన
 
||శ్రీ హనుమాను||
 
సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారతులందిరి
 
అంతులేని ఆనందాశృవులే
అయోధ్యాపురి పొంగిపొరలె
 
సీతా రాముల సుందర మందిరం
శ్రీకాంతుపదం నీ హృదయం
 
రామ చరిత కర్ణామృత గాన
రామ నామ రసామృతపాన
 
||శ్రీ హనుమాను||
 
దుర్గమమగు ఏ కార్యమైనా
సుగమమే యగు నీకృపజాలిన
 
కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీ రక్షణ యున్న
 
రామ ద్వారపు కాపరివైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
 
భూత పిశాచ శాకిని ఢాకిని
భయపడి పారు నీనామజపము విని
 
||శ్రీ హనుమాను||
 
ధ్వజావిరాజా వజ్ర శరీరా
భుజ బల తేజా గధాధరా
 
ఈశ్వరాంశ సంభూత పవిత్రా
కేసరీ పుత్ర పావన గాత్ర
 
సనకాదులు బ్రహ్మాది దేవతలు
శారద నారద ఆదిశేషులు
 
యమ కుబేర దిగ్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తి గానముల
 
||శ్రీ హనుమాను||
 
సోదరభరత సమానా యని
శ్రీ రాముడు ఎన్నిక గన్న హనుమా
 
సాధులపాలిట ఇంద్రుడవన్నా
అసురుల పాలిట కాలుడవన్నా
 
అష్టసిద్ది నవ నిధులకు దాతగ
జానకీమాత దీవించెనుగా
 
రామ రసామృత పానము జేసిన
మృత్యుంజయుడవై వెలసినా
 
||శ్రీ హనుమాను||
 
నీనామ భజన శ్రీరామ రంజన
జన్మ జన్మాంతర ధుఃఖ బంజన
 
ఎచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు,
 
ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగ మారుతి సేవలు సుఖములు
 
ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాను నర్తన
 
||శ్రీ హనుమాను||
 
శ్రద్దగ దీనిని ఆలకింపుమా
శుభమగు ఫలములు కలుగు సుమా
 
భక్తిమీరగ గానము చేయగ
ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ,
 
తులసీదాస హనుమాన్ చాలిసా
తెలుగున సుళువుగ నలుగురు పాడగ
 
పలికిన సీతారాముని పలుకున
దోషములున్న మన్నింపుమన్న
 
||శ్రీ హనుమాను||
 
మంగళ హారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత
నీవే అంతా శ్రీ హనుమంత
 
ఓం శాంతిః శాంతిః శాంతిః

సర్వ కార్య సిద్ధి

రామచరిత మానసము అనే గ్రంథము వ్రాసిన శ్రీ తులసి దాసుకు హనుమంతుని దర్శనము జరిగిన పిదప, ఆ ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని ప్రతీతి.

శ్లోకం :
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా |
అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ ‍‍‍‌‍‍||

భావం:కేవలం హనుమంతుని స్మరించటం వలన బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగము లేకపోవుట,జడత్వం తొలగుట,వాక్శుద్ధి, సాధ్యం కాని పనులు సాధ్యమగుట మున్నవి కలుగునని తులసీదాసు పైన తెలుపబడిన ద్విపదలో చెప్పాడు.

మాధ్యమాలు

ధ్వనిరూపంలో[45], దృశ్య శ్రవణ రూపంలో డిజిటల్ యానిమేషన్ రూపంలో హనుమాన్ చాలీసాను రూపొందించారు.[46]

మూలాలు

వెలుపలి లింకులు

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: