అమీబియాసిస్

అమీబియాసిస్ వ్యాధి ఎంటమీబా హిస్టోలిటికా అనే ప్రోటోజోవా పరాన్న జీవి వల్ల వస్తుంది. ఈ జీవి కోశీయ దశలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడిలో ప్రవేశిస్తుంది. పేగులో కోశీయ దశ నుంచి వెలువడిన జీవులు పేగు గోడపై దాడి చేసి పుండ్లను ఏర్పరుస్తాయి. దీనివల్ల రక్తం, జిగట పదార్థాలతో కూడిన విరోచనలవుతాయి. మలం దుర్వాసనతో ఉంటుంది. ఈ వ్యాధినే అమీబిక్ డీసెంటరీ అనికూడా పిలుస్తారు. సరైన ఔషధంతో అమీబియాసిస్ ను పూర్తిగా నయం చేయవచ్చు. ఆహారం, నీటిపై మూతలను ఉంచడం, వంట, భోజనానికి ముందు చేతులను శుభ్రపరచుకోవడం, కూరగాయలను, పండ్లను కడగడం లాంటి చర్యల ద్వారా వ్యాధి రాకుండా చేయవచ్చు.

అమీబియాసిస్
SpecialtyInfectious diseases Edit this on Wikidata
ఎంటమీబా హిస్టోలిటికా' జీవిత చక్రము

చరిత్ర

ఈ వ్యాధిని మొదటిసారిగా ఫెడర్ ఎ. లోష్ 1875 లో ఉత్తర రష్యాలో కనుగొన్నాడు.[1] 1933 లో షికాగో ప్రపంచ సంతలో తాగునీరు కలుషితం కావడం వల్ల చాలామంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. వెయ్యి మందికి పైగా ఈ వ్యాధి సోకగా 98 మంది మరణించారు.[2][3]

లక్షణాలు, చిహ్నాలు

ఇది సోకిన వారిలో 90 శాతం వరకు ఎటువంటి లక్షణాలు బయటికి కనిపించవు. కానీ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 వేల నుంచి లక్షమంది వరకు ఈ వ్యాధి సోకి మరణిస్తున్నారని ఒక అంచనా. ఈ వ్యాధికి చికిత్స తీసుకోకపోతే ఇన్‌ఫెక్షన్ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. లక్షణాలు బయట పడటానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల దాకా పట్టవచ్చు. సాధారణంగా 2 నుంచి 4 వారాలు పడుతుంది. విరేచనాలు, ఒక్కోసారి రక్తంతో కూడుకున్నది, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి దీని ప్రధాన లక్షణాలు.

నివారణ, చికిత్స

ఈ వ్యాధి నివారణకు ఇంటి చిట్కాలు కొన్ని పాటించాలి.

  • టాయిలెట్ కి వెళ్ళిన తర్వాత, తినడానికి ముందు, సబ్బుతో చేతులు కనీసం పది సెకన్ల పాటు పరిశుభ్రంగా కడుక్కోవడం
  • స్నానాల గదులను, టాయిలెట్లు, కొళాయిల ను అప్పుడప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉండటం.
  • టవళ్ళు, ఫేస్ వాషర్స్ ను చాలా మంది పంచుకోకుండా ఉండటం

మూలాలు