కాంటెంపరరీ ఆర్ట్

కాంటెంపరరీ ఆర్ట్ (ఆంగ్లం: Contemporary Art) అనగా నేటి, ఈ నాటి కళ. ఈ కళ చిత్రలేఖనం, శిల్పకళ, ఫోటోగ్రఫీ, నాటకం, నృత్యం లేదా వీడియో ఏదైనా కావచ్చును. [1] 20, 21వ శతాబ్దాల లో సృష్టించబడిన ఏ కళాఖండాన్నైనా కాంటేంపరరీ ఆర్ట్ క్రింద జమ కట్టవచ్చు. [2] అయితే మాడర్న్ ఆర్ట్ వేరు, కాంటెంపరరీ ఆర్ట్ వేరు.[3] 1860-1880 లలో ప్రారంభం అయ్యి, 1950-1960ల వరకు కొనసాగింది మాడర్న్ ఆర్ట్ అయితే దాని తర్వాతి కాలం లో వచ్చిందే (పోస్ట్-మాడర్న్) కాంటెంపరరీ ఆర్ట్.

స్పెయిన్ లో 22 మీటర్ల ఎత్తు గల డోనా ఈ ఓసెల్ (వుమన్ అండ్ బర్డ్) అనే కాంటెంపరరీ కళాఖండం

నిర్వచనం

రాయల్ డచ్ షెల్ సంస్థ నైజీరియా లోని నైజర్ నది ఒడ్డున ఇంధన వెలికితీత ప్రక్రియ లో అక్కడి పర్యావరణాన్ని దెబ్బతీయటం సూచిస్తూ కాంటెంపరరీ శైలిలో తైలవర్ణానికి బదులు కాఫీ పొడిని వాడి వేయబడ్డ చిత్రలేఖనం.

కాంటెంపరరీ ఆర్ట్ నిర్వచనం గమ్మత్తు అయినది. కాంటెంపరరీ (ప్రస్తుతం) అనే పదం చాలా సరళమైనది, సూటి అర్థం కలది అయిననూ, నేటి ఆధునిక కాలం లో కాంటెంపరరీ ఆర్ట్ యొక్క అర్థానికి అంత స్పష్టత లేదు. చిత్రలేఖన చరిత్ర గురించి, ఈ కళ లోని అంశాల గురించి తెలిసి ఉంటే మాత్రం కాంటెంపరరీ ఆర్ట్ యొక్క అర్థం తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.[1] వేగంగా మారుతోన్న కాలంలో "వర్తమానం", "ప్రస్తుతం" అనే పదాల వలన కాంటెంపరరీ ఆర్ట్ ను అర్థం చేసుకోవటం లో కొంత అయోమయం ఏర్పడుతుంది. కావున కాంటెంపరరీ ఆర్ట్ సరిగ్గా ఎప్పటి నుండి మొదలు అయ్యింది అని చెప్పటం కష్టమే అయినా, కొందరు కళా చరిత్ర కారుల మాత్రం 1960-70 లలో కాంటెంపరరీ ఆర్ట్ మొదలు అయ్యి ఉండవచ్చునని అభిప్రాయపడతారు.

వివరణ

కాంటెంపరరీ ఆర్ట్ లో ప్రయోగానికి పెద్దపీట వేయబడుతుంది. కళలో వినూత్నత నుండి సాంప్రదాయ పద్ధతులను అవలంబిస్తూ, టూ-డైమెన్షనల్ నుండి త్రీ-డైమెన్షనల్ కళలను కలబోస్తూ, కాంటెంపరరీ ఆర్టిస్టులు వారి కళాఖండాలతో కళాప్రేమికులను ప్రేరేపిస్తూ, వారికి సవాళ్ళు విసురుతూ ఉంటారు.[2] వర్తమానాన్ని అర్థం చేసుకోవటానికి గతాన్ని ఒక పరికరం లాగా వాడుకొంటూ, భవిష్యత్తును కళ్ళ ముందు ఆవిష్కరింపజేస్తూ ఉంటారు.

కాంటెంపరరీ ఆర్ట్ కు మాడర్న్ ఆర్ట్ కు మధ్య గల భేదాలు

ఒకే కాలావధిని సూచిస్తున్నట్లు అగుపించినా, కాంటెంపరరీ ఆర్ట్ వేరు, మాడర్న్ ఆర్ట్ వేరు.

మాడర్న్ ఆర్ట్

ఎప్పుడైతే కళ, కళాశాలలో కళ గురించి బోధింపబడే అంశాలను తిరస్కరించిందో అప్పుడు కళ ను ఆధునికం (మాడర్న్ ఆర్ట్) అని వ్యవహిరించటం జరిగింది. వాస్తవిక ప్రపంచానికి దూరంగా, కంటికి కనబడే దృక్కోణాన్ని విస్మరించి సాంప్రదాయేతరంగా సృష్టించబడిన ఆధునిక కళే మాడర్న్ ఆర్ట్.[3] వీక్షకులకు, కళా విమర్శకులకు ఇది మింగుడు పడలేదు. అయితే కొంత మంది కళాకారులు మాత్రం సారూప్య చిత్రలేఖనం అయినా, నైరూప్య చిత్రలేఖనం అయినా మాడర్నిస్టు శైలిని ఉపయోగించి వారి మాధ్యమం పై దృష్టి మరల్చుకోవాలి అనుకొన్నారు. ఇంప్రెషనిజం, క్యూబిజం, సర్రియలిజం, ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం వంటి అనేకానేక కళా ఉద్యమాల కలగూరగంపే మాడర్న్ ఆర్ట్.

కాంటెంపరరీ ఆర్ట్

సాంకేతిక పురోగతి చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, శిల్పకళ ల పై ఏ విధంగా ప్రభావం చూపిందో తెలిపే శైలియే కాంటెంపరరీ ఆర్ట్.[2] సౌందర్య సృష్టిని ధిక్కరించి సృష్టించే కళాఖండం, అందులోని అంశాన్ని తెలియజేయటమే కాంటెంపరరీ ఆర్ట్ యొక్క లక్షణం.[3] కాంటెంపరరీ ఆర్ట్ లో తుది ఫలితం యొక్క ప్రాధాన్యత తుక్కువ. కళాకారుడు ఆ ప్రక్రియను ఎలా అవలంబించాడు అనే ప్రశ్నకే ప్రాధాన్యత ఎక్కువ. ఈ ప్రక్రియ లో ఈ నాటి వీక్షకుడి అభిప్రాయం కూడా చర్చకు వస్తుంది.

చిత్రలేఖన చరిత్ర

కాన్వాస్ పై ఆక్రిలిక్ తో కాంటెంపరరీ శైలి లో ఒక చిత్రలేఖనం

కాంటెంపరరీ ఆర్ట్ కు అప్పటి వరకు ఉన్న కళా ఉద్యమాలు దారులు వేశాయి. వాటిలో కొన్ని:

పాప్ ఆర్ట్

అప్పటికే ఉన్న ఆధునిక కళకు సంబంధించిన కళా ఉద్యమాలకు స్పందనగా, పాప్ ఆర్ట్ పునాదిగా కాంటెంపరరీ ఆర్ట్ ప్రాణం పోసుకొంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి కాలం లో బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు కు ఆండీ వార్హోల్, రాయ్ లిచ్తెన్స్టీన్ లు పాప్ ఆర్ట్ ను సృష్టించారు. సామూహిక సంస్కృతులను చిత్రీకరించటం, వాణిజ్య ఉత్పత్తులను క్రొత్త కోణాల లో ఊహించి చిత్రీకరించటం వంటి ఆసక్తులతో పాప్ ఆర్ట్ ప్రారంభం అయ్యింది. 50-70 ల ప్రాంతం లో ఇది కనుమరుగవగా, జెఫ్ కూన్స్ వంటి వారి వలన 80వ దశకంలో నియో పాప్ ఆర్ట్ గా దర్శనమిచ్చింది.[1]

ఫోటో రియలిజం

పాప్ ఆర్ట్ వలె ఫోటో రియలిజం కూడా కళాత్మక అంశాల పున:సృష్టి ప్రారంభించింది. చిత్రకారులు (ముఖచిత్రం, ప్రకృతి దృశ్యం లేదా ఏ ఇతర) ఫోటో ను (అయినా) చూసి అదే ఫోటోను మరల అచ్చుగుద్దినట్టు చిత్రలేఖనం చేయటమే ఫోటో రియలిజం. చక్ క్లోజ్, గెర్హార్డ్ రిచ్తర్ ఈ శైలి లో చిత్రీకరణ చేసేవారు.[1]

కాన్సెప్చువలిజం

కళను ఒక అమ్మదగిన వస్తువు గా పరిగణించటాన్ని కాన్సెప్చువలిజం తిరస్కరించింది. కళాఖండం పై కనబడే రేఖలు, ఆకారాలు, రంగుల కంటే, దాని నేపథ్యంలో ఉండే ఆలోచనకు కాన్సెప్చువలిజం మొదటి ప్రాధాన్యతను ఇచ్చింది. డామియెన్ హిర్స్ట్, ఐ వెయ్ వెయ్, జెన్నీ హోల్జర్ వంటి వారు కాన్సెప్చువలిజం ను అంది పుచ్చుకొన్నారు. 60వ దశకంలో పురుడు పోసుకొన్న ఈ శైలి ఇప్పటికి కూడా ఒక కాంటెంపరరీ కళా ఉద్యమంగానే పరిగణింపబడుతోంది.[1]

మినిమలిజం

కాంటెంపరరీ శైలి లో ఒక జర్మను శిల్పం

కాన్సెప్చువలిజం వలె, మినిమలిజం కూడా 60వ దశకంలో నే మొదలు అయ్యింది. టాటె మ్యూజియం ప్రకారం మినిమలిజం, కాన్సెప్చువలిజం ఈ రెండూ కళను సృష్టించడంలో, పంచడంలో, చూడడం లో అప్పటి వ్యవస్థలను తిరస్కరించాయి. అయితే మినిమలిజం ఒక కళాఖండం దేనిని సూచిస్తోందో ఆలోచించమని కాకుండా; సారళ్యం, నైరూప్యం లోని అందం (abstract aesthetic) వీక్షకులను తాము చూసిన దానికి ప్రతిస్పందించమని ఆహ్వానిస్తుంది. డొనాల్డ్ జుడ్, సోల్ లెవిట్, డాన్ ఫ్లావిన్ లు మినిమలిజం శైలిలో చిత్రకళ చేశారు.[1]

పెర్ఫార్మెన్స్ ఆర్ట్

వేదిక పై ప్రదర్శించే కళలు (నాట్యం, నాటకం) వంటి వాటిని చిత్రీకరించటమే పెర్ఫార్మన్స్ ఆర్ట్. కేవలం ఒక భంగిమనో, ఒక దృశ్యాన్నో చిత్రీకరించటం కాకుండా ఒక లక్ష్యాన్ని, ఒక సందేశాన్ని లేదా ఒక ఆలోచనను వ్యక్తపరచటం పెర్ఫార్మెన్స్ ఆర్ట్ యొక్క లక్షణం.[1]

ఇన్స్టాలేషన్ ఆర్ట్

స్టీలు, అల్యుమినియం, గాజు పలకల పై వెలుతురు కలిపిన ఇన్స్టాలేషన్ ఆర్ట్

ఇన్స్టాలేషన్ ఆర్ట్ లో చూపించబడే త్రీ-డీ నిర్మాణాలు విశ్వం పట్ల వీక్షకుడి దృక్కోణాన్ని మార్చేలా ఉంటాయి. ఈ నిర్మాణాలు, నిర్మించే ప్రదేశాన్ని బట్టి విశాలంగా సంకర్ష్ణణకు తావు ఇచ్చేలా ఉంటాయి. యయోయి కుసామా, డేల్ చిహులీ, బ్రూస్ మున్రో లు ఈ శైలిలో నిపుణులు.[1]

ఎర్త్ ఆర్ట్/ల్యాండ్ ఆర్ట్

సహజ ప్రకృతి దృశ్యాలను ప్రదేశానికి అనుగుణంగా కళాత్మకంగా తీర్చిదిద్దటమే ఎర్త్ ఆర్ట్. రాబర్ట్ స్మిత్సన్, క్రిస్టో, జీన్-క్లౌడ్, యాండీ గోల్డ్స్వర్తీ ఎర్ట్ ఆర్ట్ లో సిద్ధహస్తులు.[1]

స్ట్రీట్ ఆర్ట్

1980లలో గ్రాఫిటీ ఆర్ట్ జనాదరణకు నోచుకోవటంతో స్ట్రీట్ ఆర్ట్ కు ప్రాముఖ్యత పెరిగింది. అలోచనలు రేకెత్తించే స్ట్రీట్ ఆర్ట్ బహిరంగ ప్రదేశాలలో మ్యూరల్స్ గా, నిర్మాణాలుగా, స్టెన్సిల్ ఉపయోగించి ముద్రించే చిత్రలేఖనాలు గా, పలు రూపాల్లో దర్శనమిస్తుంది. జీన్ మైఖేల్ బాస్కియాత్, కెయ్త్ హ్యారింగ్, బాన్స్కీ, షెపార్డ్ ఫెయిరీ లు స్ట్రీట్ ఆర్టిస్ట్ లలో అనుభవం కల వారు.[1]

యంగ్ బ్రిటిష్ ఆర్ట్

80వ దశకానికి చెందిన ట్రేసీ ఎమిన్, డేమియన్ హిర్స్ట్, గేరీ హ్యూం, గవిన్ తుర్క్, కళకు కావలసిన పదార్థాలను సాహసోపేతంగా వాడటం, కళకు అపకీర్తి తెచ్చేలా ఉండటం, కళను ఈ దిశగా తీసుకెళ్తున్నా వారిలో ఎటువంటి అపరాధ భావం లేక పోవటం ప్రసార మాధ్యమాలలో ప్రాధాన్యత సంతరించుకొంది. యంగ్ బ్రిటిష్ ఆర్ట్ గా వ్యవహరింపబడే ఈ శైలి కూడా కాంటెంపరరీ ఆర్ట్ కు దోహదపడింది.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు