కొంకణి భాష

కొంకణి[note 4][note 1] అన్నది ఇండో యూరోపియన్ వర్గానికి చెందిన ఇండో ఆర్యన్ భాష, దీన్ని భారతదేశపు నైఋతి తీరమంతా మాట్లాడతారు. భారత రాజ్యాంగపు 8వ షెడ్యూల్లో ప్రస్తావించిన 22 షెడ్యూల్డ్ భాషల్లో ఇది ఒకటి.[2] గోవా రాష్ట్రానికి ఇది అధికారిక భాష. ప్రస్తుతం లభిస్తున్న మొట్టమొదటి కొంకణీ శాసనం సా.శ. 1187 నాటిది.[3] కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర కేరళ (కాసర్ గోడ్ జిల్లా), దాద్రా నగరు హవేలీడామన్ డయ్యుల్లో ఇది మైనారిటీ భాష.[4]

దేవనాగరి లిపిలో "కొంకణి" అనే పదం

కొంకణీ దక్షిణ ఇండో-ఆర్యన్ భాషా కుటుంబంలోనిది. ఇది ప్రాచీన ఇండో-ఆర్యన్ భాషా నిర్మాణాలను నిలబెట్టుకుంది[మూలాలు తెలుపవలెను], తూర్పు, పశ్చిమ ఇండో-ఆర్యన్ భాషలు రెంటితోనూ సాపత్యం కలిగివుంది.[5]

భాష పేర్లు

ప్రాచీన కొంకణీ భాషను కేవలం ప్రాకృత్ అని ఆ భాషా వ్యవహర్తలు పిలిచేవారు అనడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.[6]కర్ణాటకలోని శ్రావణబెళగొళ ప్రాంతంలో ఉన్న బాహుబలి భారీ విగ్రహం పాదాల వద్ద చెక్కిన వాక్యాల్లో ఉన్న రెండు లైన్లు ఇలా ఉన్నాయి: (i) శ్రీ చాముండరాజె కరవియలె (ii) శ్రీ గంగ రాజె సుత్థలె కరవియలె. మొదటి వాక్యం సా.శ. 981లోనూ, రెండవ వాక్యం సా.శ.1116-17ల్లోనూ చెక్కారు. డాక్టర్ ఎస్.బి.కులకర్ణి, డాక్టర్ జోస్ పెరైయాల ప్రకారం ఈ వాక్యాల్లోని భాష కొంకణీ. ఈ వాదాలను పరిగణనలోకి తీసుకుంటే శ్రావణ బెళగొళలో ఉన్నది దేవనాగరి లిపిలోని అత్యంత ప్రాచీన కొంకణీ శాసనం. 13వ శతాబ్దికి పూర్వపుసాహిత్యంలో కొంకణీ అన్న పదం లభించదు. 13వ శతాబ్దికి చెందిన మరాఠీ కవి నామదేవుడు రాసిన 263వ అభంగలో కొంకణీ అన్న పదం మొదటగా కనిపిస్తోంది.[7] కొంకణీ భాషకు కేనరిమ్, కాంకనిం, గోమంతకి, బ్రామన, గోవని వంటి పేర్లు కూడా ఉన్నాయి. అమ్చీ భాస్ (మన భాష) అని కూడా స్థానిక భాషా వ్యవహర్తలు (దక్షిణ కన్నడ ప్రాంతంలో అమ్చి గెలె అంటారు), ఇతరులు గోవిగోయెన్చీ భాస్ అనీ ఈ భాషని పిలుస్తూంటారు. విద్యావంతులైన మరాఠీ భాషీయులు దీన్ని గోమంతకి అని వ్యవహరిస్తారు.[8]

పోర్చుగీసు వారు కొంకణీని సాధారణంగా లింగ్యువా కేనరిమ్ అనీ[9], కేథలిక్ మిషనరీలు లింగ్యువా బ్రాహ్మణ అనీ పిలిచేవారు.[9] తర్వాతికాలంలో పోర్చుగీసు వారు కొంకణీని లింగ్యువా కొంకనిం అని పిలువనారంభించారు.[9]

కేనరిమ్ లేదా లింగ్యువా కేనరిమ్ అన్న పదాన్ని 16వ శతాబ్దికి చెందిన యూరోపియన్ జెసూట్ థామస్ స్టీఫెన్స్ తన ప్రఖ్యాత రచన ఆర్టె దె లింగ్యువా కేనరిమ్ పేరులోనే కొంకణి భాషను సూచిస్తూ వాడారు. ఈ పదం పర్షియన్ భాషలో సముద్ర తీరాన్ని సూచించే కినారా అన్న పదం నుంచి వచ్చివుండొచ్చు. సముద్ర తీరపు భాష అన్న అర్థం వస్తుంది. కన్నడ భాషను పిలిచే కినారీస్ అన్న పదంతో పొరబడేందుకు అవకాశం ఇస్తోంది.[10]

అందరు యూరోపియన్ రచయితలు గోవా భాషలో రెండు రూపాలను గమనించారు: సామాన్యుల భాషయైన కెనరిమ్, విద్యావంతులు వాడే లింగ్యువా కెనారిమ్ బ్రాహ్మణా లేదా బ్రాహ్మణా దె గోవా. వ్రాతకు, సభల్లో మాట్లాడేందుకు, మతపరమైన కార్యకలాపాలకు బ్రాహ్మణా దె గోవానే యూరోపియన్లు, ఇతర కులాల వారూ ఉపయోగించేవారు.[11]

చరిత్ర

వ్యుత్పత్తి

కొంకణ్, కొంకణీ అన్న పదాల వ్యుత్పత్తి గురించి వివిధ అభిప్రాయాలు, వాదనలు ఉన్నాయి.

  • కొంకణీ భాష ప్రారంభమైన ప్రాంతంలో మొదటి నుంచీ నివాసం ఉంటున్న కుక్కణ జాతి పేరు నుంచి కొంకణ్ అన్న పేరు వచ్చింది.[12]
  • హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు సముద్రంలోకి బాణం సంధించి అది పడిన చోటు వరకూ సముద్రాన్ని వెనక్కి వెళ్ళిపొమ్మన్నాడనీ, అలా బయటకు తేలిన కొత్త భూభాగాన్ని కోణ (మూల), కణ (భాగం) అంటూ మూల భూభాగం అన్న అర్థంలో కొంకణ్ అన్నారనీ, ఆ ప్రాంతపు భాషకు కొంకణీ అయిందని చెప్తారు. ఈ గాథ స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కనిపిస్తుంది.
  • కొంకణ్ అన్నది కొంకణీ అన్నదానికి సమానార్థకం కానీ ప్రస్తుతం కొంకణీ మాట్లాడే ప్రాంతం మహారాష్ట్ర (కొంకణ్ ప్రాంతం), గోవా, కర్ణాటక (ఉత్తర కర్ణాటక) ప్రాంతాలుగా విడిపోయింది..

Footnotes

References

ఇవి కూడా చూడండి

కొంకణ్ హోటల్స్

కోంకణ్