గాల్ గడోట్

గాల్ గాడోట్ వర్సనో (ఆంగ్లం Gal Gadot; 1985 ఏప్రిల్ 30) ఇజ్రాయెలీ నటి, మోడల్.[1] ఆమె మిస్ ఇజ్రాయెల్ 2004 కిరీటాన్ని పొందింది. మిస్ యూనివర్స్ 2004 పోటీలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత ఆమె ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో పోరాట ఫిట్‌నెస్ శిక్షకురాలిగా కొంత కాలం పనిచేసింది, ఆ తర్వాత ఆమె మోడలింగ్, నటనా వృత్తిపై ఆసక్తి కనబరిచింది. అదే సమయంలో రీచ్మాన్ విశ్వవిద్యాలయం (ఐడీసి హెర్జ్లియా)లో చదువుకోవడం కూడా ప్రారంభించింది.[2][3]

గాల్ గడోట్
అందాల పోటీల విజేత
2018లో గాల్ గడోట్
జననముగాల్ గడోట్
(1985-04-30) 1985 ఏప్రిల్ 30 (వయసు 38)
పెటా టిక్వా, ఇజ్రాయెల్
పూర్వవిద్యార్థిIDC హెర్జ్లియా
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం
ఎజెన్సీIMG మోడల్స్
ప్రధానమైన
పోటీ (లు)
  • మిస్ ఇజ్రాయెల్ 2004
    (విజేత)
  • మిస్ యూనివర్స్ 2004
    (పోటీదారు)
భర్త
జారోన్ వర్షనో
(m. 2008)
పిల్లలు3

ఆమె మొదటి అంతర్జాతీయ చలనచిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ (2009)లో గిసెల్ యాషర్ పాత్రలో నటించింది. బాట్‌మ్యాన్ v సూపర్‌మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్ (2016), వండర్ వుమన్ (2017)లతో సహా డీసి ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ చిత్రాలలో వండర్ వుమన్ పాత్ర పోషించినందుకు ఆమె గ్లోబల్ స్టార్‌డమ్ సాధించింది.[4][5] ఆమె నెట్‌ఫ్లిక్స్ యాక్షన్-కామెడీ చిత్రం రెడ్ నోటీసు (2021), మిస్టరీ చిత్రం డెత్ ఆన్ ది నైల్ (2022)లలో కూడా నటించింది.

2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల టైమ్ జాబితాలో ఆమె చేర్చబడింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పారితోషికం తీసుకునే నటీమణుల వార్షిక ర్యాంకింగ్స్‌లో ఆమెకు రెండుసార్లు స్థానం దక్కింది.

బాల్యం, విద్యాభ్యాసం

ఆమె 1985 ఏప్రిల్ 30న మైఖేల్ గాడోట్, ఇరిట్ దంపతులకు పెటా టిక్వాలో జన్మించింది. ఆమె తరువాత రోష్ హాయిన్ నగరంలో పెరిగింది.[6] ఆమె తండ్రి ఇంజనీర్ కాగా తల్లి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఆమెకి డానా అనే చెల్లెలు ఉంది.[7]

ఆమె 12 సంవత్సరాల పాటు జజ్, హిప్-హాప్ నృత్యాలు నేర్చుకుంది. ఆమె రోష్ హాయిన్‌లోని బిగిన్ హై స్కూల్ నుండి జీవశాస్త్రంలో పట్టభద్రురాలైంది. ఆమె 20 ఏళ్ళ వయసులో, రెండు సంవత్సరాల సైనిక సేవలో భాగంగా పోరాట ఫిట్‌నెస్ శిక్షకురాలిగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో చేరింది. 2009 చిత్రం ఫాస్ట్ & ఫ్యూరియస్‌లో గిసెల్ యాషర్ పాత్రను పోషించడానికి తన సైనిక నేపథ్యం తనకు సహాయపడిందని ఆమె ఒక ఇంటర్వ్వూ లో చెప్పింది.[8] ఆమె సైనిక సేవ తర్వాత, ఇజ్రాయెల్‌లోని రీచ్‌మాన్ విశ్వవిద్యాలయం (ఐడిసి హెర్జ్లియా కళాశాల)లో న్యాయశాస్త్రం అభ్యసించింది.[9]

వ్యక్తిగత జీవితం

ఆమె 2008లో ఇజ్రాయెలీ రియల్ ఎస్టేట్ డెవలపర్ జారోన్ యారోన్ వర్సనోను వివాహం చేసుకుంది.[10] వారికి ముగ్గురు కుమార్తెలు 2011, 2017, 2021లలో జన్మించారు.[11] భర్తతో కలసి ఆమె చలనచిత్ర-టెలివిజన్ నిర్మాణ సంస్థ పైలట్ వేవ్‌ను 2019లో స్థాపించింది.[12]

ఆమె ఆసక్తిగల యుద్ధ కళల ఔత్సాహికురాలు. ఆమె కరాటే, క్రావ్ మాగా రెండింటిలోనూ బ్లాక్ బెల్ట్ కలిగి ఉంది. ఆమె ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)కి శిక్షకురాలిగా పనిచేసింది. మార్షల్ ఆర్ట్స్‌లో ఆమెకున్న విస్తృతమైన నేపథ్య పరిజ్ఞానం, ఆమె వండర్ వుమన్ పాత్రను పోషించడంలో కీలక పాత్ర పోషించింది.[13][14][15]

మూలాలు