దలైలామా

టిబెట్ బౌద్ధుల మతాచార్యుడు

దలైలామా, టిబెట్ ‌లోని గెలుగ్ శాఖకు చెందిన బౌద్ధుల ఆచార్య పదవి పేరు. టిబెట్ లోని సాంప్రదాయిక బౌద్ధ శాఖల్లో ఇది అత్యంత నవీనమైనది. [1] ప్రస్తుత దలైలామా, దలైలామాల పరంపరలో 14 వ వారు,భారతదేశంలో శరణార్థిగా నివసిస్తున్నాడు. అతడి పేరు టెన్జిన్ గయాట్సో . దలైలామాను తుల్కస్ శ్రేణిలో ఒకడిగా పరిగణిస్తారు. తుల్కస్ అంటే కారుణ్య బోధిసత్వుడైన అవలోకితేశ్వరుడి అవతారమని భావిస్తారు [2] [3]

దలైలామా
Standard Tibetan: ཏཱ་ལའི་བླ་མ་
Wylie transliteration: tā la'i bla ma
Incumbent
Tenzin Gyatso, 14th Dalai Lama

since 1940 ఫిబ్రవరి 22
విధంHis Holiness
అధికారిక నివాసంధర్మశాల, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
నిర్మాణం1391
మొదట చేపట్టినవ్యక్తిGendun Drup, 1st Dalai Lama

17 వ శతాబ్దంలో 5 వ దలైలామా కాలం నుండి, అతని మూర్తిమత్వం ఎల్లప్పుడూ టిబెట్ ఏకీకరణకు చిహ్నంగా ఉంటూ వచ్చింది. అతను బౌద్ధ విలువలకు, సంప్రదాయాలకూ ప్రాతినిధ్యం వహించాడు. [4] మధ్య టిబెట్‌లో రాజకీయం గాను, సంఖ్యాపరం గానూ ఆధిపత్యం వహించిన గెలుక్ శాఖలో దలైలామా ఒక ముఖ్యమైన వ్యక్తి. కానీ అతని మత అధికారం వివిధ బౌద్ధ శాఖల సరిహద్దులను దాటిపోయింది. దలైలామాకు ఏ శాఖ సంప్రదాయాలలోనూ అధికారిక లేదా సంస్థాగత పాత్ర లేదు. ఆయా శాఖలకు చెందిన స్వంత ఉన్నత లామాలే శాఖకు నేతృత్వం వహిస్తారు. అయినప్పటికీ, దలైలామా టిబెటన్ ఏకీకృత రాజ్యానికి చిహ్నం. బౌద్ధ విలువలు సంప్రదాయాలకు సంబంధించినంత వరకు ఏ బౌద్ధ శాఖ కంటే కూడా ఉన్నతంగా ప్రాతినిధ్యం వహిస్తాడు. [5] భిన్నమైన మత ప్రాంతీయ సమూహాలను కలిపి, అందరికీ ఆరాధ్యుడైన వ్యక్తిగా ఉండే దలైలామా యొక్క సాంప్రదాయిక పనితీరును ప్రస్తుత పద్నాలుగో దలైలామా చేపట్టాడు. బహిష్కృత సమాజంలో విభేదాలను, విభజనలనూ అధిగమించడానికి అతను పనిచేశాడు. టిబెట్ లోను, ప్రవాసం లోనూ ఉన్న టిబెటన్లకు జాతీయతా చిహ్నంగా మారాడు. [6]

1642 నుండి 1705 వరకు, మళ్ళీ 1750 నుండి 1950 ల వరకు, దలైలామాలు లేదా వారి ప్రతినిధులు లాసాలోని టిబెటన్ ప్రభుత్వానికి (లేదా గాండెన్ ఫోడ్రాంగ్ ) నాయకత్వం వహించారు. ఇది టిబెట్ పీఠభూమి మొత్తాన్నీ లేదా చాలా భాగాన్ని స్వయంప్రతిపత్తితో పరిపాలించింది [7] క్వింగ్ రాజవంశం ఆధిపత్యం కింద ఉండేది. [8] 1913 - 1951 మధ్య ఉన్న కాలం వివాదాస్పదమైన "వాస్తవ స్వాతంత్ర్యం" కాలం అని అంటారు. ఈ టిబెటన్ ప్రభుత్వం మొదట మంగోల్ రాజులైన ఖోషుట్ రక్షణలో ఉండేది. అ తరువాత డుంగార్ ఖానెట్స్ (1642–1720), ఆ తరువాత మంచు నేతృత్వంలోని క్వింగ్ వంశపు (1720-1912) చక్రవర్తుల రక్షణలో ఉంది. 1913 లో, అగ్వాన్ డోర్జీవ్‌తో సహా పలు టిబెటన్ ప్రతినిధులు టిబెట్, మంగోలియా మధ్య ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా పరస్పర గుర్తింపును, చైనా నుండి తమ స్వాతంత్ర్యాన్నీ ప్రకటించుకున్నారు. అయితే ఈ ఒప్పందపు చట్టబద్ధతను, టిబెట్ స్వాతంత్ర్యాన్నీ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ప్రస్తుత పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రెండూ తిరస్కరించాయి. చైనా యొక్క . [9] అయినప్పటికీ, 1951 వరకు దలైలామాలే టిబెటన్ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.

పేర్లు

"దలైలామా" అనే పేరు మంగోలిక్ పదం దలై, టిబెటన్ పదం బ్లామా ల కలయిక. దలై అంటే "మహాసముద్రం" లేదా "పెద్దది" అని అర్థం. దీని టిబెటన్ అనువాదం గ్యాట్సో లేదా టిబెటన్ ర్గ్యా-మట్షో. [10] [11] గ్లామా అనే టిబెటన్ పదానికి అర్థం "గురువు". [12]

దలైలామాను టిబెటన్లో ర్గ్యాల్-బా రిన్-పో-చే ("విలువైన విజేత")ని అంటారు. [11] దాన్ని కుదించి ర్యాల్-బా అని కూడా పిలుస్తారు. [13] : 23 

చరిత్ర

మధ్య ఆసియా బౌద్ధ దేశాలలో, కారుణ్య బోధిసత్వుడైన అవలోకితేశ్వరుడు టిబెట్ ప్రజలతో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంటాడని, దలైలామాల వంటి దయగల పాలకులు, గురువులుగా అవతరించి వారి విధిని నిర్దేశిస్తాడనీ గత సహస్రాబ్దిగా విస్తృతంగా నమ్ముతున్నారు. కడంపా బౌద్ధ శాఖ వారి ప్రధాన గ్రంథమైన కదం గ్రంథం ప్రకారం దీన్ని ప్రవచించింది. మొదటి దలైలామా అయిన గెండున్ డ్రూప్ ఈ శాఖకు చెందినవాడే. [14] వాస్తవానికి, తరువాతి కాలంలో టిబెటన్లు దలైలామాను అవలోకితేశ్వర అవతారాలుగా గుర్తించడానికి ఈ గ్రంథమే పునాది వేసినట్లు చెబుతారు. [15] 

సాంగ్ట్‌సెన్ గాంపో వంటి ప్రారంభ టిబెటన్ రాజులు చక్రవర్తులూ ఆ తరువాత డ్రోమ్‌టాన్పా (1004-1064) గా బోధిసత్వుడు అవతరించినట్లు చెప్పే గాథలు దీనికి మూలం. [16]

ఆ రాజుల పరంపరే కొనసాగిందనీ, దలైలామాలు అందులో భాగమేననీ టిబెటన్లు భావిస్తారు. [17]

14 వ దలైలామా

క్వింగ్ రాజవంశానికి చెందిన కియాన్‌లాంగ్ చక్రవర్తి చేసినట్లు గానే, టిబెట్‌లో "ఉన్నత" అవతారాల పేరును ఆమోదించే అధికారం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పిఆర్‌సి) కు ఉందని చైనా ప్రభుత్వం ప్రకటించింది. కియాన్లాంగ్ చక్రవర్తి దలైలామాను, పంచెన్ లామాను లాటరీ ద్వారా ఎన్నుకునే వ్యవస్థను స్థాపించాడు. ఇందుకు, బార్లీ రాసులతో కప్పేసిన పేర్లు ఉన్న బంగారు పాత్రను ఉపయోగించేవారు. ఈ పద్ధతిని 19 వ శతాబ్దంలో కొన్ని సార్లు రెండు స్థానాలకూ ఉపయోగించారు. కాని చివరికి అది మూలన పడింది. [18] [19] 1995 లో, దలైలామా బంగారు పాత్ర ఉపయోగించకుండా పంచెన్ లామా యొక్క 11 వ అవతారాన్ని ఎన్నుకోవాలని అనుకున్నారు. అయితే చైనా ప్రభుత్వం, దీనిని తప్పనిసరిగా ఉపయోగించాలని పట్టుబట్టింది. దాంతో అప్పుడు ఇద్దరు ఓరస్పర ప్రత్యర్థి పంచెన్ లామాలు ఎన్నికయ్యారు: చైనా ప్రభుత్వ ప్రక్రియ ప్రకారం గైన్‌కైన్ నార్బు ఎన్నికవగా, దలైలామా గెడున్ చోకేయి నైమా ను ఎంచుకున్నాడు. అయితే, పంచెన్ లామాగా ఎంపికైన కొద్దికాలానికే నైమాను చైనా ప్రభుత్వం అపహరించింది. 1995 నుండి అతను బహిరంగంగా ఎక్కడా కనబడలేదు. [20]

దలైలామాల జాబితా

పేరుచిత్రంజీవిత కాలందలైలామాగా గుర్తించినదిపట్టాభిషేకం
1జెండున్ డ్రుప్ 1391–1474N/A
2జెండున్ గ్యాట్సో 1475–154214831487
3సోనమ్ గ్యాట్సో 1543–158815461578
4యోంటెన్ గ్యాట్సో 1589–161716011603
5న్గవాంగ్ లోబ్సాంగ్ గ్యాట్సో 1617–168216181622
6త్సాంగ్యాంగ్‌ గ్యాట్సో 1683–170616881697
7కెల్జాంగ్ గ్యాట్సో 1707–175717121720
8జాంఫెల్‌ గ్యాట్సో 1758–180417601762
9లుంగ్‌కాక్ గ్యాట్సో 1805–181518071808
10త్సుల్ట్రిమ్‌ గ్యాట్సో1816–183718221822
11ఖెండ్రుప్ గ్యాట్సో1838–185618411842
12ట్రిన్లీ గ్యాట్సో 1857–187518581860
13థుబ్‌టెన్ గ్యాట్సో 1876–193318781879
14టెంజిన్ గ్యాట్సో born 19351939[21]1940

(currently in exile)

గుర్తింపు పొందని దలైలామా కూడా ఒకరున్నారు. న్గావాంగ్ యేషే గయాట్సోను 1707 జూన్ 28 న, అతడికి 25 సంవత్సరాల వయసులో, లా-బ్జాంగ్ ఖాన్ "నిజమైన" 6 వ దలైలామాగా ప్రకటించాడు. అయితే, జనాభాలో అధిక భాగం అతన్ని అంగీకరించనేలేదు . [22] [23] [24]

దలైలామా పదవి భవిష్యత్తు

ధర్మశాలలోని దలైలామా ప్రధాన బోధనా మందిరం

1970 ల మధ్యలో, టెన్జిన్ గయాట్సో ఒక పోలిష్ వార్తాపత్రికతో మాట్లాడుతూ, తానే చివరి దలైలామా నని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తరువాత ఒక ఇంగ్లీషు భాషా పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూలో, "దలైలామా పదవి ఇతరులకు ప్రయోజనం చేకూర్చేలా సృష్టించబడినది. త్వరలోనే దాని ప్రయోజనం నెరవేరే అవకాశం ఉంది." అని అన్నాడు. [25] ఈ ప్రకటనలు భారతదేశంలో టిబెటన్లలో తీవ్ర కలకలం రేపాయి. అలాంటి అవకాశాన్ని అసలు పరిగణించవచ్చా అని చాలామంది నమ్మలేకపోయారు. అవతారం ధరించాలా లేదా అనేది దలైలామా నిర్ణయం కాదని ఖూడా భావించారు. దలైలామా ఒక జాతీయ పదవి కాబట్టి, దలైలామా పునర్జన్మ పొందాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది టిబెట్ ప్రజలే అని వారు భావించారు. [26]

సెప్టెంబరు 2007 లో, చైనా ప్రభుత్వం ఉన్నత బౌద్ధ సన్యాసులందరినీ ప్రభుత్వం ఆమోదించాలని తెలిపింది. ఇందులో టెన్జిన్ గయాట్సో మరణం తరువాత ఎన్నుకునే 15 వ దలైలామా కూడా భాగమే. [27] [28] సాంప్రదాయం ప్రకారం, పంచెన్ లామా దలైలామా అవతారాన్ని ఆమోదించాలి. ఇది నియంత్రణకు మరొక పద్ధతి. పర్యవసానంగా, దలైలామా 15 వ దలైలామాను నిర్ణయించడానికి ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశం కల్పించాడు.

దీనికి ప్రతిస్పందనగా, 14 వ దలైలామా ప్రతినిధి తాషి వాంగ్డి, చైనా ప్రభుత్వం ఎంపిక అర్థరహితమని సమాధానమిచ్చాడు. "మీరు ఇమామ్, ఆర్చ్ బిషప్, సెయింట్స్, ఏ మతమైనా సరే... మీరు రాజకీయంగా ఈ విషయాలను ప్రజలపై రుద్దలేరు" అని వాంగ్డి అన్నాడు. "ఇది ఆ సంప్రదాయాన్ని అనుసరించే వారి నిర్ణయం. చైనీయులు తమ రాజకీయ శక్తిని ఉపయోగించుకోవచ్చు: శక్తి. మళ్ళీ, ఇది అర్థరహితం. వారి పంచెన్ లామా లాగా. వారు తమ పంచెన్ లామాను టిబెట్‌లో ఉంచలేరు. వారు అతనిని తన ఆశ్రమానికి తీసుకురావడానికి చాలాసార్లు ప్రయత్నించారు కాని ప్రజలు అతన్ని చూడలేదు. అలాంటి వారు మత గురువు ఎలా అవుతారు? " [29]

14 వ దలైలామా 1969 లోనే, దలైలామా పదవిని "కొనసాగించాలా వద్దా" అనేది టిబెటన్లు నిర్ణయించాల్సి ఉందని చెప్పాడు. [30] తన అవతారాన్ని గుర్తించాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని టిబెటన్ బౌద్ధులందరూ భవిష్యత్తులో ఓటు ద్వారా నిర్ణయించే సంభావ్యత గురించి ఆయన ప్రస్తావించాడు. [31] తన వారసుడిని ఎన్నుకోవటానికి పిఆర్సి ప్రయత్నించే అవకాశం పట్ల ప్రతిస్పందిస్తూ దలైలామా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నియంత్రణలో ఉన్న దేశంలో లేదా స్వేచ్ఛ లేని ఏ ఇతర దేశంలోనూ తాను అవతారం దాల్చలేనని చెప్పాడు. [32] [33] రాబర్ట్ డి. కప్లాన్ ప్రకారం, "తరువాతి దలైలామా ఉత్తర భారతదేశం, నేపాల్, భూటాన్ అంతటా విస్తరించి ఉన్న టిబెటన్ సాంస్కృతిక బెల్ట్ నుండి రావచ్చు. బహుశా అతన్ని మరింత భారతీయ అనుకూల వ్యక్తిగా, మరింత చైనీస్ వ్యతిరేక వ్యక్తిగా చేస్తుంది".

14 వ దలైలామా తన తదుపరి అవతారం స్త్రీ అయ్యే అవకాశాన్ని సమర్ధించాడు. [34] "కార్యాచరణ బౌద్ధుడు" గా, దలైలామా పట్ల సంస్కృతులకు రాజకీయ వ్యవస్థలకూ అతీతంగా ప్రజల్లో గౌరవం ఉంది. అతను అత్యంత గుర్తింపు పొందిన, గౌరవనీయమైన నైతిక స్వరాలలో ఒకరు. [35] "బహిష్కరించబడిన టిబెటన్ సంప్రదాయంలో అవతార గురువుల ఎంపిక చుట్టూ సంక్లిష్టమైన చారిత్రక, మత, రాజకీయ అంశాలు ఉన్నప్పటికీ, పరివర్తనను దలైలామా స్వాగతిస్తారు" అని రచయిత మైఖేలా హాస్ రాశాడు.

మూలాలు