మరకతము

మరకరము (పచ్చ) విలువైన రత్నం. ఇది బెరైల్ (Be3Al2(SiO3)6) ఖనిజం యొక్క వైవిధ్య రూపం. ఇది ఆకుపచ్చని రంగుతో క్రోమియంను కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వెనేడియంను కలిగి ఉంటుంది.[2] బెరైల్ ఖనిజం మోహ్స్ స్కేలుపై 7.5–8 దృఢత్వం కలిగి ఉంటుంది.[2] అనేక మరకతాలు వాటి గట్టిదనం కారణంగా బలహీనంగా వర్గీకరింపబడ్డాయి. మరకతము అనునది ఒక సైక్లో సిలికేట్.[3]

మరకతము

ముజో, కొలంబియా లోని మరకత స్పటికం
సాధారణ సమాచారం
వర్గముబెరైల్ రకం
రసాయన ఫార్ములాBe3Al2(SiO3)6
ధృవీకరణ
పరమాణు భారం537.50
రంగురంగులేని ఆకుపచ్చ షేడ్స్
స్ఫటిక ఆకృతిబాగా స్ఫటికాకారమైనది
స్ఫటిక వ్యవస్థహెక్సగోనల్ (6/m 2/m 2/m) స్పేస్ సమూహం: P6/mсc
చీలికఅసంపూర్ణమైనది [0001]
ఫ్రాక్చర్కాన్‌కోయిడల్
మోహ్స్‌ స్కేల్‌ కఠినత్వం7.5–8
ద్యుతి గుణంమెరిసేది
వక్రీభవన గుణకంnω = 1.564–1.595,
nε = 1.568–1.602
దృశా ధర్మములుయూనీ ఎక్సియల్ (−)
బైర్‌ఫ్రింజెన్స్δ = 0.0040–0.0070
అతినీలలోహిత ప్రతిదీప్తిలేదు
కాంతికిరణంతెలుపు
విశిష్ట గురుత్వంసరాసరి 2.76
ప్రకాశపారగమ్యతఅపారదర్శకత నుండి పారదర్శకంగా
మూలాలు[1]

వ్యుత్పత్తి

ఆంగ్ల పదమైన "emerald" లాటిన్ వాడుకభాష నుండి వచ్చినది. లాటిన్ వాడుకభాషలో "ఎస్మరాల్డల్ ఎస్మరాల్డస్". ఇది లాటిన్ పదమైన "స్మారగ్డస్" రూపాంతరం. ఇది ప్రాచీన గ్రీకుపదమైన σμάραγδος (స్మారగ్డస్) నుండి ఉత్పత్తి అయినది. దీని అర్థం "ఆకుపచ్చని రత్నం". [4]

మరకతము నవరత్నములలో ఒకటి. పచ్చలు అని తెలుగులో దీనికి గల వ్యావహారిక నామము. అమర కోశములో గారుత్మతం మరకత మశ్మ గర్భోహరిన్మణి అని వివరణ ఉంది. గరుత్మంతుని వలన ఉద్బవించినది, కావున, "గారుత్మతం" 'రాయి' నుండి ఉద్బవించినది కావున, అశ్మ గర్భ. పచ్చని రంగును కలిగి ఉన్నది కావున హరిన్మణి, "పచ్చ", "పచ్చలు" అన్న పేర్లు ఉన్నాయి.

విలువను నిర్ణయించే గుణాలు

కత్తిరించిన పచ్చలు

అన్ని రకాల రంగు రత్నాల వలె పచ్చలు కూడా నాలుగు ప్రాథమిక పరామితులుపయోగించి వర్గీకరించారు. వాటిని "4సి" (నాలుగు Cలు) గా పిలుస్తారు. అవి కలర్ (రంగు), కట్ (కత్తిరించుట), క్లారిటీ (స్వచ్ఛత), కారట్ బరువు. సాధారణంగా, రంగు రత్నాల శ్రేణిలో, రంగు చాలా ముఖ్యమైన ప్రమాణంతో ఉంటుంది. ఏదేమైనా, పచ్చలు యొక్క శ్రేణిలో, స్పష్టత రెండవదిగా పరిగణించబడుతుంది. మంచి మరకతము లక్షణాలలో క్రింద వివరించిన విధంగా అది స్వచ్ఛమైన పచ్చని ఆకుపచ్చ రంగు లో ఉండటమే కాక ఒక ఉన్నత రత్నంగా పరిగణించబడే పారదర్శకత అధిక స్థాయిలో ఉంటుంది.[5]

1960 దశకంలో అమెరికన్ ఆభరణాల పరిశ్రమ పచ్చ నిర్వచనాన్ని "ఆకుపచ్చ వెనేడియం బేరింగ్ బెరైల్"గా మార్చింది. దీని ఫలితంగా "వెనేడియం పచ్చలు" మరకతాలుగా యునైటెడ్ స్టేట్స్ లో గుర్తింపబడుతున్నాయి కానీ యునైటెడ్ కింగ్‌డమ్‌, యూరోప్ లలో వీటిని మరకతాలుగా గుర్తించడంలేదు. అమెరికాలో సాంప్రదాయ మరకతాలు, కొత్త వెనేడియం కరాల రత్నాల మధ్య వ్యత్యాసం మూలంగా "కొలంబియన్ ఎమరాల్డ్" అనేకొత్త పదం వాడుకలోకి వచ్చింది. [6]

రంగు

రత్నశాస్త్రంలో [7] రంగు మూడు భాగాలుగా విభజించబడింది: అవి వర్ణము, సంతృప్తత, వర్ణస్థాయి. మరకతాలు వివిధ వర్ణాలతో పసుపు-ఆకుపచ్చ నుండి నీలం-ఆకుపచ్చ వరకు వ్యాప్తి చెంది ప్రాథమికంగా ఆకుపచ్చని రంగుగా గుర్తించబడ్డాయి. పసుపు, నీలం రంగులలోనివి ద్వితీయ వర్ణాల స్థాయిలో ఉన్నాయి. మధ్యస్థాయి నుండి దట్టమైన వర్ణస్థాయి కలిగిన రత్నాలను మాత్రమే మరకతాలుగా గుర్తిస్తారు. తక్కువ వర్ణస్థాయి కలిగినవి ఆకుపచ్చని బెరైల్ యొక్క జాతులుగా గుర్తిస్తారు. ఉత్తమమైన మరకతం సుమారు 75% వర్ణస్థాయిని (రంగులేని స్థాయి 0%, అపారదర్శక నలుపు 100% ఉన్న స్కేలులో) కలిగి ఉంటుంది. అదనంగా మంచి మరకతం సంతృప్తంగా ఉండాలి, కాంతివంతమైన రంగును కలిగి ఉండాలి. బూడిదరంగు సాధారణ సంతృప్త రూపాంతరకం లేదా మరకతంపై కనిపించే రంగు. బూడిదరంగుతో కూడిన ఆకుపచ్చ రంగు అనేది కాంతి తక్కువగల ఆకుపచ్చని రంగుగా భావించబడుతుంది. [5]

ఇది ముదురు పచ్చ, లేతపచ్చ, ఆకుపచ్చ, అరటి ఆకుపచ్చ, నెమలి వర్ణం, గాజుపచ్చ, గరికపచ్చ, పాలపిట్ట పచ్చ, చిలుకపచ్చ, దిరిశనపువ్వు రంగులను కలిగి ఉంటుంది.

స్పష్టత

బ్రెజీలియన్ మరకతం[8]

మరకతాలు అనేక సంఘటనలు, ఉపరితల పగుళ్ళు కలిగి ఉంటాయి. వజ్రాల వలె కాకుండా భూతద్దంలో చూసిన ప్రతిబింబ స్థాయి (10× ఆవర్థనం) కలిగి ఉండే మరకతాలు స్పష్టమైన గ్రేడు కలిగి ఉంటుంది. మరకతాలను కన్నుతో పరిశీలించి వర్గీకరించవచ్చును. అందువలన, ఒక మరకతం కంటికి కనిపించకుండా ఉండే సంఘటనం కలిగి ఉంటే దోషరహితమని భావిస్తారు. ఉపరితల విభజన పగుళ్ళు లేని మరకతాలు చాలా అరుదైనవి. అందువలన మరకతాల యొక్క స్పష్టత పెంచడానికి వివిధ పద్ధతులు పాటిస్తారు. స్పష్టత మెరుగుపరచడానికి నూనెను రాస్తారు. ఒక పచ్చలో ఉన్నచేరికలు, పగుళ్ళు మూలంగా అది నాచుపట్టిన రూపంగా ఉన్న కారణంగా దానిని కొంతకాలం "జాడిన్" గా వర్ణించారు.[9] ప్రతీ మరకతం కూడా అసంపూర్ణమైనది, దానిని ఒక ప్రత్యేకమైన రత్నంగా గుర్తించడానికి ఉపయోగిస్తారు.

చికిత్సలు

గనుల్లో నుండి బయటకు తీయగానే ఏమరాల్డ్స్ ని చాలా వరకు ఆయిల్ లో ముంచుతారు. దీని వలన రత్నం తాలుకూ ఉపరితలంలోని పగుళ్ళు కప్పబడిపోతాయి. కొన్నిసార్లు పగుళ్ళు కప్పిపుచ్చటానికి, రంగును ఇంప్రూవ్ చేయడానికి ఆయిల్ ను ఉపయోగించడమూ జరుగుతుంది.

మరకతాల పరిశుభ్రతను పెంపొందించే విధానంలో భాగంగా "పోస్టు-లాపిడరీ" విధానంలో నూనెలను పూస్తారు. ఈ విధానంలో ఉపరితలంపై ఉన్న పగుళ్లలో నూనెనను నింపి దాని స్పచ్ఛత మరియూ స్థిరత్వాన్ని పెంచుతారు. దేవదారు నూనె వక్రీభవన గుణకం కూడా మరకతం యొక్క వక్రీభవన గుణకానికి దగ్గరగా ఉండటం వల్ల దీనిని ఉపయోగిస్తారు. ఈ చికిత్సా విధానాలను శూన్య గదిలో తక్కువ ఉష్ణ పరిస్థితులలో కొనసాగిస్తారు. దీనివల్ల మరకతంపై గల రంధ్రాలు తెరుచుకొని దాని సందుల గుండా నూనెలను సులువుగా పీల్చుకొనేటట్లు చేయవచ్చు.[10] నూనెతో నింపబడిన మరకతం అమ్మేటప్పుడు ఈ చికిత్సా విధానాన్ని యు.ఎస్.ఫెడరల్ ట్రేడ్ కమిషన్ బహిర్గతం చేయవలసి ఉంటుంది. [11] రత్నం వర్తకంలో నూనెలను వాడడం సాంప్రదాయకంగా, ఎక్కువగా ఆమోదించబడింది. అయితే నూనె పూసిన మరకతాలు, చికిత్స చేయని అదే నాణ్యత గల సహజ మరకతాల కన్నా తక్కువ విలువైనవి. లేత ఆకుపచ్చని నూనెలను వాడే ఇతర చికిత్సలు ఈ రత్న వర్తకంలో అనుమతించడంలేదు.[12] ఈ రత్నాలను నాలుగు సోపానాలలో గ్రేడింగ్ చేస్తారు. కొన్ని మరకతాలను ఏ విధమైన చికిత్సలు చేయరు. కొన్నింటికి సాధారణం, మధ్యస్థం, ఎక్కువగా మెరుగుపరచే విధానాలను అవలంబిస్తారు. ప్రయోగశాలలు ఈ ప్రమాణాలను భిన్నంగా చేస్తాయి. మరకతాలకు కొన్ని నూనెలు, పాలిమెర్లను వాటి నాణ్యత అభివృద్ధికోసం కలపాలని రత్న శాస్త్రవేత్తలు భావిస్తారు. ఇతరులు మరకతం యొక్క నాణ్యతాభివృద్ధికి నూనెలు ఉపయోగపడవని భావిస్తారు.[13]

మరకతాల గనులు

కొలంబియాలోని ట్రాపిచె మరకతం

ప్రాచీన కాలంలో మరకతాలను సా.శ.పూ 1500 నుండి ఈజిఫ్టులోని మౌంట్ స్మారగ్డస్, భారతదేశంలో గనులనుండి తీస్తున్నారు. ఆస్ట్రేలియాలో సా.శ 14వ శతాబ్దం నుండి ఈ గనుల తవ్వకాలు జరుగుచున్నవి.[14] రోమన్, బైజంటైన్ రాజులు తరువాత ఇస్లాం ఆక్రమణ దారుల ద్వారా ఈజిప్టు గనులు పారిశ్రామిక స్థాయిలో అభివృద్ధి చెందాయి. కొలంబియన్ డిపాజిట్ల ఆవిష్కరణతో మైనింగ్ నిలిపివేయబడింది, శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.[15]

ప్రపంచంలో మరకతాల ఉత్పత్తిలో 50 నుండి 90 శాతం కొలంబియాలో జరుగుతున్నది. ఈ సంఖ్య సంవత్సరం, వనరులు, గ్రేడింగ్ పై ఆధారపడుతుంది.[16][17][18][19] ఈ ఉత్పత్తి 2000 నుండి 2010 వరకు 78% పెరిగింది. [20] కొలంబియాలో "ముజొ", "కస్క్యూజ్", "చివోర్" ప్రాంతాలు ముఖ్య గనుల ప్రదేశాలు.[21] గాఢతగల మలినాలతో కూడిన కిరణంవంటి చారలు గల మరకతాలు "ట్రాపిచే" మరకతాలుగా కొలంబియాలో అరుదుగా లభ్యమవుతూ ఉంటాయి.

ప్రపంచంలో మరకతాల ఉత్పత్తిలో రెండవస్థానంలో బ్రెజిల్ ఉంది. 2004 లో ప్రపంచంలో నాణ్యత గల రత్నాల మొత్తం ఉత్పత్తిలో ఈ దేశంలోని కాఫుబు నది ప్రాంతంలోని "కిట్వే"కు నైఋతి దిశలో 45 కి.మీ వద్ద 20% రత్నాలు ఉన్నాయి. [22] 2011 లో మొదటి సగ భాగంలో కాగ్డెం గనులు 3.74 టన్నుల మరకతాలను ఉత్పత్తి చేసాయి.

ప్రపంచ వ్యాప్తంగా మరకతాలు ఆప్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్,[23] బల్గేరియా, కొలంబియా, కెనడా, చైనా, ఈజిప్టు, ఇథియోఫియా, ప్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇటలీ, ఖజికిస్తాన్, మడగాస్కర్, మొజంబిక్, నమీబియా, నార్వే, పాకిస్థాన్, రష్యా, సోమాలియా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, స్విడ్జర్లాండ్, టాంజియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, జాంబియా, జింబాంబ్వే దేశాలలో లభిస్తాయి.[1] అమెరికాలో మరకతాలు కన్నెక్టికట్, మాంటానా, నెవెడా, నార్త్ కరోలినా, దక్షిణ కరోలినాలో లభిస్తాయి. [1] 1997 లో కెనడాలో మరకతాలను యూకోన్ ప్రాంతంలోకనుగొన్నారు. [24]

వివిధ సంస్కృతులలో మరకతాలు

సంప్రదాయాలలో ఈ రత్నం మే నెల యొక్క జన్మరత్నం. అదే విధంగా ఇది కర్కాటక రాశిలో జన్మించినవారికి సాంప్రదాయ జన్మ రత్నంగా భావిస్తారు.[25] జాతిపచ్చ బుధగ్రహానికి సంబంధించింది. 1934 నుండి సింథటిక్ ఎమరాల్డ్ కూడా తయారు చేస్తున్నారు. పూర్వపు ఆధారాల ప్రకారం ఈ మరకతాలను గూర్చి "బాంటోమీ" అనే చరిత్రకారుడు 16వ శతాబ్దంలో తెలిపాడు. ఇతని ప్రకారం కోర్టెజ్ అధీనంలో గల స్పానిష్ లోనికి అనేక విలువైన మరకతాలు యూరోప్, లాటిన్ అమెరికా నుండి తీసుకు రాబడ్డాయి. [26]

మదురై లోని మీనాక్షి అమ్మవారి ఆలయంలో ప్రధాన దేవత మీనాక్షి విగ్రహం మరకతంతో చేయబడింది. [27]

వేదాలలో కథలు

వేదాలలో రెండు కథలు ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం సర్పరాజైన వాసుకి అను సర్పం బకాసురుని పిత్తాశయాన్ని సంగ్రహించి ఆకాశంనందు ఎగురుతున్న సమయంలో అది చూసిన వాసుకి శాత్రువు గరుత్మంతుడు వాసుకితో యుద్ధం చేయును. ఆ సమయంలో వాసుకి నోటిలోకి పిత్త కోశం మలయ పర్వత ప్రాంతంపై వదిలి వేయును. ఆ పిత్తాశయ భాగాలు విడిపోయి పడిన ప్రదేశాలలో అంతయు ఆకుపచ్చగా ప్రకాశించును. అందులోని కొంత భాగాన్ని గరుత్మంతుడు ంరింగును. దానితో గరుడు మూర్చపోవును. లేచిన వెంటనే బయటికి వదిలివేయును. అదా పడిన ప్రదేశంలో పుట్టిన పచ్చలను గరుడపచ్చలని అంటారు.

మరొక కథ ప్రకారం నలమహారాజుకు శనిగ్రహ పీడ విముక్తి కలిగిన తదుపరి విష్ణుమూర్తిని ప్రార్థించి శివలింగమును ప్రసాదించమని కోరగా విష్ణుమూర్తి మరకతమును ఇవ్వడం జరిగింది. దానిని నలుడు ప్రతిష్ఠించాడు. అది ఇప్పటికీ పూజలందుకొంటున్నది. ప్రస్తుతం పాడిచ్చేరి రాష్ట్రంలోని తరువళ్ళూరు అను పట్టణమున గలదు.

ఆయుర్వేద వైద్యంలో

మరకతం ఆయుర్వేదంలో సకల రోగ ఇవారిణిగా వాడుతారు.మరకతాన్ని నేల వంకాయ రసంలో ఒకరోజు, కొండపిండి వేళ్ళ రసంతో ఒకరోజు నానబెట్టి తరువాత ఆరబెట్టి, పూత వేసి పుటం వేయగా భస్మం అగును. దీనిని ఆయుర్వేద మందుగా వాడుదురు.

జాతిపచ్చకున్న నామాలు

వ్యాపారనామం: ఎమరాల్డ్,

దేశీయనామం, పన్నా,

ఇతరనామాలు: మరకతము, అశ్మగర్భము, గరలాం గురణాంకితము, గురుడాశ్శము, గురుడోత్తరము, గారుడం, తృణగ్రాహి, గరుడపచ్చ, మకరతము, హరిన్మణి.[28]

ప్రసిద్ధమైన మరకతాలు

మరకతంమూలస్థానంపరిమాణంప్రదేశం
బాహియా మరకతం [29]బ్రెజిల్, 2001180,000 కారట్లు, స్ఫటికాకార రాయి
కరోలినా ఎంపరర్[30][31]అమెరికా సంయుక్త రాష్ట్రాలు, 2009310 కారట్లు (కట్ చేయని), 64.8 కారెట్లు (కట్ చేసిన)నార్త్ కొరోలినా మ్యూజియం ఆఫ్ నేచురల్ సైన్సెస్, రాలీఘ్
చాక్ ఎమరాల్డ్కొలంబియా38.40 కారట్లు (కట్ చేసిన), 37.82 కారెట్లు (మరల కట్)నేచురల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, వాషింగ్‌టన్
డ్యూక్ ఆఫ్ దేవన్‌షైన్ ఎమరాల్డ్కొలంంబియా, 1831 కి ముందు1,383.93 కారట్లు (కట్ చేయని)నేచురల్ హిస్టరీ మ్యూజియం, లండన్
ఎమరాల్డ్ ఆఫ్ సెయింట్ యోయిస్ [32]ఆస్ట్రియా,51.60 కారట్లు (కట్ చేసిన)నేచురల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, పారిస్
గచల మరకతం [33]కొలంబియా, 1967858 కారట్లు (కట్ చేయని)నేచురల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, వాషింగ్‌టన్
మోగుల్ ముఘల్ మరకతంకొలంబియా, 1107 A.H. (1695-1696 AD)217.80 కారట్లు (కట్ చేసిన)మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్, దోహా ఖతర్
పాట్రీసియా ఎమరాల్డ్[34]కొలంబియా, 1920632 కారట్లు (కట్ చేయని), డై హక్సాగోనల్ (12 ముఖాలు)అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, న్యూయార్క్

చిత్రమాలిక

మూలాలు

ఇతర పఠనాలు

బయటి లంకెలు