సుహార్తో

సుహార్తో (Suharto) (జనవరి 8, 1921 - జనవరి 27, 2008) ఇండోనేషియాకు చెందిన సైనిక, రాజకీయ నాయకుడు, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు.

సుహార్తో
సుహార్తో


2వ ఇండోనేషియా అధ్యక్షుడు
పదవీ కాలం
మార్చి 12 1967 – మే 21 1998
ఉపరాష్ట్రపతిశ్రీ సుల్తాన్ హమెంగ్‌కుబువోనో IX (1973)
ఆడం మాలిక్ (1978)
ఉమర్ వీరహాదికుసుమా (1983)
సుధర్మొనో (1988)
త్రై సూత్రిస్నో (1993)
యూసుఫ్ హబీబీ (1998)
ముందుసుకర్నో
తరువాతయూసుఫ్ హబీబీ

వ్యక్తిగత వివరాలు

జననం(1921-06-08)1921 జూన్ 8
కేమూసుక్, యోగ్యకార్తా, జావా
మరణం2008 జనవరి 27(2008-01-27) (వయసు 86)
జకార్తా, ఇండోనేషియా
జాతీయతఇండోనేషియా
రాజకీయ పార్టీగోల్కర్ పార్టీ
జీవిత భాగస్వామిసితీ హర్తీనా (మ. 1996; 6గురు పిల్లలు)
వృత్తిసైన్యం
మతంఇస్లాం

జననం

1921, జూన్ 8 న అప్పుడు డచ్చి వారి నియంత్రణలో ఉన్నజావాద్వీపంలోని కెముసుక్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. అతడు రెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. స్థానికంగా జవనీస్ పాఠశాలలలో విద్యనభ్యసించి కొద్దికాలం ఒక గ్రామం లోని బ్యాంకులో పనిచేశాడు. ఆ తరువాత 1940లో డచ్చి వలస సైన్యంలో చేరినాడు. 1942లో సుహార్తో సైన్యంలో సర్జెంట్‌గా పదోన్నతి పొందినాడు.[1] అదే సంవత్సరంలో ఇండోనేషియాను రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్ సైన్యం దండెత్తి ఆక్రమించింది. ఇండోనేషియా స్వాతంత్ర్యానికి జపాన్ దేశ సహకారం అవసరమని తలిచి జపాన్ నియంత్రిత సైన్యంలో చేరి శిక్షణ పొందినాడు. రెండో ప్రపంచ యుద్ధం చివరిలో జపాన్ లొంగిపోవుటలో 1945 ఆగస్టులో ఇండోనేషియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. సుహార్తో ఇండోనేషియన్ సైన్యంలో ప్రవేశించి డచ్చివారికి విరుద్ధంగా 5 సంవత్సరాల యుద్ధం చేశాడు. జపాన్ లొంగుబాటు తరువాత డచ్చివారు ఇండోనేషియాపై ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. డచ్చివారు 1947లో జావా ద్వీపాన్ని, 1948లో యోగ్యాకర్టాను ఆక్రమించినారు. 1949 మార్చిలో సుహార్తో నాయకత్వంలోని ఇండోనేషియా సైన్యం యోగ్యాకార్టాను తిరిగి విముక్తి ప్రసాదించినది. ఆతరువాతి సంవత్సరం న్యూ గినియా మినహా మిగితా ఇండోనేషియా భూభాగమంతా వదిలివేస్తామని ప్రకటించారు.

ఆ తరువాత 15 సంవత్సరాల పాటు సుహార్తో సైన్యంలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. 1950 దశాబ్దంలో సుహార్తో సైన్యంలో వచ్చిన తిరుగుబాట్లను కూడా అణచివేసినాడు. 1957లో సెంట్రల్ జవనీస్ సైన్యం డివిజన్‌కు నేతృత్వం వహించాడు. 1960లో సైన్యంలో బ్రిగేడియర్ హోదా పొందినాడు. 1962లో పశ్చిమ ఇరియన్‌లో సైనిక చర్య చేపట్టినాడు. 1960 దశాబ్దంలో ఇండోనేషియన్ కమ్యూనిస్ట్ పార్టీ, సైన్యం కలిసి అప్పటి అధ్యక్షుడు సుకర్నోను దించివేయడానికి కుట్రపన్నగా సుహార్తో ఆ కుట్రను భంగం చేశాడు. అప్పడు సుహార్తో సైన్యంలో అత్యున్నత స్థానంలో కూడా లేడు. ఆ తరువాత అధ్యక్షుడు సుకర్నో సుహార్తోకు పెద్దపీఠ వేశాడు. 1966 మార్చిలో సుహార్తోకు పరిపాలన అధికారాలు కూడా ఇవ్వబడింది. 1967లో ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో నుంచి సైనిక తిరుగుబాటు ద్వారా పాలనా భాధ్యతలు తీసుకున్నాడు. ఇండోనేషియా తిరుగుబాటు సమయంలో సుహార్తో సైనిక అధికారిగా పనిచేశాడు. 1968లో పార్లమెంటు ద్వారా అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డాడు. ఆ తర్వాత 1973, 978, 1983, 1988, 1993, 1998 లలో కూడా ఎన్నికై వరుసగా 6 పర్యాయాలు ఇండోనేషియా అధ్యక్షపీఠంపై ఆసీసులయ్యాడు. అతడి దాదాపు 3 దశాబ్దాల పాలనలో ఇండోనేషియా ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందినది.[2] అదే సమయంలో అనేక ఇండోనేషియా కమ్యూనిస్టులు మరణకండకు గురయ్యారు.[3] 1975లో తూర్పు తైమూర్ ఆక్రమణ సమయంలో దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. 3 దశాబ్దాల అతని పాలన నూతన ఆజ్ఞ (Orde Baru) అని పేరు. సైనిక పాలన ఆధారంగా బలవంతమైన కేంద్రీకృత అధికారాన్ని నిర్వహించాడు. 1990 దశాబ్దం నాటికి నూతన ఆజ్ఞ పాలన ఫలితంగా అవినీతి పెచ్చుపెరిగింది. దేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ, జీవన ప్రమాణం క్షీణించింది. సుహార్తో ఏలుబడిలో అవినీతి, బంధుప్రీతి పెరిగింది. సుహార్తో బంధువులు, మిత్రులు కోట్లకు పడగలెత్తారు. అతని పాలనలో లక్షలమంది కమ్యూనిస్టులు మరణశిక్షకు గురయ్యారు. మరెంతో మంది జైళ్ళలో మగ్గినారు. ఆందోళనలను సుహార్తో నిరంకుశంగా అణచివేశాడు. గ్రామగ్రామాన సైనికులను మోహరించాడు. మానవహక్కులను యధేచ్ఛగా ఉల్లంఘించాడు.[4] సుహార్తో పాలనలో ఇన్ని ప్రతికూల పవనాలు ఉన్నప్పటికీ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాడు. ఆహారధాన్యాలలో ముఖ్యంగా వరి ఉత్పత్తిలో మంచి పురోగతి సాధించబడింది. అతని కఠిన పాలనవల్ల దేశంలో తీవ్రవాదం కూడా తగ్గిపోయింది. జనాభా తగ్గుదలకు కూడా కృషిచేశాడు. 1997 నాటి ఆసియా సంక్షోభం, పలు సంఘర్షణల ఫలితంగా 1998 మే నెలలో సుహార్తో అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత అతనిపై పాలనా కాలంలో సాగించిన మరణకాండ సంఘటనలపై కేసులు వేయాలని ప్రయత్నించిననూ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వీలుపడలేదు.

మరణం

2008, జనవరి 27 న జకర్తాలో మృతిచెందినాడు.[5]


మూలాలు