సూర్యరశ్మి

సూర్యుని నుండి భూమిని చేరే కాంతిని సూర్యరశ్మి (Sunlight) అంటారు. ఇది సూర్యుని నుండి వెలువడే విద్యుదయస్కాంత వికిరణాలలో ఒక భాగం. ప్రత్యేకంగా చెప్పాలంటే పరారుణ కిరణాలు, దృగ్గోచర వర్ణపటం, అతినీలలోహిత కిరణాలు యొక్క సముదాయమని చెప్పవచ్చు.భూమిపై సూర్యుని నుండి వచ్చే సూర్యకాంతి వాతావరణం వల్ల వడపోయబడుతుంది.సూర్యుని నుండి వెలువడే సూర్యుని వికిరణాలు మేఘాల వల్ల మూయబడక పోతే సూర్యకాంతి నేరుగా భూమిని చేరుతుంది. సూర్యకాంతి అనునది ప్రకాశవంతమైన కాంతి, ఉష్ణ వికిరణాల సముదాయం.

Sunlight shining through clouds in Dunstanburgh, England.

ప్రపంచ వాతావరణ సంస్థ ఈ పదాన్ని "sunshine duration" అని వాడుతుంది. అనగా భూమిపై ఒక ప్రదేశంలో సూర్యుని నుండి పొందిన వికిరణాకు కనీసం 120 వాట్లు/సెకండ్ వైశాల్యంలో పొందిన సమయం.[1] సూర్యకాంతిని "సన్ షైన్ రికార్డర్", "పైరనోమీటర్" వంటి పరికరాలతో నమోదు చేయవచ్చు.

సూర్యకాంతి భూమిని చేరటానికి 8.3 నిముషాలు పడుతుంది. ఈ సౌరశక్తి సుమారు 10,000 నుండి 170000 సంవత్సరాల కాలం సూర్యుని అంతర్భాగంలో శక్తిని పొంది ఆ తర్వాత వెలుపలికి వచ్చి కాంతిని ఉద్గారం చేస్తుంది.[2] నేరుగా వచ్చే సూర్యకాంతి యొక్క కాంతి తీవ్రత విలువ సుమారు 93 ల్యూమెన్/వాట్ ఉంటుంది. కాంతి తీవ్రత ఎక్కువగా గల కాంతి ప్రతిదీప్తి సుమారు 100000 లక్స్ లు లేదా ల్యూమెన్ పర్ చదరపు మీటరు ఉంటుంది.


వాతావరణ మార్పులు

భూమ్మీద సూర్యరశ్మి పగటి వెలుతురులా ఉదయం నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు కనిపిస్తుంది.

జీవరాశులపై ప్రభావం

భూమ్మీద జీవించే ప్రతీ జీవరాశీ ఏదో ఒక విధంగా సూర్యరశ్మిపై ఆధారపడి ఉంది. మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకుని కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా తమ పెరుగుదలకు కావాల్సిన పిండిపదార్థాలను తయారు చేసుకుంటాయి. జంతువులు మొక్కలు, పండ్లు, కూరగాయలు మొదలైన ఉత్పత్తులు సేవించడం ద్వారా పరోక్షంగా సూర్యరశ్మిని ఉపయోగించుకుంటున్నాయి.

ఆరోగ్యంపై ప్రభావం

మానవ శరీరం సూర్యరశ్మి నుంచి డి విటమిన్ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ సేపు ఎండ తగలకుండా ఉండటం వల్ల, తీసుకునే ఆహారంలో ఇది తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల, శరీరంలో ఈ విటమిన్ కొరత ఏర్పడవచ్చు. ఎక్కువ సమయం సూర్యరశ్మికి గురికావడం మూలాన దానిలో ఉన్న అతినీలలోహిత కిరణాల వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది.

సూర్యకాంతిలోని నులివెచ్చని కిరణాలు ముఖ్యంగా ఉదయం, సాయంత్రపు వేళల్లో మన దేహానికి 'డి' విటమిన్ అందించినా, ఆహ్లాదం కలిగించినా, సూర్యరశ్మికి మరీ ఎక్కువగా ప్రభావితమైతే, కొన్నిసార్లు హాని జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాంటి ప్రమాదాలే శరీర చర్మంపై కమిలిన మరకలుగా (Sun burns) ఏర్పడుతాయి. అవే కాలం గడిచే కొద్దీ చర్మ సంబంధిత క్యాన్సర్‌గా పరిణామం చెందే ప్రమాదం ఉంది. వీటికి కారణం సూర్యరశ్మి నుంచి వెలువడే అత్యంత శక్తిమంతమైన అతి నీలలోహిత కిరణాలు. ఈ కిరణాలు మన దేహానికి సోకకుండా ఆకాశానికి భూమికి మధ్య ఓజోన్ పొర పరచుకొని ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో ఈ ఓజోన్ పొర గాఢత చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలపైన. దీనికి కారణం శీతలీకరణకు వాడే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు. వాహనాలను నడపడానికి ఉపయోగించే పెట్రోలు, డీజిల్ లాంటి ఇంధనాల కాలుష్యాలు. అవి వెలువరించే క్లోరో ఫ్లోరో కార్బన్లు (సీఎఫ్‌సీఎస్). వీటి ప్రభా వాన్ని అరికట్టినా, ఆకాశంలోని ఓజోన్ పొర మునుపటి పరిమాణాన్ని, సాంద్రతను అందుకుంటుందనే విషయంలో శాస్త్రజ్ఞులు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. ఇకనైనా ఆ ఓజోన్ పొర మరీ బలహీన పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

ఇతరత్రా

చాలామందికి ప్రత్యక్షంగా ఎండలో ఉండటమంటే ఇబ్బంది కలిగించేదే. సూర్యునివైపు సూటిగా చూడటం వలన దృష్టి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా ఉండటం కోసం చాలామంది నల్ల కళ్ళద్దాలను వాడటం సహజం. ప్రత్యక్షంగా తలమీద ఎండ పడకుండా టోపీలు, శిరస్త్రాణములు (హెల్మెట్). మొదలైనవి వాడుతుంటారు. చల్లని ప్రదేశాల్లో ప్రజలు ఎండవేడిమిని బాగా ఎంజాయ్ చేస్తారు. నీడవైపు ఎక్కువగా వెళ్ళరు. అదే ఉష్ణమండల దేశాల్లో దీనికి పూర్తిగా వ్యతిరేకం. మధ్యాహ్న సమయాల్లో చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉండటానికే ప్రాధాన్యతనిస్తారు. ఒకవేళ బయటకు వెళ్ళవలసి వస్తే ఏదైనా నీడ పట్టున ఉండటానికి ప్రయత్నిస్తారు.

ఇవీ చూడండి

సూచికలు