సేంద్రియ సమ్మేళనం

సేంద్రియ సమ్మేళనం (Organic Compound) రసాయన శాస్త్రంలో కార్బన్-హైడ్రోజన్, కార్బన్-కార్బన్ బంధాలు కలిగిన రసాయన సమ్మేళనం. ఒక కర్బనపు పరమాణువు బహుళ కర్బన పరమాణువుతో కలిసి గొలుసులాగా ఏర్పడే స్వభావం కలది కాబట్టి లక్షల కొలది సేంద్రియ సమ్మేళనాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. సేంద్రీయ సమ్మేళనాల లక్షణాలు, ప్రతిచర్యలు సంశ్లేషణల అధ్యయనాన్ని సేంద్రీయ రసాయన శాస్త్రం అని పిలుస్తారు.

మీథేన్, CH4; అత్యంత సరళమైన సేంద్రియ సమ్మేళనం.

భూపటలంలో సేంద్రియ సమ్మేళనాల శాతం తక్కువే ఐనప్పటికీ మనకు తెలిసిన జీవజాలం అంతా వీటిమీదనే ఆధారపడి ఉంది. సేంద్రియ సమ్మేళనాలను చాలా రకాలుగా వర్గీకరించవచ్చు. ఇందులో ప్రధానమైనది సహజ సమ్మేళనాలు, కృత్రిమ సమ్మేళనాలు. సహజ సమ్మేళనాలు జంతువులు, చెట్ల నుంచి ఉత్పత్తి అవుతాయి. ఇంకా వీటి పరిమాణాలను బట్టి, చిన్న అణువులు, పాలిమర్లు అని కూడా విభజించవచ్చు.

జీవరసాయన శాస్త్రంలో యాంటిజెన్స్, పిండిపదార్థాలు, ఎంజైములు, హార్మోనులు, లిపిడ్స్, కొవ్వు ఆమ్లాలు, కేంద్రక ఆమ్లాలు, మాంసకృత్తులు, పెప్టైడ్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, లెక్టిన్లు, కొవ్వులు, నూనెలు లాంటి సేంద్రియ సమ్మేళనాలు జీవజాలానికి చాలా ముఖ్యమైనవి.

సేంద్రియ, నిరింద్రియ నిర్వచనాలు

కొన్ని చారిత్రక కారణాల వలన కర్బనం కలిగి ఉన్నా కూడా కార్బైడులు, కార్బొనేట్లు, కార్బన్ సరళ ఆక్సైడులు (కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్), సయనైడ్లు మొదలైన వాటిని సేంద్రియ సమ్మేళనాలుగా పరిగణించరు. శుద్ధ కర్బనానికి రూపాంతరాలైన వజ్రం, గ్రాఫైటు, ఫుల్లరీన్లు,[1] కార్బన్ నానోట్యూబులని కర్బన సమ్మేళనాలుగా పరిగణించరు ఎందుకంటే ఇవి కేవలం ఒకే రకమైన పరమాణువులు కలిగి ఉంటాయి కాబట్టి.

సేంద్రియ పదార్థం అనే పేరును బట్టి ఇది "సహజంగా" లభించేది అని చెప్పలేము.[2]

మూలాలు