స్మార్ట్‌ఫోన్

స్మార్ట్‌ఫోన్ అనేది మొబైల్ టెలిఫోన్, కంప్యూటింగ్ పనులను కలిపి చేసే పోర్టబుల్ పరికరం. బలమైన హార్డ్‌వేర్ సామర్థ్యాలు, విస్తృతమైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో ఇవి సాధారణ ఫీచర్ ఫోన్ల కంటే భిన్నంగా ఉంటాయి. వీటి లోని ఆపరేటింగ్ సిస్టమ్‌ల సాయంతో అనేక సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్ ( మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా వెబ్ బ్రౌజింగ్‌తో సహా), మల్టీమీడియా పనులు (సంగీతం, వీడియో, కెమెరాలు, గేమింగ్‌తో సహా) చేస్తాయి. సాధారణ ఫోన్లలో ఉండే వాయిస్ కాల్స్, టెక్స్ట్ మెసేజింగ్ వంటి విధులు మామూలుగానే చేస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లలో అనేక మెటల్-ఆక్సైడ్-సెమీకండక్టర్ (MOS) ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) చిప్‌లు ఉంటాయి. వీటిలో ఉన్న సెంసర్ల సాయంతో మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సార్‌లు, బేరోమీటర్, గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్ వంటి అనేక అప్లికేషన్లు పనిచేస్తాయి. స్మార్ట్‌ఫోన్లలో వైర్‌లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్‌లకు ( బ్లూటూత్, వై-ఫై, లేదా శాటిలైట్ నావిగేషన్ వంటివి) మద్దతు ఉంటుంది.

రెండు స్మార్ట్‌ఫోన్లు: సామ్‌సంగ్ గాలక్సీ S22 అల్ట్రా (పైన), ఐఫోన్ 13 ప్రో (కింద)

ప్రారంభ స్మార్ట్‌ఫోన్‌లు ప్రధానంగా ఎంటర్‌ప్రైజ్ మార్కెట్ వైపు దృష్టిపెట్టాయి. సెల్యులార్ టెలిఫోనీ అంశాన్ని కూడా చేర్చి, స్వతంత్ర వ్యక్తిగత డిజిటల్ అసిస్టెంట్ (PDA) పరికరాల స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసాయి. కానీ పెద్ద ఆకారం, తక్కువ బ్యాటరీ జీవితం, నిదానంగా ఉండే అనలాగ్ సెల్యులార్ నెట్‌వర్క్‌లు, ఇంకా పరిణతి చెందని వైర్‌లెస్ డేటా సేవలు వంటి కారణాల వల్ల ఇవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. MOS ట్రాన్సిస్టర్‌లు పరిమాణంలో మరింత చిన్నవై సబ్-మైక్రాన్ స్థాయిలకు చేరడం, మెరుగైన లిథియం-అయాన్ బ్యాటరీ రావడం, వేగవంతమైన డిజిటల్ మొబైల్ డేటా నెట్‌వర్క్‌లు, మొబైల్‌ను అనుమతించే మరింత పరిణతి చెందిన సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారాలు రావడం వగైరాలతో ఈ సమస్యలు పరిష్కారమై పోయాయి.

2000వ దశకంలో, NTT DoCoMo యొక్క i-మోడ్ ప్లాట్‌ఫారమ్, బ్లాక్‌బెర్రీ, నోకియా ల సింబియన్ ప్లాట్‌ఫార్మ్, విండోస్ మొబైళ్ళు మార్కెట్లో ఆదరణ పొందడం మొదలైంది. ఈ మోడల్‌లలో ఎక్కువగా QWERTY కీబోర్డులు లేదా రెసిస్టివ్ టచ్‌స్క్రీన్ ఇన్‌పుట్‌ ఉండేవి. ఈమెయిల్, వైర్‌లెస్ ఇంటర్నెట్‌ అవసరాన్ని అవి నొక్కిచెప్పాయి. 2000ల చివరలో ఐఫోన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను అనుసరించి, మెజారిటీ స్మార్ట్‌ఫోన్‌లు సన్నని, స్లేట్-వంటి ఫార్మ్ ఫ్యాక్టర్లతో వచ్చాయి. వీటికి పెద్ద, కెపాసిటివ్ స్క్రీన్‌లుంటాయి. భౌతిక కీబోర్డ్‌ల కంటే మల్టీ-టచ్ సంజ్ఞలకు మద్దతునిస్తాయి. కేంద్రీకృత స్టోర్ నుండి అదనపు అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోడానికి, లేదా కొనుక్కోడానికి, క్లౌడ్ స్టోరేజ్, సింక్రొనైజేషన్, వర్చువల్ అసిస్టెంట్‌లు అలాగే మొబైల్ చెల్లింపు సేవలను ఉపయోగించడానికీ వినియోగదారులకు వీలు కలిగించాయి. స్మార్ట్‌ఫోన్‌లు PDAలు, హ్యాండ్‌హెల్డ్/పామ్-సైజ్ PCలు, పోర్టబుల్ మీడియా ప్లేయర్‌లను (PMP) తొలగించి వాటి స్థానాన్ని ఆక్రమించాయి. [1]మెరుగైన హార్డ్‌వేర్, వేగవంతమైన వైర్‌లెస్ కమ్యూనికేషన్ (LTE వంటి ప్రమాణాల కారణంగా) స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ అభివృద్ధికి ఊతమిచ్చాయి. 2012 మూడవ త్రైమాసికంలో, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు వాడుకలో ఉన్నాయి. [2] 2013 ప్రారంభంలో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఫీచర్ ఫోను [3] అమ్మకాల గణాంకాలను అధిగమించాయి.

స్మార్ట్‌ఫోనులో ఉండే ముఖ్యమైన అంగాలు

  • ఫార్మ్‌ ఫ్యాక్టరు (బాడీ ఆకారం, పరిమాణం)
  • కెమెరా
  • తెర
  • సిపియు
  • నిల్వ సామర్థ్యం
  • ర్యామ్‌
  • సెన్సర్లు ఇతర అంశాలు
  • ఆపరేటింగ్ వ్యవస్థ

చరిత్ర

1996 ఆగస్టులో, నోకియా సంస్థ Nokia 9000 కమ్యూనికేటర్‌ను విడుదల చేసింది. ఇది Nokia 2110 పై ఆధారపడిన ఒక డిజిటల్ సెల్యులార్ PDA. ఇందులో జియోవర్క్స్ వారి PEN/GEOS 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌ ఉంది. పైన డిస్‌ప్లే, క్రింద భౌతిక QWERTY కీబోర్డ్‌తో ఉండే క్లామ్‌షెల్ డిజైన్ లో రెండు భాగాలను కీలుతో కలిపారు. ఈ PDA ఈమెయిలును అందించింది; క్యాలెండర్, చిరునామా పుస్తకం, కాలిక్యులేటర్, నోట్‌బుక్ అప్లికేషన్‌లు; టెక్స్ట్ ఆధారిత వెబ్ బ్రౌజింగ్; ఫ్యాక్స్‌లను పంపడం, స్వీకరించడం.. ఇవన్నీ చెయ్యగలిగింది. మూసివేసినప్పుడు, ఈ పరికరాన్ని డిజిటల్ సెల్యులార్ టెలిఫోన్‌గా ఉపయోగించవచ్చు.

జూన్ 1999లో Qualcomm "pdQ స్మార్ట్‌ఫోన్"ను విడుదల చేసింది, ఇది పామ్ PDA, ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన CDMA డిజిటల్ PCS స్మార్ట్‌ఫోన్. [4]

తదుపరి మైలురాయి పరికరాలు ఇలా ఉన్నాయి:

  • ఎరిక్సన్ మొబైల్ కమ్యూనికేషన్స్ ద్వారా ఎరిక్సన్ R380 (డిసెంబర్ 2000) [5][6] సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడిన మొదటి ఫోన్‌ ఇది (మొదట్లో ఉన్న పేరు EPOC ను తరువాత Symbian OSగా మార్చారు). ఇది స్టైలస్‌ని ఉపయోగించి రెసిస్టివ్ టచ్‌స్క్రీన్‌పై PDA పనులు, పరిమిత వెబ్ బ్రౌజింగ్‌ చేసేది. [7] ఇది "స్మార్ట్‌ఫోన్"గా విక్రయించబడినప్పటికీ, [8] దీనిలో వినియోగదారులు తమ స్వంత సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయలేరు.
  • క్యోసెరా 6035 (ఫిబ్రవరి 2001), [9] ప్రత్యేక పామ్ OS PDA ఆపరేటింగ్ సిస్టమ్, CDMA మొబైల్ ఫోన్ ఫర్మ్‌వేర్‌తో కూడిన ద్వంద్వ-స్వభావం పరికరం. ఇది ఫోన్ హార్డ్‌వేర్‌ను జోడించిన మోడెమ్‌గా పరిగణిస్తూ PDA సాఫ్ట్‌వేర్‌తో పరిమిత వెబ్ బ్రౌజింగ్‌కు మద్దతు ఇచ్చింది. [10] [11]
  • Nokia 9210 కమ్యూనికేటర్ (జూన్ 2001), [12] నోకియా యొక్క సిరీస్ 80 ప్లాట్‌ఫారమ్ (v1.0)తో Symbian ఓయెస్ (విడుదల 6) వాడిన మొదటి ఫోన్. ఇది అదనపు అప్లికేషన్ల ఇన్‌స్టాలేషన్‌ను అనుమతించే మొదటి Symbian ఫోన్ ప్లాట్‌ఫారమ్. నోకియా 9000 కమ్యూనికేటర్ వలె ఇది పూర్తి భౌతిక QWERTY కీబోర్డ్‌తో కూడిన పెద్ద క్లామ్‌షెల్ పరికరం.
  • Handspring's Treo 180 (2002), OSలో అంతర్నిర్మిత టెలిఫోనీ, SMS సందేశం, ఇంటర్నెట్ సదుపాయాలున్న GSM మొబైల్ ఫోన్‌లో పామ్ OS ను పూర్తిగా ఏకీకృతం చేసిన మొదటి స్మార్ట్‌ఫోన్. 180 మోడల్‌లో థంబ్-టైప్ కీబోర్డ్ ఉంది. 180g వెర్షన్‌లో గ్రాఫిటీ హ్యాండ్‌రైటింగ్ రికగ్నిషన్ ఏరియా ఉంది. [13]

ఫారమ్ ఫ్యాక్టర్, ఆపరేటింగ్ సిస్టమ్ మార్పులు

2000ల చివరలో, 2010ల ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్‌లు ఫిజికల్ కీబోర్డులు, కీప్యాడ్‌లు ఉన్న పరికరాల నుండి పెద్ద ఫింగర్-ఆపరేటెడ్ కెపాసిటివ్ టచ్‌స్క్రీన్‌లకు మారాయి. [14] పెద్ద కెపాసిటివ్ టచ్‌స్క్రీన్ కలిగిన మొదటి ఫోన్ LG ప్రాడా. [15] LG దీన్ని 2006 డిసెంబరులో ప్రకటించింది. ఇది 3 అంగుళాల, 240x400 పిక్సెళ్ళ తెరతో, 144p వీడియో రికార్డింగ్ సామర్థ్యమున్న 2-మెగాపిక్సెల్ డిజిటల్ కెమెరా, LED ఫ్లాష్, సెల్ఫ్ పోర్ట్రెయిట్‌ల కోసం మినియేచర్ మిర్రర్‌తో ఫ్యాషన్ ఫీచర్ ఫోన్‌ను రూపొందించారు. [16] [17]

2007 జనవరిలో, ఆపిల్ కంప్యూటర్ ఐఫోన్‌ను పరిచయం చేసింది. [18] [19] దీనిలో 3.5" కెపాసిటివ్ టచ్‌స్క్రీన్‌ను ఉంది. ఆ సమయంలో చాలా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ల కంటే రెండు రెట్లు సాధారణ రిజల్యూషన్‌తో ఉంది. [20] ఫోన్‌లకు మల్టీ-టచ్‌ని పరిచయం చేసింది. ఇది ఫోటోలు, మ్యాప్‌లు, వెబ్ పేజీలలో జూమ్ ఇన్ లేదా అవుట్ చేయడానికి "పిన్చింగ్" వంటి సంజ్ఞలను చేర్చింది. సమకాలీన స్మార్ట్‌ఫోన్‌లలో విలక్షణమైన స్టైలస్‌ను, కీబోర్డ్ లేదా కీప్యాడ్ నూ తీసేసి, మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న మొదటి పరికరం ఈ iPhone. వాటి స్థానంలో ఇది, నేరుగా వేలితో ఇన్‌పుట్ ఇవ్వగల పెద్ద టచ్‌స్క్రీన్‌ను ఉపయోగించింది. [21]

ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, PDAలు, ఫీచర్ ఫోన్‌ల నుండి రూపొందిన ఇతర ఓయెస్‌ల కంటే భిన్నంగా ఉంది. ఇతర స్మార్ట్‌ఫోన్లలో ఉన్న వెబ్ బ్రౌజర్లను వాడాలంటే వెబ్ పేజీలను ప్రత్యేకంగా WML, cHTML, లేదా XHTML వంటి సాంకేతికతలను ఉపయోగించి తయారు చేయాల్సి వచ్చేది. కానీ ఐఫోనులో Apple వారి Safari బ్రౌజరును స్థాపించింది. ఇది అన్ని వెబ్‌సైట్లనూ చూపిస్తుంది - ఫోన్‌ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లను రూపొందించాల్సిన పని లేదు. [22] [23] [24] [25]

అధునాతన అప్లికేషన్‌లకు మద్దతు ఇచ్చేంత శక్తివంతమైన సాఫ్ట్‌వేర్, పెద్ద కెపాసిటివ్ టచ్‌స్క్రీన్‌తో కూడిన డిజైను కలిసి మరొక స్మార్ట్‌ఫోన్ OS ప్లాట్‌ఫారమ్ ఆండ్రాయిడ్ అభివృద్ధికి దారి తీసాయి. అప్పటి ప్రోటోటైప్ పరికరంలో బయటికి లాగితే వచ్చే ఫిజికల్‌ కీబోర్డు ఉండేది. ఆ సమయంలో Google ఇంజనీర్లు, టచ్‌స్క్రీన్ ఉన్నంతమాత్రాన భౌతిక కీబోర్డు, బటన్‌ల అవసరం తొలగి పోదు అని భావించారు. [26] [27] [28] ఆండ్రాయిడ్ సవరించిన లైనక్స్ కెర్నల్ పై ఆధారపడి ఉంది. PDAలు, ఫీచర్ ఫోన్‌ల నుండి రూపొందిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది. మొదటి ఆండ్రాయిడ్ పరికరం, HTC డ్రీమ్ ఫోను 2008 సెప్టెంబరులో [29] విడుదలైంది.

అమ్మకాలు

2011లో, శామ్‌సంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ వాటా ఉంది, ఆ తర్వాత ఆపిల్ ఉంది. 2013లో, శామ్‌సంగ్ మార్కెట్ వాటా 31.3%, 2012లో 30.3% నుండి స్వల్పంగా పెరిగింది. ఆపిల్ వాటా 15.3% వద్ద ఉంది, 2012లో 18.7% నుండి ఇది తగ్గింది. హువావీ, LG, లెనోవో ఒక్కొక్క దాని వాటా 5%. 2012 కంటే ఇవి పెరిగాయి. ఇతరుల వాటా సుమారుగా 40% ఉండగా, ఇది మునుపటి సంవత్సరాల సంఖ్యకు సమానం. Apple మాత్రమే మార్కెట్ వాటాను కోల్పోయింది. అయితే, వారి అమ్మకాల పరిమాణం మాత్రం 12.9% పెరిగింది. [30]

Q1 2014లో, శామ్‌సంగ్ మార్కెట్‌ వాటా 31% ఉంది. యాపిల్ వాటా 16%. [31]Q4 2014లో, యాపిల్ వాటా 20.4% ఉండగా శామ్‌సంగ్ వాటా 19.9%. [32] Q2 2016లో, శామ్సంగ్‌కు 22.3% వాటా ఉండగా, యాపిల్‌కు 12.9% ఉంది. [33] Q1 2017లో, 8 కోట్ల యూనిట్ల అమ్మకాలతో శామ్‌సంగ్ మొదటి స్థానంలో ఉంది, 5.08 కోట్లతో యాపిల్, 3.46 కోట్లతో హువావీ, 2.55 కోట్లతో ఒప్పో, 2.27 కోట్లతో వివో తరువాతి స్థానాల్లో ఉన్నాయి.[34]

ఆదాయం పరంగా చూస్తే, శామ్‌సంగ్ మొబైల్ వ్యాపారం యాపిల్ వ్యాపారంలో సగమే ఉంది. యాపిల్ వ్యాపారం 2013 నుండి 2017 సంవత్సరాలలో చాలా వేగంగా పెరిగింది. [35] ఒప్పో యాజమాన్యంలోని బ్రాండ్ అయిన రియల్‌మి, Q2 2019 నుండి ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫోన్ బ్రాండ్. చైనాలో హువావీ, ఆనర్‌ లు హువావీ యాజమాన్యంలోని బ్రాండ్లు. వీటికి 46% మార్కెట్‌ ఉంది. పెరుగుతున్న చైనీస్ జాతీయవాదం అండగా 2019 లో 66% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. [36] 2019లో, శామ్‌సంగ్‌కు దక్షిణ కొరియా 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 74% వాటా ఉంది. [37]

భారతదేశంలో

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో చైనా కంపెనీలు ఆధిపత్యం వహిస్తున్నాయి. మొత్తం అమ్మిన ఫోన్ల సంఖ్యలో షియోమి అగ్రస్థానంలో ఉండగా, శామ్‌సంగ్ రెండవ స్థానంలో ఉంది. 2020 లో దేశంలో అమ్మిన మొత్తం ఫోన్ల సంఖ్య 14.97 కోట్లు కాగా 2021 లో అమ్మిన మొత్తం ఫోన్ల సంఖ్య 16 కోట్లు. 2021 లో 4 కోట్లు షియోమి 4 కోట్లు, శామ్‌సంగ్ 2.8 కోట్ల ఫోన్లు అమ్మాయి. 2020, 2021 లో భారతదేశంలో అమ్ముడైన వివిధ బ్రాండ్ల ఫోన్ల వివరాలు ఇవి: [38]

సంవత్సరంబ్రాండు2021 అమ్మకాల సంఖ్య

కోట్ల ఫోన్లు

2021 మార్కెట్ షేరు2020 అమ్మకాల సంఖ్య

కోట్ల ఫోన్లు

2020 మార్కెట్ షేరు
1షియోమి4.0425.1%4127.4%
2సామ్‌సంగ్2.7917.4%2.9719.8%
3వివో2.5115.6%2.6717.8%
4రియల్‌మి2.4215%1.9212.8%
5ఒప్పో1.7811.1%1.6511%
6ఇతరులు2.5315.8%1.6611.2%
మొత్తం16.07100%14.97100%

మూలాలు