అభిజిత్ బెనర్జీ

అభిజిత్ వినాయక్ బెనర్జీ (Abhijit Vinayak Banerjee) ( జననం 1961 ఫిబ్రవరి 21) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త. అతడు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.[1] బెనర్జీ ఆర్థిక శాస్త్రంలో 2019 ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రీమెర్‌లతో కలిసి నోబెల్ మెమోరియల్ బహుమతిని పొందాడు. "ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయోగాత్మక విధానం” అనే కృషికి గాను వారు ఈ బహుమతిని పొందారు.[2] బెనర్జీ 2015 ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఉన్నత స్థాయి ప్యానెల్ ఆఫ్ ఎమినెంట్ పర్సన్స్ ప్యానెల్లో పనిచేశాడు. అతడు “సేవ్ ది చిల్డ్రన్ యుఎస్ఎ” సంస్థకు ట్రస్టీ. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎవిడెన్స్ అడ్వైజరీ ప్యానెల్ లోను, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోవిడ్ -19 గ్లోబల్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ గానూ వ్యవహరించాడు.

అభిజిత్ వినాయక్ బెనర్జీ
నవంబరు 2011 లో బెనర్జీ
జననం (1961-02-21) 1961 ఫిబ్రవరి 21 (వయసు 63)
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
సంస్థMassachusetts Institute of Technology
Harvard University
Princeton University
రంగంDevelopment economics
Social economics
పూర్వ విద్యార్థి
  • University of Calcutta (BSc)
  • Jawaharlal Nehru University (MA)
  • Harvard University (PhD)
రచనలుAbdul Latif Jameel Poverty Action Lab
పురస్కారములుNobel Memorial Prize in Economic Sciences (2019)
Information at IDEAS/RePEc

బాల్యం

అభిజిత్ బెనర్జీ తండ్రి బెంగాలీ, తల్లి మహారాష్ట్రకు చెందినవారు.[3] బెనర్జీ తండ్రి దీపక్ బెనర్జీ కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసరు గాను, అతని తల్లి నిర్మలా బెనర్జీ, కలకత్తాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్ లో అర్థశాస్త్ర ప్రొఫెసరు గానూ పనిచేసారు. తండ్రి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి పట్టా పొందాడు. అభిజిత్, 1981లో కోల్ కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో బిఎస్‌సి డిగ్రీ పొందాడు. ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ చేసాడు.[4] ఆ తర్వాత 1988లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు.

పరిశోధన సంస్థ

అభిజిత్ బెనర్జీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లో ఎకనామిక్స్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఎస్తర్ డుఫ్లో, మాజీ హార్వర్డ్ ప్రొఫెసర్ సెంథిల్ ముల్లైనాథన్ లతో కలిసి అతను జె -పిఎఎల్ (J-PAL) అనే సంస్థను స్థాపించాడు. వారు 2003 లో పావర్టీ యాక్షన్ ల్యాబ్ గా స్థాపించారు. సంస్థ ముఖ్య ఉద్దేశం ప్రపంచం లో పేదరికం నిర్మూలన. సంస్థ ప్రధాన కార్యాలయం కేంబ్రిడ్జిలో ఉంది. ఈ సంస్థలో సుమారు 400 మంది పరిశోధన, విధానం, విద్య, శిక్షణ నిపుణులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, కరేబియన్, ఐరోపా, ఆఫ్రికా, మధ్య ఆసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా లలో ఈ సంస్థకు ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 200 మంది పరిశోధకులు సుమారు 1,000 మంది కాంట్రాక్టర్లు అమలు చేసే ప్రాజెక్టులను పర్యవేక్షిస్తారు. ఈ సంస్థ 2003 లో స్థాపించినప్పటి నుండి కొత్త పరిశోధనలకు నిధులు సమకూర్చడానికి $63 మిలియన్ల గ్రాంట్లను మంజూరు చేసింది. సంస్థ దృష్టి మొదట్లో పేద, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలపై ఉన్నప్పటికీ, ఇప్పుడు ఐరోపాలో చురుకుగా ఉంది, ఉదాహరణకు, వలసదారుల సామాజిక చేరికను ప్రోత్సహించడానికి అవకాశాలను పరిశోధిస్తోంది. వీటిలో ఉత్తర అమెరికా శాఖలో కార్మికుల కొరకు శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి, గృహనిర్మాణం, న్యాయ వ్యవస్థలో సంస్కరణ, ఆరోగ్యంపై ప్రాజెక్టులు ఉన్నాయి.[5]

పరిశోధన పలితాలు

బెనర్జీ, అతని బృందం ప్రభుత్వ కార్యక్రమాల వంటివి ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ఎలా ఉపయోగ పడుతున్నాయి, వాటి అమలు ఎలా జరుగుతోంది అనే విషయాల గురించి పరిశోధనలు చేస్తారు. దీని కోసం, వారు వైద్య పరిశోధనలో క్లినికల్ ట్రయల్స్ మాదిరిగానే యాదృచ్ఛిక, నియంత్రిత ట్రయల్స్ ను ఉపయోగిస్తారు.[6] ఉదాహరణకు, పోలియో వ్యాక్సినేషన్ భారతదేశంలో ఉచితంగా అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది తల్లులు తమ పిల్లలను వ్యాక్సినేషన్ వేయడానికి ముందుకు రావడం లేదు. దీని కోసం బెనర్జీ, ప్రొఫెసర్ ఎస్తర్ డఫ్లోలు రాజస్థాన్ లో ఒక ప్రయోగం చేసారు. అక్కడ వారు, పిల్లలకు టీకాలు వేయించిన తల్లులకు పప్పుదినుసుల సంచిని ఇచ్చారు. త్వరలోనే ఇక్కడ టీకాలు వేసుకోవడంతో ఇమ్యూనైజేషన్ రేటు పెరిగింది. ముంబై, వడోదర ప్రాంతములో వారి మరొక ప్రయోగంలో అవసరమైన విద్యార్థులకు చదువులో సహాయపడటానికి బోధనా సహాయకులతో పాఠశాలలలో పాఠాలు చెపితే ఆ విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగుపడ్డాయని వారు కనుగొన్నారు.[7]

అభిజిత్ బెనర్జీ, మార్కెట్‌లు ఉద్యోగాలు కల్పించకపోతే విద్యకు అర్థం లేకుండా పోతుందని, కేవలం విద్యతో పేదరికాన్ని నిర్మూలించలేమని, జీవితంలో మార్పుకు, అభివృద్ధికి విద్య బాధ్యత వహిస్తుందని ఏ విషయం వారి ప్రయోగాలలో చూపించిందని, కానీ అదే సమయంలో వారికి లేబర్ మార్కెట్ లేకపోవడం ఆటంకాలు కలిగిస్తున్నాయని బెనర్జీ చెప్పాడు.[8]

రచనలు

అభిజిత్ ముఖర్జీ ఆర్థిక వేత్తయే గాక పుస్తకాల రచయిత కూడా. అతడు అనేక వ్యాసాలతో పాటు, ఐదు పుస్తకాలు రచించాడు. వాటిలో రెండు పుస్తకాలను ఇతరులతో కలసి రాసాడు. అతని అత్యంత ప్రసిద్ధ రచన పూర్ ఎకనామిక్స్, డుఫ్లోతో, గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్ (2019): ఎస్తర్ డఫ్లోతో కలిసి రాసాడు. హ్యాండ్‌బుక్ ఆఫ్ ఫీల్డ్ ఎక్స్‌పెరిమెంట్స్ వాల్యూమ్ 1- 2 (2017): మేకింగ్ ఎయిడ్ వర్క్ (2007), పూర్ ఎకనామిక్స్, ఎ రాడికల్ రీథింకింగ్ ఆఫ్ ది వే టు ఫైట్ గ్లోబల్ పావర్టీ వంటి మరికొన్ని పుస్తకాలు కూడా రాసాడు.[9]

నోబెల్ బహుమతి

అభిజిత్ బెనర్జీకి అతని ఇద్దరు సహ-పరిశోధకులు ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రీమర్‌లతో కలిసి 2019లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ స్మారక బహుమతిని అందుకున్నాడు. "ప్రపంచ పేదరిక నిర్మూలనకు ప్రయోగాత్మక విధానం" అనే పరిశోధనలో వారికి ఈ బహుమతి వచ్చింది.

మూలాలు