ఏకకణ జీవులు

ఏకకణ జీవులు అంటే ఒకే ఒక జీవకణం కలిగిన జీవులు. ఒకటి కంటే ఎక్కువ జీవకణాలు కలిగిన బహుకణ జీవులకంటే ఇవి భిన్నమైనవి. జీవులను ప్రధానంగా కేంద్రకపూర్వ జీవులు, కేంద్రకయుత జీవులు అని వర్గీకరిస్తారు. చాలావరకు కేంద్రకపూర్వ జీవులు ఏకకణ జీవులు. వీటిని బ్యాక్టీరియా, ఆర్కియా అని విభజించారు. చాలా కేంద్రకయుత జీవులు బహుకణ జీవులు. కానీ ప్రోటోజోవా, ఏకకణ శైవలాలు, ఏకకణ శిలీంధ్రాలు లాంటి ఏకకణ జీవులు మాత్రం కేంద్రకయుత జీవులు. ఏకకణ జీవులు జీవం యొక్క మొట్టమొదటి రూపంగా భావిస్తారు. కొన్ని ప్రోటో జీవకణాలు 3.8 నుంచి 4 బిలియన్ సంవత్సరాల క్రితమే ఉద్భవించి ఉండవచ్చు.[1][2]

కొన్ని కేంద్రకపూర్వ జీవులు కాలనీలలో నివసిస్తున్నప్పటికీ, అవి విభిన్న విధులు కలిగిన ప్రత్యేక కణాలు కావు. ఈ జీవులు కలిసి జీవిస్తాయి. ప్రతి కణం జీవించడానికి అన్ని జీవిత ప్రక్రియలను నిర్వహించాలి. దీనికి విరుద్ధంగా, సరళమైన బహుకణ జీవులు కూడా పరస్పరం ఆధారపడి మనుగడ సాగించే కణాలను కలిగి ఉంటాయి.

చాలా బహుకణ జీవులు ఏకకణ జీవిత-చక్ర దశను కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఏకకణ జీవులైన బీజకణాలు బహుకణ జీవులకు పునరుత్పత్తి రూపాలు.[3] జీవం చరిత్రలో భాగంగా బహుకణాలు చాలా సార్లు స్వతంత్రంగా అభివృద్ధి చెందినట్లు అనిపిస్తుంది.

మూలాలు