చింపాంజీ-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు

చింపాంజీ-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు (CHLCA) అంటే హోమినిని లో ప్రస్తుతం ఉనికిలో ఉన్న హోమో (మానవ) ప్రజాతికి, పాన్ (చింపాంజీ, బోనోబో) ప్రజాతికీ ఉమ్మడిగా ఉన్న చిట్టచివరి పూర్వీకుడు. సంక్లిష్టమైన సంకర స్పీసియేషన్ కారణంగా, ఈ పూర్వ జాతి వయస్సుపై ఖచ్చితమైన అంచనా ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ రెంటి మధ్య "తొలి వేర్పాటు" 130 లక్షల సంవత్సరాల క్రితమే (మియోసిన్లో) సంభవించి ఉండవచ్చు. కానీ వేరుపడ్డాక కూడా వీటి మధ్య సంకరం 40 లక్షల సంవత్సరాల క్రితం (ప్లియోసిన్) వరకు కొనసాగుతూనే ఉండి ఉండవచ్చు.

గత కోటి సంవత్సరాలలో హోమినిని, గొరిల్లిని ల స్పీసియేషన్ నమూనా; హోమినినిలోని సంకర ప్రక్రియ సుమారు 80, 60 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య కొనసాగినట్లు సూచిస్తోంది.

మానవ జన్యు అధ్యయనాలలో, మానవ జనాభాలో సింగిల్-న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం (SNP) రేట్లను లెక్కించడానికి CHLCA ఒక యాంకర్ పాయింట్‌గా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో చింపాంజీలను అవుట్‌గ్రూప్‌గా అనగా, జన్యుపరంగా హోమో సేపియన్స్‌తో చాలా సారూప్యత ఉన్న జాతిగా స్వీకరిస్తారు.

టాక్సానమీ


హోమినోయిడియా (హోమినిడ్లు, వాలిడులు)
హైలోబాటిడే (గిబ్బన్లు)
హోమినిడే (హోమినిడ్లు, గొప్ప కోతులు)
పోంగినే
(ఒరంగుటన్లు)
హోమినినే
గొరిల్లిని
(గొరిల్లా)
హోమినిని
పానినా
(చింపాంజీలు)
హోమినినా (మానవులు)


ఒక జాతి నుండి మూడు జాతులు పరిణామం చెందినపుడు వాటిలో అతి తక్కువ సారూప్యత ఉన్న జాతిని మిగతా రెండింటి నుండి వేరుచేయాలి అనే ఆలోచన ఆధారంగా హోమినిని టాక్సన్ తెగను ప్రతిపాదించారు. వాస్తవానికి, దీన్ని బట్టి హోమో అనే ప్రత్యేక జాతి ఉత్పన్నమైంది. ఇది పాన్, గొరిల్లా అనే ఇతర రెండు జాతుల కంటే "చాలా భిన్నమైనది" గా భావించారు. అయితే, తరువాత కనుగొన్న విషయాలు, విశ్లేషణలను బట్టి పాన్, హోమోల్లో పాన్, గొరిల్లాల కంటే జన్యుపరంగా సారూప్యత లున్నాయని వెల్లడైంది. అందువలన, పాన్‌ను హోమో తో కలిపి హోమినిని తెగలో చేర్చారు. దాంతో, గొరిల్లాను వీటి నుండి వేరుచేసి కొత్త టాక్సన్ తెగ గొరిల్లిని ని ఏర్పరచారు. పాన్, హోమో లు హోమినిని తెగలో ఉండాలని, కాని వేరువేరు ఉపతెగలుగా ఉండాలనీ మాన్, వీస్ లు (1996) ప్రతిపాదించారు. [1] హోమో తో సహా ద్విపాద వాలిడులన్నీ హోమినినా అనే ఉపతెగలోను, పాన్‌లు పానినా అనే ఉపతెగలో ఉండాలనీ వారు చెప్పారు. [2]

రిచర్డ్ రాంగ్‌హామ్ (2001). CHLCA జాతి సాధారణ చింపాంజీ (పాన్ ట్రోగ్లోడైట్స్) ని బాగా పోలి ఉందని వాదిస్తూ, ఎంతలా పోలికలున్నాయంటే, దీన్ని పాన్ జాతికి చెందినదిగా, పాన్ ప్రయోర్ అనే పేరుతో వర్గీకరించాలని వాదించాడు. [3]

CHLCA కు మానవుల వైపు వారసులను హోమినినా అనే ఉపతెగలో సభ్యులు. అంటే హోమోను, దానికి దగ్గరి సంబంధం ఉన్న ఆస్ట్రలోపిథెకస్ ప్రజాతులనూ ఇందులో చేర్చాలి. అంటే, పాన్ వంశం నుండి విడిపోయిన తర్వాత ఉద్భవించిన హోమినిని తెగకు చెందిన మానవ-సంబంధ జాతులన్నీ అని అర్థం. పాన్ ను ఇందులో చేర్చరాదు. ఇటువంటి సమూహం "మానవ క్లేడ్" ను సూచిస్తుంది. ఇందులోని సభ్యులను " హోమినిన్స్ " అని పిలుస్తారు. [4] "చింపాంజీ క్లేడ్" ను వుడ్, రిచర్డ్‌లు పానిని అనే తెగలో చేర్చాలని సూచించారు. ఇది హోమినిడే కుటుంబం నుండి వేరుపడిన మూడు ఉపకుటుంబాల్లో ఒకటి అవుతుందని భావించారు. [5]

శిలాజ ఆధారాలు

ఇంకా ఏ శిలాజాన్నీ నిశ్చయంగా ఉమ్మడి పూర్వీకుడని గుర్తించలేదు. గ్రేకోపిథెకస్ ను అలా గుర్తించేందుకు కొంత సంభావ్యత ఉంది.. [6] దీన్ని గుర్తిస్తే, ఉమ్మడి పూర్వీకుడు ఆఫ్రికాలో కాకుండా ఐరోపాలో ఉన్నట్లు అవుతుంది [7]

సహెలాంత్రోపస్ చాడెన్సిస్ హోమినినేకు చెందిన అంతరించిపోయిన జాతి. దీన్ని ఉమ్మడి పూర్వీకుడిగా గుర్తించ దగినంత శరీరనిర్మాణం దీనికి ఉందని కొందరు ప్రతిపాదించారు (కొందరు విభేదించారు కూడా). ఇది 70 లక్షల సంవత్సరాల క్రితం, చింపాంజీ-మానవ వేర్పాటు సమయానికి దగ్గరగా, నివసించింది. కానీ దీనిని హోమినిని తెగలో హోమో, పాన్ ల ప్రత్యక్ష పూర్వీకుడిగా, సిహెచ్‌ఎల్‌సిఎ జాతిగా చేర్చవచ్చా లేదా కేవలం శరీర నిర్మాణంలో తరువాతి కాలపు హోమినిన్లతో కొన్ని పోలికలున్న మయోసీన్ కాలపు కోతిగా భావించాలా అనేది అస్పష్టంగా ఉంది.

ఆర్డిపిథెకస్ 55 లక్షల సంవత్సరాల క్రితం, మానవ-చింపాంజీలు వేరుపడిన తరువాత, బహుశా సంకరం ఇంకా కొనసాగుతూనే ఉన్న సమయంలో జీవించింది. దీనికి చింపాంజీలతో అనేక సారూప్య లక్షణాలున్నాయి. కానీ దాని శిలాజాలు అసంపూర్ణంగా ఉండడం, మానవ-చింపాంజీ వేర్పాటు కాలానికి సమీపంలో ఉండడం కారణంగా, శిలాజ రికార్డులో ఆర్డిపిథెకస్ యొక్క ఖచ్చితమైన స్థానం అస్పష్టంగా ఉంది. [8] బహుశా ఇది చింపాంజీ వంశం నుండి ఉద్భవించి ఉంటుంది. అందువల్ల మానవులకు నేరుగా పూర్వీకుడు కాదు. [9] [10] అయితే, మానవులకు మాత్రమే ప్రత్యేకంగా ఉండే లక్షణాలేమీ ఆర్డిపిథెకస్ కు లేనందున, ఇది, మానవులు చింపాంజీలూ గొరిల్లాల నుండి వేరుపడక ముందు జీవించిన వాలిడుల (తోక లేని కోతుల) నుండి ఉద్భవించి ఉండవచ్చని సార్మియెంటో (2010) సూచించాడు. [11]

స్పష్టంగా మానవుడికి మాత్రమే చెంది, చింపాజీకి సంబంధమేమీ లేని తొట్టతొలి శిలాజాలు ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్‌ వి. ఇవి 45 నుండి 40 లక్షల సంవత్సరాల క్రితం మధ్య కాలం నాటివి.

మానవులు చింపాంజీలు వేరుపడ్డాక, చింపాంజీ వైపు శిలాజాలు కూడా కొన్ని దొరికాయి. కెన్యా లోని తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ వ్యాలీలో 5,45,000, 2,84,000 సంవత్సరాల క్రితం మధ్య కాలం నాటి శిలాజ చింపాంజీని మెక్‌బ్రేర్టీ, 2005 లో కనుగొన్నాడు. [12]

వయస్సు అంచనాలు

ఉమ్మడి పూర్వీకుడి వయసు, TCHLCA 1 నుండి 1.3 కోట్ల సంవత్సరాలు ఉంటుందని 1998 లో ప్రతిపాదించారు,[note 1] ఇది 70 నుండి 100 లక్షల సంవత్సరాల క్రితం జరిగి ఉంటుందని వైట్ తది.. (2009) భావించారు:

అంటే, మానవ-చింపాంజీ వేర్పాటు ఇటీవలనే జరిగిందనే దానికి కారణం ఏమీ లేదు, ఈ వేర్పాటు జరిగిందనేందుకు ప్రస్తుతమున్న శిలాజ ఆధారాలు 70 నుండి 100 లక్షల సంవత్సరాల క్రితం సరిపోతున్నాయి..

—వైట్ తది.. (2009), [14]

కొంతమంది పరిశోధకులు దగ్గరి సంబంధం ఉన్న జంతువుల మధ్య కొద్దిగా భిన్నంగా ఉండే బయోపాలిమర్ నిర్మాణాలను ఉపయోగించి ఉమ్మడి పూర్వీకుడి వయసు (T CHLCA ) అంచనా వేయడానికి ప్రయత్నించారు. ఈ పరిశోధకులలో అలన్ సి. విల్సన్, విన్సెంట్ సారిచ్ లు మోలిక్యులర్ గడియారం అభివృద్ధికి బాటలు వేసినవారు. ప్రోటీన్ సీక్వెన్సులపై పనిచేస్తూ, శిలాజ రికార్డు ఆధారంగా పాలియోంటాలజిస్టులు భావించిన దానికంటే కోతులు మానవులకు దగ్గరగా ఉన్నాయని వారు నిర్ధారించారు (1971). T CHLCA వయస్సు 80 లక్షల సంవత్సరాల కంటే పాతది కాదని, [15] 40 - 60 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందనీ తరువాతి కాలంలో విన్సెంట్ సారిచ్ తేల్చి చెప్పాడు.

జెనోమ్ సీక్వెన్సులపై 2016 లో చేసిన అధ్యయనంలోమానవ-చింపాంజీల వేర్పాటు 1.21 కోట్ల సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చనే అంచనాకు చేరుకుంది. [16]

హైబ్రిడ్ స్పెసియేషన్

పాన్ - హోమో స్ప్లిట్ యొక్క ఖచ్చితమైన వయస్సును నిర్ణయించడంలో గందరగోళానికి మూలం - రెండు వంశాల మధ్య విస్పష్టమైన విభజన కాకుండా, సంక్లిష్టమైన సంకర స్పెసియేషన్ జరగడం. వేర్వేరు క్రోమోజోములు వేర్వేరు సమయాల్లో విడిపోయినట్లు - బహుశా 40 లక్షల సంవత్సరాల అంతరంలో - కనిపిస్తాయి. 63 నుండి 54 లక్షల సంవత్సరాల క్రితమే వేరుపడడం మొదలైనా, ఈ రెండు వంశాల మధ్య పెద్ద ఎత్తున సంకరం జరుగుతూండడంతో సుదీర్ఘమైన స్పీసియేషన్ ప్రక్రియ జరిగినట్లు ఇది సూచిస్తోంది. (ప్యాటర్సన్ తదితరుల ప్రకారం -2006). [17]

పాన్, హోమోల మధ్య స్పీసియేషన్ గత 90 లక్షల సంవత్సరాలలో సంభవించింది. బహుశా మధ్య మియోసిన్ మెస్సీనియన్‌ కాలంలో, ఆర్డిపిథెకస్, పాన్ వంశం నుండి వేరుపడింది. [9] [10] తొలి వేర్పాటు తరువాత, ఈ జనాభా సమూహాల మధ్య అనేక లక్షల సంవత్సరాల పాటు సంకరం కొనసాగి ఉంటుందని పాటర్సన్ (2006) చెప్పాడు. [17] చివరి మయోసీన్ లేదా ప్రారంభ ప్లయోసీన్ సమయంలో, మానవ క్లేడ్‌కు చెందిన తొలి సభ్యులు పాన్ వంశం నుండి పూర్తిగా వేరుపడ్డారు. ఈ వేర్పాటు 130 నుండి 40 లక్షల సంవత్సరాల మధ్య జరిగి ఉంటుందని అంచనా. 40 అక్షల సంవత్సరాలనే సమయాన్ని, సంకరం జరిగి ఉంటుందనే వాదననూ వేక్లీ తిరస్కరించాడు.

మరీ ఇటీవలి వరకూ, అంటే 40 లక్షల సంవత్సరాల క్రితం వరకూ కూడా, సంకరం జరుగుతూ ఉందనే భావన, మానవులు, చింపాంజీలలోని X క్రోమోజోమ్‌ల సారూప్యతపైనే ముఖ్యంగా ఆధారపడింది. అలా భావించాల్సిన అవసరం లేదని వేక్లీ (2008) దీన్ని తిరస్కరిస్తూ, CHLCA పూర్వీకుల జనాభాలో X క్రోమోజోమ్‌లపై ఎంపిక ఒత్తిడి ఉండి ఉండవచ్చని అతడు సూచించాడు.

ఇవి కూడా చూడండి

గమనికలు

మూలాలు