నగర-రాజ్యం

సార్వభౌమ నగరం

నగర-రాజ్యం లేదా నగర రాజ్యం లేదా నగరరాజ్యం అంటే చుట్టుపక్కలి ప్రాంతాలకు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా మసలే ఒక స్వాతంత్ర్య, సార్వభౌమ నగరం.[1] చరిత్ర మొదలైన నాటి నుండి ఇలాంటి నగరాలు ప్రపంచంలో చాలా మూలల్లో ఏర్పడ్డాయి. వీటిలో ముఖ్యమైనవి గ్రీకు పొలిస్లు ఐన ఎథిన్స్, స్పర్టాలు, ఆధునిక టూనిస్యలో ఒకప్పుడు ఉన్న కార్థిజ్, రోము, కొలంబ్య పూర్వ మెక్సికోలో[గమనిక 1] ఆల్టెపేౘ్‌లు [గమనిక 2], మధ్యయుగపు ఇటలీలోని ఫ్లొరన్స్, వెనిస్, జెనోవ, మిలాన్‌లు.

నేడు ప్రపంచవ్యాప్తంగా జాతిరాజ్యాల హవా పెరగడంతో, ఆధునిక సార్వభౌమ నగర-రాజ్యాలు చాలా కొన్నే మిగిలాయి. ఏవి నగర-రాజ్యాలు అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎక్కువ మందిచే అంగీకరించబడేవి మొనకో, సింగపూరు, వెటికన్ నగరాలు. పూర్తి స్వయం పాలనా, సొంత ద్రవ్యమారకం, బలమైన సైనికశక్తీ, 55 లక్షల జనాభాతో సింగపూరు నగర రాజ్యానికి చాలా మంచి ఉదాహరణ.[2]

సార్వభౌమాధికారం లేని కొన్ని రాజ్యాలు కూడా పెద్ద ఎత్తున స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. వీటినీ కొన్నిసార్లు నగర-రాజ్యాలుగా పరిగణించొచ్చు. వీటిలో ముఖ్యమైనవి హొంకొంగ్, మకొవ్‌లూ,[3][4] యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యులైన దుబాయి, అబు దాబిలు.[5][6][7]

చరిత్ర

ప్రాచీన, మధ్యయుగాలు

ప్రాచీన, మధ్యయుగాల నగర-రాజ్యలలో ముఖ్యమైనవి సుమేరులోని ఉరుక్, ఉర్‌లూ; ప్రాచీన ఈజిప్టులోని థీబ్స్, మెంఫిస్‌లూ; ఫనిషలోని టైయర్, సైడన్‌లూ; ఐదు ఫిలిస్టియ నగర రాజ్యాలూ; ప్రాచీన గ్రీకు పొలిస్‌లూ; రోము గణతంత్రం (నగర రాజ్యంగా మొదలైన ఇది ఒక మహా సామ్రాజ్యంగా ఎదిగింది); ఇటలీలోని ఫ్లొరన్స్, సియేనా, ఫెరరా, మిలన్‌లు. చుట్టూ ఉన్న నగరాలపై కూడా వీటి పెత్తనం ఉండేది. ఇటలీలో ఇంకొన్ని ముఖ్యమైన నగర రాజ్యాలైన జెనొవ, వెనిస్‌లు బలమైన థలసొక్రసీలుగా (ఆంగ్ల వికీ లంకె) మారాయి. వీటితో సమాన ప్రాముఖ్యత గల మరికొన్ని ఉదాహరణలు: కొలంబ్య పూర్వ మీసో అమెరికాలోని మైయా, ఇతరత్రా సంస్కృతుల్లోని నగరాలైన చీచెన్ ఈట్సా, టికాల్, కొపాన్, మొన్టె అల్బాన్ వగైరాలు; సిల్క్ రోడ్డు మీదనున్న మధ్య ఆసియా నగరాలు; స్వహీలీ తీరాన ఉన్న నగరాలు, ఆధునిక క్రొయేషియాలో ఒకప్పుడు ఉన్న రగుస, మధ్యయుగపు రష్యాలోని నొవ్గొఱొడ్, ప్స్కొవ్ నగరాలు. డెన్మార్క్ చరిత్రాకారుడు పొవ్ల్ హోమ్ మధ్యయుగపు ఐయర్లాన్డ్‌లోని వైకింగ్ వలసరాజ్యాలను, ముఖ్యంగా డబ్లిన్‌ను, కూడా నగర రాజ్యాలుగా పేర్కొన్నాడు.[8]

రగుస గణతంత్ర నగర-రాజ్యం

సైప్రస్‌లో ఫనిష ఆవాసమైన కితియొన్ (ఆధునిక లఱ్నక) క్రీ.పూ 800 నుండి క్రీ.పూ 4వ శతాబ్ది చివరి వరకూ నగర రాజ్యంగా విలసిల్లింది.

గ్రీకు పొలిస్‌లైనా, ఇటలీ వర్తక నగరాలైనా సార్వభౌమ నగరాలుగా ఉంటూనే సాంస్కృతిక, భౌగోళిక ఏకరూపతను నిలుపుకునేవి. దీని వలన ఇవి కలిసిపోయి జాతి రాజ్యాలుగా ఏర్పడలేదు.[ఆధారం చూపాలి] ఐతే ఇలాంటి చిన్న చిన్న రాజ్యాలకు పెద్ద రాజ్యాల దండయాత్రలను తట్టుకునేందుకు కావలసిన వనరులు లేక (గ్రీకుపై రోమన్ల దండయాత్రలా), ఏదో ఒక దశలో సామ్రాజ్యాల్లోనో, దేశాల్లోనో భాగాలుగా మారిపోయేవి.[9]

మధ్య ఐరోపా

1792 నాటికి ఉన్న ఫ్రీ ఇంపియర్యల్ సిటీస్‌ను చూపిస్తున్న పటము

రోము సామ్రాజ్యంలో (962–1806) 80 నగరాలకు స్వయం ప్రతిపత్తి ఉండేది. ఆధునిక యుగ ప్రారంభంలో 1648లో జరిగిన వెస్ట్‌ఫెయ్ల్య ఒప్పందం తరువాత, అంతర్జాతీయ చట్టం కూడా వీటి స్వయం ప్రతిపత్తికి రక్షణ కల్పించింది. వీటిని "ఫ్రీ ఇంపియర్యల్ సిటీస్"గా (Free Imperial Cities, అర్థం: స్వేచ్ఛా సామ్రాజక నగరాలు) పేర్కొంటారు. ఈ నగరాలు పక్కనున్న ఇతర నగరాలతోనో, ప్రాంతాలతోనో కలిసి రక్షణ సమితులను ఏర్పాటు చేసుకునేవి. ఇలాంటి సమితులకు ఉదాహరణలు హెన్సియెటిక్ లీగ్ (1358–17వ శతాబ్దం, Hanseatic league), స్వెయ్బ్యన్ లీగ్ ఒఫ్ సిటీస్ (1331–1389, Swabian league of cities), ఎల్‌సెస్‌లోని డెకపొల్ (1354–1679, Décapole), ఓల్డ్ స్విస్ కన్‌ఫెడరసి (1300–1798 Old swiss confederacy). స్విస్ కెన్టన్లు[గమనిక 3] జ్యరిక్, బెర్న్, లుౘెర్న్, ఫ్రైబుర్గ్, సొవ్లట్వర్న్, బాజల్, షఫ్‌హౌసన్, జనీవాలు నగర రాజ్యాలుగానే మొదలయ్యాయి.

1806లో రోము సామ్రాజ్యం పడిపోయాక వివిధ సమితుల్లోని సభ్య రాజ్యాలు, నగర-రాజ్యాలుగా మారాయి. వాటిలో ముఖ్యమైనవి "ఫ్రీ హెన్సియెటిక్ సిటీ ఒఫ్ బ్రేమన్" (1806–11 దాకా, మళ్ళీ 1813–71 దాకా), "ఫ్రీ సిటీ ఒఫ్ ఫ్రంక్‌ఫుర్ట్ అపొన్ మెయ్న్" (1815–66), "ఫ్రీ అన్డ్ హెన్సియెటిక్ సిటీ ఒఫ్ హెమ్‌బుర్క్" (1806–11 వరకు, మళ్ళీ 1814–71 వరకు), "ఫ్రీ అన్డ్ హెన్సియెటిక్ సిటీ ఒఫ్ ల్యీబెక్" (1806–11 వరకు, మళ్ళీ 1813–71 వరకు), "ఫ్రీ సిటీ ఒఫ్ క్రకుఫ్" (1815–1846). హెప్స్‌బేర్గ్ పాలనలో నేటి క్రొయేషియాలోని ఫ్యూమ్ నగరానికి వేరుగా గుర్తింపు (1779–1919) ఉండేది. ఈ గుర్తింపు వలన నగర-రాజ్యాలకున్న వెసులుబాట్లు చాలానే ఉన్ననూ సార్వభౌమత్వం ఉండేది కాదు.

ఇటలి

1494లో లోది శాంతి ఒప్పందం తరువాతి ఇటలీ భూభాగాలు.

మధ్యయుగమూ, పునరుజ్జీవన కాలాల్లోని ఇటలీ ఉత్తరా, మధ్య భాగాల్లో రాజ్యం అంటే నగర రాజ్యం అన్నట్లు ఉండేది. వీటిలో కొన్ని పేరుకు రోము సామ్రాజ్యంలో భాగాలైనా, స్వతంత్ర రాజ్యాలుగానే నడిచేవి. 11వ శతాబ్ది నుండి 15వ శతాబ్ది వరకూ ఇటలీలో ఈ నగర రాజ్యాల హవా నడిచింది. ఈ కాలంలో ఆర్థిక అభివృద్ధీ, వర్తకం, వస్తు ఉత్పత్తీ, వాణిజ్య పెట్టుబడిదారీ విధానమూ విశేష స్థాయిని అందుకున్నాయి. వీటితో పాటు పట్టణీకరణ కూడా ఊపందుకుని, ఈ నగర రాజ్యాల్లోని అభివృద్ధి తాలూకు ప్రభావం ఐరోపా మీద పడింది. ఈ కాలంలోని నగర రాజ్యాల్లో, కొన్నిటిలో రాజ్యం సిఞ్ఞొరీయ[గమనిక 4] వంటి ఒక పాలకుడి ఆధీనంలో ఉండగా, కొన్ని ఒక వంశం ఆధీనంలో పాలింపబడుతుండేవి. వంశాలకు కొన్ని ఉదాహరణలు: "హౌస్ ఒఫ్ గొన్‌ౙాగ", "హౌస్ ఒఫ్ స్ఫొర్ౘ".[10]

మధ్యయుగాలూ, పునరుజ్జీవనం నాటి ఇటలీ నగర రాజ్యాలకు కొన్ని ఉదాహరణలు: ఫ్లొరన్స్ గణతంత్రం, మిలెన్ డచి[గమనిక 5], ఫరార డచి, సెన్ మరీనో, మొడిన అన్డ్ రెజొ డచి, ఆర్‌బీనో డచి, మెన్ట్యువ డచి, లూక గణతంత్రం.

ఇవి కాక నాడు ఇటలీలోని మెరిటైం రిపబ్లిక్స్ (ఆంగ్ల లంకె) కూడా నగర రాజ్యాలే. ఇవి ఏవి అనగా: వెనిస్ గణతంత్రం, జెనోవ గణతంత్రం, అమెల్ఫి గణతంత్రం, పీస గణతంత్రం, ఎంకోన గణతంత్రం, గయేట డచి.

ఆగ్నేయ ఆసియా

ఆగ్నేయాసియాలోని ఇన్డో-చైనాలోని ఆవాసాలను ఉన్నత వర్గాల వారూ లేదా బౌద్ధ మతపెద్దలు పూర్తిగా లేక పాక్షికంగా స్వయం ప్రతిపత్తి గల నగరాలుగా తీర్చిదిద్దారు. వీటిని "మువఙ్" లేదా "మఙ్"లు[గమనిక 6] అంటారు. ఈ మఙులు సార్వభౌమ నగరాలు. ఒక మఙు దానికంటే పెద్ద మఙుల రక్షణలో ఉండేది. ఇలా రక్షణ కల్పించేందుకు గానూ చిన్న మఙులు పెద్ద మఙులకు శిస్తు కట్టేవి. కొన్ని మఙులు వాటికంటే చిన్నవాటికి రక్షణ ఇస్తూనే, వాటికంటే పెద్దవాటి రక్షణలో ఉండేవి. ఇలా మఙులకు వివిధ స్థాయిలు ఉండేవి. అయుత్థయ[గమనిక 7], బగఁ, బెంకొక్ వంటి కొన్ని నగరాలు అతి పెద్ద మఙులుగా ఉండేవి. ఇలా చిన్న మఙులు పెద్ద మఙుల రక్షణలో ఉండే రాజ్యపరిపాలనా వ్యవస్థని "మండల వ్యవస్థ" అని పేర్కొంటారు.

ఈ ప్రాంతంలో 19వ శతాబ్దంలో ఐరోపా వలసరాజ్యాలు ఏర్పడేవరకూ ఈ మండల వ్యవస్థ నడిచింది. ఐరోపేయమ శక్తులతో లావాదేవీలు జరిపేందుకు నాడు థయ్‌లోని శక్తిమంతమైన సయాం సామ్రాజ్యానికి తమ కింద ఉన్న నేలను చాటవలసిన అవసరం ఏర్పడింది. దానితో వారు ఈ మండల వ్యవస్థను రద్దు చేసి, థాయిలన్డ్‌ను జాతి రాజ్యంగా మార్చారు.[11][12][13]

ఫిలిపీన్స్‌లో బారాంగై అనే చారిత్రక రాజ్యపాలనా వ్యవస్థ ఉండేది.[14][15][16] బారాంగై పాలకుడిని డటు అనో, రాజ అనో, సుల్తాన్ అనో పిలిచేవారు.[17] ఫిలిపీన్స్ చరిత్తను గ్రంథస్తం చేసిన మొట్టమొదటి ఐరోపా చరిత్రకారులు[18] ఈ బారాంగై అనే పదం "బాలాంగై" అనే ఇంకో పదం నుండి పుట్టిందని వ్రాసారు. బాలాంగై అనేది నాటి ఫిలిపీన్స్ వాసులు వాడే తెరచాప పడవ పేరు.[15]

20వ శతాబ్దం

డంౘిశ్

బోల్టిక్ సముద్ర తీరాన ఉన్న డంౘిశ్ (నేటి పోలన్డ్‌లో ఉన్న ఆధునిక గడెన్స్క్) రేవు చుట్టూ ఉండే సుమారు 200 గ్రామాలతో "ఫ్రీ సిటి ఒఫ్ డంౘిశ్" ఏర్పడింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసాక 1919లో జరిగిన వెర్సయ్ ఒప్పందంలోని ఆర్టికల్ 100 (మూడవ భాగంలో 11వ సెక్షన్) ఆధారంగా, 15 నవంబర్ 1920న ఈ నగర-రాజ్యం ఏర్పడింది. పాక్షిక స్వయం ప్రతిపత్తితో నడిచిన ఈ రాజ్యం 1939 వరకు ఉండేది.

ఫ్యూమె

1719–1919 వరకు హెబ్స్‌బర్గ్ వంశ పాలనలో ఫ్యూమె నగరానికి సార్వభౌమత్వం లేకున్ననూ చాలా వెసులుబాట్లు ఉండేవి. దీనికంటే ముందు ఇది రోము సామ్రాజ్యంలో భాగం. 1920లో ఇది పూర్తి స్థాయి సార్వభౌమ నగరంగా మారింది. ఫ్యూమె నగరంతో (నేటి క్రొయేషియాలోని ఆధునిక రియేక) పాటు ఉత్తరాన ఉన్న పల్లె ప్రాంతాలనూ, పశ్చిమాన ఇటలీతో అనుసంధానం చేసే ఇంకో ప్రాంతాన్నీ కలుపుకుని ఏర్పడ్డ ఈ రాజ్య విస్తీర్ణం 28 చ.కి.మీ. నగర-రాజ్య హోదా దీనికి నాలుగేళ్ళపాటు, అనగా 1924 వరకూ ఉంది.

జరూసలం

1947లో తయారైన పాలస్తీనా విభజనకు ఐ.రా.స ప్రణాళిక ప్రకారం మెన్డటరి పాలస్తీనాను (Mandatory Palestine) మూడు రాజ్యాలుగా విభజించడమైనది. అవి యూదు రాజ్యం ఇస్రాయ్ల్, అరబీ రాజ్యం పాలస్తీనా, ఒక వేరు ప్రాంతం ఐన నగర రాజ్యం జరూసలం. ఈ నగర రాజ్యం ఐ.రా.స ట్రస్టీషిప్ కౌన్సిల్ నియంత్రణలో ఉండాలి. ఈ ప్రణాళికకు ఐ.రా.స ఆమోదంతో పాటు కొంత అంతర్జాతీయ మద్దతు కూడా లభించింది. కానీ ఇంతలో 1947 పాలస్తీనా యుద్ధంతో పాటు 1947–48 పాలస్తీనా అంతర్యుద్ధం రావడంతో ఈ ప్రణాళిక అమలుకాలేదు. జరూసలం తూర్పూ, పశ్చిమ భాగాలుగా విడిపోయింది. తరువాత 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇస్రాయ్ల్ తూర్పు భాగాన్ని చేజిక్కించుకుంది.

మెమల్

1920లో వెర్సయ్ ఒప్పందం ద్వారా జర్మనీ సరిహద్దులోని భూభాగం మెమల్ లేదా క్లెయ్పెడ ప్రాంతంగా ఏర్పడింది. ఇది కౌన్సిల్ ఒఫ్ ఎంబెసడర్స్ (Council of ambassadors) పాలనలో ఉండేది. అప్పటికి దాన్ని నానాజాతి సమితి నియంత్రణలో ఉంచి, భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించి, వాటి ఆధారంగా దీన్ని జర్మనీలో కలపాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలన్నది నాటి ప్రణాళిక. ఐతే 1923లో క్లెయ్పెడ తిరుగుబాటు తరువాత ఈ ప్రాంతం లిథ్యుయెయ్న్య సొంతమైంది.

షాంఘై

షాంఘై/షాంహై అంతర్జాతీయ ఆవాసం (1845–1943) అనే ఒక అంతర్జాతీయ భూభాగానికి సొంత న్యాయ వ్యవస్థా, తపాలా సేవలూ, ద్రవ్యమారకం ఉండేవి.

టెన్జ్యర్

టెన్జ్యర్

ఉత్తర ఆఫ్రికాలోని టెన్జ్యర్ నగరం లోపల ఉన్న టెన్జ్యర్ అంతర్జాతీయ భూభాగపు వైశాల్యం 373 చ.కి.మీ. మొదట్లో ఈ ప్రాంతం ఫ్రన్స్, స్పెయ్న్, యు.కెల ఉమ్మడి పాలనలో ఉండేది. తరువాత పోర్చుగల్, ఇటలీ, బెల్జ్యం, నెథర్‌లెన్డ్స్, స్వీడెన్, యు.ఎస్‌లు కూడా పాలనా బాధ్యతలను పంచుకున్నాయి. తరువాత ఇది మరొకో పాలనలోకి వెళ్ళింది. 1923–29 అక్టోబర్ 1956 వరకు కొంతకాలం ఫ్రన్స్-స్పెయ్న్ సంరక్షిత రాజ్యంగా ఉండి, తరువాత మళ్ళీ మరొకో ఆధీనంలోకి వెళ్ళింది.

ట్రియెస్ట్

ఫ్రీ టెరిటరి ఒఫ్ ట్రియెస్ట్ (Free territory of Trieste) అనేది మధ్య ఐరోపాలో ఉత్తర ఇటలీకీ, యూగోస్లావ్యాకీ మధ్యన ఎయ్డ్రియ సముద్రపు ఉత్తర భాగానికేసి ఉన్న ఒక ప్రాంతం. ఈ ప్రాంతం రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1947–54 వరకూ ఐ.రా.స భద్రతా మండలి కింద ఉండేది. ఐ.రా.స దీన్ని నగర రాజ్యంగా మార్చాలని ప్రయత్నించింది కానీ, ఈ ప్రాంతానికి ఎప్పుడూ నిజమైన స్వాతంత్ర్యం రాలేదు. చివరికి 1954లో ఇటలీ, యూగోస్లావ్యాలు ఈ ప్రాంతాన్ని పంచుకున్నాయి.

పశ్చిమ బేర్లిన్

1948–90 వరకు పశ్చిమ బేర్లిన్‌కు సార్వభౌమత్వం లేనప్పటికీ, ఏ రాజ్యానికీ చెందని నగరంగా వెస్టర్న్ బ్లొక్ (western bloc) పాలనలో ఉంది. ఈ బ్లొక్ దేశాలు ఆ ప్రాంతంలో స్వయంపాలనకు అభ్యంతరం చెప్పలేదు. ఈ పశ్చిమ బేర్లిన్‌కు పశ్చిమ జర్మనీతో సత్సంబంధాలుండేవి కానీ, ఇది దానిలో భాగమవ్వలేదు. తరువాత జర్మన్ ఏకీకరణ జరిగానప్పుడు ఈ నగరం జర్మనీలో కలిసిపోయింది.

ఆధునిక నగర రాజ్యాలు

జూదశాలలకీ, రాజరికానికీ, అందమైన రేవులకీ ప్రసిద్ధి చెందిన మొనకో చిత్రం
ఆధునిక నగర రాజ్యమూ, ద్వీపదేశమూ ఐన సింగపూరు చిత్రం

మొనకో

మొనకో అనేది ఫ్రన్స్‌కు ఆనుకుని ఉండే నగర రాజ్యం. 1917 వరకూ మూడు నగరపాలక విభాగాలుగా పాలించబడ్డ ఈ నగరం, ఆ తరువాత నుండి రెండు జిల్లాలుగా విభజించబడింది. అవి మొనకో-విల్ (కందకంతో రక్షింపబడిన ప్రాచీన నగరం), మొన్టి కార్లోలు. ఈ రాజ్యానికి చిన్నపాటి సైన్యం ఉన్నప్పటికీ, యుద్ధ దళాలకు ఫ్రన్స్‌పై ఆధారపడుతుంటుంది.

సింగపూరు

సింగపూరు ఆసియాలో మలేషియాకు ఆనుకుని ఉండే ఒక ద్వీప నగర రాజ్యం. 728.3 చ.కి.మీలో విస్తరించి ఉన్న ఈ నగర జనాభా సుమారు 56 లక్షలు. అత్యంత జనసాంద్రత గల దేశాల్లో మొనకోది మొదటి స్థానం కాగా దీనిది రెండో స్థానం. రెండేళ్ళ పాటు మలేషియాలో భాగంగా ఉన్న ఈ ద్వీపం, 1965లో సమాఖ్య నుండి తోసివేయబడింది. దానితో ఇది ఒక నగర రాజ్యంగా మారింది. సింగపూరుకు సొంత ద్రవ్యమారకం, పెద్ద వాణిజ్య విమానాశ్రయం, ప్రపంచంలో అత్యధిక రద్దీ గల రేవులలో ఒకటైన ఒక రేవు, పూర్తి స్థాయి సైనిక దళాలూ ఉన్నాయి.[19][20] ఆంగ్లేయ వారపత్రిక "ద ఇకొనమిస్ట్" దీన్ని ప్రపంచంలో ఏకైక పూర్తి స్థాయి నగర రాజ్యంగా పేర్కొంది.[21]

వెటికన్ నగరం

ప్రపంచంలోని అతిచిన్న దేశంగా ప్రసిద్ధికెక్కిన వెటికిన్ నగరపు భూపటం

1870 వరకు రోము పోప్ ఆధీనంలో ఉండేది. 1870లో రెండవ విక్టర్ ఇమెన్యువల్ రోము నగరాన్ని ఆక్రమించుకుని ఇటలీ రాజ్యాన్ని నెలకొల్పినప్పుడు, నాటి పోప్ ఐన తొమ్మిదవ పైయస్, ఈ కొత్త రాజ్యాన్ని గుర్తించడానికి నిరాకరించారు.

రాజు అధికారాన్ని ఒప్పుకోకుండా అతను తిరగలేడు కనుక, అతనూ, ఆ తరువాతి పోప్‌లూ ఒకసారి పోప్‌గా నియమితులయ్యాక వారి ప్రత్యక్ష పాలనలో ఉన 0.44 చ.కి.మీల లియొనిన్ నగరాన్ని దాటి వెళ్ళేవారు కాదు. వారిని వారు వెటికన్‌లో ఖైదీలుగా చెప్పుకునేవారు.

1929లో అప్పటి రాజు మూడో ఇమెన్యువల్‌కీ, నాటి పోప్ పదకొండవ పైయస్‌కూ మధ్య ఇటలీ నియంత బెనీటొ ముస్సొలీని కుదిర్చిన లెటరన్ ఒప్పందాలతో ఈ చిక్కుముడి వీడింది. ఈ ఒప్పందం ప్రకారం వెటికన్ నగరం పోప్ పాలనలో ఉన్న స్వాతంత్ర్య నగరంగా గుర్తించబడింది. నేడు ఈ రాజ్యానికి సొంత పౌరసత్వం, జెండా, తపాలా బిళ్ళలూ, దౌత్య వర్గం ఉన్నాయి. ఎక్కువగా క్రైస్తవ మతాచార్యులు నివాసముండే ఈ దేశ జనాభా 1000 మంది లోపే. ఇది ప్రపంచంలోకెల్లా అతిచిన్న సార్వభౌమ దేశం.

నగర రాజ్యాల్లాంటి మరికొన్ని నగరాలు

నగర రాజ్యాలను తలపించేలాంటి రాజ్యాలు ఇంకొన్ని ఉన్నాయి. చాలామంది వీటిని కూడా నగర రాజ్యాలుగా పేర్కొంటుంటారు. జిబూటి,[22] కతార్,[23][24] బ్రూనై,[5] కువైట్,[5][23][25] బారెయ్న్,[5][23] మల్టా[26][27][28] రాజ్యాలలో ఒకటి కంటే ఎక్కువ పురపాలక విభాగాలు ఉండి, వాటిలో ఒకదాన్ని రాజధానిగా గుర్తిస్తారు. రాజ్యంలోని జనాభాలో ఎక్కువ మంది ఈ రాజధానాలో ఉండడంతో పాటు స్థూ.దే.ఉలో ఎక్కువ భాగం ఇక్కడి నుండే వసూలు అవుతుంటుంది. ఐతే చారిత్రాక నగర రాజ్యాలుగా నేడు చెప్పబడుతున్న వాటికి కూడా ఇలా ఒక రాజధాని ఉండేది అన్నది గమనార్హం‌. జనాభా సాంద్రత ఎక్కువగా ఉండే సెన్ మరీనో లాంటి కొన్ని మైక్రోస్టేట్స్‌ని (Microstate, అర్థం:సూక్ష్మరాజ్యం) కూడా కొన్ని సందర్భాలలో నగర రాజ్యాలుగా పేర్కొనడం జరిగింది. ఐతే మిగతా నగర రాజ్యాలకు వలె వీటికి ఒక ప్రత్యేక ముఖ్య పట్టణం అనేది ఉండదు.[5][6][29]

సార్వభౌమత్వం లేని నగర రాజ్యాలు

విశేష స్వయం-ప్రతిపత్తి గల హొంకొంగ్ నగరాన్ని కూడా కొందరు నగర రాజ్యంగా లెక్కేస్తారు.

కొన్ని నగరాలకు సార్వభౌమత్వం లేకున్ననూ, విశేషమైన స్వయం ప్రతిపత్తి ఉంటుంటుంది. కనుక ఇవి తాము భాగంగా ఉన్న సార్వభౌమ రాజ్యానికి లోబడి ఉండే "నగర రాజ్యాల" వలె నడుచుకుంటూ ఉంటాయి. వీటిలో కొన్ని ఒక సమాఖ్యలో భాగంగా ఉండేవి అయ్యుంటాయి. ఇలాంటి నగరాల స్వయం పాలనను గురించి డెన్మార్క్ చరిత్రాకారుడు మొగెన్స్ హెర్మన్ హెన్సన్ వివరిస్తూ: "నగర-రాజ్యం ఒక స్వయం పాలిత ప్రాంతమే కానీ స్వతంత్ర ప్రాంతం కాదు" అని పేర్కొన్నాడు. స్వయం ప్రతిపత్తి లేకుండా పరిమిత స్వయం పాలన ఉండే నగరాన్ని "ఇన్డిపెన్డన్ట్ సిటి" (Independent city)గా పిలుస్తారు.

సార్వభౌమత్వం లేకున్ననూ విశేషమైన స్వయం ప్రతిపత్తి ఉన్న నగరాలకు ఉదాహరణలు:

కొన్ని నగరాలు రాజ్యాలుగా ఉన్ననూ, ఏదో ఒక సమాఖ్యలో భాగమైనందున, వాటికి సార్వభౌమత్వం ఉండదు. వీటిని సార్వభౌమత్వం లేని నగర రాజ్యాలుగా చెప్పుకోవచ్చు. వీటికి విశేషమైన స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇలాంటి నగరాలకు ఉదాహరణలు:

రాజ్య ప్రతిపాదనలు గల నగరాలు

లన్డన్

లన్డన్‌ను యు.కె నుండి వేరు చేసి నగర రాజ్యంగా మార్చాలనే ఆశయంతో "లన్డన్ స్వాతంత్ర్యోద్యమం" ప్రారంభమైంది.[37]

న్యూయార్క్

న్యూయార్క్ నగరాన్ని న్యూయార్క్ రాష్ట్రం నుండి వేరు చేయాలనే ప్రతిపాదనలు చాలాసార్లు చేయబడ్డాయి.

అమెరికా అంతర్యుద్ధానికి ముందు ఏర్పడ్డ జాతీయ సంక్షోభంలో, నాటి డెమొక్రటిక్ పార్టీ మేయరు ఫర్నెన్డో వుడ్ న్యూయార్క్‌ను మన్‌హెటన్, లొంగ్ ఐలన్డ్, స్టెటన్ ఐలన్డ్‌లతో కలిపి, "ఫ్రీ సిటీ ఒఫ్ ట్రై-ఇన్సుల" (Free City of Tri-Insula,అర్థం: త్రిద్వీప స్వేచ్ఛా నగరం) అనే పేరుతో సార్వభౌమ నగర-రాజ్యంగా ప్రకటించాలని ప్రతిపాదించాడు.[38]

జనవరి 6, 1861న మేయరు వుడ్ నగరపు కొమన్ కొవ్న్సిల్ ముందు మాట్లాడుతూ, కొపర్‌హెడ్‌ల సానుభూతులు వేర్పాటువాద రాష్ట్రాలతో ఉన్నాయనీ ప్రకటిస్తూ, లాభదాయక పత్తి వ్యాపారాన్ని నడపాలని ఆశాభావం వ్యక్తం చేసి, నాడు ఫెడరల్ ఆదాయంలో మూడింటికి రెండొంతులు ఉన్న దిగుమతి సుంకాలతో కొత్త నగర రాజ్యాలు మనగలుగుతాయని నమ్మకం వ్యక్తం చేస్తూనే, ఓల్బనిలోని[గమనిక 8] నాటి రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఐతే యు.ఎస్ నుండి వేరుపడడమనేది నాటి రాజకీయ సంక్షోభంలో కూడా విపరీత చర్యగా చూడబడింది. ముఖ్యంగా ఏప్రిల్ 12న సమ్టర్ కోటపై దాడి జరిగాక, ఈ ప్రతిపాదనకు మద్దతు బాగా సన్నగిల్లింది.[38]

ఇవి కూడా చూడండి

గమనికలు

మూలాలు

మరింత సమాచారం కోసం

  • Mogens Herman Hansen (ed.), A comparative study of thirty city-state cultures : an investigation conducted by the Copenhagen Polis Centre, Det Kongelige Danske Videnskabernes Selskab, 2000. (Historisk-filosofiske skrifter, 21). ISBN 87-7876-177-8.
  • Mogens Herman Hansen (ed.), A comparative study of six city-state cultures : an investigation, Det Kongelige Danske Videnskabernes Selskab, 2002. (Historisk-filosofiske skrifter, 27). ISBN 87-7876-316-9.

వెలుపలి లంకెలు