బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్

బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్ (BVI), కరిబియన్‌లోని బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం. దీన్ని అధికారికంగా వర్జిన్ దీవులు అని కూడా అంటారు.[1] ఇవి ప్యూర్టో రికోకు తూర్పున, US వర్జిన్ ఐలండ్స్‌కు, యాంగిల్లాకు వాయువ్యంగానూ ఉన్నాయి. ఈ ద్వీపాలు భౌగోళికంగా వర్జిన్ దీవుల ద్వీపసమూహంలోను, లెస్సర్ యాంటిల్లెస్‌లోని లీవార్డ్ దీవులలోనూ భాగం. ఇవి వెస్ట్ ఇండీస్‌లో భాగం.

బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో టోర్టోలా, వర్జిన్ గోర్డా, అనెగాడా, జోస్ట్ వాన్ డైక్ అనే ప్రధాన ద్వీపాలతో పాటు 50 పైచిలుకు ఇతర చిన్న ద్వీపాలు, లంకలూ ఉన్నాయి. [2] దాదాపు 16 ద్వీపాలలో ప్రజల నివాసం ఉంది. రాజధాని రోడ్ టౌన్, టోర్టోలాలో ఉంది. టోర్టోలా, దాదాపు 20 km (12 mi) పొడవు, 5 km (3 mi) వెడల్పుతో అతిపెద్ద ద్వీపం. 2010 జనాభా లెక్కల ప్రకారం ఈ ద్వీపాల జనాభా 28,054. వీరిలో 23,491 మంది టోర్టోలా లోనే నివసిస్తారు; 2018 జూలై అంచనాల ప్రకారం జనాభా 35,802 [3]

బ్రిటిష్ వర్జిన్ ద్వీపవాసులు బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీస్ పౌరులు. 2002 నుండి బ్రిటిష్ పౌరులు కూడా అయ్యారు.

పేరు వ్యుత్పత్తి

సెయింట్ ఉర్సులా - 11,000 మంది కన్యల గాథ పేరిట 1493లో క్రిస్టోఫర్ కొలంబస్, ఈ ద్వీపాలకు "శాంటా ఉర్సులా వై లాస్ వన్స్ మిల్ విర్జెనెస్" అని పేరు పెట్టాడు. [2] ఈ పేరే తరువాత "వర్జిన్ ఐలండ్స్" గా కుదించబడింది. [4]

దీని అధికారిక పేరు ఇప్పటికీ "వర్జిన్ ఐలండ్స్" అనే ఉంటుంది. కానీ "బ్రిటిష్" అనే ఉపసర్గను తరచుగా ఉపయోగిస్తారు. పొరుగునే ఉన్న యు.ఎస్. వర్జిన్ ఐలాండ్స్ నుండి భిన్నంగా సూచించడం కోసం దీన్ని బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్ అంటారు. 1917లో అమెరికా "డానిష్ వెస్ట్ ఇండీస్ " పేరును " వర్జిన్ ఐలండ్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ "గా మార్చిన తరువాత ఈ అవసరం ఏర్పడింది. అయితే, స్థానిక చరిత్రకారులు మాత్రం దీనితో విభేదిస్తారు. 1857 ఫిబ్రవరి 21, 1919 సెప్టెంబర్ 12 మధ్య కాలం నాటి వివిధ ప్రచురణలను, పబ్లిక్ రికార్డులనూ ఆధారంగా చూపిస్తూ, ఈ భూభాగం పేరు ముందునుండే బ్రిటిష్ వర్జిన్ దీవులు అని ఉండేదని వాదిస్తారు. [5] బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ప్రభుత్వ ప్రచురణల్లో "ది టెరిటరీ ఆఫ్ ది వర్జిన్ ఐలాండ్స్" అనే అంటారు. ఇక్కడి పౌరుల పాస్‌పోర్టుల్లో కేవలం "వర్జిన్ ఐలాండ్స్" అనే ఉంటుంది. అన్ని చట్టాలు "వర్జిన్ ఐలాండ్స్" అనే పదాలతోనే ప్రారంభమవుతాయి. అంతేకాకుండా, "వర్జిన్ ఐలాండ్స్" అనే పేరును ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి "ప్రతి ప్రయత్నం చేయాలి" అనే అభిప్రాయాన్ని రాజ్యాంగ కమిషన్ వ్యక్తం చేసింది. [6] కానీ BVI ఫైనాన్స్, BVI ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, BVI టూరిస్ట్ బోర్డ్, BVI అథ్లెటిక్ అసోసియేషన్, BVI బార్ అసోసియేషన్ తదితరాలతో సహా వివిధ ప్రభుత్వ, పాక్షిక-ప్రభుత్వ సంస్థలు "బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్" లేదా "BVI" అనే పేరును ఉపయోగిస్తూనే ఉన్నాయి.

చరిత్ర

వర్జిన్ దీవుల్లో సా.పూ. 100 నుండి సా.శ. 200 వరకు దక్షిణ అమెరికా నుండి వచ్చిన అరవాక్ లు మొదట స్థిరపడ్డారని భావిస్తారు. అయితే, సా.పూ. 1500 నాటికే ఈ దీవులలో అమెరిండియన్ ఉనికికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. [7] [8] [9] 15వ శతాబ్దంలో లెస్సర్ యాంటిల్లెస్ దీవుల నుండి వచ్చిన మరింత ఉగ్రమైన కారిబ్‌లు వెళ్ళగొట్టేవరకు అరవాక్‌లు ఈ దీవులలో నివసించారు.

1493లో క్రిస్టోఫర్ కొలంబస్ తన రెండవ అమెరికా సముద్రయానంలో వర్జిన్ దీవులను మొదటిసారి చూసాడు. యూరోపియన్లు ఈ దీవులను చూడడాం ఇదే తొలిసారి. వారే ఈ ద్వీపాలకు ప్రస్తుత పేరు పెట్టారు. [8]

16వ శతాబ్దం ప్రారంభంలో ఈ ద్వీపాలను కనుగొన్నాక స్పానిష్ సామ్రాజ్యం వాటిని సొంతం చేసుకుంది. కానీ అక్కడ నివాసాలను ఏర్పరచుకోలేదు. తరువాతి సంవత్సరాల్లో ఇంగ్లీష్, డచ్, ఫ్రెంచ్, స్పానిష్, డానిష్ దేశాలు ఈ ప్రాంతాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాయి. ఈ ప్రాంతం సముద్రపు దొంగలకు నెలవైన ప్రదేశంగా మారింది. [2] ఈ కాలంలో బ్రిటిష్ వర్జిన్ దీవులలో స్థానిక అమెరిండియన్ జనాభా ఉన్న దాఖలాలు లేవు; వారు సురక్షితమైన దీవులకు పారిపోయారని లేదా చంపబడ్డారని భావిస్తున్నారు. [2]

1648 నాటికి డచ్ వారు టోర్టోలా ద్వీపంలో శాశ్వత స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. [2] వారు, సమీపంలోని ప్యూర్టో రికోలో ఉన్న స్పానిష్‌ వారితో తరచూ ఘర్షణ పడేవారు. 1672లో, ఆంగ్లేయులు డచ్ నుండి టోర్టోలాను స్వాధీనం చేసుకున్నారు. 1680 లో [10] ఆంగ్లేయులు అనెగడ, వర్జిన్ గోర్డాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంతలో, 1672-1733 కాలంలో డానిష్ వారు, సమీపంలోని సెయింట్ థామస్, సెయింట్ జాన్, సెయింట్ క్రోయిక్స్ (అంటే ఆధునిక US వర్జిన్ దీవులు) దీవులపై నియంత్రణ సాధించారు.

బ్రిటిష్ దీవులు ప్రధానంగా వ్యూహాత్మక స్వాధీనంగా పరిగణించబడ్డాయి. బ్రిటిష్ వారు ఇక్కడ చెరకును ప్రవేశపెట్టారు. ఇది ప్రధాన పంటగా, విదేశీ వాణిజ్యానికి మూలంగా మారింది. చెరకు తోటలపై పనిచేయడానికి ఆఫ్రికా నుండి పెద్ద సంఖ్యలో బానిసలను బలవంతంగా తీసుకువచ్చారు. [2] పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలం వరకు ఈ ద్వీపాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. 1834 లో బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వ నిర్మూలనజరగడం, వరసగా వినాశకరమైన తుఫానులు రావడం, ఐరోపా, యునైటెడ్ స్టేట్స్‌లో చక్కెర దుంపల పంటలో పెరుగుదల వంటి కారణాల వలన [11] చెరకు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయి ద్వీపాల ఆర్థిక క్షీణతకు దారితీసింది. [2]

1917లో, యునైటెడ్ స్టేట్స్ డానిష్ వర్జిన్ దీవులను US$25 మిలియన్లకు కొనుగోలు చేసింది. వాటికి యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్స్ అని పేరు పెట్టింది. US దీవులతో ఉన్న ఆర్థిక సంబంధాల వలన 1959 లో బ్రిటిష్ వర్జిన్ దీవులు US డాలర్‌ను కరెన్సీగా స్వీకరించాయి.

బ్రిటిష్ వర్జిన్ దీవులు బ్రిటిష్ లీవార్డ్ దీవులలో భాగంగాను, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లో భాగంగాను వివిధ రకాలుగా నిర్వహించబడుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే నిర్వాహకులు ఒకరు ఈ దీవుల్లో ఉంటారు. [2] 1960లో ఈ దీవులు ప్రత్యేక కాలనీ హోదాను పొందాయి. 1967లో కొత్తగా ముఖ్యమంత్రి పదవిని నెలకొల్పడంతో స్వయంప్రతిపత్తిని పొందాయి. [2] 1960ల నుండి, ఈ దీవులు తమ సాంప్రదాయిక వ్యవసాయ-ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి పర్యాటకం, ఆర్థిక సేవల వైపు మళ్ళాయి. దాంతో ఇవి కరిబియన్‌లోని సంపన్న ప్రాంతాలలో ఒకటిగా అవతరించింది. [2] దీవుల రాజ్యాంగాన్ని 1977, 2004, 2007లో సవరించి, ఎక్కువ స్థానిక స్వయంప్రతిపత్తి కల్పించారు. [2]

భౌగోళికం

బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో దాదాపు 60 ఉష్ణమండల కరిబియన్ దీవులున్నాయి. 20 km (12 mi) పొడవు, 5 km (3 mi) వెడల్పు ఉండే అతిపెద్దదైన టోర్టోలా నుండీ చిన్న జనావాసాలు లేని ద్వీపాల వరకు మొత్తం 150 square kilometres (58 square miles) విస్తీర్ణంలో ఉన్నాయి. అవి వర్జిన్ ఐలాండ్స్ ద్వీపసమూహంలో ఉన్నాయి, US వర్జిన్ దీవులకు తూర్పున కొన్ని మైళ్ల దూరంలో, ప్యూర్టో రికన్ ప్రధాన భూభాగం నుండి దాదాపు 95 km (59 mi) దూరంలో ఉన్నాయి. సుమారు 150 km (93 mi) తూర్పు ఆగ్నేయంలో యాంగిల్లా ఉంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం ద్వీపాలకు తూర్పున, కరిబియన్ సముద్రం పశ్చిమాన ఉన్నాయి. చాలా ద్వీపాలు అగ్నిపర్వత విస్ఫోటనాల నుండి ఏర్పడినవే. ఇవి కొండ, కఠినమైన భూభాగాన్ని కలిగి ఉంటాయి. [2] టోర్టోలాలో 521 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ సేజ్, అత్యంత ఎత్తైన ప్రదేశం. [2] సున్నపురాయి, పగడాలతో కూడిన ఒక చదునైన ద్వీపం అనెగడ, మిగిలిన సమూహం నుండి భౌగోళికంగా భిన్నంగా ఉంటుంది. [2] [3] బ్రిటిష్ వర్జిన్ దీవులలో లీవార్డ్ దీవులు తేమతో కూడిన అడవులు ఉంటాయి. లీవార్డ్ దీవులు జిరిక్ స్క్రబ్ భూసంబంధ పర్యావరణ ప్రాంతాలు కూడా ఉన్నాయి.

వాతావరణం

బ్రిటిష్ వర్జిన్ దీవులు ఉష్ణమండల వర్షారణ్య వాతావరణాన్ని కలిగి ఉంటాయి. వాణిజ్య పవనాలు ఉంటాయి. [2] ఏడాది పొడవునా ఉష్ణోగ్రతల్లో తేడా కొద్దిగానే ఉంటుంది. రాజధాని, రోడ్ టౌన్‌లో, సాధారణ రోజువారీ గరిష్ట సంఖ్య వేసవిలో 32 °C (89.6 °F) , శీతాకాలంలో 29 °C (84.2 °F) ఉంటుంది. సాధారణ రోజువారీ కనిష్టం వేసవిలో సుమారు 26 °C (78.8 °F) శీతాకాలంలో 23 °C (73.4 °F) ఉంటాయి. సగటు వార్షిక వర్షపాతం 1,150 mm (45.3 in). వర్షపాతం కొండలలో ఎక్కువగాను, తీరంలో తక్కువగానూ ఉంటుంది. వర్షపాతం చాలా వైవిధ్యంగా ఉంటుంది. సగటున అత్యంత తేమగా ఉండే నెలలు సెప్టెంబరు నుండి నవంబరు వరకు= ఉంటుంది. సగటున పొడి నెలలు ఫిబ్రవరి, మార్చి.

శీతోష్ణస్థితి డేటా - Cyril E. King Airport (1991–2020 normals)
నెలజనఫిబ్రమార్చిఏప్రిమేజూన్జూలైఆగసెప్టెంఅక్టోనవండిసెంసంవత్సరం
సగటు అధిక °C (°F)28.9
(84.1)
29.1
(84.3)
29.2
(84.5)
29.8
(85.7)
30.7
(87.2)
31.6
(88.9)
32.1
(89.7)
32.1
(89.8)
31.8
(89.2)
31.3
(88.4)
30.3
(86.6)
29.6
(85.2)
30.6
(87.0)
రోజువారీ సగటు °C (°F)26.0
(78.8)
26.1
(78.9)
26.2
(79.1)
27.0
(80.6)
27.9
(82.3)
28.9
(84.1)
29.2
(84.5)
29.3
(84.7)
29.1
(84.4)
28.5
(83.3)
27.6
(81.6)
26.7
(80.1)
27.7
(81.9)
సగటు అల్ప °C (°F)23.1
(73.6)
23.1
(73.5)
23.2
(73.8)
24.2
(75.5)
25.3
(77.5)
26.3
(79.3)
26.3
(79.3)
26.4
(79.6)
26.4
(79.5)
25.7
(78.3)
24.8
(76.6)
23.8
(74.9)
24.9
(76.8)
సగటు అవపాతం mm (inches)67
(2.64)
48
(1.90)
47
(1.86)
57
(2.24)
77
(3.02)
60
(2.35)
74
(2.91)
111
(4.37)
150
(5.89)
134
(5.28)
154
(6.06)
74
(2.93)
1,053
(41.45)
సగటు అవపాతపు రోజులు (≥ 0.01 in)15.013.510.710.611.910.914.815.815.217.318.517.4171.6
Source: NOAA[12][13]

తుఫానులు అప్పుడప్పుడు ద్వీపాలను తాకుతాయి. అట్లాంటిక్ హరికేన్ సీజన్ జూన్ నుండి నవంబరు వరకు నడుస్తుంది.

రాజకీయం

ఇక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో అంతిమ కార్యనిర్వాహక అధికారం, రాజుదే. రాజు తరపున బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ గవర్నర్ అధికారాన్ని అమలు చేస్తారు. [3] గవర్నరును బ్రిటిష్ ప్రభుత్వ సలహా మేరకు రాజు నియమిస్తాడు. రక్షణ, విదేశీ వ్యవహారాల బాధ్యత యునైటెడ్ కింగ్‌డమ్‌ది. [3]

ఇటీవలి రాజ్యాంగాన్ని 2007లో ఆమోదించారు. (వర్జిన్ ఐలాండ్స్ కాన్‌స్టిట్యూషన్ ఆర్డర్, 2007) [14] [15] 2007 సాధారణ ఎన్నికల కోసం లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను రద్దు చేసినప్పుడు ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాధినేత ప్రీమియర్ (కొత్త రాజ్యాంగానికి ముందు ఈ పదవిని ముఖ్యమంత్రి అనేవారు). పాలక, ప్రతిపక్ష సభ్యులతో పాటు ప్రీమియర్‌ కూడా సాధారణ ఎన్నికలలో ఎన్నుకోబడతాడు. దాదాపు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. క్యాబినెట్‌ను ప్రీమియర్ నామినేట్ చేస్తారు. గవర్నర్‌ నియమిస్తారు. శాసనసభలో రాజు (గవర్నర్ ప్రాతినిధ్యం వహిస్తారు) తో పాటు, 13 మంది ఎన్నుకోబడిన సభ్యులు, స్పీకర్, అటార్నీ జనరల్‌తో కూడిన ఏకసభ అసెంబ్లీ ఉంటుంది. [2]

ఉపవిభాగాలు

బ్రిటిష్ వర్జిన్ దీవులు ఏకీకృత భూభాగం. ఇది తొమ్మిది ఎన్నికల జిల్లాలుగా విభజించబడింది. ప్రతి ఓటరు ఆ జిల్లాల్లో ఒకదానిలో నమోదు చేయబడతారు. [16] తొమ్మిది జిల్లాలలో ఎనిమిది పాక్షికంగా లేదా పూర్తిగా టోర్టోలాలో, సమీపంలోని పొరుగు ద్వీపాలను కలుపుకుని ఉన్నాయి. తొమ్మిదవ జిల్లా (వర్జిన్ గోర్డా అండ్ అనెగాడా)లో మాత్రమే టోర్టోలాలో ఏ భాగం ఉండదు. ఎన్నికలలో, వారి స్థానిక ప్రతినిధికి ఓటు వేయడంతో పాటు, ఓటర్లు దీవుల-వ్యాప్తంగా ఎన్నికైన నలుగురు "ఎట్-లార్జ్" అభ్యర్థులకు కూడా ఓట్లు వేస్తారు.

దీవులను సాంకేతికంగా ఐదు పరిపాలనా జిల్లాలుగా విభజించారు. నాలుగు అతిపెద్ద ద్వీపాలకు ఒక్కొక్కటి చొప్పున, ఇతర దీవులన్నిటికీ కలిపి ఒకటి ఉంటాయి. ఆరు సివిల్ రిజిస్ట్రీ జిల్లాలుగా (టోర్టోలా, జోస్ట్ వాన్ డైక్, వర్జిన్ గోర్డా అండ్ అనెగాడాకు మూడు) కూడా విభజించారు. అయితే వీటికి పెద్దగా ప్రాముఖ్యత లేదు.

ఆర్థిక వ్యవస్థ

ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా ఆర్థిక సేవలు (60%), పర్యాటకం (GDPలో దాదాపు 40-45%) ఉన్నాయి. [17] [18] రాజకీయంగా, ఈ రెండింటిలో పర్యాటకం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది భూభాగంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది. పర్యాటక పరిశ్రమలోని వ్యాపారాలలో ఎక్కువ భాగం స్థానికులవే. అనేక మంది పర్యాటకంపై ఆధారపడిన ఏకైక వ్యాపారులు ఉన్నారు. (ఉదాహరణకు, టాక్సీ డ్రైవర్లు, వీధి వ్యాపారులు). 

ఆర్థికంగా అయితే, ఆఫ్‌షోర్ ఆర్థిక కేంద్రంగా భూభాగం యొక్క హోదాతో అనుబంధించబడిన ఆర్థిక సేవలు చాలా ముఖ్యమైనవి. ప్రభుత్వ ఆదాయంలో 51.8% నేరుగా ఆఫ్‌షోర్ కంపెనీల లైసెన్స్ ఫీజుల నుండి వస్తుంది. ట్రస్ట్ ఇండస్ట్రీ సెక్టార్‌లో ఇచ్చే జీతాలపై వచ్చే పన్నుల నుండి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది (ఈ జీతాలు పర్యాటక రంగంలో ఇచ్చే జీతాల కంటే ఎక్కువగా ఉంటుంది). [19]

బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అధికారిక కరెన్సీ 1959 నుండి యునైటెడ్ స్టేట్స్ డాలర్ (US$), యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్స్ కూడా దాన్నే ఉపయోగిస్తుంది.

బ్రిటిష్ వర్జిన్ దీవులు కరిబియన్ ప్రాంతంలో అత్యంత సంపన్నమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. తలసరి ఆదాయం సుమారు $42,300 (2010 అంచనా. ) [20] 2010 జనాభా లెక్కల ప్రకారం దీవుల్లో ఒక కార్మికుడు సంపాదించే సగటు నెలవారీ ఆదాయం US$2,452. జనాభాలో 29% మంది "తక్కువ ఆదాయ" వర్గంలోకి వస్తారు. 

పర్యాటకం

జాతీయ ఆదాయంలో పర్యాటకం వాటా సుమారు 45%. [17] ఈ ద్వీపాలు అమెరికా పౌరులకు ఇష్టమైన గమ్యస్థానంగా ఉన్నాయి. [17] పర్యాటకులు అనేక తెల్లని ఇసుక బీచ్‌లను సందర్శిస్తూంటారు. వర్జిన్ గోర్డాలోని బాత్ బీచ్‌లను, అనెగడ సమీపంలోని పగడపు దిబ్బలను సందర్శిస్తారు. లేదా జోస్ట్ వాన్ డైక్ యొక్క ప్రసిద్ధ బార్‌లలో ఆనందివిస్తారు. BVI ప్రపంచంలోని గొప్ప సెయిలింగ్ గమ్యస్థానాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. తక్కువ అందుబాటులో ఉన్న ద్వీపాలను సందర్శించడానికి చార్టర్ పడవ బోట్లు చాలా ప్రసిద్ది చెందాయి. 1972లో స్థాపించబడిన BVI స్ప్రింగ్ రెగట్టా, సెయిలింగ్ ఫెస్టివల్‌లు ప్రసిద్ధం. [21] BVIని సందర్శించే పర్యాటకులలో గణనీయమైన సంఖ్యలో క్రూయిజ్ షిప్ ప్రయాణీకులు ఉన్నారు. చార్టర్ బోట్ పర్యాటకులు, హోటల్ ఆధారిత పర్యాటకుల కంటే వారి ద్వారా సమకూరే తలసరి ఆదాయం తక్కువే అయినప్పటికీ, వారు టాక్సీ డ్రైవర్లకు గణనీయంగా ముఖ్యమైనవారు. వర్జిన్ ద్వీపవాసులకు మాత్రమే టాక్సీ డ్రైవర్లుగా పని చేయడానికి అనుమతి ఉంది.  

వ్యవసాయం, పరిశ్రమలు

దీవుల GDPలో వ్యవసాయం, పరిశ్రమల వాటా చాలా కొద్ది భాగం మాత్రమే. వ్యవసాయ ఉత్పత్తులలో పండ్లు, కూరగాయలు, చెరకు, పశువులు, పౌల్ట్రీ ఉన్నాయి. పరిశ్రమలలో రమ్ స్వేదనం, నిర్మాణం, పడవ నిర్మాణం ఉన్నాయి. ద్వీపాల జలాల్లో వాణిజ్యపరంగా చేపలు పట్టడం కూడా జరుగుతుంది. [2]

రవాణా

టెరెన్స్ బి. బీఫ్ ఐలాండ్‌లోని లెట్సోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం

దీవుల్లో 113 kilometres (70 mi) రోడ్లు ఉన్నాయి. ప్రధాన విమానాశ్రయం, టెరెన్స్ బి. లెట్సోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం. దీనిని బీఫ్ ఐలాండ్ ఎయిర్‌పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఇది టోర్టోలా తూర్పు కొన వద్ద బీఫ్ ఐలాండ్‌లో ఉంది. క్వీన్ ఎలిజబెత్ II వంతెన ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. కేప్ ఎయిర్, ఎయిర్ సన్‌షైన్ ఇక్కడికి షెడ్యూల్డ్ సర్వీస్‌ను అందిస్తున్న విమాన సంస్థలు. [22] వర్జిన్ గోర్డా, అనెగడా లలో చిన్న విమానాశ్రయాలు ఉన్నాయి. ఐలాండ్ బర్డ్స్ ఎయిర్ చార్టర్ ద్వారా నిర్వహించబడే ప్రైవేట్ ఎయిర్ చార్టర్ సేవలు కరిబియన్‌లోని ఏదైనా ప్రధాన విమానాశ్రయం నుండి నేరుగా మూడు దీవులకు ఎగురుతాయి. [23] రన్‌వే సౌకర్యాలు లేని దీవులకు వెళ్లేందుకు హెలికాప్టర్లను ఉపయోగిస్తారు; యాంటిల్లీస్ హెలికాప్టర్ సర్వీసెస్ దేశంలోని ఏకైక హెలికాప్టర్ సర్వీస్.

ప్రధాన నౌకాశ్రయం రోడ్ టౌన్‌లో ఉంది. బ్రిటిష్ వర్జిన్ దీవులకు, పొరుగున ఉన్న యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ దీవులకు కూడా ఇక్కడి నుండి ఫెర్రీలు ఉన్నాయి. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని కార్లు యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్స్‌లో లాగానే ఎడమవైపున నడుస్తాయి. అయినప్పటికీ, చాలా కార్లు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, [24] ఎందుకంటే అవి యునైటెడ్ స్టేట్స్ నుండి దిగుమతి అవుతాయి. రోడ్లు తరచుగా చాలా వాలుగా, సన్నగా, వంకరగా ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు రాళ్ళు, బురదలు, రాక్‌ఫాల్‌లు సమస్యగా మారతాయి.

జనాభా వివరాలు

2010 జనాభా లెక్కల ప్రకారం, దీవుల జనాభా 28,054. 2018 జూలై అంచనాల ప్రకారం జనాభా 35,800. అయితే 2022లో, ఇది ఇర్మా తుఫాను తర్వాత, పర్యాటక పరిశ్రమలో నిరుద్యోగం కారణంగా COVID లాక్‌డౌన్‌ల సమయంలో ప్రజలు దీవులను విడిచిపెట్టడం వలన ఇది 30,000 కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. జనాభాలో మెజారిటీ (76.9%) బ్రిటిష్ వారు ద్వీపాలకు తీసుకువచ్చిన బానిసల సంతతికి చెందిన ఆఫ్రో-కరిబియన్లు. [8] ఇతర పెద్ద జాతి సమూహాలలో లాటినోలు (5.6%), యూరోపియన్ మూలీయులు (5.4%), మిశ్రమ మూలీయులు (5.4%), భారతీయులు (2.1%) ఉన్నారు. [3]

  • 76.9% ఆఫ్రికన్
  • 5.6% హిస్పానిక్
  • 5.4% యూరోపియన్/కాకేసియన్
  • 5.4% మిశ్రమంగా ఉంది
  • 2.1% ఈస్ట్ ఇండియన్
  • 4.6% ఇతరులు*

మతం

2010 జనాభా లెక్కల ప్రకారం మతపరమైన అనుబంధాన్ని సూచించిన జనాభాలో 90% పైగా క్రైస్తవులు [25] మెథడిస్ట్ (18.1%), [25] ఆంగ్లికన్ (9.8%), చర్చ్ ఆఫ్ గాడ్ (10.6%), రోమన్ కాథలిక్కులు (9.1%) ఉన్నారు. బ్రిటిష్ వర్జిన్ దీవుల రాజ్యాంగం దేవుడిపై జాతీయ విశ్వాసంతో ప్రారంభమవుతుంది. [26] ప్రపంచ మతాల డేటాబేసు 2005 [27] ప్రకారం హిందువులు, ముస్లింలు జనాభాలో దాదాపు 1.2% మంది ఉన్నారు.

మతం
జనాభాలో %
జాతీయ జనాభా గణన 2010
201020011991
మెథడిస్టులు17.622.732.9
చర్చ్ ఆఫ్ గాడ్10.411.49.2
ఆంగ్లికన్లు9.511.616.7
సెవెంత్ డే అడ్వెంటిస్టులు9.08.46.3
రోమన్ కాథలిక్కులు8.99.510.5
పెంటెకోస్టల్‌లు8.29.14.1
మతం లేని వారు7.96.43.6
బాప్టిస్టులు7.48.24.7
ఇతరులు4.13.44.4
యెహోవాసాక్షులు2.52.22.1
వెల్లడించనివారు2.42.71.1
హిందువులు1.92.02.2
ముస్లింలు0.90.90.6
ఇవాంజెలికల్‌లు0.70.5
రాస్తాఫారియన్0.60.40.2
మొరవియన్‌లు0.30.50.6
ప్రెస్బిటేరియన్‌లు0.20.40.7
బౌద్ధులు0.2--
యూదులు0.04--
బహాయి0.040.030.00
బ్రదరెన్-0.030.04
సాల్వేషన్ ఆర్మీ-0.030.04

భాష

స్థానిక మాండలికం ఉన్నప్పటికీ ప్రాథమిక భాష ఇంగ్లీషు. [2] ప్యూర్టో రికన్, డొమినికన్, ఇతర హిస్పానిక్ వలసదారులు స్పానిష్ మాట్లాడతారు.

ఇవి కూడా చూడండి

మూలాలు