భోజ్‌పురి భాష

భోజ్ పురి (/ˌboʊdʒˈpʊəri/ 𑂦𑂷𑂔𑂣𑂳𑂩𑂲 𑂦𑂰𑂭𑂰) భారతదేశంలోని భోజ్ పూర్-పూర్వాంచల్ ప్రాంతం, నేపాల్ లోని తేరాయ్ ప్రాంతానికి చెందిన ఇండో-ఆర్యన్ భాష. ప్రధానంగా పశ్చిమ బీహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్, వాయవ్య జార్ఖండ్ లలో మాట్లాడుతారు. సామాజికభాషాపరంగా, భోజ్ పురి తరచుగా హిందీకి చాలా భిన్నంగా ఉన్న విస్తారమైన పదజాలం, వ్యాకరణం, దాని స్వంత అనేక మాండలికాలు కలిగిన భాష అయినప్పటికీ కొన్ని కారణాలతో అనేక హిందీ మాండలికాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఫిజీ, గయానా, మారిషస్, దక్షిణాఫ్రికా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగోలలో అల్పసంఖ్యాక భాషగా ఉంది.[1]

ప్రపంచంలో భోజ్ పురి భాష మాట్లాడుతున్న దేశాలు
ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రలలో భోజ్ పురి మాట్లాడే ప్రాంతాల చిత్రం

చరిత్ర

భోజ్‌పురి మగధీ ప్రాకృత వంశానికి చెందినది, వర్ధన రాజవంశం పరిపాలనలో రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. బాణభట్ట, తన హర్ష చరిత్రలో ప్రాకృతం, సంస్కృతానికి బదులుగా స్థానిక భాషలో వ్రాసే ఈశాంచంద్ర, బేణిభారత అనే ఇద్దరు కవులను ప్రస్తావించారు.[2][3][4] భోజ్‌పురి తొలి రూపాన్ని సిద్ధ సాహిత్యం చార్యపదలో 8వ శతాబ్దం నాటికే గుర్తించవచ్చు. 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దానికి మధ్య లోరికయాన్, సోరతి బిర్జాభర్ మొదలైన జానపదాలు ఉనికిలోకి వచ్చాయి. 15 నుండి 18వ శతాబ్దంలో, కబీర్, ఇతర సాధువులు భోజ్‌పురిలో అనేక భజనలను రాశారు.

భోజ్ పురి సంస్కృతములో రాసిన రికార్డులు లభ్యం కాకపోవడం వల్ల భాష ప్రారంభ చరిత్ర గురించి చాలా తక్కువ సమాచారం ఉంది. భోజ్ పురి భారతదేశ స్థాపిత సాహిత్య భాషలలో ఒకటి కానప్పటికీ, దీనికి మౌఖిక సాహిత్యంలో సంప్రదాయంగా ఉంది. ఈ ప్రాంతం నుండి వలసల సుదీర్ఘ చరిత్ర కారణంగా, భోజ్‌పురి ప్రపంచంలోని అన్ని ఖండాలలో విస్తరించింది.భారతదేశంలో భోజ్ పురిని 37.8 మిలియన్ల మంది మాట్లాడతారు, బీహార్ రాష్ట్రం పశ్చిమ భాగంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తూర్పు భాగంలో, మధ్యప్రదేశ్ (ఎథ్నోలాగ్) కొన్ని పరిసర ప్రాంతాలలో వాడుకలో ఉంది. ప్రస్తుతం అధికారిక భాష కాదు, కానీ భారత ప్రభుత్వం భోజ్‌పురి భాషకు హోదా ఇవ్వడానికి జాతీయ షెడ్యూల్ భాషగా మార్చాలని ప్రయత్నంలో ఉన్నది, హోదా లేకపోయినా భోజ్ పురిని ప్రభుత్వం, మాస్ మీడియాలో ఉపయోగిస్తున్నారు.నేపాల్ లో భోజ్ పురిని మొదటి భాషగా 1.7 మిలియన్లు, రెండవ భాషగా మరో 74,000 మంది మాట్లాడతారు. మారిషస్ భోజ్ పురిని మారిషస్ లో 336,000 మంది మాట్లాడతారు కాని హిందీని పాఠశాలల్లో, మీడియాలో ఉపయోగిస్తారు. ఇతర ప్రాంతాలలో గయానా, సురినామ్, ఫిజీ, ట్రినిడాడ్, టొబాగోలోమాట్లాడతారు.[5]

సాహిత్యం

లోరికయాన్, వీర్ లోరిక్ కథలో తూర్పు ఉత్తరప్రదేశ్ కు చెందిన భోజ్ పురి జానపద కథలు ఉన్నాయి.[6] భిఖరీ ఠాకూర్ రచించిన బిడేసియా అనే నాటకం పుస్తకంగా వ్రాయబడింది. ఫూల్ దలియా ప్రసిద్ధనారాయణ్ సింగ్ రాసిన ప్రసిద్ధ పుస్తకం. క్విట్ ఇండియా ఉద్యమంలో తన అనుభవాల గురించి, దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత పేదరికంతో భారతదేశం పోరాటం గురించి అజాది (స్వేచ్ఛ) ఇతివృత్తంపై వీర్ రాస్ (ఒక రచనా శైలి) కవితలు దీనిలో ఉన్నాయి.

పత్రికలు

బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లలో అనేక భోజ్ పురి పత్రికలు ప్రచురిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో స్థానికంగా అనేక భోజ్ పురి వార్తాపత్రికలు అందుబాటులో ఉన్నాయి. పరిఖన్ సమకాలీన సాహిత్య-సాంస్కృతిక మైథిలి-భోజ్ పురి పత్రిక, దీనిని మైథిలి-భోజ్ పురి అకాడమీ, ఢిల్లీ ప్రభుత్వం ముద్రణ చేసాయి. వీటిని పరిచాయ్ దాస్ సవరించారు ( ఏడిట్).[7] పత్రికలలో ది సండే ఇండియన్, ఆకార్ ముద్రణ జరుగుతుంది.[8]

మూలాలు