మహా సరస్సులు

మహా సరస్సులు (ఇంగ్లీషులో గ్రేట్ లేక్స్) ఉత్తర అమెరికా ఖండంలో మధ్య తూర్పు ప్రాంతంలో ఉన్న పెద్ద మంచినీటి సరస్సులు. అమెరికా, కెనడాల సరిహద్దుకు అటూ ఇటూ ఉన్న ఈ సరస్సులు ఒకదాని కొకటి అనుసంధానమై ఉంటాయి. ఇవన్నీ సెయింట్ లారెన్స్ నది ద్వారా అట్లాంటిక్ మహాసముద్రంతో అనుసంధానమై ఉంటాయి. ఈ మహా సరస్సులు: సుపీరియర్, మిచిగన్, హ్యురాన్, ఎరీ, ఒంటారియో. హైడ్రలాజికల్‌గా చూస్తే నాలుగే సరస్సులు ఉన్నాయి. మిచిగన్, హ్యురాన్ సరస్సులు ఒకదానికొకటి కలిసే ఉంటాయి. ఈ సరస్సులన్నీ కలిసి మహా సరస్సుల నీటిమార్గాన్ని ఏర్పరుస్తాయి.

గ్రేట్ లేక్స్
అంతరిక్షం నుండి మహా సరస్సుల వీక్షణ

విస్తీర్ణం పరంగా చూస్తే, ఈ మహా సరస్సులు భూమిపై ఉన్న మంచినీటి సరస్సుల సమూహాల్లో అతిపెద్దవి. ఘనపరిమాణం పరంగా చూస్తే, ప్రపంచం లోని మంచినీటిలో 21%తో ఇవి రెండవ స్థానంలో ఉంటాయి.[1][2][3] ఈ సరస్సుల మొత్తం ఉపరితల వైశాల్యం 2,44,106 చ.కి.మీ. మొత్తం నీటి ఘనపరిమాణం 22,671 కి.మీ3. [4] ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సైన బైకాల్ సరస్సు పరిమాణం (23,615 కి.మీ3 -ప్రపంచపు మొత్తం మంచినీటిలో 22-23%) కంటే కొంచెమే తక్కువ. సముద్రాల్లో ఉన్నట్లుగా ఈ సరస్సుల్లో కూడా కెరటాలు, నిరంతర గాలులు, బలమైన ప్రవాహాలు, బాగా లోతు, సుదూరంగా ఉండే తీరాలు ఉంటాయి. ఈ కారణంగా వీటిని నేలపైని సముద్రాలు అని అంటారు.[5] విస్తీర్ణం పరంగా సుపీరియర్ సరస్సు ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఉపరితల వైశాల్యం పరంగా అతిపెద్ద మంచినీటి సరస్సు. మిచిగన్ సరస్సు, ఒకే దేశంలో విస్తరించి ఉన్న అతి పెద్ద సరస్సు.[6][7][8][9]

సుమారు 14,000 ఏళ్ళ క్రితం, గత గ్లేసియల్ పీరియడ్ అంతమైనపుడు ఈ మహా సరస్సులు ఏర్పడడం మొదలైంది. ఈ పీరియడ్ అంతాన ఐసు పలకలు కరిగిపోతూ ఉండగా అప్పతి వరకూ అవి కప్పి ఉంచిన నేల బయటపడి, అందులో మంచు కరిగిన నీరు నిండి ఈ సరస్సులు ఏర్పడ్డాయి.[10]

ఈ సరస్సుల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మహాసరస్సుల ప్రాంతం (గ్రేట్ లేక్స్ రీజియన్) అంటారు. గ్రేట్ లేక్స్ మెగాపోలిస్ కూడా ఇందులో భాగమే.[11]

సరస్సులు

భౌగోళికం

గ్రేట్ లేక్స్‌లో నాలుగు (సుపీరియర్ సరస్సు, హురాన్ సరస్సు, ఏరీ సరస్సు, ఒంటారియో సరస్సు) కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్య సరిహద్దులందు ఉన్నాయి. మిచిగన్ సరస్సు మాత్రం పూర్తిగా యునైటెడ్ స్టేట్స్ లోపలే ఉంది. ఈ ఐదు సరస్సులూ వేరువేరు బేసిన్లలో ఉన్నప్పటికీ, ఇవన్నీ ఒకదానితో ఒకటి సహజంగా కలిసి ఉంటూ, ఒకే మంచినీటి జలాశయంగా ఉంటుంది. ఈ సరస్సులు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటూ మధ్య తూర్పు ఉత్తర అమెరికా నుండి అట్లాంటిక్ మహా సముద్రం వరకూ గొలుసుకట్టుగా ఉంటాయి. సుపీరియర్ సరస్సు నుండి నీరు హ్యురాన్, మిచిగన్ సరస్సులకు, అక్కడి నుండి ఎరీ సరస్సుకు, అక్కడి నుండి ఉత్తరంగా ఒంటారియో సరస్సుకూ ప్రవహిస్తుంది. అక్కడి నుండి సెయింట్ లారెన్స్ నది ద్వారా అట్లాంటిక్ లోకి ప్రవహిస్తాయి. ఈ సరస్సులలో సుమారు 35,000 ద్వీపాలున్నాయి. [12]

ఏరీ సరస్సుహురాన్ సరస్సుమిచిగాన్ సరస్సుఒంటారియో సరస్సుసుపీరియర్ సరస్సు
ఉపరితల వైశాల్యం[13]9,910 sq mi (25,700 km2)23,000 sq mi (60,000 km2)22,300 sq mi (58,000 km2)7,340 sq mi (19,000 km2)31,700 sq mi (82,000 km2)
నీటి ఘనపరిమాణము[13]116 cu mi (480 km3)850 cu mi (3,500 km3)1,180 cu mi (4,900 km3)393 cu mi (1,640 km3)2,900 cu mi (12,000 km3)
ఉన్నతాంశము

(సముద్ర మట్టం నుండి ఎత్తు) [14]

571 ft (174 m)577 ft (176 m)577 ft (176 m)246 ft (75 m)600 ft (180 m)
సగటు లోతు[15]62 ft (19 m)195 ft (59 m)279 ft (85 m)283 ft (86 m)483 ft (147 m)
గరిష్ఠ లోతు210 ft (64 m)770 ft (230 m)923 ft (281 m)808 ft (246 m)1,332 ft (406 m)
గ్రేట్ లేక్స్: సిస్టమ్ ప్రొఫైల్

కొన్నిసార్లు మిచిగన్, హ్యురాన్ సరస్సులను ఒకే సరస్సుగా పరిగణిస్తూ, మిచిగన్-హ్యురాన్ సరస్సు అంటారు. ఈ రెండూ మాకినాక్ జలసంధితో కలిసి ఒకే హైడ్రలాజికల్గా ఒకటేగా ఉంటాయి కాబట్టి ఇలా అంటారు.[16] ఈ జలసంధి వెడల్పు 8 కి.మీ., [17] 37 మీ. లోతూ ఉంటుంది, రెండు సరస్సుల నీటిమట్టం ఒక్కసారే లేస్తూ ఒక్కసారే తగ్గుతూ ఉంటాయి, [18] నీటి ప్రవాహం కొన్నిసార్లు ఇటు నుండి అటూ కొన్నిసార్లు అటు నుండి ఇటూ మారుతూ ఉంటుంది.


సరస్సులను కలిపే జలమార్గాలు

Chicago on Lake Michigan is in the western part of the lakes megalopolis, and the site of the waterway linking the lakes to the Mississippi River valley
Detroit on the Detroit River links the region's central metropolitan areas.
Toronto on Lake Ontario is in the eastern section of the Great Lakes Megalopolis
  • గ్రేట్ లేక్స్ బేసిన్‌ను మిసిసిపి నది బేసిన్‌తో కలుపుతూ చికాగో నది, కాలుమెట్ నది ప్రవహిస్తున్నాయి.
  • సుపీరియర్ హ్యురాన్ లను కలుపుతూ సెయింట్ మేరీ నది ఉంది
  • మాకినాక్ జలసంధి మిచిగన్, హ్యురాన్ సరస్సులను కలుపుతుంది.
  • సెయింట్ క్లెయిర్ నది హ్యురాన్ సరస్సును సెయింట్ క్లెయిర్ సరస్సుతో కలుపుతుంది
  • సెయింట్ క్లెయిర్ సరస్సును ఎరీ సరస్సునూ కలుపుతూ డెట్రాయిట్ నది ప్రవహిస్తోంది
  • ఎరీ, ఒంటారియో సరస్సులను కలుపుతూ నయాగరా నది, నయాగరా జలపాతంతో సహా, ప్రవహిస్తోంది
  • నయాగరా జలపాతాన్ని బైపాసు చేస్తూ వెల్లాండ్ కాలువ ఎరీ, ఒంటారియో సరస్సులను కలుపుతుంది
  • సెయింట్ లారెన్స్ నది ఒంటారియో సరస్సును సెయింట్ లారెన్స్ సింధుశాఖతోను తద్వారా అట్లాంటిక్ మహాసముద్రంతోనూ కలుపుతుంది.

మూలాలు