మీరాబాయి

16వ శతాబ్ధానికి చెందిన హిందూ ఆధ్యాత్మిక కవయిత్రి, గాయకురాలు, శ్రీకృష్ణుని భక్తురాలు

మీరాబాయి[2] హిందూ ఆధ్యాత్మిక కవయిత్రి, గాయకురాలు, శ్రీకృష్ణుని భక్తురాలు. 16వ శతాబ్ధకాలంలో ఉత్తర భారతదేశ హిందూ సాంప్రదాయంలో పేరొందిన భక్తురాలుగా తన జీవితాన్ని సాగించింది.[3][4][5]

మీరా
మీరాబాయి చిత్రపటం
ఇతర పేర్లుమీరాబాయి, మీరా బాయి
వ్యక్తిగతం
జననం1498[1]
మరణం1546 లేదా 1547 ద్వారక[1]
మతంహిందూ
దీనికి ప్రసిద్ధిఆధ్యాత్మిక వైష్ణవ కవయిత్రి
ఇతర పేర్లుమీరాబాయి, మీరా బాయి

సామాజికంగా, కుటుంబపరంగా తాను నిర్లక్ష్యానికి గురవ్వడం వల్ల శ్రీకృష్ణుడి పట్ల భక్తిని పెంచుకొని కృష్ణుడిని తన భర్తగా భావించిందని, ఇందుకోసం ఆమె తన అత్తమామలచే హింసించబడిందని మీరాబాయి గురించి అనేక కథలు చెప్పబడుతున్నాయి.[1][5] జానపద కథలు, హాజియోగ్రాఫిక్ ఇతిహాసాలలో మీరాబాయి జీవితం గురించి పలు రకాలుగా ప్రస్తావించబడింది.[1][6] భారతీయ సంప్రదాయంలో కృష్ణుడిని స్తుతిస్తూ రాయబడిన మిలియన్ల భక్తి కవితలు మీరాబాయి రాసిందని అనుకోగా, వాటిల్లో కొన్ని వందల కవితలను మాత్రమే ఆమె రాసిందని పండితులచే ప్రామాణీకరించబడింది. తొలి వ్రాతపూర్వక రికార్డుల ప్రకారం ఆయా కవితల్లో రెండు కవితలు మినహా చాలావరకు 18వ శతాబ్దంలో రాయబడినవని తెలుస్తుంది.[7] ఈ కవితలను భజనలు అని పిలుస్తారు, ఇవి భారతదేశం అంతటా ప్రాచుర్యం పొందాయి.[8] చిత్తోర్‌ఘర్ కోట వంటి హిందూ దేవాలయాలు మీరాబాయి జ్ఞాపకార్థంగా ఆమెకు అంకితం చేయబడ్డాయి.[1]

జీవిత విశేషాలు

మీరాబాయి 1498లో రాజస్థాన్, జోధ్‌పూర్ జిల్లా, కుర్కి గ్రామంలోని రాజ్‌పుత్ రాజ కుటుంబంలో జన్మించింది. మీరా గురించి ప్రామాణికమైన రికార్డులు అందుబాటులో లేవు. లభించిన ఆధారాలతో చరిత్రకారులు మీరా జీవిత చరిత్రను రాశారు. 1516లో మీరాకు ఇష్టంలేకుండా మేవాడ్ యువరాజు భోజ్‌రాజ్‌తో వివాహం జరిగింది.[9][10] 1518లో ఢిల్లీ సుల్తానేట్‌లో జరుగుతున్న హిందూ-ముస్లిం యుద్ధంలో గాయాలతో బయటపడిన మీరాబాయి భర్త భోజ్‌రాజ్ 1521లో జరిగిన యుద్ధంలో మరణించాడు. భారత ఉపఖండంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించిన బాబర్ కు చెందిన ఇస్లామిక్ సైన్యంతో జరిగిన యుద్ధంలో మీరాబాయి భర్త భోజ్‌రాజ్,[1] తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆమె తండ్రి, ఆమె బావ ఇద్దరూ చంపబడ్డారు.[11][12]

మీరాబాయి బావ మరణం తరువాత మేవాడ్‌కు విక్రమ్ సింగ్ రాజయ్యాడు. మీరాబాయి అత్తమామలు ఆమెను చంపడంకోసం చాలాసార్లు ఉరితీయడానికి ప్రయత్నించారని, మీరాకు ఒక గ్లాసు విషం, పువ్వులకు బదులుగా పాముతో ఉన్న బుట్టను పంపించారని చరిత్రకారులు తమ పరిశోధనలో పేర్కొన్నారు.[2][9] పాము కృష్ణ విగ్రహం (పువ్వుల దండ)గా మారడంతో ఆమెకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని హాజియోగ్రాఫిక్ ఇతిహాసాలలో చెప్పబడింది.[6][9]తనను తాను మునిగిపోమని విక్రమ్ సింగ్ కోరగా మీరాబాయి నీటిలో మునగగా, ఆమె నీటిలో మనగకుండా పైకి తేలిందని మరికొన్ని ఇతిహాసాలలో రాయబడింది.[13] మొఘల్ చక్రవర్తి అక్బర్, మీరాబాయిని చూడడానికి తాన్‌సేన్ తో వచ్చి ఆమెకు ఒక ముత్యాల హారాన్ని సమర్పించాడని మరొక చోట రాయబడింది. ఇది నిజంగా జరిగిందా లేదా అన్నదానిపై పరిశోధకులకు అనుమానాలు ఉన్నయి. ఎంటుకంటే, మీరాబాయి మరణించిన 15 సంవత్సరాల తరువాత, అనగా 1562లో అక్బర్ కోర్టులో తాన్‌సేన్ చేరాడు.[13] అదేవిధంగా, కొన్నింటిలో గురు రవిదాస్ మీరాబాయి గురువు అని రాసివుంది, అయితే దీనిని ధృవీకరించే చారిత్రక ఆధారాలు లేవు. ఈ విషయం ఇతరులు అంగీకరించలేదు.[13]

మీరాబాయి గురించి ప్రస్తావించిన మూడు వేర్వేరు పురాతన రికార్డులు అన్నీ 17వ శతాబ్దం నుండి (మీరాబాయి మరణించిన 150 సంవత్సరాలలో) వ్రాయబడ్డాయి.[14] వాటిల్లో ఆమె బాల్యం గురించి లేదా భోజరాజ్‌తో ఆమె వివాహం చేసుకున్న పరిస్థితుల గురించి ఏమీ ప్రస్తావించబడలేదు. ఆమెను హింసించిన వ్యక్తులు ఆమె అత్తమామలు లేదా కొంతమంది రాజ్‌పుత్ రాజకుటుంబానికి చెందినవారని కూడా పేర్కొనబడలేదు.[15] మీరాను హింసించడానికి మతపరమైన లేదా సామాజిక సంప్రదాయాలు కారణమయ్యే అవకాశం లేదని, రాజ్‌పుట్ రాజ్యం - మొఘల్ సామ్రాజ్యాల మధ్య సైనిక ఘర్షణ దీనికి కారణం కావచ్చని నాన్సీ మార్టిన్-కెర్షా పేర్కొన్నాడు.

మీరాబాయి మేవాడ్ రాజ్యాన్ని విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళిందని ఇతర కథలలో చెప్పబడింది. తన చివరి రోజుల్లో, మీరాబాయి ద్వారక (బృందావన్) నివసించిందని, అక్కడ 1547లో కృష్ణుడి విగ్రహంలోకి ప్రవేశంచడం ద్వారా ఆమె అదృశ్యమైందని పురాణాలు చెబుతున్నాయి.[1][2] మీరా తన జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేసి, భక్తి గీతాలను రూపొందించి, వాటిని గానం చేసినందువల్ల మీరాబాయి భక్తిమార్గంలో నడిచిన కవయిత్రిగా అంగీకరించారు.[2][13][16]

రచనలు

మీరాబాయి రాసిన అనేక పాటలు ప్రస్తుతం భారతదేశంలో గానం చేయబడుతున్నాయి. ఇవి ఎక్కువగా భక్తి పాటలు (భజనలు) అయినప్పటికీ దాదాపు అన్నింటిలో తాత్విక అర్థాలు ఉన్నాయి.[17] ఈమె రాసిన గీతాలలో "పయోజీ మైనే రామ్ రతన్ ధన్ పాయో" ఒక గీతం.[18] [19] మీరాబాయి రాజస్థానీ భాషలో మెట్రిక్ పద్యాలు (లిరికల్ పాడాస్) రాసింది.[13] ఈమె వేలాది గీతాలు ఈమె రాసినట్టు చెప్పబడుతున్నప్పటికీ, వాస్తవానికి ఎన్ని గీతాలును స్వయంగా రాసిందనే విషయంపై పరిశోధకులలో బేధాభిప్రాయాలు వచ్చాయి.[20] ఈమె కవిత్వానికి లిఖిత ప్రతులు ఏవీ లేవు, 18వ శతాబ్దం ఆరంభం నుండి, ఈమె మరణించిన 150 సంవత్సరాల తరువాత ఈమె పేరుతో రెండు గీతాలతో కూడిన తొలి రికార్డులు ఉన్నాయి.[7]

ఇంగ్లీష్ అనువాదాలు

అలిస్టన్, సుబ్రమణియన్ ఇద్దరు అనువాదకులు మీరాబాయి రచనల్లో కొన్నింటిని ఎంపికచేసి భారతదేశంలో ఆంగ్ల అనువాదంతో ప్రచురించారు.[21][22] షెల్లింగ్,[23] లాండెస్-లెవి[24] యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో సంకలనాలను అందించారు. స్నెల్[25] ది హిందీ క్లాసికల్ ట్రెడిషన్‌ పేరుతో అనువాద సంకలనాన్ని అందించాడు. సెయింట్ రవిదాస్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత సేథి మీరాబాయి రాసిన కవితలను సేకరించి అనువదించింది.[26] రాబర్ట్ బ్లై, జేన్ హిర్ష్ఫీల్డ్ ఇంగ్లీష్ అనువాదకులు మీరాబాయి రాసిన కొన్ని భజనలను మీరాబాయి: ఎక్స్టాటిక్ పోయమ్స్ పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు.[27]

గుర్తింపులు

మీరాబాయి జీవితకథ అధారంగా 1945లో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి నటించిన తమిళ భాషా చిత్రం మీరా, 1979లో గుల్జార్ హిందీలో రూపొందించిన మీరా అనే రెండు సినిమాలు రూపొందాయి. 2009-2010 మధ్యకాలంలో మీరా పేరుతో టీవీ సిరీస్ కూడా రూపొందింది. మీరాబాయి భజనలతో 2009, అక్టోబరు 11న మీరా - ది లవర్ మ్యూజిక్ ఆల్బమ్ కూడా రూపొందించబడింది.[28] మెర్టాలోని మీరా మహల్ మ్యూజియంలో శిల్పాలు, చిత్రాలతో మీరాబాయి జీవిత కథను చెప్పబడింది.[29]

మూలాలు

ఇతర లంకెలు