వికీపీడియా:విషయ ప్రాముఖ్యత

వికీపీడియాలో ఓ విషయానికి ప్రత్యేకంగా వ్యాసం ఉండొచ్చో లేదో నిర్ణయించడానికి పనికివచ్చే పరీక్ష, విషయ ప్రాముఖ్యత. వికీపీడియాలో ఉన్న సమాచారం నిర్థారించుకోదగినదిగా ఉండాలి; విషయానికి సంబంధించి విశ్వసనీయమైన, స్వతంత్రమైన వనరులు దొరక్కపోతే, ఆ విషయానికి వ్యాసం ఉండకూడదు. వికీపీడియాలో విచక్షణారహితంగా వ్యాసాలను చేర్చకుండా ఉండటానికి ఈ మౌలిక సూత్రాన్ని వర్తింపజేస్తుంది. వ్యాసాలు, జాబితా వ్యాసాల విషయాలకు తప్పనిసరిగా విషయ ప్రాముఖ్యత ఉండాలి. కీర్తి, ప్రాముఖ్యత లేదా ప్రజాదరణ వంటివి విషయపు ప్రాముఖ్యతను పెంచుతాయేమో గానీ పూర్తిగా వాటిపై అది ఆధారపడి ఉండదు.

తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేరీజు వేయడానికి

  1. కింద వివరించిన ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. లేదా ఆయా సబ్జెక్టులకు ప్రత్యేకంగా ఏమైనా మార్గదర్శకాలను వివరించి ఉంటే వాటికి అనుగుణంగా ఉండాలి
  2. ఏది వికీపీడియా కాదు అనే విధానంలో చూపిన మినహాయింపుల్లో ఉండకూడదు.

ఏదైనా విషయం ఇక్కడ చూపిన మార్గదర్శకాలకు సరిపోయినంత మాత్రాన, దానికి ప్రత్యేకంగా ఒక పేజీ ఖచ్చితంగా ఉండొచ్చని అర్థం కాదు. మరో వ్యాసంలో భాగంగా రాసేందుకో, లేదా మరేదైనా విషయంతో కలిపి ఒకే వ్యాసంగా రాసేందుకో వాడుకరులు చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. ఈ మార్గదర్శకాలు ఫలానా విషయానికి వికీపీడియాలో పేజీ ఉండవచ్చునా అనేది చెబుతాయే తప్ప, ఆ వ్యాసంలో కంటెంటు ఏమి ఉండాలో, ఏం ఉండకూడదో చెప్పవు. ఆ సంగతిని వివరించేందుకు తటస్థ దృక్కోణం, నిర్థారత్వం, మౌలిక పరిశోధనలు నిషిద్ధం, ఏది వికీపీడియా కాదు అనే మౌలిక నిబంధనలు ఉన్నాయి.

సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు

ఒక విషయానికి స్వతంత్రమైన, విశ్వసనీయమైన వనరులలో గణనీయమైన కవరేజీ వచ్చినపుడు ఆ విషయానికి వికీపీడియాలో ప్రత్యేకమైన వ్యాసం ఉండవచ్చని భావిస్తారు.

  • గణనీయమైన కవరేజీ అంటే విషయం గురించి నేరుగా, వివరంగా చర్చించడం. ఎంత వివరంగా ఉండాలంటే అందులోని కంటెంటును సంగ్రహించాలంటే మౌలిక పరిశోధన చెయ్యాల్సిన అవసరం ఉండకూడదు. ఆ వనరుల్లో, ఏదో ఒకటీ అరా చోట్ల స్వల్పమైన ప్రస్తావన (ట్రివియల్ మెన్షన్) వస్తే అది గణనీయమైన కవరేజీ అని భావించరాదు. అయితే ఆ మూల వ్యాసానికి ఇదే ప్రధాన విషయం కావాల్సిన అవసరం లేదు.
    • విప్లవ రచయితల సంఘం గురించి సాక్షి దినపత్రికలో ప్రత్యేకంగా వచ్చిన వ్యాసం ఆ వ్యాస విషయ ప్రాముఖ్యతను వివరించేందుకు సరిపోతుంది.
    • పై వ్యాసంలో "గా, అల్లం రాజయ్య ‘అగ్నికణం’లో మాదిగ బయ్యక్క విప్లవ నాయకిగా కావడంగా కనిపిస్తుంది." అనే వాక్యం ఉన్నంత మాత్రాన బయ్యక్కకు విషయ ప్రాముఖ్యత ఉన్నట్టు కాదు (స్వల్పమైన ప్రస్తావన మాత్రమే కాబట్టి).
  • "విశ్వసనీయమైన" అంటే విశ్వసనీయమైన మూలాల మార్గదర్శకానికి అనుగుణంగా ఉండే సమగ్రత, ప్రాశస్త్యం ఉన్న మూలాలు అని అర్థం. ఈ మూలాలు ఏ రూపంలో/ఏ మాధ్యమంలో నైనా, ఏ భాషలోనైనా ప్రచురితమై ఉండవచ్చు. విషయాన్ని కవర్ చేసే ద్వితీయ స్థాయి మూలాలైతే మరీ మంచిది.
  • "వనరులు" [1] ద్వితీయ స్థాయి మూలాలై ఉండాలి. ఎందుకంటే అవి విషయ ప్రాముఖ్యతకు సంబంధించి అత్యుత్తమ వస్తుగత సాక్ష్యాలను అందిస్తాయి. మూలాలు నాణ్యత లోను, కవరేజి లోతు లోనూ తేడాలు ఉంటాయి కాబట్టి, మూలాలు ఎన్ని ఉండాలి అనే విషయంలో ఇదమిత్థమైన సంఖ్య అంటూ లేదు. కాని అనేక వనరులు ఉంటే బాగుంటుంది. [2] ఈ వనరులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండవలసిన అవసరం లేదు. తెలుగు లోనే ఉండాలని కూడా ఏమీ లేదు. ఒకే రచయిత రాసినవీ లేదా ఒకే సంస్థ ప్రచురించినవీ అయిన ప్రచురణలను ఒకే మూలంగా పరిగణిస్తారు.
  • "విషయానికి సంబంధించినవి కాకుండా స్వతంత్రమైనవి" అంటే వ్యాస విషయం గానీ, దానికి సంబంధించిన వారు గానీ చేసిన రచనలు కాకుండా ఇతరాలు. స్వతంత్ర మూలాలు కానివి విషయ ప్రాముఖ్యత నిరూపించే మూలాలుగా అంగీకరించబడవు. ఉదాహరణకు, ప్రకటనలు, పత్రికా ప్రకటనలు, ఆత్మకథలు, వ్యాస విషయానికి చెందిన వెబ్‌సైటు మొదలైనవి స్వతంత్ర వనరులుగా పరిగణించబడవు. [3]
  • "భావిస్తారు" అని ఎందుకు అన్నారంటే.. విశ్వసనీయమైన వనరులలో గణనీయమైన కవరేజి ఉన్నంత మాత్రాన దానికి వ్యాసం కచ్చితంగా ఉండాలి అనే హామీ ఏమీ లేదు, ఉండవచ్చు అనే సంభావ్యతను మాత్రమే ఇది సూచిస్తుంది. మరింత లోతైన చర్చ జరిగితే ఈ విషయానికి ప్రత్యేకంగా వ్యాసం ఉండనక్కరలేదు అని తేలవచ్చు. బహుశా ఏది వికీపీడియా కాదు అనే పేజీలో చెప్పిన మినహాయింపులకు లోబడి లేకపోయి ఉండవచ్చు. [4]

ఏదైనా విషయం ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేనప్పటికీ, కొన్ని ధ్రువీకరించదగిన వాస్తవాలను కలిగి ఉంటే, దాని గురించి మరొక వ్యాసంలో రాసే అవకాశం ఉండవచ్చు.

నిర్దుష్ట విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు

వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వ్యాసాలకు విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాల కోసం కింది పేజీలను చూడవచ్చు:

  1. వ్యక్తుల పేజీలు: వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (వ్యక్తులు)
  2. పుస్తకాల పేజీలు: వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (పుస్తకాలు)
  3. రచయితల పేజీలు: వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు)
  4. సంస్థల పేజీలు: వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (సంస్థలు)

వ్యాసాల్లోని కంటెంటుకు విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వర్తించవు

వ్యాసాన్ని సృష్టించవచ్చా లేదా అనేదానికి వర్తించే ప్రమాణాలు, ఆ వ్యాసం లోని కంటెంటుకు వర్తించే ప్రమాణాలూ ఒకటి కాదు. విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వ్యాసం లోని కంటెంటుకు వర్తించవు (జాబితాల్లో విషయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను చేర్చడాన్ని నిరోధించే మార్గదర్శకాలను మినహాయించి). వ్యాసాల్లో చేర్చే కంటెంటు, కంటెంటు మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది.

వ్యాసం లోని కంటెంటు విషయ ప్రాముఖ్యతను నిర్థారించదు

విషయ ప్రాముఖ్యత అనేది వ్యాస విషయపు లక్షణం, వ్యాసపు లక్షణం కాదు. వ్యాస విషయానికి వికీ బయట తగినంత కవరేజీ లేకపోతే, ఆ వ్యాసం లోని కంటెంటును ఎంతగా మెరుగుపరచినా, ఎంతగా అభివృద్ధి చేసినా ఆ వ్యాస విషయానికి హఠాత్తుగా ప్రాముఖ్యత వచ్చేయదు. పైగా, వ్యాస విషయానికి ప్రాముఖ్యత ఉంటే, వ్యాసం లోని కంటెంటు ఏమంత బాగా రాయకపోయినా విషయ ప్రాముఖ్యతకు లోటేమీ రాదు.

విషయ ప్రాముఖ్యత కోసం నిర్థారించుకోదగ్గ మూలాలు ఆవశ్యకం

విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలలో, దండలో దారం లాంటి సాధారణ సూత్రం ఏమిటంటే, వ్యాస విషయానికి స్వతంత్ర వనరులలో గణనీయమైన కవరేజీ వచ్చిందని ధ్రువీకరించుకోదగిన, వస్తుగతమైన ఆధారాలు ఉండాలి.

ఓ విషయం ఉనికిలో ఉన్నంత మాత్రాన, ఆటోమాటిగ్గా దానికి ప్రాముఖ్యత చేకూరినట్లు కాదు: ఆ విషయానికి స్వతంత్ర వనరుల్లో గణనీయమైన కవరేజి లేదా గుర్తింపు లభించిందని చూపించగలగాలి. ఇది, ఏదో తాత్కాలిక గుర్తింపు కాకూడదు. ప్రాపగాండా కార్యకలాపాల్లో భాగంగా ఉండకూడదు. విచక్షణారహిత ప్రచారం కాకూడదు. వేరే ఏ ఇతర కారణాల వల్లనైనా అనుచితమైన విషయంగా పరిగణింపబడకూడదు. మూలాల్లో, గుర్తించబడిన సాటివారి-సమీక్ష జరిగిన గుర్తింపు పొందిన ప్రచురణలు, విశ్వసనీయమైన, సాధికారిత కలిగిన పుస్తకాలు, ప్రశస్తి కలిగిన మీడియా వనరులు తదితర విశ్వసనీయ వనరులు ఆధారాలుగా పనికివస్తాయి.

విషయ ప్రాముఖ్యత సముచితమైన మూలాలు ఉన్నాయా అనే దానిపై ఆధారపడి ఉంటుంది, వ్యాసంలో మూలాలను ఉల్లేఖించారా లేదా అనేదాన్ని బట్టి కాదు

ఏదైనా వ్యాసంలో ఉన్న కంటెంటుకు మూలాలను చూపించనంత మాత్రాన (మూలాలు అసలు ఉనికి లోనే లేకపోవడం కాదు) ఆ వ్యాస విషయానికి ప్రాముఖ్యత లేనట్లు కాదు. విషయ ప్రాముఖ్యతకు కావలసినది విశ్వసనీయమైన, నిర్థారించుకోదగ్గ, స్వతంత్ర వనరులు ఉనికిలో ఉండడం - అంతేగానీ, వాటిని వ్యాసంలో ఉల్లేఖించారా లేదా అనేది కాదు. వ్యాస విషయ ప్రాముఖ్యతను మదింపు చేసే సంపాదకులు వ్యాసంలో పేర్కొన్న మూలాలను మాత్రమే కాకుండా, వ్యాసంలో ఉల్లేఖించని ప్రాముఖ్యతను-సూచించే మూలాల ఉనికిని కూడా పరిగణించాలి. అందువల్లనే, తొలగింపు కోసం ఒక వ్యాసాన్ని ప్రతిపాదించడానికి ముందుగానీ, తొలగింపు చర్చలో అభిప్రాయాన్ని రాసే ముందుగానీ, సంపాదకులు సదరు విషయపు ప్రాముఖ్యతను నిర్థారించగల మూలాలను కనుగొనే ప్రయత్నం చెయ్యాలని బలంగా ఉద్బోధిస్తాం.

వికీపీడియా వ్యాసాలను తుది ముసాయిదాగా భావించరాదు. వ్యాస విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలను ప్రస్తుతానికి చూపించి ఉండక పోవచ్చు.., కానీ అవి ఉండే ఉండవచ్చు. ప్రాముఖ్యతను నిరూపించే, సముచితమైన మూలాలు లభించే అవకాశం ఉంటే, విషయ ప్రాముఖ్యత లేదని తొలగించడం సరికాదు. అయితే, విషయ ప్రాముఖ్యతను నిరూపించమని అడిగిన తరువాత, ఆ మూలాలను చూపించవలసి ఉంటుంది, ఉన్నాయనీ, ఉండే ఉంటాయనో చెబితే సరిపోదు.

విషయ ప్రాముఖ్యత తాత్కాలికం కాదు

విషయ ప్రాముఖ్యత తాత్కాలికమైనది కాదు; వ్యాస విషయానికి ప్రాముఖ్యత ఉందంటూ ఒకసారి నిర్థారణ అయ్యాక (అంటే, విషయ ప్రాముఖ్యత మార్గదర్శకం ప్రకారం "గణనీయమైన కవరేజీ" వస్తే), ఇక ఆ వ్యాస విషయానికి అలాంటి కవరేజీ వస్తూనే ఉండాల్సిన అవసరం లేదు.

విషయ ప్రాముఖ్యత తాత్కాలికమైనది కానప్పటికీ, వ్యాస విషయాల ప్రాముఖ్యతను నిరూపించిన మూలాలపై మళ్ళీ మూల్యాంకనం చెయ్యాలని గానీ, వాటి గురించి కొత్త సందేహాలు వెలుగు లోకి తీసుకురావడం గానీ వాడుకరులు చేసే అవకాశం ఉంది. తొలగింపుకు ప్రతిపాదించి అక్కడి చర్చలో ఈ అంశాలను లేవనెత్తవచ్చు. లేదా గతంలో ప్రాముఖ్యత లేదని భావించిన అంశాల విషయంలో కొత్త ఆధారాలు వెలుగు లోకి రావచ్చు. అంచేత వ్యాసాలను సృష్టించిన కొన్ని నెలలు ఏళ్ళ తరువాత వాటి విషయ ప్రాముఖ్యతపై సందేహంతో తొలగింపుకు ప్రతిపాదించబడే అవకాశం లేకపోలేదు.

విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేని వ్యాసాలు

ఈ ప్రమాణానికి అనుగుణంగా లేని అంశాలకు వికీలో పేజీలు ఉంచరు. అలాంటి పేజీలను వాటికి దగ్గరి సంబంధం ఉన్న ముఖ్యమైన వ్యాసాలు లేదా జాబితాల పేజీల్లో విలీనం చేస్తారు. అయితే అలా విలీనం చేసే అవకాశాలు లేని పేజీలను తొలగిస్తారు.

ఒక వ్యాసం దాని విషయ ప్రాముఖ్యతను చూపే మూలాలను ఉదహరించడంలో విఫలమైతే, మూలాల కోసం మీరే చూడండి, లేదా:

  • వ్యాస సృష్టికర్తను గానీ, సంబంధిత విషయ నిపుణుడిని గానీ మూలాలు ఎక్కడ దొరుకుతాయని అడగవచ్చు. [5]
  • ఇతర సంపాదకులను హెచ్చరించడానికి వ్యాసంపై {{notability}} ట్యాగ్‌ని ఉంచండి.
  • వ్యాసం ఏదైనా నైపుణ్య రంగానికి సంబంధించినదైతే, ఆ రంగానికి సంబంధించి అవగాహన ఉన్న సంపాదకులను ఆకర్షించడానికి నిర్దిష్ట వికీప్రాజెక్టుతో {{expert-subject}} అనే ట్యాగ్‌ని ఉపయోగించండి. వారికి ఆన్‌లైన్‌లో అందుబాటులో లేని నమ్మదగిన మూలాలు వారికి అందుబాటులో ఉండవచ్చు.

తగిన మూలాల కోసం మంచి విశ్వాసంతో శోధించిన తర్వాత కూడా కనుగొనలేకపోతే, ఆ వ్యాసం లోని నిర్థారించదగిన కంటెంటును సందర్భోచితమైన మరో పెద్ద వ్యాసంలో విలీనం చెయ్యవచ్చేమో పరిశీలించండి. [6] లేదా తొలగిస్తోంటే:[7]

  • వ్యాసం సత్వర తొలగింపు ప్రమాణాలుకు అనుగుణంగా ఉంటే, సంబంధిత నిర్దుష్ట తొలగింపు ట్యాగ్‌ను ఆ పేజీలో చేర్చాలి.
  • సత్వర తొలగింపు ప్రమాణాలకు అనుగుణంగా లేనివి, కానీ ఏ వివాదమూ లేకుండా తొలగింపుకు అర్హులైన పేజీలైతే పేజీలో {{prod}} ట్యాగ్‌ని చేర్చండి. దీనివల్ల ఏడు రోజుల తర్వాత ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే కథనాన్ని తొలగించవచ్చు. మరింత సమాచారం కోసం, వికీపీడియా:ప్రతిపాదిత తొలగింపు చూడండి.
  • తొలగింపు గురించి సందేహం ఉన్న సందర్భాల్లో, ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని లేదా మరొక సంపాదకుడు ఇప్పటికే ప్రతిపాదిత తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాల్లో, తొలగింపు కొరకు వ్యాసాలు ప్రక్రియలో తొలగింపు కోసం ప్రతిపాదించండి. ఇక్కడ ఏడు రోజుల పాటు చర్చలు జరిపి ఇర్ణయిస్తారు.

ప్రాముఖ్యత లేదని "స్పష్టంగా" తెలిసిన వ్యాసాల విషయంలో, తొలగింపు అనేది సాధారణంగా సరైన చర్య. అయితే ఇతర పద్ధతులను పాటించడం వలన అందులో ఏదైనా ఉపయోగకరమైన కంటెంటు ఉంటే సముదాయం దాన్ని భద్రపరచుకునే వీలుంటుంది.

ఇవీ చూడండి

మూలాలు