అలబామా

అలబామా అమెరికా దేశపు ఆగ్నేయ ప్రాంతపు రాష్ట్రాలలో ఒకటి. అమెరికా కూటమిలో చేరిన ఇరవై రెండవ రాష్ట్రం ఇది. 1861 అంతర్యుద్ధ కాలంలో ఈ రాష్ట్రం కూటమి నుండి వేరుపడి అమెరికా ఐక్య రాష్ట్రాల సరసన చేరింది. అంతర్యుద్ధానంతరం 1868లో ఈ రాష్ట్రం మరలా కూటమిలో అంతర్భాగమయ్యింది.

విస్తీర్ణం పరంగా అలబామా అమెరికా రాష్ట్రాల్లో 30 వ స్థానంలో ఉంటుంది. జనాభా పరంగా 24 వ స్థానంలో ఉంటుంది. రాష్ట్రంలో 2,400 కి.మీ. జలమార్గాలున్నాయి. అత్యంత పొడవైన జలమార్గాలున్న రాష్ట్రాల్లో ఇది రెండవ స్థానంలో ఉంది.[1][2]

అలబామా రాజధాని మాంట్‌గొమరీ. జనాభా పరంగా రాష్ట్రంలోని అతిపెద్ద పట్టణం బర్మింగ్‌హాం.[3] ఇది పారిశ్రామిక కేంద్రం కూడా. విస్తీర్ణం పరంగా అతిపెద్ద పట్టణం హంట్స్‌విల్ల్. అత్యంత పురాతన పట్టణం మోబిలే. ఈ పట్టణాన్ని 1702 లో ఫ్రెంచి వారు స్థాపించారు.[4] గ్రేటర్ బర్మింగ్‌హాం, రాష్ట్రం లోని అతిపెద్ద ఆర్థిక కేంద్రం.[5]

అమెరికా జనగణన విభాగం ప్రకారం 2019 జూలై 1 న అలబామా జనాభా 49,03,185. [6]

భౌగోళికం

అలబామా విస్తీర్ణం 1,35,760 చ.కి.మీ. అందులో 3.2% నీరు.[2] రాష్ట్రం లోని ఐదింట మూడొంతుల భూమి మైదాన ప్రాంతం. ఉత్తర ప్రాంతం పర్వతాలతో కూడుకుని ఉంటుంది. టెన్నెసీ నది ఈ ప్రాంతంలో ఒక విస్తారమైన లోయను ఏర్పరచింది.[7]

అలబామాకు ఉత్తరాన టెన్నెసీ, తూర్పున జార్జియా, దక్షిణాన ఫ్లోరిడా, పడమటన మిస్సిసిప్పీ రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రానికి దక్షిణ కొసన మెక్సికో సింధుశాఖ వద్ద సముద్ర తీరం ఉంది.[7] రాష్ట్రంలో అత్యంత ఎత్తైన ప్రదేశం చియాహా పర్వతం ఇది సముద్ర తీరానికి 735 మీ. ఎత్తున ఉంది.[8]

అలబామాలో 67% భూమి (89,000 చ.కి.మీ.) అటవీ ప్రాంతం.[9]

ఆర్థికం

రాష్ట్రంలో ఏరోస్పేస్, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగు, భారీ పరిశ్రమలు, ఆటోమొబైళ్ళు, ఖనిజాలు, ఉక్కు, ఫ్యాబ్రికేషను వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. 2006 నాటికి వ్యవసాయ రంగం ఉత్పత్తి, పశుపోషణను కూడా కలుపుకుని $1.5 బిలియన్లుంది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 1% మాత్రమే. గత శతాబ్దంలో ప్రధాన రంగంగా ఉన్న వ్యవసాయం ఇప్పుడు ఈ స్థాయికి పడిపోయింది. 1960 నుండి ప్రైవేటు కమతాల సంఖ్య క్రమేణా తగ్గుతూ వచ్చింది. భూమిని డెవలపర్లకు, కలప సంస్థలకు, పెద్ద వ్యవసాయ సంస్థలకూ అమ్మేసుకున్నారు.[10]

2008 వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి ఇలా ఉంది: 1,21,800 మేనేజిమెంటు స్థానాల్లో, 71,750 వాణిజ్య, బ్యాంకింగు రంగాల్లో, 36,790 కంప్యూటరు రంగంలో, 44,200 ఆర్కిటెక్చరు, ఇంజనీరింగు రంగాల్లో, 12,410 భౌతిక, సామాన్య శాస్త్రాల్లో; 32,260 సంఘసేవా రంగంలో, 12,770 న్యాయ రంగంలో, 116,250 విద్యా రంగంలో, 27,840 కళలు, మీడియా రంగాల్లో, 1,21,110 ఆరోగ్య సేవారంగంలో, 44,750 పోలీసు, అగ్ని మాపక రంగాల్లో, 1,54,040 ఆహార రంగంలో, 76,650 నిర్మాణ రంగంలో, 53,230 వ్యక్తిగత సేవారంగంలో, 244,510 సేల్స్ రంగంలో, 338,760 కార్యాలయసహాయకులుగా, 20,510 వ్యవసాయ సంబంధిత రంగాల్లో, 1,20,155 గనులు, చమురు రంగాల్లో, 1,06,280 నిర్వహణ, రిపేరు రంగాల్లో, 2,24,110 ఉత్పాదక రంగంలో, 167,160 రవాణా రంగంలోనూ ఉన్నారు.[11]

The Riverchase Galleria in Hoover, one of the largest shopping centers in the southeast

2008 లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి $170 బిలియన్లు. తలసరి ఉత్పత్తి $29,411. అలబామాలో కనీస జీత నిబంధన లేదు. రాష్ట్రం లోని మునిసిపాలిటీలు ఈ నిబంధన పెట్టకూడదని 2016 లో రాష్ట్రం ఒక చట్టం చేసింది.[12]


మూలాలు