కుషాణులు

కుషాణు సామ్రాజ్యం సా.శ. 1వ శతాబ్దం - 3వ శతాబ్దం మధ్య కాలంలో విలసిల్లింది. దాని ప్రాభవ కాలంలో, సుమారు సా.శ.250 నాటికి, ఆ సామ్రాజ్యం ప్రస్తుత తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాలనుండి ఉత్తర భారతదేశంలోని గంగానది పరీవాహక ప్రాంతమంతా విస్తరించింది. ఈ సామ్రాజ్యం పాలకులు మొదట యూజీ అనే ఇండో-యూరోపియన్ తెగకు చెందిన పశ్చిమచైనా ప్రాంతంవారు.[2] కుషాణులకు రోమన్ సామ్రాజ్యంతోను, పర్షియా సస్సానిద్ సామ్రాజ్యంతోను, చైనాతోను రాజకీయ సంబంధాలుండేవి. తూర్పు, పశ్చిమ భూముల మధ్య సాస్కృతిక, ఆర్థిక, రాజకీయ మేళవింపులకు కుషాన్ సామ్రాజ్యం ఒక ముఖ్యమైన కేంద్రం అయ్యింది.

కుషాణు సామ్రాజ్యం

రబటక్ శాసనం ప్రకారం కనిష్కుని కాలంలో కుషాణుల పాలనలో ఉన్న ప్రాంతం (గీత లోపల), వారి అధిపత్య ప్రభావంలో ఉన్న ప్రాంతాలు (చుక్కల గీత లోపల) [1]
భాషలుబాక్ట్రియన్, గ్రీక్, పాళి,
సంస్కృతం, ప్రాకృతం,
బహుశా అరామిక్ కూడా
మతాలుమధ్య ఆసియా విధానాలు,
జోరాస్ట్రియన్, బౌద్ధం
పురాతన గ్రీక్ మతం,
హిందూమతం
రాజధాని నగరాలుబెగ్రామ్, తక్షశిల, మధుర
ప్రదేశంమధ్య ఆసియా,
భారత ఉపఖండం వాయవ్య ప్రాంతం
కాలంసా.శ.60 – 375

ఆరంభ దశలో కుషానులు

కుషాణుల రాజరిక టమ్‌గాలు.
మొదటి కుషాణ్ గా ప్రకటించుకున్న ("కొస్సానో" అని నాణెములపై వున్నది) రాజు హెరాయిస్ (1–30) కు చెందిన వెండి టెట్రాడ్రాచెమ్.
ఉజ్బెకిస్తాన్ లోని ఖల్చయాన్ సౌధంలోని, కుషాణ్ యువరాజు తల శిల్పం.

చైనాలో లభించిన సమాచారం ప్రకారం కుషాన్ మూలపదం గ్విషువాంగ్ (చైనా భాషలో: 貴霜) అనేది యూజీ (月氏) జాతికి చెందిన ఐదు రాజకుటుంబాలలో ఒకటి. ఇది ఒక ఇండో- యూరోపియన్ జాతి.[3] వీరు ఇండో-యూరోపియన్ భాషలు మాట్లాడేవారిలో అందరికంటే తూర్పు భాగంలో, మధ్య ఆసియా మైదానాలలో, ప్రస్తుతపు జింగియాంగ్, గన్సూ ప్రాంతాలలో, నివసించేవారు. బహుశా వీరి భాష తొచారియన్ భాషకు చెందినది కావచ్చును. వీరు క్రీ.పూ. 176 - 160 మధ్యకాలంలో జొయోగ్ను వారి దాడుల వలన మరింత పడమర దిక్కుకు వెళ్ళిఉంటారు. యూజీ జాతిలోని ఐదు తెగలు - జియూమి -Xiūmì (休密), గ్విషువాంగ్ -Guishuang (చైనా: 貴霜), షువాంగ్‌మి - Sh

అప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులలో పెద్దయెత్తున జనాభా ఇతర ప్రాంతాలలో స్థిరపడడం జరిగింది. అందులో భాగంగానే కుషానుల స్థానచలనాన్ని చరిత్ర కారుడు జాన్ కీయ్ భావించాడు. సుమారు క్రీ.పూ. 135 సమయంలో యూజీ జాతివారు బాక్ట్రియన్ ప్రాంతమైన హెల్లెనిక్ రాజ్యం గ్రీకో-బాక్ట్రియాలో ప్రవేశించి ఉండవచ్చును. అప్పుడు స్థాన భ్రంశం పొందిన గ్రీకు పాలక వంశాలు ఆగ్నేయంగా కదిలి హిందూ కుష్ పర్వత ప్రాంతాలలోను, సింధు నది పరీవాహక ప్రాంతంలోను స్థిరపడి ఉండవచ్చును. ఇది అప్పటి ఇండో-గ్రీక్ రాజ్యం పశ్చిమాన ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉంది.

కుషానుల ఆరంభ కాలపు చిహ్నాలు కొన్ని బాక్ట్రియా, సోగ్డియానాలలో లభించాయి. వీటిలో కొన్ని పురాతన ఆలయ శిథిలాలున్నాయి. వారు నిర్మించిన కోటల శిథిలాలున్నాయి. గుర్పు స్వారీ చేసేవారి శిల్పాలున్నాయి. ఆసక్తికరంగా కృత్రిమ పుర్రె అవిటితనం (artificially deformed skulls) కలిగిన రాజు బొమ్మ ఉంది.[4] (ఇది మధ్య ఆసియాలోని సంచార జాతులలో కనిపించే ఒక ముఖ్య లక్షణం). అందరికంటే ముందుగా మనకు ఆధారాలు లభించిన కుషాను పాలకుని పేరు హెరాయిస్. అతడు తనను తాను "టిరంట్" అని తన నాణేలపై వర్ణించుకొన్నాడు. ఇతను గ్రీకు పాలకులతో సత్సంబంధాలు కలిగి ఉండవచ్చును. మొదటి కుషాను చక్రవర్తిగా చెప్పబడిన కుజులా కాడ్‌ఫైసిస్ ఇతని కుమారుడైయుండవచ్చును.

వివిధ సంస్కృతుల సామ్రాజ్యం

కుషాను దుస్తులలో ఉన్న బౌద్ధ భక్తుడు - 2వ శతాబ్దం, మధుర. కుషానుల దుస్తులు బహుశా తోలుతో చేయబడిఉండవచ్చును గనుక 'బిరుసు'గా చూపబడ్డాయి.
సా.శ. 200 నాటికి కుషాన్ సామ్రాజ్యం, వారి పరిసర దేశాలు.
కుషానుల లిపిలో గ్రీకు అక్షరాలను వాడారు. "షో" అనే అదనపు అక్షరాన్ని కలిపారు.

తరువాతి శతాబ్దంలో (క్రీ.పూ. 1వ శతాబ్దం) గ్విషాంగ్ జాతివారు తక్కిన యూజీజాతులవారిపై నాయకత్వం సాధించి, వారందరినీ ఒక బలమైన సంఘంగా రూపొందించారు. ఈ దశలో గ్విషాంగ్ నాయకుడు కుజులా కాడ్‌ఫైసిస్. ఈ గ్విషాంగ్ పదమే పాశ్చాత్య దేశాలలో కుషాన్గా వ్యవహరింపబడింది. కాని చైనాలో మాత్రం యూజీ పదం కొనసాగింది.క్రమంగా వారు తక్కిన సిథియన్ జాతులనుండి అధికారాన్ని హస్తగతం చేసుకొని దక్షిణాన గాంధార దేశం అనబడే ప్రాంతానికి విస్తరించారు. ఈ గాంధార దేశంలో ప్రస్తుత పాకిస్తాన్‌యొక్క పోతోవార్, వాయవ్య సరిహద్దు, కాబూల్ లోయ, కాందహార్ ప్రాంతాలు ఉండేవి. అలా కనిష్కులు అప్పటిలో "కాప్సియా" (ఇప్పటి కాబూల్), "పుష్కలావతి" (ఇప్పటి పెషావర్) లలో జంట రాజధానులను స్థాపించారు.

కుషానులు బాక్ట్రియాకు చెందిన హెలెనిస్టిక్ నాగరికతకు సంబంధించిన అనేక అంశాలను అనుసరించారు. గ్రీకు భాష లిపిలోని అక్షరాలను, నాణేల పద్ధతిని అనుసరించారు. క్రమంగా కుషాణుల లిపి పాళీ భాష లిపితో కలిసి క్రొత్త కుషాన్ భాష రూపుదిద్దుకుంది.కుషానులు మొదట ప్రధానంగా జొరాస్ట్రియన్ మతాన్ని, తరువాత బౌద్ధ ధర్మాన్ని అనుసరించారనిపిస్తుంది. గ్రీకు సంస్కృతి కూడా కుషానుల ప్రాథమిక దశలో ప్రస్ఫుటంగా ఉంది. కాని "విమా టాక్టో" తరువాత, (భారతదేశంపైకి దండెత్తిన ఇతర జాతులలాగాఅనే) భారతీయ సంస్కృతి, మతం వారిపై అధిక ప్రభావం చూపింది. మొదటి గొప్ప కుషాన్ రాజు "విమా కాడ్‌ఫైసిస్" బహుశా శైవ మతాన్ని అవలంబించి ఉండవచ్చునని కొన్ని నాణేల ఆధారంగా ఊహిస్తున్నారు.

కుషాణుల రాజ్యంలో హిందూ మహాసముద్రం వాణిజ్యాన్ని, పురాతన సింధునది లోయ నాగరికతను, సిల్కు మార్గం వాణిజ్యాన్ని అనుసంధించింది. వారి సామ్రాజ్యం ఉన్నత దశలో అరల్ సముద్రం నుండి గంగానది లోయ వరకు - ప్రస్తుత ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్,, ఉత్తర భారతదేశం వారి పాలనలో ఉండేవి. కనుక సదూర ప్రాంతాల మధ్య వాణిజ్యం సమృద్ధిగా సాగింది. పెద్ద నగరాలు వెలిశాయి. చైనా సిల్కు రోమ్ వరకు ఎగుమతి అయ్యేది.

సామ్రాజ్య విస్తరణ

బల్లెం విసిరే విదేశీ సైనికుడు - 3వ శతాబ్దం శిల్పం- చైనా.
బుద్ధగయలో "Enlightenment Throne of the Buddha"కు హవిష్కుడు సమర్పించిన సువర్ణ దానాలు - 3వ శతాబ్దం (బ్రిటిష్ మ్యూజియమ్)

కుషాణుల పాలన గురించిన స్పష్టమైన పురావస్తు ఆధారాలు సుర్ఖ్ కోతల్, బెగ్రామ్ పెషావర్, తక్షశిల , మధురల నుండి లభిస్తున్నాయి. ఇంకా వారిపాలనలో ఉండిఉండవచ్చునని భావిస్తున్న ప్రాంతాలు - ఖ్వారిజమ్, కౌశాంబి, సాంచి, సారనాథ్, మాల్వా, ఒరిస్సాలు (కొద్దిపాటి నాణెములు, రాజుల పేర్లున్న ఫలకాల ఆధారంగా) [5] ఇటీవల లభించినరబటక్ శాసనం ఆధారంగా ఉత్తర భారతదేశం ప్రధాన భాగమంతా కుషాణుల పాలనలో ఉండేదని ఖచ్చితంగా తెలుస్తున్నది.[6] దీని ప్రకారం ఉజ్జయిని, కుండిన, సాకేత్, కౌశాంబి, పాటలీపుత్రం, (బహుశా చంపా కూడా) నగరాలు కనిష్కుడి పాలనలో ఉండేవి.[7][8][9]

ఇక ఉత్తర దిశగా 2వ శతాబ్దం నాటికి కుషాణుల రాజైన కనిష్కుడు తమ ప్రాచీన యూజీ స్వస్థానమైన తరిమ్ బేసిన్ ప్రాంతంలో కూడా తన అధికారాన్ని విస్తరించి ఉండవచ్చునని కొన్ని ఆధారాలవల్ల తెలుస్తుంది. కష్గర్, యార్కండ్ , ఖోటాన్లలో కనిష్కుడి పాలన సాగిఉండవచ్చునని కొన్న రచనల ద్వారా ఊహిస్తున్నారు.[5]

3వ శతాబ్దం నాటికి కూడా బుద్ధగయలోని బుద్ధ జ్ఞాన సింహాసనానికి ("Enlightenment Throne") హవిష్కుడు దానం చేసిన సువర్ణ దానం, అలంకృత సువర్ణ నాణేల వలన అప్పటివరకు ఆ ప్రాంతంలో కుషానుల పాలన సాగి ఉండవచ్చునని భావిస్తున్నారు.[10]

ప్రధాన కుషాణు పాలకులు

కుజులా కాడ్‌ఫైసిస్ (సా.శ. 30–80)

కుజులా కాడ్‌ఫైసిస్ యొక్క Tetradrachm (సా.శ. 30–80) హెర్మయ్స్ రాజు శైలిలో.

హౌ హన్షూ అనే చారిత్రికాధారం ప్రకారం బదక్‌షాన్‌కు చెందిన కుజులా కాడ్‌ఫైసిస్ అనే రాజు నలుగురు ఇతర రాజులను నాశనం చేసి తనను తాను "గ్విషాంగ్" రాజుగా ప్రకటించుకొన్నాడు.[11]

అతను తరువాత పార్థియాపై దండెత్తి కాబూల్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. పూడా, జిబిన్ (కపిష-గాంధార) రాజ్యాలను జయించాడు. ఎనభై ఏళ్ళ పైబడిన వయస్సులో మరణించాడు. బహుశా సా.శ. 45 - 60 సంవత్సరాల మధ్య జరిగిన ఈ యుద్ధాలలోని విజయాలు కుషాన్ సామ్రాజ్యానికి ప్రారంభాలు. తరువాత అతని వారసులు రాజ్యాన్ని ఇంకా విస్తరించారు. కుజులా అనేక నాణేలు ముద్రించాడు. కుజులాకు ఇద్దరు కుమారులు - సదష్కణ (రాజ్యం చేయలేదు), విమా టక్టూ. కుజులా కాడ్‌ఫైసిస్ కనిష్కుడి ముత్తాత.

విమా టక్టూ (80–105)

ఇతను కుషాను రాజ్యాన్ని భారత ఉపఖండం వాయవ్య ప్రాంతంలోకి విస్తరింపజేశాడు. దానితో కుషాను రాజ్యం బాగా సంపన్నమైంది. [11]

విమా కాడ్‌ఫైసిస్(105–127)

విమా కాడ్‌ఫైసిస్.

రబటక్ శాసనం ఆధారంగా ఇతను సదష్కణుడి కొడుకు. ఇతని కాలంలో కుషాణు రాజ్యం ఆఫ్ఘనిస్తాన్‌లోకి, ఇంకా భారతదేశంలోకి విస్తరించింది. భారతదేశంలో అప్పటికి ఉన్న రాగి, వెండి నాణేలకు అదనంగా బంగారు నాణేలు ప్రవేశపెట్టిన మొదటి రాజు ఇతడే. ఇతని కొడుకు 1వ కనిష్కుడు కుషాణులలోకెల్లా ప్రసిద్ధుడైన రాజు.

1వ కనిష్కుడు (127–147)

1వ కనిష్కుడు.

కుషాణులలో ఐదవ రాజైన కనిష్కుడి పాలన సా.శ.127 నుండి సుమారు 28 సంవత్సరాలు సాగింది. అతను సింహాసనానికి వచ్చేసరికి దాధాఫు మొత్తం ఉత్తర భారతదేశం, ఇంకా పాటలీ పుత్రం, కుండిన, ఉజ్జయిని, సాకేత్, చంపా వంటి ప్రాంతాలు ఇతని పాలనలో ఉన్నాయని రబటక్ శాసనం తెలుపుతోంది.ఇతని సామ్రాజ్యం రెండు రాజధానులనుండి నిర్వహింపబడింది - పరుషపురం (పాకిస్తాన్ లోని పెషావర్), మధుర. ప్రస్తుత పంజాబ్‌ లోని భటిండాలో బ్రహ్మాండమైన భటిండా కోట ఇతని కాలంలోనే నిర్మించబడింది. (ఖిలా ముబారక్). ఇతని మరొక వేసవి రాజధాని బగ్రామ్లో ఉండేది (అప్పటి పేరు కప్సియా). ఇక్కడ గ్రీస్ నుండి చైనా వరకు వివిధ ప్రాంతాలకు చెందిన పెక్కు "అమూల్యమైన బగ్రామ్ చారిత్రిక కళాకృతులు" లభించాయి.

రబటక్ శాసనం ప్రకారం కనిష్కుడు విమా కాడ్‌ఫైసిస్ కుమారుడు, సదక్షిణుడి మనుమడు, కుజులా కాడ్‌ఫైసిస్ మునిమనుమడు. హ్యారీ ఫాల్క్ అనే చరిత్రకారుని విస్తృతమైన పరిశోధనల ద్వారా కనిష్కుని పాలన సా.శ. 127వ సంవత్సరంలో ప్రాంభమైందని తెలుస్తున్నది.[12][13] కనిష్కుని కాలం నుండి కనిష్కుని శకంగా కుషాను రాజులు కేలండర్‌ను లెక్కించారు. కుషానుల అధికారం సన్నగిల్లేవరకు, అంటే సుమారు 100 సంవత్సరాల వరకు, ఈ విధానం కొనసాగింది.

వశిష్కుడు

హవిష్కుడు.

వశిష్కుడు కొద్దికాలంపాటే రాజ్యపాలన చేసినట్లనిపిస్తుంది. అతని రాజ్యం దక్షిణాన సాంచి వరకు ఉన్నదని సాంచిలో లభించిన శాసనాలవలన ("వక్షుసాన" పేరుమీద ఉన్నవి) తెలుస్తుంది.

హవిష్కుడు(140–183)

హవిష్కుడు కనిష్కుని మరణం (లభించిన ఆధారాల ప్రకారం సా.శ.140లో జరిగింది) తరువాత రాజయ్యాడు. తరువాత వాసుదేవుడు రాజ్యానికి వచ్చేవరకూ సుమారు 40 సంవత్సరాలు రాజ్యమేలాడు. ఇతని పాలనా కాలంలో కుషానుసామ్రాజ్యం సుస్థిరమైంది. ముఖ్యంగా మధుర నగరంపై తమ అధికారాన్ని బలపరచుకొన్నాడు.

1వ వాసుదేవుడు (191–225)

1వ వాసుదేవుడు కుషానులలో చివరి గొప్పరాజు. ఇతని పాలన 191 నుండి 225 వరకు సాగిందని ఆధారాలున్నాయి. ఇతని పాలన చివరికాలంలో పశ్చిమోత్తర భారతాన సస్సానిద్‌ల దండయాత్రలు జరిగాయి. సుమారు 240 లో ఇండీ సస్సానిద్ లేదా కుషాన్‌షాల రాజ్యం మొదలయ్యింది.కుషాణుల రాజు, కనిష్క వంశపు సామ్రాజ్యాధి పతులలో చివరి ప్రభువు ఆయిన వాసుదేవుడు (సా.శ. 202-233) ముద్రించిన నాణెం ఇక్కడ చిత్రంలో చూడవచ్చును. నాణేనికి ఒక వైపున తన బొమ్మను శూలం ధరించిన రూపులో వేయించాడు. మరో వైపున "ఓషొ" అనే దేవత బొమ్మను వేయించాడు. ఇతని పేరును బట్టియే అతడు పూర్తిగా భారతీకరణకు లోనైనట్టు గమనించగలము.

కుషాణులు ఆరాధించిన దేవతలు

కుషాణుల కాలంలో పలువిధాలైన దేవతలను ఆరాధించారు. వారి నాణేలు, ముద్రలపై 30 పైగా దేవతా రూపాలు లభిస్తున్నాయి. ఈ మూర్తులలో గ్రీకు (హెలెనిస్టిక్), ఇరానియన్, భారతీయ దేవతా రూపాలున్నాయి. భారతీయ దేవతా రూపలలో బుద్ధుడు, బోధిసత్వ మైత్రేయుడు, మహాసేనుడు, స్కందకుమారుడు, శాక్యముని బుద్ధుడు - ఈ రూపాలు చిత్రించబడ్డాయి. హవిష్కుని రెండు రాగి నాణేలలో గణేశ మూర్తి (లేదా రుద్రుడు) ఉంది.

కుషాణుల కాలంనాటి నాణేలపై ముద్రింపబడిన దేవతామూర్తులు

కుషాణుల కాలంలో బౌద్ధం

మహాయాన బౌద్ధం ఆరంభ దశకు చెందిన సంకేతాలు - కుషాన్ భక్తుడు, బోధిసత్వ మైత్రేయుడు, బోధిసత్వ అవలోకితేశ్వరుడు - గాంధార శిల్పం - 2,3 శతాబ్దాల నాటిది.

కుషాణుల కాలంలో హెలెనిస్టిక్,, బౌద్ధ సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం ఫలితంగా గ్రీకో-బౌద్ధం ఆవిర్భవించింది. ఇది మహాయాన బౌద్ధంగా రూపుదిద్దుకొని మధ్య ఆసియా, ఉత్తర ఆసియా ప్రాంతాలలో విస్తరించింది.

బౌద్ధ సంప్రదాయంలో కనిష్కునికి విశేషమైన స్థానం ఉంది. ఇతను కాష్మీరులో 4వ మహాబౌద్ధ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే ప్రాకృతంలో ఉన్న బౌద్ధ మత గ్రంథాలను సంస్కృతంలోకి అనువదింపజేశాడు. బౌద్ధమతం విస్తరణలో ప్రముఖమైన పాత్ర వహించిన నలుగురు చక్రవర్తులు - అశోకుడు, హర్ష వర్ధనుడు, ఇండో-గ్రీక్ రాజు 1వ మెనాందర్ (మిలిందుడు), కనిష్కుడు.

కుషాణులనాటి కళ

కుషాణుల ప్రాభవ కాలంలో పల్లవించిన గాంధార కళ, సంస్కృతి పాశ్చాత్య సంస్కృతిపై కుషాణుల ప్రభావానికి సంకేతాలు. తరువాతి కాలంలో బౌద్ధమతానికి సంబంధించిన చిత్రాలు, శిల్పాలలో ఈ గాంధార విధానం దాదాపు ప్రామాణికమయ్యింది.

రోమన్లతో సంబంధాలు

గ్రీకో-రోమన్ ఖడ్గవీరుడు - గాజు పాత్రపై చిత్రం - బెగ్రామ్, 2వ శతాబ్దం.
కుషాణుల నాణేలతో కలిసి ఉన్న రోమన్ నాణెం. (ఆఫ్ఘనిస్తాన్)

2వ శతాబ్దంలో బాక్ట్రియా, భారత రాజుల మధ్య రాజదూతల గురించిన ప్రస్తావన పలు రోమన్ వ్రాతలలో ఉంది. ఇది కుషాణుల గురించి అయిఉండవచ్చును.

చైనా దేశానికి చెందిన రికార్డులలో కూడా రోమన్ సామ్రాజ్యం, పశ్చిమోత్తర భారతం మధ్య సరకుల మార్పిడి గురించి వ్రాయబడిఉంది. సన్నని బట్టలు, వూలు తివాచీలు, పంచదార బిళ్ళలు, మిరియాలు, ఆల్లం, నల్ల ఉప్పు వంటివి. కుషాణుల వేసవి రాజధాని బెగ్రామ్‌లో రోమన్లకు చెందిన ఎన్నో పనిముట్లు, ముఖ్యంగా గాజుసామాను, లభించాయి.

చైనాతో సంబంధాలు

తారిమ్ బేసిన్ ప్రాంతంలో లభించిన కుషాణు నాణెం.

1వ, 2వ శతాబ్దాలలో కుషాన్ సామ్రాజ్యం ఉత్తరంగా విస్తరించింది. వారు చైనాలోని తరిమ్ బేసిన్ ప్రాంతం కొంత ఆక్రమించారు. ఇది కుషాణు జాతి (యూజీ తెగ) వారి పూర్వపు స్వస్థానం. తత్ఫలితంగా మధ్య ఆసియా - రోమన్ సామ్రాజ్యాల మధ్య జరిగే లాభకరమైన వాణిజ్యం కుషాను రాజ్యంగుండా జరిగేది. చైనా రాజుల మిలిటరీ వ్యవహారాలలో కూడా - సా.శ. 84, 85 కాలంలో, కొంత వరకు కుషాణుల సహకారం ఉంది.

ఈ విధంగా నెలకొన్న సత్సంబంధాల కారణంగా కుషాణులు చైనా రాజాస్థానానికి బహుమతులు అందజేసేవారు. అయితే కుషాణులు హాన్ రాజవంశపు రాకుమారితో వివాహబంధాన్ని కోరినప్పుడు చైనీయులు నిరాకరించారు. ఈ తిరస్కారానికి ప్రతిస్పందనగా 70,000 కుషాణు సేనలు 86లో "బాన్ చావో"ప్రాంతంపై దండెత్తారు. కాని సుదూరమైన ప్రాంతంలో యుద్ధం చేసి విజయం సాధించడం వారివల్ల కాలేదు. ఆ తరువాత కుషాణులు చైనా చక్రవర్తి హాన్ హి కి 89-106 కాలంలో కప్పం కట్టవలసివచ్చింది.

మళ్ళీ 116 సంవత్సరంలో కనిష్కుని రాజ్యకాలంలో కుషాణులు మరింత విస్తరించి చైనాలోని కష్గర్ చుట్టుప్రక్కల ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. పాకృతభాషకు చెందిన బ్రాహ్మీ లిపిని ఆ ప్రాంతం పరిపాలనలో ప్రవేశపెట్టారు. ఈ కాలంలో బౌద్ధమతం , గ్రీకో-రోమన్ కళ ఈ ప్రదేశాలలో మరింత విస్తరించాయి. 158-159 కాలంలో చైనా చక్రవర్తి హాన్ హుయాన్‌కు కుషాణులు బహుమతులు పంపినట్లు రికార్డులున్నాయి. ఈ విధంగా అభివృద్ధి చెందిన సంబంధాల కారణంగా లోకక్షేమ వంటి అనేక బౌద్ధమత ప్రచారకులు చైనా రాజధాని నగరాలైన లోయాంగ్, నాన్‌జింగ్‌లలో ఆదరణ పొందాఱు. వారు అనేక గ్రంధాలను చైనా భాషలోకి అనువదించారు. సిల్క్ మార్గం ద్వారా బౌద్ధమతం వ్యాప్తికి వీరికాలంలోనే అంకురార్పణ జరిగింది.

కుషాణుల రాజ్యం క్షీణత

2వ కనిష్కుని బంగారు నాణెం - 200-220 కాలం
1వ శకుడు - కుషాణుల చివరి పాలకులలో ఒకడు(325-345).

3వ శతాబ్దం నుండి కుషాణుల రాజ్యం విచ్ఛిన్నమవ్వసాగింది. 225లో 1వ వాసుదేవుడు మరణించాడు. తరువాత కుషాణు రాజ్యం తూర్పు, పశ్చిమ భాగాలుగా విడిపోయింది. 224-240 కాలంలో సస్సానిద్‌లు బాక్ట్రియా, ఉత్తర భారతదేశంపై దండెత్తారు. 270 నాటికి కుషాణులు గంగా నది మైదాన ప్రాంతంలో తమ అధికారం కోల్పోయారు. 320నాటికి గుప్త సామ్రాజ్యం స్థాపింపబడింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం సస్సనిద్‌ల వశమైంది. 4వ శతాబ్దంలో కిదారుడు అనే సామంతరాజు పాత వంశాన్ని కూలదోసి తనను తాను కుషాణు రాజుగా ప్రకటించుకొన్నాడు. అతని కాలంలో రాజ్యం చిన్నదైనా గాని సంపన్నంగా ఉంది. 5వ శతాబ్దంలో తెల్ల హూణుల దండయాత్రల వలనా, తరువాత ఇస్లాం విస్తరణ వలనా మిగిలిన కొద్దిపాటి కుషాణు పాలన కూడా తుడిచిపెట్టుకుపోయింది.

కుషాణు రాజుల పట్టిక

  • హెరాయొస్ (c. 1 – 30), మొదటి కుషాణు పాలకుడు (కాలం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి)
  • కుజులా కాడ్‌ఫైసిస్ (c. 30 – c. 80)
  • విమా టక్టో (c. 80 – c. 105) (అలియాస్ Soter Megas or "Great Saviour.")
  • విమా కాడ్‌ఫైసిస్ (c. 105 – c. 127) the first great Kushan emperor
  • 1వ కనిష్కుడు (127 – c. 147)
  • వశిష్కుడు (c. 151 – c. 155)
  • హవిష్కుడు (c. 155 – c. 187)
  • 1వ వాసుదేవుడు (c. 191 –నుండి కనీసం 230 వరకు), పెద్ద కుషాణు పాలకులలో చివరివాడు.
  • 2వ కనిడష్కుడు (c. 226 – 240)
  • వశిష్కుడు (c. 240 – 250)
  • 3వ కనిష్కుడు (c. 255 – 275)
  • 2వ వాసుదేవుడు (c. 290 – 310)
    • 3వ వాసుదేవుడు (బహుశా)
      • 4వ వాసుదేవుడు - కాందహార్ పాలకుడు (బహుశా)
        • కాబూల్ వాసుదేవుడు (బహుశా)
  • చూ (c. 310? – 325?)
  • 1వ శకుడు (c. 325 – 345)
  • కిపుణదుడు (c. 350 – 375)

ఇవికూడా చూడండి

మూలాలు

మూలాలు

ఆంగ్లభాషలో పలు మూలాలు ఆంగ్ల వికీ వ్యాసం en:Kushan Empire లో ఇవ్వబడ్డాయి.

బయటి లింకులు

మూస:భారతదేశ చరిత్ర


గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగముక్రీ.పూ.1500వరకు
పూర్వ యుగముక్రీ.పూ.1500-క్రీ.శ.650
• మౌర్యులకు ముందుక్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులుక్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులుక్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులుక్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు210 – 300
బృహత్పలాయనులు300 – 350
ఆనంద గోత్రీకులు295 – 620
శాలంకాయనులు320 – 420
విష్ణుకుండినులు375 – 555
పల్లవులు400 – 550
పూర్వమధ్య యుగము650 – 1320
• మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు624 – 1076
పూర్వగాంగులు498 – 894
• చాళుక్య చోళులు980 – 1076
కాకతీయులు750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము1320–1565
ముసునూరి నాయకులు1333–1368
• ఓఢ్ర గజపతులు1513
రేచెర్ల పద్మనాయకులు1368–1461
కొండవీటి రెడ్డి రాజులు1324–1424
• రాజమహేంద్రవరం రెడ్డి రాజులు1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము1336–1565
ఆధునిక యుగము1540–1956
అరవీటి వంశము1572–1680
పెమ్మసాని నాయకులు1423–1740
కుతుబ్ షాహీ యుగము1518–1687
నిజాము రాజ్యము1742–1948
• బ్రిటిషు రాజ్యము
• స్వాతంత్ర్యోద్యమము1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ1953–1956
• ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము • 21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు