నియాండర్తల్

40,000 ఏళ్ళ కిందట యూరేషియాలో నివసించి అంతరించి పోయిన ఆదిమ మానవ జాతి

నియాండర్తల్ [7] యురేషియాలో సుమారు 40,000 సంవత్సరాల క్రితం వరకు నివసించి, అంతరించిపోయిన పురాతన మానవుల జాతి లేదా ఉపజాతి. [8][9][10][11] దీని శాస్త్రీయ నామం హోమో నియాండర్తలెన్సిస్ లేదా హోమో సేపియన్స్ నియాండర్తలెన్సిస్.[12] వలస వచ్చిన ఆధునిక మానవులతో పోటీ పడి గాని, వాళ్ళతో స్పర్థ వలన గానీ, [13] [14] [15] లేదా శీతోష్ణస్థితుల్లో వచ్చిన గొప్ప మార్పు వలన గానీ, [16] [17] [18] వ్యాధుల వలన గానీ, [19] [20] లేదా పై కారణాల్లో కొన్నిటి వలన గానీ, లేదా అన్నింటి వలన గానీ అవి అంతరించిపోయాయి.[18]

నియాండర్తల్
కాల విస్తరణ: మధ్య–అంత్య ప్లైస్టోసీన్ 0.43/0.25–0.04 Ma
PreꞒ
O
S
D
C
P
T
J
K
Pg
N
Slightly angled head-on view of a Neanderthal skeleton, stepping forward with the left leg
నియాండర్తల్ అస్థిపంజరపు పునర్నిర్మాణం. పక్కటెముకల గూడు, కటి భగాలు ఆధునిక మానవులవి.
శాస్త్రీయ వర్గీకరణ edit
Kingdom:Animalia
Phylum:Chordata
Class:Mammalia
Order:Primates
Suborder:Haplorhini
Infraorder:Simiiformes
Family:Hominidae
Subfamily:Homininae
Tribe:Hominini
Genus:Homo
Species:
H. neanderthalensis
Binomial name
Homo neanderthalensis
విలియమ్ కింగ్, 1864
Stretching across all of Portugal, Spain, Switzerland, Italy, England, southern Germany and Austria, all of Czech Republic, Hungary, Romania, Croatia, Montenegro, the Peloponnesian Peninsula, Crimean peninsula, Black Sea–Caspian Steppe west of the Caucasus, southern Turkey, northern Syria, the Levant, northern Iraq spilling over into Iran, the east end of Uzbekistan, and just northeast of Kazakhstan in Russia
Known Neanderthal range in Europe (blue), Southwest Asia (orange), Uzbekistan (green), and the Altai Mountains (violet).
Synonyms[6]
హోమో
    • H. stupidus
      Ernst Haeckel, 1895[1]
    • H. europaeus primigenius
      Wilser, 1898
    • H. primigenius
      Gustav Schwalbe, 1906[2]
    • H. antiquus
      Adloff, 1908
    • H. transprimigenius mousteriensis
      Farrer, 1908
    • H. mousteriensis hauseri
      Hermann Klaatsch 1909[3][4]
    • H. priscus
      Krause, 1909
    • H. chapellensis
      von Buttel-Reepen, 1911
    • H. calpicus
      Arthur Keith, 1911
    • H. acheulensis moustieri
      Wiegers, 1915
    • H. lemousteriensis
      Wiegers, 1915
    • H. naulettensis
      Baudouin, 1916
    • H. sapiens neanderthalensis
      Kleinshmidt, 1922
    • H. heringsdorfensis
      Werthe, 1928
    • H. galilensis
      Joleaud, 1931
    • H. primigenius galilaeensis
      Sklerj, 1937
    • H. kiikobiensis
      Bontsch-Osmolovskii, 1940
    • H. sapiens krapinensis
      Campbell, 1962
    • H. erectus mapaensis
      Kurth, 1965
Palaeoanthropus
    • P. neanderthalensis
      Theodore McCown and Sir Arthur Keith, 1939[5]
    • P. heidelbergensis
      Theodore McCown and Sir Arthur Keith, 1939[5]
    • P. ehringsdorfensis
      Paterson, 1940[5]
    • P. krapinensis
      Sergi, 1911[5]
    • P. palestinensis
      Theodore McCown and Sir Arthur Keith, 1939[5]
    • P. europaeus
      Sergi, 1910
Protanthropus
    • P. atavus
      Ernst Haeckel, 1895
    • P. tabunensis
      Bonarelli, 1944
Acanthropus
    • A. neanderthalensis
      Arldt, 1915
    • A. primigenius
      Othenio Abel, 1920
    • A. neanderthalensis
      William Boyd Dawkins, 1926

ఆధునిక మానవుల నుండి నియాండర్తళ్ళు ఎప్పుడు వేరుపడ్డారో స్పష్టంగా లేదు. DNA అధ్యయనాల్లో ఈ కాలం 1,82,000 సంవత్సరాల క్రితం [21] నుండి 80,000 సంవత్సరాల క్రితం వరకు ఉండొచ్చని తేలింది.[22] నియాండర్తళ్ళు తమ పూర్వీకుడైన హెచ్. హైడెల్బెర్గెన్సిస్ నుండి ఎప్పుడు వేరుపడ్డారనేది కూడా అస్పష్టంగా ఉంది. నియాండర్తళ్ళకు చెందినవని భావిస్తున్న అత్యంత పురాతన ఎముకలు 4,30,000 సంవత్సరాల నాటివి. కానీ వాటి వర్గీకరణ అనిశ్చితంగా ఉంది.[23] నియాండర్తల్‌కు చెందిన శిలాజాలు ముఖ్యంగా 1,30,000 సవత్సరాల క్రితం తరువాతి కాలానికి చెందినవి చాలా లభించాయి.[24] నియాండర్తల్ 1 అనే టైప్ స్పెసిమెన్ను 1856 లో జర్మనీ లోని నియాండర్ లోయలో కనుగొన్నారు. నియాండర్తళ్ళను ఆదిమ జాతిగాను, తెలివితక్కువ వారిగాను, క్రూరులు గానూ 20 వ శతాబ్దం ప్రారంభంలో చిత్రీకరించారు. తదనంతర కాలంలో వారి గురించిన జ్ఞానం, అవగాహన శాస్త్ర ప్రపంచంలో బాగా మారినప్పటికీ, పరిణతి చెందని, గుహల్లో జీవించిన ఆదిమ మానవులుగా వారిని భావించడం ప్రముఖ సంస్కృతుల్లో ఇంకా ప్రబలంగానే ఉంది.[25] [26]

ఆధునిక మానవులతో పోల్చినప్పుడు, నియాండర్తళ్ళు దృఢంగా, పొట్టి కాళ్ళు చేతులతో, వెడల్పాటి ఛాతీతో, వెడల్పాటి ముక్కుతో ఉండేవారు. ఈ లక్షణాలు ఎక్కువగా శీతల వాతావరణంలో శరీరం లోని వేడిని కాపాడుకోటానికి పరిణామ క్రమంలో ఏర్పడిన అనుసరణలుగా భావిస్తారు. కానీ (శరీర కొవ్వు నిల్వను పక్కన పెడితే) [27] అవి జన్యు ప్రవాహపు పరిణామం గాను [28] నియాండర్తళ్ళు నివసించిన వెచ్చటి, అటవీ ప్రాంతంలో పరిగెత్తడం కోసం జరిగిన అనుసరణలు గానూ భావించవచ్చు [29] నియాండర్తల్ పురుషులు, మహిళల కపాలాలు సగటున 1,600 సెం.మీ3 , 1,300 సెం.మీ.3 ఉండేవి.[30] [31] [32] ఇది ఆధునిక మానవుల కపాల పరిమాణం అంతే ఉన్నాయి. వారి సమకాలీన మానవుల మాదిరిగానే సగటు నియాండర్తల్ పురుషులు 165 సెం.మీ (5 అడుగులు 5 అంగుళాలు), మహిళలు 153 సెం.మీ (5 అడుగులు) ఎత్తులో ఉన్నారు.[33]

నియాండర్తల్ టెక్నాలజీ అధునాతనమైనదని భావిస్తున్నారు. ఇందులో మౌస్టేరియన్ రాతి సాధన పరిశ్రమ [34] [35], అగ్నిని సృష్టించే సామర్థ్యాలు,[36] [37] గుహలో పొయ్యిలను నిర్మించడం, [38] [39] అంటుకునే బిర్చ్ బెరడు తారు, [40] దుప్పట్లు, పోంచోల వంటి బట్టల తయారీ, [41] మధ్యధరాలో సముద్రయానానికి వెళ్లడం, [42] [43] ఔషధ మొక్కలను ఉపయోగించుకోవడం [44] [45] [46] తీవ్రమైన గాయాలకు చికిత్స చేసుకోవడం, [47] వేయించడం [48] కాల్చడం వంటి వివిధ వంట పద్ధతులను వాడడం వంటివి వీరి సాంకేతికతలో భాగం.[49] నియాండర్తల్‌లు విస్తృతమైన ఆహారాన్ని తినేవారు. ప్రధానంగా గిట్టల జంతువులతో పాటు, [50] ఇతర భారీ జంతువులు, [51] [52] మొక్కలు, [53] [54] [55] చిన్న క్షీరదాలు, పక్షులు, సముద్ర జీవులూ వారి ఆహారంలో ఉండేవి.[56] వారు మాంసాహార గొలుసులో శీర్షాన ఉన్నప్పటికీ, గుహ ఎలుగుబంట్లు, సింహాలు, హైనాలు, ఇతర పెద్ద మాంసాహారులతో పోటీ పడేవారు.[57] : 120–143 పాతరాతియుగపు కళకు చెందిన కొన్ని ఉదాహరణలు నియాండర్తల్‌లకు ఆపాదించారు. అయితే అది వివాదాస్పదంగా ఉంది. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనవి, 65,000 సంవత్సరాల క్రితం నాటి స్పానిష్ గుహ చిత్రాలు, [58] [59] [60] దివ్జే బేబ్ ఫ్లూట్.[61] వారికి మత విశ్వాసాలు ఉండేవని కొన్ని వాదనలు ఉన్నాయి. [62] నియాండర్తళ్ళకు మాట్లాడే సామర్థ్యం ఉండేది. అయితే వారి భాష ఎంత క్లిష్టంగా ఉండేదో స్పష్టంగా తెలియదు. [63] [64]

మొత్తం జనాభా తక్కువగా ఉండేది. వారు చిన్నచిన్న సమూహాలలో నివసించేవారు. బయటి వ్యక్తులతో అరుదుగా సంభాషించేవారు.[38] [65] ఇది హానికరమైన జన్యువులు పోగవడానికి, అంతర్గత సంతానోత్పత్తికీ (రక్త సంబంధీకులతో సంతానోత్పత్తి) దారితీసింది. [65] నియాండర్తళ్ళు అధిక ఒత్తిడితో కూడిన పర్యావరణంలో నివసించారు. గాయాలు బాగా అవుతూ ఉండేవి. 80% మంది ప్రజలు 40 ఏళ్ళ లోపే మరణించేవారు.[66] 2010 నియాండర్తల్ జన్యు ప్రాజెక్టు ముసాయిదా నివేదికలో నియాండర్తళ్ళకు, శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులకూ మధ్య సంతానోత్పత్తి జరిగిందనే దానికి ఆధారాలు ఇచ్చారు. [67] [68] [69] ఇది బహుశా 316–219 వేల సంవత్సరాల మధ్య జరిగి ఉండవచ్చు.[70] 100 - 65 వేల సంవత్సరాల మధ్య జరిగి ఉండడానికి మరింత ఎక్కువ సంభావ్యత ఉంది.[71] సబ్‌సహారా యేతర ఆఫ్రికా ( యురేషియన్లు, ఓషియానియన్లు, స్థానిక అమెరికన్లు, ఉత్తర ఆఫ్రికన్లు) జన్యువులలో 1–4% నియాండర్తల్‌ల అంశ ఉంది. [67] [72] [73] నియాండర్తల్ జన్యువులో 20% ఈరోజుకీ మానవుల్లో ఉంది.[74] వారసత్వంగా వచ్చిన అనేక జన్యువుల్లో హానికరమైన వాటిని పరిణామ క్రమంలో బహుశా వదిలివేసినప్పటికీ, [75] ఆధునిక మానవుల రోగనిరోధక వ్యవస్థను నియాండర్తల్ అంశ ప్రభావితం చేసినట్లు కనిపిస్తుంది. [76] [77]

వర్గీకరణ

పదవ్యుత్పత్తి

నియాండర్తల్ 1 లభించిన క్లీన్ ఫెల్డోఫర్ గ్రోట్టే [a]

నియాండర్తల్ (Neandertal) శిలాజాలను మొట్టమొదటిగా నియాండర్టల్ లోయలో కనుగొన్నారు. (దీన్ని నియాండర్ (Neanderthal) లోయ అని కూడా అంటారు) అప్పట్లో ఈ పదాన్ని నియాండర్తల్ అని పలికే వారు. ఆ తరువాత 1901 లో జర్మను భాషలో స్పెల్లింగ్ సంస్కరణ జరిగాక దాన్ని నియాండర్టల్ అని ఉచ్చరిస్తున్నారు [b] జర్మనుల వ్యావహారికంలో ఈ జాతిని నియాండర్టలర్ ( "నియాన్దర్ లోయ నివాసి") అని పలుకుతారు. నియాండర్టల్ అనే పదం ఈ లోయను సూచిస్తుంది. [c] ఇంగ్లీషులో అసలైన జర్మన్ స్పెల్లింగ్‌ను వాడుతారు, కాని జర్మను నుండి తెచ్చుకునే క్రమంలో లోయ పేరుకు, జాతి పేరుకూ మధ్య కొంత గందరగోళం ఉంది. వాస్తవానికి, నియాండర్తల్ మ్యాన్, నియాండర్తలర్ అనే పదాలను మొదట్లో వాడేవారు. ఇప్పటికీ జాగ్రత్తగా రచించిన గ్రంథాలలో వాడుతారు. ఈ లోయకు జోకిమ్ నియాండర్ పేరిట ఈ పేరు వచ్చింది.[81] [82] [83]

ప్రామాణిక బ్రిటిష్ ఉచ్చారణ ప్రకారం దీన్ని నియాండర్టల్ / t / తో ఉంటుంది pronounced /niːˈændərtɑːl/ ) [84] [85] అని పలుకుతారు. ఉత్తర అమెరికాలో నియాండర్తల్పా అని పలుకుతారు. [86] [87]

ఇంగ్లీషులో దీన్ని నియాండర్టల్ (Neandertal) (Neanderthal అని కాక) అని రాయడం కద్దు. కానీ శాస్త్రీయ నామం మాత్రం ఎల్లప్పుడూ H. నియాండర్తలెన్సిస్ (H. neanderthalensis) అనే రాస్తారు. [88]

నియాండర్తల్ 1 శిలాజం ఈ జాతికి చెందిన టైప్ స్పెసిమెన్ (జాతికి గుర్తింపుగా వాడే శిలాజం - జాతికి పెట్టే పేరు ఈ శిలాజ లక్షణాల నుండే ఏర్పడుతుంది). మానవ శాస్త్ర సాహిత్యంలో దీన్ని "నియాండర్తల్ క్రేనియమ్" అనీ, "నియాండర్తల్ పుర్రె" అనీ పిలుస్తారు. దీని ఆధారంగా పునర్నిర్మించిన మనిషిని నియాండర్తల్ మనిషి అంటారు. [89] హోమో నియాండర్తాలెన్సిస్ అనే ద్విపద పేరు "నియాండర్తల్ మనిషి" అనే ఒక టైప్ స్పెసిమెన్‌కు పెట్టిన పేరును యావత్ సమూహానికీ విస్తరిస్తూ, ఈ జాతిని మానవుల కంటే భిన్నమైనదిగా గుర్తిస్తుంది. దీన్ని మొదట ఐరిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త విలియం కింగ్, 1863 లో 33 వ బ్రిటిష్ సైన్స్ అసోసియేషనుకు సమర్పించిన పత్రంలో ప్రతిపాదించాడు. . [90] [91] [92] అయితే, 1864 లో అతను నియాండర్తల్ బ్రెయిన్‌కేస్‌ను చింపాంజీతో పోల్చి, దీని ప్రజాతి పేరు కూడా ఆధునిక మానవుల కంటే భిన్నంగా ఉండాలని అతను సిఫారసు చేశాడు. నియాండర్థళ్ళకు "నైతిక, [ ఆస్తిక ] [d] భావనలు అందవు" అని వాదించాడు. [93]

వర్గీకరణ

హోమో సేపియన్స్

డెనిసోవాన్ (డెనిసోవా గుహకు చెందిన)

డెనిసోవాన్] (బైషియా కార్స్ట్ గుహకు చెందిన)

డెనిసోవా గుహకు చెందిన నియాండర్తల్

సిద్రోన్ గుహకు చెందిన నియాండర్తల్

విండియా గుహకు చెందిన నియాండర్తల్

Phylogeny based on comparison of ancient proteomes and genomes with those of modern species.[94]

నియాండర్తళ్ళు హోమో ప్రజాతికి చెందిన హోమినిడ్లు. సాధారణంగా H. నియాండర్తలెన్సిస్ అనే ఒక ప్రత్యేకమైన జాతిగా దీన్ని వర్గీకరిస్తారు. అయితే కొన్నిసార్లు, ఆధునిక మానవుని ఉపజాతి H. సేపియన్స్ నియాండర్తలెన్సిస్ అని కూడా వర్గీకరిస్తారు. ఇలా చేస్తే, ఆధునిక మానవులను H. s. సేపియన్స్ అని వర్గీకరించాల్సి ఉంటుంది. [12]

వివాదం ముఖ్యంగా "జాతి" అనే పదం యొక్క అస్పష్టత కారణంగా వచ్చింది. ఎందుకంటే "జాతి" ని సాధారణంగా రెండు జన్యుపరమైన వివిక్త జనాభాను వేరు చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఆధునిక మానవులు, నియాండర్తల్‌ల మధ్య సంకరం జరిగిందన్నది తెలిసిన సంగతే. [12] [95] అయితే, ఆధునిక మానవులలో నియాండర్తల్-ఉత్పన్నమైన పితృసంబంధ వై-క్రోమోజోమ్, మాతృసంబంధ మైటోకాన్డ్రియల్ డిఎన్ఎ (ఎంటీడిఎన్ఎ) లేకపోవడం, నియాండర్తల్ ఎక్స్ క్రోమోజోమ్ డిఎన్ఎ ప్రాతినిధ్యం తక్కువగా ఉండడం వంధ్యత్వాన్ని, హైబ్రిడ్ సంతతిలో సంతానోత్పత్తి లేమినీ సూచిస్తూ, [69] [96] [97] [98] ఈ రెండు సమూహాల మధ్య పునరుత్పత్తిలో ఉన్న పాక్షిక అవరోధాన్ని సూచిస్తుంది. [69]

2014 లో, జన్యు శాస్త్రవేత్త స్వంటే పెబో, ఇలాంటి " వర్గీకరణ యుద్ధాలను" పరిష్కరించలేమని అన్నాడు. "ఈ కేసును సంపూర్ణంగా వివరించే జాతి నిర్వచనం లేదు". [12]

ఆధునిక మానవులతో పోలిస్తే నియాండర్తళ్ళకు డెనిసోవాన్లతో ఎక్కువ సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. అదేవిధంగా, నియాండర్తల్, డెనిసోవాన్లకు న్యూక్లియర్ DNA (nDNA) ఆధారంగా మానవులతో కన్నా మరింత ఇటీవలి చివరి ఉమ్మడి పూర్వీకుడు (LCA) ఉన్నాడు. అయితే, mtDNA ను బట్టి నియాండర్తల్‌కు, ఆధునిక మానవులకూ ఉమ్మడిగా మరింత ఇటీవలి పూర్వీకుడు ఉన్నాడు. బహుశా ఇది నియాండర్తల్ / డెనిసోవన్ వేర్పాటు తరువాత నియాండర్తల్, ఆధునిక మానవుల మధ్య జరిగిన సంకరం ఫలితంగా మరొక mtDNA లైన్‌ ప్రవేశించడం వలన జరిగి ఉంటుంది. ఏదైనా పురాతన మానవుడి అంశ డెనిసోవాన్స్ లోకి [99] [100] [101] [102] లేదా అంతకు పూర్వమే ఆఫ్రికా నుండి వలస వచ్చిన ఆధునిక మానవుల అంశ నియాండర్తల్స్ లోకి రావడం ఇందులో ఇండి ఉన్న ఒక అంశం. [103]

పరిణామం

ఐరోపాలో విలసిల్లిన నియాండర్తళ్ళు, ఆసియాలో విస్తరించిన డెనిసోవాన్‌లు, ఆఫ్రికాలో పరిణామం చెందిన ఆధునిక మానవులు -ఈ ముగ్గురికీ చిట్టచివరి ఉమ్మడి పూర్వీకుడు హెచ్. హైడెల్బెర్గెన్సిస్ అని భావిస్తారు. [104] హెచ్. హైడెల్బెర్గెన్సిస్, నియాండర్తళ్ళ మధ్య ఉన్న టాక్సానమీ పరమైన వ్యత్యాసానికి కారణం ఐరోపాలో 3,00,000 - 2,43,000 సంవత్సరాల క్రితాల మధ్య కాలానికి చెందిన శిలాజాలు లభ్యం కాలేదు. సాంప్రదాయికంగా "నియాండర్తల్" అంటే ఆ తరువాతి కాలానికి చెందిన శిలాజాలే. [105] [51] [21] అయితే, సిమా డి లాస్ హ్యూసోస్ వద్ద దొరికిన 4,30,000 సంవత్సరాల క్రితం నాటి ఎముకలు తొలి నియాండర్తళ్ళకు లేదా వారికి దగ్గరి సంబంధం ఉన్న జనాభాకు చెందినవై ఉండవచ్చు. [23] అలాగే 4,00,000 సంవత్సరాల నాటి అరోయిరా 3 శిలాజాలు ఒక పరివర్తన దశను సూచిస్తాయి. మూలజాతి,ఉత్పన్న జాతులూ రెండూ ఏకకాలంలో జీవించి ఉండవచ్చు. [106] శిలాజ రికార్డుల నాణ్యత 1,30,000 సంవత్సరాల క్రితం నుండి బాగా మెరుగైంది. [107] ఈ కాలం నాటి స్పెసిమెన్లే నియాండర్తల్ అస్థిపంజరాలలో ఎక్కువ భాగం. [108] [109] 450–430 వేల సంవత్సరాల క్రితం, మధ్య ప్లైస్టోసీన్ సమయంలో, నియాండర్తళ్ళ దంత లక్షణాలు పరిణామం చెందాయని ఇటలీ లోని విసోగ్లియానో, ఫోంటానా రానుచ్చియో స్థలాల్లో లభించిన దంతాల అవశేషాలు సూచిస్తున్నాయి. [110]

నియాండర్తళ్ళు, మానవులు వేరుపడ్డాక, నియాండర్తళ్ళు ఎలా పరిణామం చెందారనే దానికి సంబంధించి రెండు ప్రధాన పరికల్పనలు ఉన్నాయి: 1. రెండు-దశలు, 2. క్రమానుగత వృద్ధి. మొదటిది, ఒక పెద్ద పర్యావరణ సంఘటన (సాలే హిమానీనదం వంటిది) జరిగి ఐరోపా లోని హెచ్. హైడెల్బెర్గెన్సిస్ శరీర పరిమాణం, దార్ఢ్యత వేగంగా పెరిగాయి. అలాగే తల కూడా పెరిగింది. ఇది పుర్రె నిర్మాణంలో ఇతర మార్పులకు దారితీసింది. [111] అయితే, నియాండర్తళ్ళ శరీర నిర్మాణంలో చోటు చేసుకున్న పరిణామాలు శీతల వాతావరణానికి అనుగుణంగా జరిగాయనడానికి అంతగా అవకాశం లేదు. [29] రెండవ పరికల్పన ప్రకారం, నియాండర్తళ్ళ పరిణామం పూర్వీకులైన H. హీడేల్బేర్గేన్సిస్ నుండి కాలానుగుణంగా, నెమ్మదిగా 4 దశల్లో జరిగింది: తొలి-ప్రాక్-నియాండర్తల్ (మరీన్ ఐసోటోప్ స్టేజ్ - MIS 12 ), ప్రాక్-నియాండర్తల్ (MIS 11 - 9), తొలి నియాండర్తల్ (MIS 7- 5 ), సాంప్రదాయిక నియాండర్తల్ (MIS 4–3). [105]

నియాండర్తల్ - మానవ వేర్పాటుకు సంబంధించి అనేక తేదీలు ఉన్నాయి. ఫ్లోరిస్‌బాడ్ పుర్రె (" హెచ్. హెల్మీ ") ను చివరి ఉమ్మడి పూర్వీకుడుగా భావిస్తూ సుమారు 250,000 సంవత్సరాల క్రితం వేర్పాటు జరిగిందని కొందరు పేర్కొన్నారు. ఈ వేర్పాటు రాతి పనిముట్లను తయారుచేసే లెవల్లోయిస్ సాంకేతికతతో ముడిపడి ఉంది. సుమారు 4,00,000 సంవత్సరాల క్రితం అని, H. హైడెల్బెర్గెన్సిస్‌ను చివరి ఉమ్మడి పూర్వీకుడిగా భావించి చెప్పారు. 6,00,000 సంవత్సరాల క్రితం నాటి " హెచ్. రొడీసియెన్సిస్ " ను చివరి ఉమ్మడి పూర్వీకుడని మరొక భావన ఉంది.దీన్నుండి ఆధునిక మానవ వంశం, నియాండర్తల్ / హెచ్. హైడెల్బెర్గెన్సిస్ వంశాలు వేరుపడ్డాయి. [112] 8,00,000 సంవత్సరాల క్రితం నాటి హెచ్‌. యాంటెసెస్సర్ చివరి ఉమ్మడి పూర్వీకుడని మరొక వాదన. ఈ మోడల్ యొక్క విభిన్న వాదనలు ఈ తేదీని 10 లక్షల సంవత్సరాల క్రితం వరకూ వివిధ తేదీలు చెబుతాయి. [112] [23] డిఎన్‌ఎ అధ్యయనాలు ఈ వేర్పాటుకు వివిధ తేదీలను సూచించాయి: 592–182 వేసంక్రి, [21] 553–321 వేసంక్రి, [113] 654–475 వేసంక్రి, [112] 690–550 వేసంక్రి, [81] 765–550 వేసంక్రి, [23] [81] [23] [101] 800–520 వేసంక్రి, [114] 800 వేసంక్రికి ముందు [22], ఇలాగ.

ఆధునిక మానవులతో పోలిస్తే నియాండర్తళ్ళు, డెనిసోవాన్లు ఒకరితో ఒకరు ఎక్కువ సంబంధం కలిగి ఉన్నారు. అనగా ఆధునిక మానవులతో విడిపోయిన తరువాత నియాండర్తల్ / డెనిసోవన్ ల వేర్పాటు జరిగింది. [115] [101] [23] [100] సంవత్సరానికి 1x10 -9 లేదా 0.5x10 -9 బేస్ పెయిర్ల (బిపి) మ్యుటేషన్ రేటు ఉంటుందని భావిస్తే, నియాండర్తల్ / డెనిసోవన్ ల వేర్పాటు వరుసగా 236-190 వేల సంవత్సరాల క్రితం గానీ 473–381 వేల సంవత్సరాల క్రితం గానీ జరిగి ఉంటుంది. [101] ప్రతి 29 సంవత్సరాలకు కొత్త తరం వస్తుందని భావిస్తూ, ఒక్కో తరానికీ 1.1x10 -8 గా తీసుకుంటే, ఈ వేర్పాటు 744 వేల సంవత్సరాల క్రితం జరిగినట్లు తెలుస్తుంది. సంవత్సరానికి 5x10 -10 న్యూక్లియోటైడ్ సైట్ ప్రకారం చూస్తే ఇది 644 వేల సంవత్సరాల క్రితం అవుతుంది. ఈ చివరి తేదీల ప్రకారం చూస్తే, ఐరోపా అంతటా హోమినిన్లు వ్యాపించిన సమయాని కంటే ముందే వేర్పాటు జరిగింది. నియాండర్తళ్ళకే ప్రత్యేకమైన లక్షణాలు 600-500 వేల సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందడం మొదలైంది. [100]

జన విస్తరణ

రేంజ్

అత్యంత దక్షిణాన ఉన్న నియాండర్తల్ అవశేషాలు ఇజ్రాయెల్ (120-50 వేసంక్రి) లోని తబున్ కేవ్ ఇజ్రాయెల్ మ్యూజియం

ఈమియన్ ఇంటర్‌గ్లేసియల్ (130 వేసంక్రి) కి ముందు జీవించిన తొలి నియాండర్తళ్ళ గురించి పెద్దగా తెలియదు. ఎక్కువగా ఐరోపా స్థలాల్లోనే వీరి ఆధారాలు దొరికాయి. 130 వేసంక్రి నుండి, శిలాజ రికార్డుల నాణ్యత ఒక్కసారిగా పెరిగింది. ఈ తరువాతి నియాండర్తళ్ళ శిలాజాలు పశ్చిమ, మధ్య, తూర్పు, మధ్యధరా ఐరోపాల లోను, [24] అలాగే నైరుతి, మధ్య, ఉత్తర ఆసియా లోను, దక్షిణ సైబీరియాలోని ఆల్టాయ్ పర్వతాల వద్దా లభించాయి.

జనసంఖ్య

ఆధునిక మానవుల మాదిరిగానే, నియాండర్తళ్ళు కూడా చాలా తక్కువ జనాభా నుండి ఉద్భవించి ఉండవచ్చు. ఫలదీకరణ దశలో ఉన్న వ్యక్తుల సంఖ్య సుమారు 3,000 నుండి 12,000 వరకు ఉండవచ్చు. అయితే, నియాండర్తళ్ళ జనాభా ఈ తక్కువ స్థాయిలోనే ఉండిపోయింది, పెరగలేదు. నియాండర్తళ్ళు చిన్న, వివిక్త (ఐసోలేటెడ్), అంతర్గత సంపర్కం జరిపే సమూహాల్లోనే జీవించారు. [116] [100] mtDNA విశ్లేషణను ఉపయోగించి చేసిన వివిధ అధ్యయనాలు విభిన్న జనసంఖ్యలను [65] - సుమారు 1,000 నుండి 5,000 వరకు; [116] 5,000 నుండి 9,000 వరకు ఫలదీకరణ దశలో ఉన్న వ్యక్తులు ఉన్నట్లు - సూచించాయి. [117] కొన్ని అధ్యయనాలు, క్రీస్తుపూర్వం 50,000 వరకు 3,000 నుండి 25,000 వరకు క్రమంగా పెరిగినట్లు, ఆ తరువాత క్షీణించి, అంతరించినట్లు సూచించాయి. [118] ఏదేమైనా, జనాభా తక్కువగా ఉండేదని అందరూ అంగీకరించే విషయమే. [65] ఇది పశ్చిమ ఐరోపాలో నియాండర్తళ్ళ జనాభా, అప్పటి ఆధునిక మానవ జనాభాలో పదోవంతు కంటే తక్కువగా ఉండవచ్చు. [119] పదుల వేల [100] సంఖ్యలో జనాభా ఉన్నట్లు చూపే అంచనాలపై వ్యతిరేక వాదనలున్నాయి. [116] జనాభా స్థిరంగా తక్కువగా ఉండడాన్ని "బోసెరూపియన్ ట్రాప్" వివరిస్తుంది: జనాభాను మోయగలిగే సామర్థ్యం ఆ జనాభా సంపాదించగలిగే ఆహార పరిమాణాన్ని బట్టి పరిమిత మౌతుందు. ఈ ఆహార సంపాదన స్థాయి, ఆ జాతి సాధించిన సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. జనాభా పెరిగే కొద్దీ కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. కానీ జనాభా చాలా తక్కువగా ఉంటే, ఆవిష్కరణలు వేగంగా జరగవు, జనాభా తక్కువ స్థాయిలోనే ఉండి పోతుంది. నియాండర్తళ్ళ రాతి పనిముట్ల సాంకేతికతలో 150 వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ స్తబ్దత, బోసెరూపియన్ ట్రాప్‌కు అనుగుణంగానే ఉంది. [65]

206 నియాండర్తల్‌ల నమూనాలను పరిశీలించినపుడు, వారిలో 20 ఏళ్లకు పైబడిన వారిలో 80% మంది 40 ఏళ్ళ వయస్సు లోపే మరణించారని గమనించారు. ఈ అధిక మరణాల రేటుకు కారణం అధిక ఒత్తిడితో కూడిన పరిస్థితులు కావచ్చు. [66] అయితే, నియాండర్తళ్ళ, సమకాలీన ఆధునిక మానవుల వయస్సు పిరమిడ్లు ఒకటేనని కూడా అంచనా వేసారు. [65] నియాండర్తళ్ళలో శిశు మరణాలు చాలా ఎక్కువగా ఉండేవని అంచనా వేసారు. ఉత్తర యూరేషియాలో ఈ రేటు 43% ఉండేది. [120]

ఐరోపా లోను, లెవాంట్ లోనూ నియాండర్తల్ శిలాజాలను కనుగొన్న స్థలాలు (మ్యాపులో కనబడని ఆసియా ప్రాంతం లోని స్థలాలు: డెనిసోవా గుహ, బిసిటున్ గుహ, ఓబి-రఖ్‌మత్, అంఘిలాక్ గుహ, తెషిక్-తాష్)
[121][79][64][122][123][60][10][124][125][126][127][128]

ఆహారం

వేట, సేకరణ

ఎర్ర జింక, బహుశా నియాండర్తళ్ళకు ఇష్టమైన వేట

నియాండర్తళ్ళు స్కావెంజర్ల [నోట్స్ 1] వలె జీవించేవారని ఒకప్పుడు భావించారు. కాని అవి మాంసాహార గొలుసులో శీర్షాన ఉండేవారని ఇప్పుడు భావిస్తున్నారు. [129] [130] అటవీ వాతావరణంలో నివసించే వీరు, ఆకస్మికంగా దాడి చేసే వేటగాళ్ళు. లక్ష్యానికి కనిపించకుండా నక్కుతూ, బాగా దగ్గరి దాకా వెళ్ళి, హఠాత్తుగా, వేగంగా దాడి చేసి, చాలా దగ్గర నుండి ఈటెతో పొడిచి చంపేవారు. [131] [29] చిన్న జంతువులను, గాయపడిన జంతువులను ఉచ్చుల తోటి, రాళ్ళు విసిరి, లేదా తరిమీ వేటాడేవారు. [131] వారు వివిధ రకాల ఆవాసాలకు అనుగుణంగా మారగలిగారు. [56] [132] 1980 లో, ఛానల్ ఐలాండ్స్‌లోని లా కోట్టే డి సెయింట్ బ్రెలేడ్ వద్ద కనిపించిన రెండు దొంతర్ల మామత్ పుర్రెలే, వాళ్ళు మామత్ లను తరిమి వేటాడేవారని చెప్పేందుకు ఆధారాలని ఊహించారు. [133] అయితే దీన్ని కొందరు వ్యతిరేకించారు. [132]

సాంకేతికత

150 వేల సంవత్సరాల క్రితం నియాండర్తల్ ఆవిష్కరణల్లో స్తబ్దత ఉన్నప్పటికీ, [65] నియాండర్తల్ సాంకేతికత గతంలో అనుకున్నదానికంటే చాలా అధునాతనమైనదని ఆధారాలు ఉన్నాయి. [63] అయితే, అంగవైకల్యం తెచ్చిపెట్టేంతటి గాయాలు తరచూ అవడం వలన చాలా సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాలు ఉద్భవించలేదు. ఎందుకంటే ఒక పెద్ద గాయం అయిన నిపుణుడు కొత్తవారికి తన సాంకేతికతను సమర్థవంతంగా నేర్పించలేడు. [134]

పనిముట్ల తయారీ

ఫ్రాన్సులో లభించిన లెవల్లోయిస్ పాయింటు
లెవల్లోయిస్ సాంకేతికత

నియాండర్తళ్ళు రాతి పనిముట్లు తయారు చేసారు. వాళ్ళు మౌస్టేరియన్ పరిశ్రమకు చెందినవారు. [34] 315 వేల సంవత్సరాల క్రితమే [135] ఉత్తర ఆఫ్రికా లోని హెచ్. సేపియన్లకు కూడా మౌస్టేరియన్ పరిశ్రమతో సంబంధం ఉంది. ఉత్తర చైనా లోనూ 47–37 వేల సంవత్సరాల క్రితం ఈ పరిశ్రమ ఉంది. [136] వారు అవలంబించిన లెవల్లోయిస్ టెక్నిక్‌లో (ఇది కూడా నియాండర్తల్‌లకు మాత్రమే ప్రత్యేకమైనది కాదు) అతి తక్కువ చెకుముకితో ఎక్కువ కట్టింగు ఉపరితలం వచ్చేది. దీన్ని నేర్చుకోవడం కష్టతరమైన ప్రక్రియ కాబట్టి, కేవలం పరిశీలన ద్వారా కాకుండా తరం నుండి తరానికి ఈ సాంకేతికతను నేర్పించి ఉండవచ్చు. [35] వారి వద్ద ఎక్కువ దూరం వేయగల ఆయుధాలు ఉండేవా అనే విషయమై కొంత చర్చ ఉంది. [137] ఓ ఆఫ్రికన్ అడవి గాడిద మెడపై అయిన గాయం లెవల్లోయిస్ మొన ఉన్న ఈటె వలన అయి ఉండవచ్చు. [138] విసిరే అలవాటు కారణంగా జరిగే ఎముక అరుగుదలను నియాండర్తల్స్‌లో గమనించారు. [137] [139]

భాష

లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కేబారా 2 అస్థిపంజరం పునర్నిర్మాణం

నియాండర్తళ్ళు వారి శరీర నిర్మాణం కారణంగా క్వాంటల్ అచ్చులను పలకలేక పోయేవారని ఒకప్పుడు భావించారు. ఆధునిక మానవుల భాషలన్నిటిలోనూ ఈ అచ్చులు ఉన్నాయి. వారిది పెద్ద నోరు. ఈ కారణంగా నోటి లోపల నాలుక మొత్తం పట్టాలంటే, స్వరపేటిక కిందకి ఉండాల్సిన అవసరం లేదు. [140] [141] అయితే, ఇదేమంత సరైన ఊహ కాదు. [142] ఆధునిక మానవులకు ఉన్న స్వర ఉపకరణం, స్వర సంగ్రహాలయం వారి పూర్వీకుడైన హెచ్. హైడెల్బెర్గెన్సిస్‌లోనే ఉన్నాయి. శబ్ద ఉత్పత్తిలో ఉపయోగించే కంఠాస్థి (గొంతులో "యు" ఆకారంలో ఉండే ఎముక, ఇది నాలుకకు ఊతంగా ఉంటుంది. ఇంగ్లీషులో హైయోడ్) మానవుల్లాగే నియాండర్తళ్ళకు కూడా ఉందని 1983 లో కనుక్కున్నాక, వాళ్ళకు మాట్లాడే సామర్థ్యం ఉండేదని తెలిసింది. [64] ఆధునిక మానవులలో శబ్దోత్పాదక శక్తి ఇటీవలే అభివృద్ధి చెందిందనేది చాలా కాలంగా ఉన్న పరికల్పన. [63] నియాండర్తళ్ళలో కంఠాస్థికి వేరే ప్రయోజనం ఉండి ఉండవచ్చని కాగ్నిటివ్ శాస్త్రవేత్త ఫిలిప్ లైబెర్మాన్, వాదించాడు. ఎందుకంటే ఇది నమిలేటపుడూ, నాలుకను కదలించడానికీ కూడా ఉపయోగ పడుతుంది. [140] [141]

నియాండర్తళ్ళ భాష ఎంత సంక్లిష్టంగా ఉండేదో తెలుసుకోవడం చాలా కష్టం. కానీ వాళ్ళు కొంత సాంకేతిక, సాంస్కృతిక సంక్లిష్టతను సాధించారు కాబట్టీ, మానవులతో సంకరం చేసారు కాబట్టీ ఆధునిక మానవులతో పోలిస్తే ఎంతో కొంత సంక్లిష్టత సాధించి ఉంటారనీ భావించవచ్చు. కఠినమైన శీతోష్ణస్థితుల్లో మనుగడ సాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి, స్థలాల గురించి, వేట, సేకరణల గురించీ పనిముట్ల తయారీ పద్ధతులు వంటి అంశాల గురించీ కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత క్లిష్టమైన భాష - బహుశా వాక్యనిర్మాణాన్ని ఉపయోగించడం - వారికి అవసరం. [63] [143] [144]

పరిమితమైన పదాలను ఉపయోగించి అనంతమైన ఆలోచనలను సమర్థవంతంగా రూపొందించగల ఆధునిక మానవుల ఊహా సామర్థ్యం (మానసిక సంశ్లేషణ) నియాండర్తళ్ళకు లేదని న్యూరో సైంటిస్ట్ ఆండ్రీ వైషెడ్స్కీ వాదించాడు. ఇది ప్రవర్తనా ఆధునికత యొక్క లక్షణం, ఇది సుమారు 70,000 సంవత్సరాల క్రితం ("ఎగువ పాతరాతియుగ విప్లవం") మానవుల్లో కనిపించిందని అతను భావించాడు. [145] అయితే, ప్రవర్తనా ఆధునికత 400,000 సంవత్సరాల క్రితమే [146] మొదలైంది. బహుశా ఇది నియాండర్తళ్ళలో కూడా ఉండి ఉండవచ్చు. [147] [144]

మతం

అంత్యక్రియలు

మ్యూసీ డి లా చాపెల్లె-ఆక్స్-సెయింట్స్ వద్ద లా చాపెల్లె-ఆక్స్-సెయింట్స్ 1 సమాధి యొక్క పునర్నిర్మాణం

నియాండర్తళ్ళు మరణించినవారికి సంకేతార్థంలో అంత్యక్రియలు చేసేవారన్న: 158–60  వాదనలకు [107] : 158–60  గట్టి వ్యతిరేకత వచ్చింది. [148] [149] [150] ఖననం ఉద్దేశపూర్వకంగా చేసినట్లు కనబడుతున్నప్పటికీ, మరణానంతర జీవితం గురించిన మత విశ్వాసమేదో అందులో ఇమిడి ఉన్నట్లు ఇది సూచించదు. మరణించిన వారి పట్ల ఉన్న మమకారం లోంచి వెలువడ్డ గొప్ప భావోద్వేగంతో ఖననం చేసి ఉండవచ్చు. [151] లేదా భౌతిక కాయాన్ని జంతువులు తినకుండా నిరోధించడానికి చేసి ఉండవచ్చు. [145]

నైరుతి ఫ్రాన్స్‌లోని ఒక గుహలో ఒక చిన్న, కృత్రిమంగా చేసిన రంధ్రంలో లా చాపెల్లె-ఆక్స్-సెయింట్స్ 1 ను 1908 లో కనుగొన్నప్పటి నుండి నియాండర్తల్ అంత్యక్రియల అలవాటు గురించిన చర్చ చురుకుగా ఉంది. అది సంకేతార్థక ఖననం అని కొందరు చేసిన బాగా వివాదాస్పదమైంది. [152] [148] [153] షానిదార్ గుహ వద్ద ఉన్న మరొక సమాధిలో అనేక పూల పుప్పొడి ఉంది. అవి నిక్షేపణ సమయంలో వికసించినవై ఉండవచ్చు-యారో, సెంటారీ, రాగ్‌వోర్ట్, గ్రేప్ హైసింత్, జాయింట్ పైన్, హోలీహాక్ అనే మొక్కల పూలు కనిపించా యక్కడ. [154] ఆ మొక్కల ఔషధ గుణాలను గమనించిన అమెరికన్ పురావస్తు శాస్త్రవేత్త రాల్ఫ్ సోలెక్కి, ఖననం చేసిన వ్యక్తి నాయకుడో, వైద్యుడో, షామానో అయి ఉండవచ్చని అన్నాడు. [155] అయితే, ఆ పుప్పొడిని ఎలుకల్లాంటివి ఖననం తరువాత చేర్చి ఉండడం కూడా సాధ్యమే. [156]

ముఖ్యంగా పిల్లలు, శిశువుల సమాధుల్లో హస్తకృతులు, ఎముకలు వంటి వస్తువులున్నాయి. లా ఫెర్రాసీకి చెందిన నవజాత శిశువు సమాధిలో మూడు ఫ్లింట్ పారలు కనిపించాయి. సిరియాలోని డెడెరియే గుహలో శిశువు ఛాతీపై త్రిభుజాకార చెకుముకిని ఉంచారు. అముద్ గుహలోని 10 నెలల వయస్సు గల శిశువు వద్ద ఎర్ర జింక దవడ ఉంది. ఇతర జంతువుల అవశేషాలు ఇప్పుడు శకలాలుగా కనిపించాయి. ఉజ్బెకిస్తాన్ లోని టెషిక్-తాష్ 1, ఐబెక్స్ కొమ్ములతో చేసిన వృత్తం, సున్నపురాతి పలక కనిపించాయి. తల కింద ఎత్తు లాగా దీన్ని పెట్టి ఉంటారని భావించారు. [157] ఉక్రెయిన్‌లోని క్రిమియాలోని కిక్-కోబాకు చెందిన ఒక పిల్లవాడి సమాధలో అలంకారం చెక్కిన చెకుముకి పెచ్చు ఉంది. అలా చెక్కడానికి చాలా నైపుణ్యం అవసరం, బహుశా దానికి కొంత సంకేత ప్రాముఖ్యత ఉండి ఉంటుంది. [158] ఏదేమైనా, సమాధి వస్తువుల ప్రాముఖ్యత, విలువ అస్పష్టంగా ఉండి వివాదాస్పదంగా ఉన్నాయి. [157]

జాత్యంతర సంకరం

ఆధునిక మానవులతో సంకరం

ఎగువ పాతరాతియుగపు మానవుడు ఓస్ 2 పునర్నిర్మాణం. సుమారు 7.3% నియాండర్తల్ DNA తో (4-6 తరాల కిందటి పూర్వీకుడు) [159]

మొట్టమొదటి నియాండర్తల్ జన్యు శ్రేణిని 2010 లో ప్రచురించారు. నియాండర్తళ్ళకు, తొలినాళ్ళ ఆధునిక మానవులకూ మధ్య సంతానోత్పత్తి జరిగిందని ఇది గట్టిగా సూచించింది. [67] [160] [161] [72] అన్ని సబ్-సహారా జనాభాల జన్యువులలో నియాండర్తల్ DNA ఉంది. [67] [162] [69] [73] ఎంత నిష్పత్తిలో అనేదానికి వివిధ అంచనాలు ఉన్నాయి: ఆధునిక యూరేషియన్లలో 1–4%, [67] ఆధునిక యూరోపియన్లలో 3.4–7.9%, [163] 1.8–2.4%, ఆధునిక తూర్పు ఆసియన్లలో 2.3–2.6%. [164] ఇంత తక్కువ శాతాలు జాత్యంతర సంకరం అరుదుగా జరిగేదని సూచిస్తాయి. [165] వారసత్వంగా వచ్చిన నియాండర్తల్ జన్యువులో, ఆధునిక యూరోపియన్లలో 25%, ఆధునిక తూర్పు ఆసియన్లలో 32% వరకూ వైరల్ రోగనిరోధక శక్తికి సంబంధించినవి కావచ్చు. [166] మొత్తం మీద, నియాండర్తల్ జన్యువులో సుమారు 20% ఆధునిక మానవ జన్యు కొలనులో మనుగడలో ఉన్నట్లు తెలుస్తుంది. [74]

అయితే, వారి జనాభా తక్కువగా ఉండడం వలన, సహజ ఎంపికలో సమర్థత తగ్గడం వలనా, నియాండర్తళ్ళలో అనేక బలహీనమైన, హానికరమైన ఉత్పరివర్తనాలు చేరుకున్నాయి. ఇవి చాలా పెద్ద మానవ జనాభాలో ప్రవేశించాయి; తొలి సంకర జనాభాకు, సమకాలీన మానవులతో పోలిస్తే శారీరిక దార్ఢ్యత 94% తగ్గి ఉండవచ్చు. ఇదే కొలమానం ప్రకారం, నియాండర్తల్స్ దార్ఢ్యత గణనీయంగా పెరిగి ఉండవచ్చు. [75] టర్కీలోని పురాతన జన్యువులపై 2017 లో చేసిన అధ్యయనంలో ఉదరకుహర వ్యాధి, మలేరియా తీవ్రత, కోస్టెల్లో సిండ్రోమ్‌తో వీటికి సంబంధం ఉందని కనుగొన్నారు. [167] ఏదేమైనా, కొన్ని జన్యువులు ఆధునిక మానవ యూరోపియన్లు పర్యావరణానికి అనుగుణంగా మారటానికి సహాయపడి ఉండవచ్చు; ఎరుపు జుట్టు, తేలికపాటి చర్మంతో ముడిపడివున్న MC1R జన్యువు యొక్క Val92Met వేరియంట్ నియాండర్తల్స్ నుండి వారికి సంక్రమించి ఉండవచ్చు [168] అయితే, ఈ జన్యువు నియాండర్తల్స్‌లో చాలా అరుదుగా ఉన్నందున ఈ భావన ప్రశ్నార్థకంగా ఉంది. [169] పైగా హోలోసీన్ వచ్చేవరకు ఆధునిక మానవులలో తెల్ల చర్మం లేదు. [170]రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన అనేక జన్యువులు - [77] వంటి OAS1, [171] STAT2, [172] TLR6, TLR1, TLR10, [173] రోగనిరోధక ప్రతిస్పందనకు సంబంధించినవీ [76] [e] - ఆధునిక మానవుల్లోకి సంక్రమించినట్లు కనిపిస్తుంది. ఇది వారికి వలసలు పోవడంలో సాయపడి ఉండవచ్చు.

లింకేజ్ డిస్క్విలిబ్రియం మ్యాపింగ్ ప్రకారం, ఆధునిక మానవ జన్యువులోకి చివరి నియాండర్తల్ జన్యు ప్రవాహం 86–37 వేల సంవత్సరాల క్రితం సంభవించింది. కానీ ఇది 65–47 వేల సంవత్సరాల క్రితం జరిగి ఉండడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. [174] అయితే, సుమారు 40 వేల సంవత్సరాల క్రితం నాటి ఆధునిక మానవ శిలాజం ఓస్ 2 లో 6-9% (పాయింట్ అంచనా 7.3%) వరకూ నియాండర్తల్ DNA కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. దీన్ని బట్టి ఆ వ్యక్తికి నియాండర్తల్ పూర్వీకుడు నాలుగు నుండి ఆరు తరాల ముందువారని తెలుస్తుంది. [159] కానీ ఈ సంకర రొమేనియన్ జనాభా అంశ, తరువాతి యూరోపియన్ల జన్యువుల్లో అంతగా ఉన్నట్లు కనిపించడం లేదు. [159]

2016 లో, డెనిసోవా గుహలో లభించిన నియాండర్తల్ శిలాజాల డిఎన్ఎను పరిశీలిస్తే, 1,00,000 సంవత్సరాల క్రితం జాత్యంతర సంపర్కం జరిగినట్లు తేలింది. 1,20,000 సంవత్సరాల క్రితమే అంతకుముందు వలస వచ్చిన హెచ్. సేపియన్లతో వీరు జాత్యంతర సంతానోత్పత్తి చేసినట్లు లెవాంట్ వంటి ప్రదేశాలలో ఆధారాలు లభించాయి. [71] ఆఫ్రికా బయట, తొట్టతొలి H. సేపియన్ అవశేషాలు మిస్లియా గుహలోను (194 - 177 వేల సంవత్సరాల క్రితం) స్ఖూల్, కఫ్జే ల లోనూ (120-90 వేల సంవత్సరాల క్రితం) లభించాయి. [175] అయితే, జర్మని లోని హోలెన్‌స్టెయిన్-స్టేడెల్ గుహలోని నియాండర్తళ్ళ mtDNA ఇటీవలి నియాండర్తల్‌లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. బహుశా 316–219 వేల సంవత్సరాల క్రితాల మధ్య మానవ mtDNA చొరబడడం వల్ల కావచ్చు లేదా అవి జన్యుపరంగా విడిపోయినందు వలన కావచ్చు. [70] ఏది ఏమైనప్పటికీ, ఈ మొదటి సంతానోత్పత్తి సంఘటనల జాడలు ఆధునిక మానవ జన్యువులలో కనబడలేదు. [176]

ఆధునిక జనాభాలో నియాండర్తల్-ఉత్పన్న mtDNA (ఇది తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తుంది) లేకపోవడం వల్ల, [98] [177] [81] ఆధునిక మానవ మగవారితో జతకట్టిన నియాండర్తల్ ఆడవారికి సంతానం అరుదుగా కలిగేదని లేదా అసలే కలగలేదనీ, ఆధునిక మానవ స్త్రీలు నియాండర్తల్ మగవారితో సంతాన ప్రాప్తి పొందారనీ సూచిస్తుంది. [178] [177] [96] [68] ఆధునిక మానవులలో నియాండర్తల్-ఉత్పన్నమైన Y- క్రోమోజోములు లేకపోవడం వల్ల (ఇది తండ్రి నుండి కొడుకుకు సంక్రమిస్తుంది), ఆధునిక జనాభాకు దోహదం చేసిన పూర్వజ సంకర సంతానం ప్రధానంగా ఆడవారని, లేదా నియాండర్తల్ Y- క్రోమోజోమ్ హెచ్. సేపియన్లకు సరిపడక అంతరించిపోయిందని భావించవచ్చు. [179]

జాత్యంతర సంకర సిద్ధాంత వ్యతిరేకులు, జన్యు సారూప్యత అనేది ఉమ్మడి పూర్వీకుల అవశేషం మాత్రమేననీ, దానికి మూలం జాత్యంతర సంతానోత్పత్తి కాదనీ వాదిస్తున్నారు, [180] అయితే, సబ్-సహారా ఆఫ్రికన్లకు నియాండర్తల్ DNA ఎందుకు లేదో వివరించడంలో విఫలమవడం వలన ఈ వాదన తప్పయ్యే అవకాశం ఎక్కువ. [161] మానవ శాస్త్రవేత్త జాన్ డి. హాక్స్, జన్యు సారూప్యతకు ఉమ్మడి వంశపారంపర్యత, జాత్యంతర సంతానోత్పత్తి రెండూ కారణం కావచ్చనీ, వీటిలో ఏ ఒక్కటో మాత్రమే కాదనీ వాదించాడు. [181]

డెనిసోవాన్స్‌తో సంకరం

క్రిస్ స్ట్రింగర్ రూపొందించిన హోమో కుటుంబ వృక్షం. అడ్డు అక్షం భౌగోళిక స్థానాన్ని, నిలువు అక్షం సమయాన్ని (మిలియన్ల సంవత్సరాల క్రితం) సూచిస్తాయి. [f]

ఆధునిక మానవులతో పోలిస్తే నియాండర్తళ్ళు, డెనిసోవాన్లు ఒకరికొకరు దగ్గరి సంబంధం కలిగి ఉన్నారని nDNA నిర్ధారిస్తున్నప్పటికీ, నియాండర్తళ్ళు, ఆధునిక మానవులు మరింత ఇటీవలి mtDNA ఉమ్మడి పూర్వీకులు కలిగి ఉన్నారు. దీనికి బహుశా డెనిసోవాన్లు, కొన్ని తెలియని మానవ జాతుల మధ్య సంతానోత్పత్తి కారణం కావచ్చు. ఉత్తర స్పెయిన్‌లోని సిమా డి లాస్ హ్యూసోస్ లో లభించిన 4,00,000 సంవత్సరాల క్రితం నాటి నియాండర్తల్ లాంటి మానవుల MtDNA ను పరిశీలిస్తే, వారికి నియాండర్తళ్ళతో కంటే డెనిసోవాన్లతోనే ఎక్కువ సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. యురేషియాలో లభించిన ఇదే కాలానికి చెందిన అనేక నియాండర్తల్ లాంటి శిలాజాలను తరచూ హెచ్. హైడెల్బెర్గెన్సిస్ గా వర్గీకరిస్తూంటారు. వీటిలో కొన్ని మునుపటి మానవుల అవశేష జనాభా కావచ్చు, ఇవి డెనిసోవాన్లతో సంకరం జరిపి ఉండవచ్చు. [183] సుమారు 1,24,000 సంవత్సరాల క్రితం నాటి జర్మన్ నియాండర్తల్ నమూనాను వివరించడానికి కూడా ఇది ఉపయోగ పడుతుంది. దీని MtDNA ఇతర నియాండర్తల్‌ల నుండి (సిమా డి లాస్ హ్యూసోస్ మినహా) 2,70,000 సంవత్సరాల క్రితం వేరుపడింది. అయితే దాని జన్యు DNA మాత్రం 1,50,000 సంవత్సరాల క్రితం కన్నా తక్కువ వైవిధ్యాన్ని సూచించింది. [70]

డెనిసోవా గుహలో లభించిన ఒక డెనిసోవన్ జన్యువు సీక్వెన్సింగ్ చేసినపుడు, దాని జన్యువులో 17% నియాండర్తల్ అంశ ఉందని తేలింది. [99] ఈ నియాండర్తల్ డిఎన్‌ఎ క్రోయేషియాలోని విండిజా గుహ లోను, కాకసస్‌లోని మెజ్మైస్కాయ గుహ లోనూ దొరికిన నియాండర్తళ్ళ కంటే, అదే గుహలో లభించిన 120,000 సంవత్సరాల నాటి నియాండర్తల్ ఎముక డిఎన్‌ఎనే ఎక్కువగా పోలి ఉంది. దీన్ని బట్టి సంకరం స్థానికంగానే ఉందని తెలుస్తుంది. [101]

90,000 సంవత్సరాల నాటి డెనిసోవా 11 విషయంలో, ఆమె తండ్రి ఈ ప్రాంతంలోని ఇటీవలి నివాసితులకు సంబంధించిన డెనిసోవన్ అనీ, ఆమె తల్లి క్రొయేషియాలోని విండిజా గుహలోని ఇటీవలి యూరోపియన్ నియాండర్తల్‌లకు సంబంధించిన నియాండర్తల్ అనీ కనుగొన్నారు. తొలి తరానికి చెందిన సంకర సంతతిని కనుగొనడంతో ఈ జాతుల మధ్య సంకరం చాలా సాధారణం అనీ, యురేషియా అంతటా నియాండర్తళ్ళ వలసలు 120,000 సంవత్సరాల క్రితం తరువాత కొంతకాలానికి జరిగాయనీ తెలుస్తుంది. [184]

విలుప్తి

ఉత్తర స్పెయిన్‌లోని ఎబ్రో నదిని వివరంగా చూపే మ్యాప్

నియాండర్తళ్ళు 41,000 - 39,000 సంవత్సరాల క్రితాల మధ్య అంతరించి పోయినట్లు భావిస్తున్నారు. [185] [8] [9] [10] [11] జిబ్రాల్టర్‌లో కొందరు నియాండర్తల్‌లు -జాఫరాయా (30,000 సం.) [186], గోర్హామ్స్ గుహ (28,000 సం) [187] ల లోని వారు- ఆ తరువాత కాలానికి చెందినవారని తేలింది. భౌగోళిక అవరోధంగా ఉన్న ఎబ్రో నది వలన ఐబీరియాలో ఆశ్రయం పొంది ఉండవచ్చనే పరికల్పనకు ఇది దారితీసింది. ఇవి ప్రత్యక్ష డేటింగ్‌ ద్వారా కాకుండా, అస్పష్టమైన హస్తకృతులపై ఆధారపడి ఉన్నందున ఈ తేదీలు తప్పుయి ఉండవచ్చు. [11] యురల్ పర్వతాలలో 34–31 వేల సంవత్సరాల నాటి మౌస్టేరియన్ రాతి పనిముట్లు లభించడం, ఆధునిక మానవులు అప్పటికి ఇంకా ఐరోపా ఉత్తర ప్రాంతాలలో వలస రాకపోవడం వంటి ఆధారాల ప్రకారం అక్కడ ఆ కాలంలో నియాండర్తళ్ళు జీవించి ఉన్నారనే వాదన ఉంది. [188] [189] అయితే, 40,000 సంవత్సరాల క్రితం నాటి ఆధునిక మానవ అవశేషాలు ఉత్తర సైబీరియన్ మామోంటోవయ కుర్యా స్థలంలో లభించాయి. [190]

అంతరించిపోవడానికి కారణం ఏమైనప్పటికీ, 38,000 సంవత్సరాల క్రితం నాటి శిలాజ రికార్డులో మౌస్టేరియన్ రాతి సాంకేతిక పరిజ్ఞానం స్థానంలో ఆధునిక మానవ ఆరిగ్నేసియన్ రాతి సాంకేతిక పరిజ్ఞానం చేరడాన్ని బట్టి, నియాండర్తళ్ళ స్థానాన్ని ఆధునిక మానవులు అక్రమించారని తెలుస్తోంది. [15] 45-43 వేల సంవత్సరాల క్రితం నాటి ఆధునిక మానవ అవశేషాలను ఇటలీ [191], బ్రిటన్, [192] లలో కనుగొన్నారు. ఆధునిక మానవుల ఈ వలసలో వారు నియాండర్తల్‌ల స్థానాన్ని ఆక్రమించారు. [8] గ్రీసు లోని ఎపిడిమా గుహలో లభించిన 2,10,000 సంవత్సరాల క్రితం నాటి పుర్రె శకలాలను, నియాండర్తళ్ళకు చెందినవని భావించిన వాటిని, 2019 లో పునః విశ్లేషణ చేసినపుడు అవి ఒక ఆధునిక మానవుడికి చెందినవని తేలింది. లక్ష సంవత్సరాలక్రితమే హోమో సేపియన్లు నియాండర్తళ్ళతో లైంగికసంపర్కంలో ఉన్నారని DNA ఆధారాలు సూచించాయి. అంటే ఐరోపాలోకి మానవ వలసలు అనేక సార్లు జరిగిందని తెలుస్తోంది. అపిడిమా గుహలో 1,70,000 సంవత్సరాల క్రితం నాటి నియాండర్తల్ పుర్రె లభించింది. దీన్ని బట్టి తొలి వలసల్లో వచ్చిన హెచ్. సేపియన్ల స్థానాన్ని, 40,000 సంవత్సరాల క్రితం హెచ్. సేపియన్లు మళ్ళీ వలస వచ్చే వరకూ, నియాండర్తళ్ళు ఆక్రమించారని ఇది సూచిస్తుంది. [193]

ఆధునిక మానవులు

తొలి ఆధునిక మానవులు నియాండర్తళ్ళ స్థానాన్ని ఆక్రమించడం.

సర్వనాశనం

1911 లో, నియాండర్తళ్ళ స్వాభావిక బలహీనత కారణంగా ఆధునిక మానవులు ఐరోపాను నియాండర్తల్ నుండి బలవంతంగా ఆక్రమించారని సూచించిన మొదటి వ్యక్తి బౌల్. [194] ఈ పొరపాటు భావన [38] [25] [26] దశాబ్దాల పాటు వ్యాప్తిలో ఉంది. మానవ చరిత్రలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన సంస్కృతి (ఆధునిక మానవులు) తక్కువ అభివృద్ధి చెందిన సంస్కృతిని (నియాండర్తల్) కలిసినప్పుడు పోటీలో తొలగిపోవడం తరచూ జరుగుతుందని 1992 లో, జారెడ్ డైమండ్ తన పుస్తకం ది థర్డ్ చింపాంజీలో పేర్కొన్నాడు. [14] అయితే, శిలాజ రికార్డులో నియాండర్తల్, మానవుల మధ్య హింస గురించిన ప్రసక్తి కనిపించలేదు. దీనిని వివరించడానికి, 1999 లో, సైనిక చరిత్రకారుడు అజర్ గాట్, బహిరంగ మారణహోమానికి బదులుగా, ఆధునిక మానవులు బలప్రదర్శన ద్వారా నియాండర్తల్‌లను భయపెట్టి, అనుకూలమైన నివాస స్థానాల నుండి తరిమి కొట్టారని, ఈ ప్రదర్శనలు పనిచేయనప్పుడు వారిని ఊచకోత కోశారనీ అన్నాడు. పరస్పర శాంతియుత సంపర్కాలు జరిగినప్పటికీ, దూకుడుగా ఉండేవే ప్రధానంగా ఉండేవనీ, ఇదే వారి విలుప్తికి దారితీసిందనీ అతడు అన్నాడు. [195]

నియాండర్తల్ / మానవ సంపర్కానికి మొదటి ఆధారం, 2009 లో ఫ్రాన్స్‌లోని ఆధునిక-మానవ-నివాసమైన (ఆరిగ్నేసియన్ సాంకేతిక పరిజ్ఞానం సూచించిన) లెస్ రోయిస్ గుహలో లభించిన యువ నియాండర్తల్‌ కింది దవడ. దీనితో పాటు ఆ గుహలో దొరికిన రెయిన్ డీర్ ఎముకలపై కనిపించిన గాట్ల లాగానే ఉన్న గుర్తులు ఈ దవడపై కూడా కనిపించాయి. మానవుడు నియాండర్తళ్ళను వేటాడడానికి, నియాండర్తల్ తలలను చెక్కి ట్రోఫీలుగా ఉంచుకోడానికి, పూడ్చిపెట్టే ముందు దంతాలను పీకెయ్యడానికీ ఇవి సూచికలు కావచ్చు. ఇతర ఆరిగ్నేసియన్ స్థలాల్లో కూడా చనిపోయాక దంతాలను పీకిన ఆధారాలు ఉండడాన్ని బట్టి (ఇది జరిగింది ఆధునిక మానవులకు) ఈ చివరి దానికే ఎక్కువ సంభావ్యత ఉంది. ఇలా పీకిన దంతాలను బహుశా ఆభరణాలుగా ఉపయోగించి ఉంటారు. [196]

షానిదార్ 3 శిలాజానికి చెందిన నియాండర్తల్ మనిషి ఆయుధంతో పొడిచిన పోటు వలన అయిన గాయం కారణంగా మరణించాడు. ఈ గాయం దూరం నుండి విసరగలిగే, తేలికైన ఆయుధం వలన ఏర్పడింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హెచ్. సేపియన్స్‌కు మాత్రమే ఉండేది. కాబట్టి ఇది నియాండర్తల్, ఆధునిక మానవుల మధ్య జరిగిన హింసకు సూచికగా భావించవచ్చు. [197] అయితే, దిగువ పాతరాతియుగానికి చెందిన షోనింగన్ ఈటెలు [137], నియాండర్తళ్ళకు అయిన గాయాలను గమనిస్తే, వాళ్ళు దూరాన్నుంచి విసిరే ఆయుధాలు వాడడం వారికి అలవాటేనని తెలుస్తుంది. [137] [139]

పోటీ

ఆధునిక మానవుల వ్యాప్తి, నియాండర్తళ్ళ సంకోచం రెండూ పరస్పర సంబంధం కలిగి ఉన్నప్పటికీ, ఆధునిక మానవుల చేతుల్లో అంతమైపోవడం కాక, వాళ్ళతో పోటీ పడి, ఆ పోటీలో నెగ్గలేక పోటీలో లుప్తమై పోవడమనే సిద్ధాంతం ప్రకారం నియాండర్తళ్ళు అంతరించిపోయి ఉండవచ్చు. [13] అయితే, ఆధునిక మానవులు అసలు మానవుల్లేని ఉష్ణమండల ఆసియాలోకి 60,000 సంవత్సరాల క్రితం వలస వెళ్ళారు. ఐరోపా లోకి వారి వలస ఆలస్యంగా జరిగింది. బహుశా అక్కడి శీతల వాతావరణం వలసలను ఆలస్యం చేసినప్పటికీ, అక్కడి నియాండర్తల్ స్థావరాల ఉనికి వలన ఆధునిక మానవులు అక్కడికి వెళ్ళేందుకు వెనకాడి ఉండవచ్చు. [198]

నియాండర్తల్ ఆధునిక ప్రవర్తనను ప్రదర్శించినట్లు అనిపించినప్పటికీ, గడ్డి భూములు, బహిరంగ స్టెప్పీల వ్యాప్తి నియాండర్తళ్ళ (అటవీ వాతావరణానికి ప్రాధాన్యతనిచ్చేవారు) కంటే మానవులకు (గడ్డి భూముల వాతావరణంలో పెరిగినవారు) అనుకూలంగా ఉండేది. [15] ఆధునిక మానవులు, నియాండర్తళ్ళ పోంచోల (తల దూరేందుకు కంత ఉండి దేహంపై వేళ్ళాడే చొక్కా) కంటే వెచ్చదనాన్ని ఇచ్చే, దేహానికి సరిపోయే బట్టలు ధరించి, చల్లటి ప్రాంతాలలోకి చొచ్చుకుపోగలిగారు. [199] ముడి పదార్థాలు, జంతు కళేబరాల ఆధారాలు దక్షిణ కాకసస్‌లో దొరకడాన్ని బట్టి, ఆధునిక మానవులు కరువు కాలంలో దూర ప్రాంతాల్లోని వనరుల గురించి తెలుసుకునేందుకు విస్తృతమైన సామాజిక నెట్‌వర్క్‌లను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. నియాండర్తళ్ళు మాత్రం స్థానిక వనరులకు మాత్రమే పరిమితం అయినట్లు వారి రాతి పనిముట్లు చాలా వరకు 5 కి.మీ. లోపలి భూభాగంలో దొరికే వనరులతోనే తయారు చేసుకోడాన్ని బట్టి తెలుస్తోంది. [38] [200] ఈ శీతోష్ణస్థితి మార్పు వలన అంతకు ముందరి శీత సమయాల్లో లాగానే నియాండర్తళ్ళు అనేక ప్రాంతాలను ఖాళీ చేసి ఉండవచ్చు. కాని ఈ ప్రాంతాల్లో వలస వచ్చిన మానవులు ఆవాసాలు ఏర్పాటు చేకోవడం వలన నియాండర్తల్ విలుప్తికి దారితీసింది. [201]

నియాండర్తల్ విలుప్తిలో ఆధునిక మానవులు కుక్కను మచ్చిక చేసుకోవడం కొంత పాత్ర పోషించి ఉండవచ్చని, దానికంటే ముందే వారు తోడేళ్ళతో సహజీవనం చేయడం మరింత కారణం కావచ్చుననీ మానవ శాస్త్రవేత్త పాట్ షిప్మాన్ సూచించింది. సుమారు 50–45 వేలఏళ్ళ క్రితమే, ఆధునిక మానవులు తమ కంటి తెల్లగుడ్డు ద్వారా తోడేళ్ళతో ప్రభావవంతమైన మౌఖికేతర భాషించ గలిగారని, ఇది ఆధునిక మానవులకు వేటలో ఉపయోగపడిందనీ ఆమె పేర్కొంది. మిగతా జంతు ప్రపంచం మాదిరిగానే నియాండర్తల్ కళ్ళలో కూడా స్ఫుటమైన తెల్లగుడ్డు లేదని కూడా ఆమె పేర్కొంది. [57] : 214–226

వాతావరణ మార్పు

నియాండర్తl విలుప్తి అతి శీతల కాలం మొదలైనప్పుడు సంభవించింది. దీన్ని బట్టి, వారి విలుప్తికి వాతావరణ మార్పు ప్రధాన కారణం కావచ్చని ప్రతిపాదించారు. వారి జనాభా బాగ తక్కువగా ఉండటాన, పర్యావరణ మార్పులు వారి మనుగడలో గానీ, సంతానోత్పత్తిలో గానీ కొద్దిపాటి తగ్గుదల కలగజేసినా, వారు త్వరగా అంతరించిపోవడానికి దారితీస్తుంది. [202] వారి అంతిమ విలుప్తి తీవ్రమైన చలి, పొడి వాతావరణ కాలమైన హీన్రిచ్ ఈవెంట్ 4 సమయంలో జరిగింది. ఈ కాలంలో, వారికి అలవాటైన అటవీ ప్రాంతం నశించి, స్టెప్పీ భూములు ఉద్భవించాయి. ఆ తరువాత ఏర్పాడిన హెన్రిచ్ ఘటనల్లో కూడా యూరోపియన్ మానవ జనాభాలు కుప్పకూలాయి. [16] [17]

కాంపానియన్ ఇగ్నింబ్రైట్ విస్ఫోటనం నుండి వెలువడ్డ బూడిద మేఘపు గ్రాఫిక్

అంతరించిపోయిన సమయంలోనే, సుమారు 40,000 సంవత్సరాల క్రితం, ఇటలీలోని కాంపానియన్ ఇగ్నింబ్రైట్ విస్ఫోటనం చెందింది. దీనివలన, ఒక సంవత్సరం పాటు ఉష్ణోగ్రతలు 2 నుండి 4 ° C పడిపోయాయి. చాలా సంవత్సరాల పాటు ఆమ్ల వర్షాలు కురిసాయి. అప్పటికే ఇతర కారణాల వలన తగ్గిపోతూ ఉన్న నియాండర్తల్ జనాభా, ఈ విస్ఫోటనంతో పూర్తిగా అంతరించిపోయి ఉండవచ్చు. [18] [203]

వ్యాధి

ఆధునిక మానవులు ఆఫ్రికా నుండి కొత్త వ్యాధులను నియాండర్తళ్ళకు అంటించి ఉండవచ్చు. అవి కూడా వారు అంతరించిపోవడానికి దోహదం చేసి ఉండవచ్చు. రోగనిరోధక శక్తి లేకపోవడం వలన, ఇప్పటికే తక్కువ జనాభా వలనా ఈ రోగాల దెబ్బ నియాండర్తల్ జనాభాకు వినాశకరంగా పరిణమించి ఉండవచ్చు. జన్యు వైవిధ్యం తక్కువగ ఉండడం వలన కూడా ఈ కొత్త వ్యాధుల పట్ల సహజ రోగనిరోధక శక్తి కలిగిన నియాండర్తళ్ళు తక్కువగా ఉండి ఉండవచ్చు. [20]

తక్కువ జనాభా, సంతానోత్పత్తి మాంద్యం జనన లోపాలకు కారణమై, వారి క్షీణతకు దోహదం చేసి ఉండవచ్చు. [204]

20 వ శతాబ్దం చివరలో, న్యూ గినియాలో, ఉత్సవాల్లో నరమాంస భక్షణ చేసిన కారణంగా, ట్రాన్స్మిసిబుల్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫలోపతిస్ (కురు) అని వ్యాధి వచ్చి జనాభా నశించిపోయింది. మెదడు కణజాలంలో కనిపించే ప్రయాన్‌లను తినడం వలన ఈ వ్యాధి వచ్చింది. అయితే, పిఆర్ఎన్పి జన్యువు యొక్క 129 వేరియంట్ ఉన్న వ్యక్తులు సహజంగా ప్రయాన్లకు రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. నియాండర్తళ్ళలో నరమాంస భక్షణ చేసిన దృష్టాంతాలు ఉన్నందున, ఆధునిక మానవులు, నియాండర్తల్‌ల మధ్య కురు లాంటి వ్యాధి వ్యాపించి ఉండవచ్చు. అప్పటికే నియాండర్తల్ జనాభా తక్కువగా ఉన్న కారణంగా సహజ రోగనిరోధక శక్తి కలిగినవారు బాగా తక్కువగా ఉండి, చాలా త్వరగా ఈ వ్యధికి బలయ్యారు. [19] [205] [206]

ఇవి కూడా చూడండి

నోట్స్

మరింత చదవడానికి

  • Reich, David (2018). Who We Are And How We Got Here – Ancient DNA and the New Science of the Human Past. Pantheon Books. ISBN 978-1101870327.
  • Diamond, Jared (ఏప్రిల్ 20, 2018). "A Brand-New Version of Our Origin Story". The New York. Retrieved ఏప్రిల్ 23, 2018.
  • Derev'anko, Anatoliy P.; Powers, William Roger; Shimkin, Demitri Boris (1998). The Paleolithic of Siberia: new discoveries and interpretations. Novosibirsk: Institute of Anthropology. ISBN 978-0-252-02052-0. OCLC 36461622.
  • Lunine, Jonathan I. (2013). Earth: Evolution of a Habitable World. Cambridge University Press. 327. ISBN 978-0-521-85001-8.
  • Vattathil, S.; Akey, J.M. (2015). "Small amounts of archaic admixture provide big insights into human history". Cell. 163 (2): 281–84. doi:10.1016/j.cell.2015.09.042. PMID 26451479.
  • Wild, Eva M.; Teschler-Nicola, Maria; Kutschera, Walter; Steier, Peter; Trinkaus, Erik; Wanek, Wolfgang (2005). "Direct dating of Early Upper Palaeolithic human remains from Mladeč". Nature. 435 (7040): 332–35. Bibcode:2005Natur.435..332W. doi:10.1038/nature03585. PMID 15902255.
  • Zilhão, João; Davis, Simon J. M.; Duarte, Cidália; Soares, António M. M.; Steier, Peter; Wild, Eva (2010). Hawks, John (ed.). "Pego do Diabo (Loures, Portugal): Dating the Emergence of Anatomical Modernity in Westernmost Eurasia". PLOS ONE. 5 (1): e8880. Bibcode:2010PLoSO...5.8880Z. doi:10.1371/journal.pone.0008880. PMC 2811729. PMID 20111705.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)

బయటి లింకులు

నోట్స్

మూలాలు