బాంబే జయశ్రీ

"బాంబే" జయశ్రీ రామనాథ్ ఒక భారతీయ సంగీత విద్వాంసురాలు. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో అనేక సినిమా పాటలను పాడింది. సంగీతకారుల కుటుంబంలో జన్మించిన జయశ్రీ వారి వంశంలో నాలుగవ తరానికి చెందిన గాయనీమణి. లాల్గుడి జయరామన్, టి.ఆర్.బాలమణి,[1][2] [3]ల వద్ద శిష్యరికం చేసిన ఈమెకు 2021 వ సంవత్సరానికి భారత నాల్గవ పెద్ద పౌరపురస్కారం పద్మశ్రీ[4][5] లభించింది.

బాంబే జయశ్రీ
బాంబే జయశ్రీ
జననం
జయశ్రీ

(1962-11-30) 1962 నవంబరు 30 (వయసు 61)
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థఆర్.ఎ.పొద్దార్ కాలేజ్
వృత్తి
  • గాయని
  • సంగీతజ్ఞురాలు
  • ఉపాధ్యాయిని
క్రియాశీల సంవత్సరాలు1982–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కర్ణాటక సంగీతం
తల్లిదండ్రులుఎన్.ఎన్.సుబ్రమణ్యం
సీతా లక్ష్మి
పురస్కారాలు
సన్మానాలు
సంగీత ప్రస్థానం
సంగీత శైలి
వాయిద్యాలుగాత్రం, వీణ

తొలి జీవితం, శిక్షణ

కలకత్తాలో జన్మించిన జయశ్రీ కర్ణాటక సంగీతాన్ని తొలుత తన తల్లిదండ్రులు సీతాలక్ష్మి సుబ్రమణియన్, ఎన్.ఎన్.సుబ్రమణియన్‌ల వద్ద నేర్చుకుంది. తర్వాత లాల్గుడి జయరామన్, టి.ఆర్.బాలమణి[6] ల వద్ద శిక్షణ పొందింది. జి.ఎన్.దండపాణి అయ్యర్ వద్ద వీణావాయిద్యం నేర్చుకుంది.

ఈమె హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని కె.మహావీర్ జైపూర్‌వాలె, అజయ్ పొహంకర్‌ల వద్ద నేర్చుకుంది.[7] గంధర్వ మహావిద్యాలయ, ఢిల్లీ నుండి భారతీయ సంగీతంలో డిప్లొమా పొందింది.

ముంబైలోని శ్రీ రాజరాజేశ్వరి భరతనాట్య కళామందిర్‌కు చెందిన కె.కళ్యాణసుందరం పిళ్ళై అనే గురువు వద్ద భరతనాట్యాన్ని అభ్యసించింది. ముంబైలో అమెచ్యూర్ డ్రమెటిక్ క్లబ్ ద్వారా నాటకరంగంలో కూడా ప్రవేశించింది.

ఈమె ముంబై శివారు ప్రాంతమైన చెంబూరులోని సెయింట్ ఆంథోని హైస్కూలులో మాధ్యమిక విద్య చదివి, ఆర్.ఎ.పోద్దర్ కాలేజీ నుండి వాణిజ్య, ఆర్థిక శాస్త్రాలలో పట్టభద్రురాలైంది.

సంగీత ప్రస్థానం

జయశ్రీ తన మొదటి సంగీత కచేరీని 1982లో ఇచ్చింది. అది మొదలు ఈమె భారతదేశంలోని పలుప్రాంతాలలోను, 35 ప్రపంచ దేశాలలోను తన ప్రదర్శనలు ఇచ్చింది. భారతదేశంలోని అన్ని సంగీతోత్సవాలలో పాల్గొన్నది. ఆకాశవాణి సంగీత సమ్మేళనాలలో భాగం వహించింది. ఈమె దేశంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడి విద్యార్థులకు భారతీయ సంగీతం గురించి వందలకొద్దీ ప్రసంగాలు చేసి వారికి శాస్త్రీయ సంగీతాన్ని పరిచయం చేసింది.

ఈమె రోను మజుందార్ [8] శుభ ముద్గల్,,[9] విశ్వమోహన్ భట్, గౌరవ్ మజుందార్ వంటి హిందుస్తానీ గాయకులతో జగల్‌బందీ కచేరీలను చేసింది. లీలా శామ్‌సన్, చిత్రావిశ్వేశ్వరన్, అలర్మెల్ వల్లి, ప్రియదర్శిని గోవింద్,[10] శోభన వంటి నాట్యకళాకారిణులకు గాత్రాన్ని అందించింది.

ఈమె కర్ణాటక విద్వాంసులు టి.ఎం.కృష్ణ, జయంతి కుమరేష్[11], అభిషేక్ రఘురామ్‌ వంటి వారితో కలిసి సంగీత కచేరీలు చేసింది.

అనేక సంగీతరీతుల పట్ల ఉన్న ఆసక్తితో జయశ్రీ ప్రపంచంలోని వివిధ గాయకులతో కలిసి ఆల్బమ్‌లు చేసింది. ఈజిప్షియన్ గాయకుడు హిషమ్‌ అబ్బాస్, సింహళ గాయకుడు తియోన్ సెక్ వంటి కళాకారులతో కలిసి పాడింది. ఫిన్‌లాండ్‌కు చెందిన ఈరో హమీన్నియెమితో ఫిన్నిష్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాలో పనిచేసింది.

ఈమె కాళిదాసు మేఘదూతాన్ని సంగీత నృత్య రూపకంగా మలిచి శీజిత్ నంబియార్, పార్వతీ మేనన్‌లతో ప్రదర్శన చేయించింది. చిత్రావిశ్వేశ్వరన్ నాట్యం చేసిన మీరా నృత్య రూపకానికి కూడా సంగీతం సమకూర్చింది. శిలప్పదికారమ్‌ను నృత్య రూపకంగా మలిచి సంగీతాన్ని సమకూర్చింది.

సినిమా సంగీతం

ఈమె తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో పాటలను పాడింది. ఎం.ఎస్.విశ్వనాథన్, ఇళయరాజా, ఎ.ఆర్.రహమాన్, యువన్ శంకర్ రాజా, హారిస్ జయరాజ్, ఎం.ఎం.కీరవాణి, ఆర్.పి.పట్నాయక్, హరిహరన్ వంటి సంగీత దర్శకుల క్రింద పాటలను పాడింది. లైఫ్ ఆఫ్ పై చిత్రంలో పై జోలపాటకు సాహిత్యాన్ని అందించింది. ఈ జోలపాట 2012 ఆస్కార్ అవార్డుకు ఉత్తమ ఒరిజినల్ పాట కేటగరీలో నామినేట్ అయ్యింది. కేరళ కేఫ్ అనే సినిమాలో ఒక పాటకు సంగీతం సమకూర్చింది.

ఈమె పాడిన తెలుగు సినిమాపాటల జాబితా:

సంవత్సరంసినిమాపాటసంగీత దర్శకుడుసహ గాయకులు
1997 ఇద్దరు" శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా"ఎ.ఆర్.రెహమాన్ఉన్ని కృష్ణన్
1998ప్రియురాలు"రాణి లలిత ప్రియనాదమ్"ఇళయరాజాకె. ఎస్. చిత్ర, మనో
2001చెలి"మనోహరా"హారిస్ జయరాజ్
మజ్ను"తొలివలపా"హరీష్ రాఘవేంద్ర
2002శ్రీరామ్"తీయ తీయని కలలను"ఆర్. పి. పట్నాయక్సోలో
2004మార్నింగ్ రాగా"మహాగణపతిమ్"మణిశర్మ/అమిత్ హెరి
"జగదాధారణ"నందినీ శ్రీకర్
2005 గజినీ "హృదయం ఎక్కడున్నదీ హృదయం ఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ"హారిస్ జయరాజ్హరీష్ రాఘవేంద్ర
ప్రేమికులు"ఆమని కోయిలనై"సాజన్ మాధవ్సోలో
2006అమ్మ చెప్పింది"ఎవరేమైనా అననీ"ఎం. ఎం. కీరవాణి
"ఎంతో దూరం"
జలకాంత"ఉలికే ఓ చిలకే"హారిస్ జయరాజ్కార్తీక్
రాఘవన్"బాణం వేశాడే"హరీష్ రాఘవేంద్ర
"మాయ మొదలాయే"
200816 డేస్"అంటి పెట్టుకుందునా"ధరణ్హరిచరణ్
నేను మీకు తెలుసా"ఎందుకో మది నమ్మదే ఇది ముందున్నది నిజమంతా నిజమే అన్న సంగతి"అచ్చుహేమచంద్ర
సెల్యూట్"ముద్దుల ముద్దుల"హారిస్ జయరాజ్బలరామ్‌, సునీతా సారథి
2009ఈనాడు"ఈనాడు ఈ సమరం"శ్రుతి హాసన్కమల్ హాసన్
2011రంగం"ఈ మంచుల్లో"హారిస్ జయరాజ్శ్రీరామ్‌ పార్థసారథి
2012తుపాకీ"వెన్నెలవే "హరిహరన్
2013ఇంటింటా అన్నమయ్య"కమలాసన"ఎం. ఎం. కీరవాణి
2015నేనే "నిన్నింక చూడవు"హారిస్ జయరాజ్కార్తీక్, ఎన్.ఎస్.కె.రమ్య
2016దృశ్యకావ్యం"నానాటి బ్రతుకు నాటకము"ప్రణాం కమలాకర్
పోలీసోడు"నీలి కన్నుల"జి.వి.ప్రకాష్ కుమార్
2018సాక్ష్యం"శివమ్‌ శివమ్‌"హర్షవర్ధన్ రామేశ్వర్
"తత్ర గండ"
2019సర్వం తాళ మయం"మాకేలరా విచారము"ఎ.ఆర్.రెహమాన్
డియర్ కామ్రేడ్"ఓ కలల కథల"జస్టిన్ ప్రభాకరన్విజయ్ యేసుదాస్
మమంగం"లాలిపాట"ఎం.జయచంద్రన్

పురస్కారాలు, గుర్తింపులు

  • 2021 - భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం[12][13]
  • 2020 - నేచురల్స్ సంస్థ 20వ వార్షికోత్సవం సందర్భంగా అలర్మేల్ వల్లి, సుహాసిని మణిరత్నంలతో కలిసి ట్రూ బ్యూటీ రికగ్నిషన్ అవార్డు.
  • 2020 - మమంగం చిత్రానికి ఆసియా నెట్ ఉత్తమ నేపథ్యగాయని అవార్డు.
  • 2019 – చౌడయ్య మెమోరియల్ హాల్, బెంగళూరు వారి అకాడమీ ఆఫ్ మ్యూజిక్ - చౌడయ్య అవార్డ్ 2019
  • 2019 – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే "మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్"[14]
  • 2019 – శ్రీరామ సేవామండలి, బెంగళూరు వారిచే "రామ గాన కళాచార్య" బిరుదు.
  • 2015 – శ్రీరామ లలితకళా మందిర, బెంగళూరు వారిచే "సంగీత వేదాంత ధురీణ" బిరుదు.
  • 2015 – కళాసాగరం, హైదరాబాదు వారిచే "సంగీత కళాసాగర" బిరుదు.
  • 2014 – ఆల్ సిలోన్ కంబన్ కళకం, శ్రీలంక వారిచే "కంబన్ పుగళ్" అవార్డు.
  • 2013 – 4వ ఇందిరా శివశైలం ఎండోమెంట్ మెడల్ అవార్డు.
  • 2013 – లైఫ్ ఆఫ్ పై చిత్రంలోని లాలిపాటకు ఉత్తమ ఒరిజినల్ పాట కేటగరీలో ఆస్కార్ అవార్డు కోసం ప్రతిపాదన.[15][16][17]
  • 2012 – శ్రీత్యాగ గాన సభ వారిచే "వాణీ కళాసుధాకర" బిరుదు.
  • 2011 – నాదసుధ, వెలచేరి వారిచే "నాద రత్న" అవార్డు.
  • 2011 – భారత్ కళాకార్ సంస్థచే "సంగీత విశ్వకళాభారతి".
  • 2009 – మదర్ థెరెసా మహిళా విశ్వవిద్యాలయం, కొడైకెనాల్ వారిచే గౌరవ డాక్టరేట్.
  • 2009 – సౌత్ ఇండియా కల్చరల్ అసోసియేషన్(SICA) వారిచే"సంగీత సరస్వతి" బిరుదు.
  • 2008 – ధూమ్‌ధామ్‌ సినిమాకు విజయ్ ఉత్తమ నేపథ్యగాయని పురస్కారం.
  • 2007 – శ్రీ పార్థసారథి స్వామి సభ, చెన్నై వారిచే "సంగీత కళాసరస్వతి" అవార్డు.
  • 2007 – తమిళనాడు ప్రభుత్వంచే"కళైమామణి" బిరుదు.
  • 2006 – షణ్ముఖానంద సభ, ముంబై వారిచే "షణ్ముఖ సంగీత శిరోమణి" బిరుదు.
  • 2006 – నేదునూరి కృష్ణమూర్తి చేతుల మీదుగా విశాఖ మ్యూజిక్ అకాడమీ, విశాఖపట్నం వారిచే "ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పురస్కారం"
  • 2005 – గజని చిత్రానికి ఉత్తమ నేపథ్యనాయనిగా తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డు.
  • 2005 – శ్రీకృష్ణ గానసభ, చెన్నై వారిచే లాల్గుడి జయరామన్ సమక్షంలో "సంగీత చూడామణి" అవార్డు.[18]
  • 2003 – టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, వారణాశి వారిచే "ఆత్మ వాణిశ్రీ" బిరుదు.
  • 2002 – రాజలక్ష్మి ఫైన్ ఆర్ట్స్, కొయంబత్తూరు వారిచే 'మణి మకుటం'.
  • 2002 – కల్కి కృష్ణమూర్తి ట్రస్ట్ తరఫున "కల్కి అవార్డు".
  • 2001 – మిన్నలె చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తమిళ సినిమా మహిళా నేపథ్యగాయని
  • 2001 – షణ్ముఖానంద సంగీత్య సభ, న్యూఢిల్లీ వారిచే "నాద భూషణం" బిరుదు.
  • 2001 – శృంగేరి శారదా పీఠము వారి ఆస్థాన విదుషీమణి.
  • 1997 – కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ వారిచే "ఇసై పెరొలి".
  • 1992 – భారత్ కళాకార్, చెన్నై వారి "యువకళాభారతి"

వివాదాలు

2012లో ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయబడిన లైఫ్ ఆఫ్ పై సినిమాలోని లాలిపాటను జయశ్రీ 18వ శతాబ్దానికి చెందిన మలయాళ కవి ఇరాయిమ్మన్ తంపి వ్రాసిన లాలిపాట నుండి కాపీ చేసిందని తంపి వారసులు, తంపి స్మారక ట్రస్టు సభ్యులు ఆరోపించారు.[19]ఈమె ఆ లాలిపాటను 2001లో తన ఆల్బమ్‌ "వాత్సల్యం"లో పాడింది.[20]

మూలాలు

బయటి లింకులు