గ్రీన్‌హౌస్ వాయువు

గ్రీన్‌హౌస్ వాయువు ఉష్ణ పరారుణ పరిధి లోపల రేడియేషను శక్తిని గ్రహించి, విడుదల చెయ్యగల వాయువు. గ్రీన్‌హౌస్ వాయువులు గ్రహాలపై గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని కలిగిస్తాయి. [1] భూ వాతావరణంలో ప్రాథమిక గ్రీన్‌హౌస్ వాయువులు నీటి ఆవిరి (H 2 O), కార్బన్ డయాక్సైడ్ (CO2), మీథేన్ (CH4), నైట్రస్ ఆక్సైడ్ (N2O), ఓజోన్ (O3) లు. గ్రీన్‌హౌస్ వాయువులు లేకపోతే, భూ ఉపరితలపు సగటు ఉష్ణోగ్రత ఇప్పుడున్న 15 oC కాకుండా, [2][3] -18 oC ఉండి ఉండేది. [4] శుక్రుడు, అంగారకుడు, టైటన్ ల వాతావరణాలలో కూడా గ్రీన్‌హౌస్ వాయువులు ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం ప్రారంభం నుండి (1750 ప్రాంతాల్లో) మానవ కార్యకలాపాల వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత పెరుగుతూ వచ్చింది. 1750 లో 280 పిపిఎమ్ ఉన్న సాంద్రత 2019 లో 415 పిపిఎమ్ వరకు, 45%, పెరిగింది. [5] ఇంత అధిక స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత ఎప్పుడో 30 లక్షల సంవత్సరాల క్రితం ఉండేది. ఆ తరువాత ఎప్పుడూ ఇంత ఎక్కువ స్థాయిలో లేదు [6] కార్బన్ చక్రంలో ఉండే వివిధ ప్రకృతి సహజ "సింక్‌లు" ఈ ఉద్గారాలలో సగానికి పైగా పీల్చేసుకున్నప్పటికీ ఈ పెరుగుదల సంభవించింది. [7] [8] మానవజనిత కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో ఎక్కువ భాగం శిలాజ ఇంధనాలను దహనం చెయ్యడం వలన వచ్చినదే. వాటిలో ముఖ్యమైనవి: బొగ్గు, చమురు, సహజ వాయువు. అటవీ నిర్మూలన, భూ వినియోగంలో మార్పులు, నేల కోత, వ్యవసాయం (పశువులతో సహా) నుండి వెలువడే కార్బన్ డయాక్సైడు పైవాటికి తోడౌతుంది. [9] [10] మానవజనిత మీథేన్ ఉద్గారాలకు ప్రధాన వనరులు జంతు వ్యవసాయం, తరువాత గ్యాస్, చమురు, బొగ్గు, ఇతర పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు, ఘన వ్యర్థాలు, మురుగునీరు, వరి ఉత్పత్తి. [11] ప్రస్తుత ఉద్గారాల స్థాయి ఇలాగే కొనసాగితే, 2036 నాటికి ఉష్ణోగ్రతలు 2°C పెరుగుతాయి. "ప్రమాదకరమైన" స్థాయిలను నివారించాలంటే ఈ స్థాయిని దాటకూడదని వాతావరణ మార్పుపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (IPCC) చెప్పింది

గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల భూమి ఉపరితలంపై గ్రీన్‌హౌస్ ప్రభావం

భూ వాతావరణంలో వాయువులు

గ్రీన్‌హౌసేతర వాయువులు

భూ వాతావరణంలో ప్రధాన భాగాలైన నత్రజని (N
2
) (78%), ఆక్సిజన్ (O
2
) (21%), ఆర్గాన్ (Ar) (0.9%) లు గ్రీన్‌హౌస్ వాయువులు కావు. ఒకే మూలకానికి చెందిన రెండు అణువులను కలిగి ఉన్న N
2
, O
2
వంటి మోలిక్యూళ్ళు కంపించేటప్పుడు వాటి విద్యుత్ చార్జీల పంపిణీలో నికరంగా మార్పేమీ ఉండదు. Ar వంటి మోనో అటామిక్ వాయువులకు వైబ్రేషనల్ మోడ్‌లు లేవు. అందువల్ల వాటిని పరారుణ వికిరణం ఏమాత్రం ప్రభావితం చెయ్యలేదు. కార్బన్ మోనాక్సైడ్ (CO), హైడ్రోజన్ క్లోరైడ్ (HCl) వంటి విభిన్న మూలకాలకు చెందిన రెండు అణువులను కలిగి ఉన్న కొన్ని మోలిక్యూళ్ళు పరారుణ వికిరణాన్ని గ్రహిస్తాయి గానీ, ఈ అణువులు వాటి రియాక్టివిటీ లేదా ద్రావణీయత కారణంగా వాతావరణంలో చాలా తక్కువ కాలం ఉంటాయి. అందువల్ల, అవి గ్రీన్‌హౌస్ ప్రభావానికి పెద్దగా దోహదం చేయవు. గ్రీన్‌హౌస్ వాయువుల గురించి చర్చించేటప్పుడు వాటిని పక్కన పెడుతూంటారు.

గ్రీన్‌హౌస్ వాయువులు

వివిధ తరంగదైర్ఘ్యాల వద్ద విద్యుదయస్కాంత తరంగాల వాతావరణ శోషణ, వికీర్ణం. కార్బన్ డయాక్సైడ్ యొక్క అతిపెద్ద శోషణ బ్యాండ్ భూమి నుండి ఉష్ణ ఉద్గారంలో గరిష్టానికి పెద్ద దూరంలో ఏమీ లేదు.

గ్రీన్‌హౌస్ వాయువులు భూమి విడుదల చేసే తరంగదైర్ఘ్యం పరిధిలో పరారుణ వికిరణాన్ని గ్రహిస్తాయి, విడుదల చేస్తాయి.[12] కార్బన్ డయాక్సైడ్ (0.04%), నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, ఓజోన్ లు కొద్ది మోతాదులో ఉండే వాయువులు. ఇవన్నీ కలిసి భూ వాతావరణంలో 0.1% మాత్రమే ఉంటాయి. కానీ పెద్దయెత్తున గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని కలిగిస్తాయి.

గ్రీన్‌హౌస్ వాయువుల్లో భూ వాతావరణంలో అత్యంత సమృద్ధిగా లభించేవి, అవరోహణ క్రమంలో:

వనరులకూ (మానవ కార్యకలాపాల నుండి, సహజ వ్యవస్థల నుండీ వాయువు వెలువడడం) సింకులకూ (వాయువు వేరే రసాయన సమ్మేళనంగా మారడం వలన, లేదా నీటిలో కరగడం ద్వారా తగ్గుతుంది) మధ్య సమతుల్యతను వాతావరణంలో వివిధ వాయువుల సాంద్రతలు ఉంటాయి. వెలువడిన ఉద్గారానికి, ఒక నిర్దుష్ట సమయం తరువాత వాతావరణంలో మిగిలి ఉన్న ఉద్గారానికీ మధ్య ఉండే నిష్పత్తిని "ఎయిర్‌బోర్న్ ఫ్రాక్షన్" (AF) అంటారు. వార్షిక ఎయిర్‌బోర్న్ ఫ్రాక్షన్ అంటే సంవత్సరంలో వెలువడిన మొత్తం ఉద్గారాలకూ, ఆ సంవత్సరంలో పెరిగిన పరిమాణానికీ ఉన్న నిష్పత్తి. 2006 నాటికి CO2 ఎయిర్‌బోర్న్ ఫ్రాక్షన్ సుమారు 0.45. 1959-2006 మధ్య కాలంలో వార్షిక ఎయిర్‌బోర్న్ ఫ్రాక్షన్ సంవత్సరానికి 0.25±0.21 % చొప్పున పెరిగింది. [13]

పరోక్ష రేడియేటివ్ ప్రభావాలు

ఈ చిత్రంలోని ఫాల్స్ రంగులు దిగువ వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ సాంద్రతలను సూచిస్తాయి, ఇవి 390 పార్ట్స్ పర్ బిలియన్ (ముదురు గోధుమ పిక్సెల్‌లు) నుండి, 220 పార్ట్స్ పర్ బిలియన్ (ఎరుపు పిక్సెల్‌లు) వరకు, 50 పార్ట్స్ పర్ బిలియన్ (నీలం పిక్సెల్‌లు) వరకూ ఉంటాయి. [14]

కొన్ని వాయువులు పరోక్ష రేడియేటివ్ ప్రభావాలను కలిగి ఉంటాయి (అవి గ్రీన్‌హౌస్ వాయువులు అయినా, కాకపోయినా). ఇది రెండు ప్రధాన మార్గాల్లో జరుగుతుంది. ఒక మార్గం ఏమిటంటే అవి వాతావరణంలో విచ్ఛిన్నమైనప్పుడు ఒక గ్రీన్‌హౌస్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ (CO) లు ఆక్సీకరణం చెంది, కార్బన్ డయాక్సైడ్ ను వెలువరిస్తాయి (మీథేన్ ఆక్సీకరణలో నీటి ఆవిరి కూడా ఉత్పత్తి అవుతుంది). CO, CO2 గా ఆక్సీకరణ చెందే క్రమంలో రేడియేటివ్ వత్తిడిలో స్పష్టమైన పెరుగుదల ఏర్పడుతుంది.

వాతావరణంలో ఈ వాయువులు జరిపే రసాయనిక చర్యల వలన గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతలు మారినప్పుడు రెండవ రకమైన పరోక్ష ప్రభావం జరుగుతుంది. ఉదాహరణకు, వాతావరణంలో మీథేనేతర అస్థిర సేంద్రియ సమ్మేళనాలు (నా మీథేన్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ - NMVOC లు) నాశనం అయ్యే క్రమంలో ఓజోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ పరోక్ష ప్రభావపు పరిమాణం - వాయువు ఎక్కడ విడుదలైంది, ఎప్పుడు విడుదలయింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. [15]

CO2 ను వెలువరించడంతో పాటు, మీథేన్ కొన్నిపరోక్ష ప్రభావాలను కూడా కలిగిస్తుంది. వాతావరణంలో మీథేన్‌తో చర్య జరిపే ప్రధాన రసాయనం హైడ్రాక్సిల్ రాడికల్ (OH). కాబట్టి, మీథేన్ ఎక్కువయ్యే కొద్దీ, OH సాంద్రత తగ్గుతుంది. అంతిమంగా జరిగేదేంటంటే, మీథేన్ తన స్వీయ వాతావరణ జీవితకాలాన్ని పెంచుకుంటుంది, తద్వారా దాని మొత్తం రేడియేటివ్ ప్రభావం పెరుగుతుంది. మీథేన్ ఆక్సీకరణం చెందడంతో ఓజోన్, నీరు రెండూ ఉత్పత్తి అవుతాయి; సాధారణంగా పొడిగా ఉండే స్ట్రాటోస్ఫియరులో నీటి ఆవిరి చేరడానికి ప్రధాన వనరు ఇదే. CO, NMVOC లు ఆక్సీకరణం చెందినపుడు CO2 ను ఉత్పత్తి చేస్తాయి. అవి వాతావరణం నుండి OH ను తొలగిస్తాయి. దీంతో వాతావరణంలో మీథేన్ సాంద్రత పెరుగుతుంది. దీనివలన కలిగే ఆశ్చర్యకరమైన ప్రభావ మేంటంటే, యొక్క భూతాపాన్ని పెంచగలిగే సమర్ధత CO కు CO2 కంటే మూడు రెట్లు ఉంటుంది. [16] NMVOC లను కార్బన్ డయాక్సైడ్‌గా మార్చే ప్రక్రియే, ట్రోపోస్పిరిక్ ఓజోన్ ఏర్పడటానికి దారితీస్తుంది. హేలోకార్బన్లు స్ట్రాటోస్ఫెరిక్ ఓజోన్‌ను నాశనం చేసి, పరోక్ష ప్రభావాన్ని కలిగిస్తాయి. చివరిగా హైడ్రోజన్, ఓజోన్ ఉత్పత్తికి, CH
4
పెరగడానికీ, స్ట్రాటోస్ఫియరులో నీటి ఆవిరిని ఉత్పత్తి అవడానికీ దోహదం చేస్తుంది. [15]

గ్రీన్‌హౌస్ ప్రభావానికి మేఘాల దోహదం

భూమిపై గ్రీన్‌హౌస్ ప్రభావానికి మేఘాలు కూడా దోహదపడతాయి. మేఘాలు కూడా పరారుణ వికిరణాన్ని గ్రహిస్తాయి, విడుదల చేస్తాయి. తద్వారా గ్రీన్‌హౌస్ వాయువుల రేడియేటివ్ లక్షణాలపై ప్రభావం చూపుతాయి. మేఘాలంటే వాతావరణంలో వేలాడుతున్న నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాలే . [17] [18]

మొత్తం గ్రీన్‌హౌస్ ప్రభావంపై వివిధ వాయువుల వాటా

ష్మిత్ తదితరులు. (2010) మొత్తం గ్రీన్‌హౌస్ ప్రభావానికి వాతావరణం లోని ఒక్కొక్క వాయువు ఎలా దోహదపడుతుందో విశ్లేషించారు. గ్రీన్‌హౌస్ ప్రభావంలో నీటి ఆవిరి 50% ఉంటుందని వారు అంచనా వేశారు, మేఘాలు 25%, కార్బన్ డయాక్సైడ్ 20%, చిన్నాచితకా గ్రీన్‌హౌస్ వాయువులు, ఏరోసోల్స్‌కు మిగిలిన 5% వాటా ఉంది. ఈ అధ్యయనానికి, రిఫరెన్సుగా తీసుకున్నది, 1980 నాటి వాతావరణం. చిత్ర క్రెడిట్: నాసా .

గ్రీన్‌హౌస్ ప్రభావానికి ప్రతి వాయువు ఇస్తున్న తోడ్పాటు ఆ వాయువు లక్షణాల ద్వారాను, దాని సమృద్ధి ద్వారానూ, అది కలిగించే పరోక్ష ప్రభావా లేమైనా ఉంటే వాటి ద్వారానూ నిర్ణయించవచ్చు. ఉదాహరణకు, కొంత ద్రవ్యరాశి మీథేన్ 20 సంవత్సరాల కాల వ్యవధిలో కలిగించే ప్రత్యక్ష రేడియేటివ్ ప్రభావం, అంతే ద్రవ్యరాశి గల కార్బన్ డయాక్సైడ్ కలిగించే ప్రభావంకంటే 84 రెట్లు బలంగా ఉంటుంది [19] కానీ వాతావరణంలో మీథేన్ సాంద్రత చాలా తక్కువ. దాంతో దాని మొత్తం ప్రత్యక్ష రేడియేటివ్ ప్రభావం తక్కువగా ఉంటుంది. దీనికితోడు వాతావరణంలో మీథేన్ జీవితకాలం తక్కువ.

మరోవైపు, ప్రత్యక్ష రేడియేటివ్ ప్రభావంతో పాటు, ఓజోన్ ఏర్పడటానికి దోహదపడుతూ, మీథేన్ పెద్ద పరోక్ష రేడియేటివ్ ప్రభావాన్ని కలిగిస్తోంది. ఈ ప్రభావం ఫలితంగా వాతావరణ మార్పుకు మీథేన్ కలిగించే చేర్పు, మునుపటి అంచనాల కంటే కనీసం రెండు రెట్లు ఉంటుందని షిండెల్ తదితరులు. (2005) [20] వాదించారు. [21]

గ్రీన్‌హౌస్ ప్రభావానికి చేస్తున్న ప్రత్యక్ష తోడ్పాటును బట్టి చాలా ముఖ్యమైన ంవాయువులు ఇవి: [17]

సమ్మేళనం  రసాయనిక ఫార్ములా  
వాతావరణంలో సాంద్రత [22] (పిపిఎం)
వాటా
(%)
నీటి ఆవిరి, మేఘాలుH
2
O
10–50,000 (ఎ)36-72%  
బొగ్గుపులుసు వాయువుCO2~ 4009-26%
మీథేన్CH
4
~ 1.84-9%  
ఓజోన్O
3
2–8 (బి)3-7%  
గమనికలు:

(ఎ) నీటి ఆవిరి స్థానికంగా మారుతుంది (బి) స్ట్రాటోస్ఫియరులో సాంద్రత. భూమి వాతావరణంలోని ఓజోన్‌లో 90% స్ట్రాటోస్ఫియరులో ఉంటుంది.

గ్రీన్‌హౌస్ వాయువులలో పై జాబితాతో పాటు సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, హైడ్రోఫ్లోరోకార్బన్లు, పెర్ఫ్లోరోకార్బన్లు ఉన్నాయి. కొన్ని గ్రీన్‌హౌస్ వాయువుల ప్రసక్తి ఎక్కడా పెద్దగా కనబడదు. ఉదాహరణకు, నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్‌ గ్లోబల్ వార్మింగ్ సామర్థ్యం ఎక్కువ గానే ఉన్నప్పటికీ, వాతావరణంలో ఇది చాలా తక్కువ పరిమాణంలో ఉండడం వలన దీన్ని సాధారణంగా ఉదహరించరు. [23]

ప్రత్యక్ష ప్రభావాల నిష్పత్తి

మొత్తం గ్రీన్‌హౌస్ ప్రభావంలో ఒక నిర్దుష్ట వాయువు ఇంత శాతాన్ని కలిగిస్తుందని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒకే పౌనఃపున్యాల వద్ద ఒకటి కంటే ఎక్కువ వాయువులు రేడియేషన్‌ను పీల్చుకోవడం, విడుదల చెయ్యడం చేస్తాయి. ఈ కారణం వలన మొత్తం గ్రీన్‌హౌస్ ప్రభావం అనగా ఒక్కో వాయువు కలగజేసే ప్రభావాల కూడిక అని అర్థం చెప్పలేం. పైన చూపిన శ్రేణులలో పై చివరలు ఒక్క వాయువుకు మాత్రమే చెందినది; కానీ దిగువ చివరలు ఇతర వాయువులతో అతివ్యాప్తి (ఓవర్‌ల్యాప్) చెందుతాయి. [17] దీనికితోడు, మీథేన్ వంటి కొన్ని వాయువులు పెద్ద యెత్తున పరోక్ష ప్రభావాలను కలిగిస్తాయి. కానీ వాటి పరిమాణం ఎంతో ఇంకా లెక్కించలేదు. [24]

వాతావరణ జీవితకాలం

సుమారు తొమ్మిది రోజుల జీవిత కాలం ఉన్న నీటి ఆవిరిని పక్కన పెడితే, మిగతా ప్రధాన గ్రీన్‌హౌస్ వాయువులు గాల్లో బాగా మిశ్రితమై ఉంటాయి, వాతావరణం నుండి ఇవి తొలగిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. [25] ఖచ్చితంగా ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడం అంత సులభం కానప్పటికీ, ప్రధాన గ్రీన్‌హౌస్ వాయువుల విషయంలో కొన్ని అంచనా లున్నాయి. X అనే వాయువు ఒక పెట్టెలో నివసించే జీవితకాలం అనేది, ఆ పెట్టెలో ఒక మోలిక్యూలు ఉండే సగటు సమయం అని జాకబ్ (1999) నిర్వచించాడు . గణితశాస్త్రం ప్రకారం ని పెట్టెలో ఉన్న వాయువు ద్రవ్యరాశి (కిలోల్లో) కీ, పెట్టెనుండి దాని మొత్తం తొలగింపు రేటుకూ మధ్య నిష్పత్తిగా నిర్వచించవచ్చు. పెట్టె నుండి బయటికి తొలగిపోయే రేటు ( ), X యొక్క రసాయనిక నష్టం ( ), X నిక్షేపణ ( ) (అన్నీ kg / s) - ఈ మూడింటి మొత్తమే పెట్టె నుండి దాని మొత్తం తొలగింపు అవుతుంది. అంటే జీవితకాలం . [26]

పెట్టెలోకి కొత్తగా వాయువు వెళ్ళడం ఆగిపోతే, సమయం తరువాత , దాని సాంద్రత 63% తగ్గుతుంది.

వాతావరణంలో ఒక వాయువు యొక్క సాంద్రత ఆకస్మికంగా పెరగడం లేదా తగ్గడం జరిగిన తరువాత, తిరిగి సమతుల్యతను పునరుద్ధరించడానికి అవసరమైన సమయాన్ని ఈ జీవితకాలం తెలియజేస్తుంది. నేల, మహాసముద్రాలు, ఇతర జలాలు, వృక్షసంపద, ఇతర జీవసంబంధమైన వ్యవస్థల వంటి సింక్‌ల లోకి వాయువుల అణువులు లేదా మోలిక్యూళ్ళు జమ కావచ్చు. నేపథ్య సాంద్రతల్లో ఉన్న హెచ్చులను ఇది తగ్గిస్తుంది. దీన్ని సాధించడానికి తీసుకున్న సగటు సమయమే సగటు జీవితకాలం .

వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ జీవితకాలం మారుతూ ఉంటుంది, ఖచ్చితంగా ఇంత అని చెప్పలేం. CO2 వాతావరణ జీవితకాలం 30-95 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేసారు. [27] సముద్రంలో కలవడం ద్వారా, కిరణజన్య సంయోగక్రియ లోను, ఇతర ప్రక్రియలలోనూ ఖర్చవడం ద్వారా వాతావరణం నుండి తొలగిపోయే CO2 ను లెక్కలోకి తీసుకున్న అంచనా ఇది. అయితే, జియలాజికల్ రిసర్వాయర్ల నుండి వాతావరణం లోకి ప్రవహించే CO2 ను (ఈ ప్రవాహం రేటు తక్కువగా ఉంటుంది) ఇందులో పరిగణించలేదు. [28] వాతావరణం లోకి విడుదలైన CO2 లో సగానికి పైగా ఒక శతాబ్దం లోపలే వాతావరణం నుండి తొలగించబడినప్పటికీ, కొంత భాగం (సుమారు 20%) మాత్రం, అనేక వేల సంవత్సరాల పాటు వాతావరణంలోనే ఉంటుంది. [29] [30] ఇతర గ్రీన్‌హౌస్ వాయువులకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. వీటిలో చాలా వాటికి CO2 కన్నా ఎక్కువ సగటు జీవితకాలం ఉంటుంది. ఉదాహరణకు, N2O సగటు వాతావరణ జీవితకాలం 121 సంవత్సరాలు. [19]

రేడియేటివ్ వత్తిడి

భూమి సూర్యుడి నుండి పొందే శక్తిలో కొంత భాగాన్ని శోషిస్తుంది (పీల్చుకుంటుంది), కొంత భాగాన్ని కాంతిగా ప్రతిబింబిస్తుంది, మిగిలిన దాన్ని ఉష్ణం రూపంలో అంతరిక్షంలోకి ప్రతిబింబిస్తుంది లేదా ప్రసరిస్తుంది. [31] ఈ లోపలికి వచ్చే, బయటికి పోయే శక్తుల మధ్య సమతుల్యతపై భూమి ఉపరితల ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. ఈ శక్తి సమతుల్యత మారితే, భూమి ఉపరితలం ఉష్ణోగ్రత పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఇది ప్రపంచ శీతోష్ణస్థితిలో అనేక రకాల మార్పులకు దారితీస్తుంది.

అనేక సహజ, మానవ నిర్మిత మెకానిజాలు ప్రపంచ శక్తి సమతుల్యతను ప్రభావితం చేసి, భూమి శీతోష్ణస్థితిలో మార్పులు కలగజేస్తాయి. [31] అటువంటి మెకానిజాల్లో గ్రీన్‌హౌస్ వాయువులు ఒకటి. గ్రీన్‌హౌస్ వాయువులు భూమి ఉపరితలం నుండి వెలువరించే శక్తిని కొంతవరకు గ్రహించి, విడుదల చేస్తాయి. తద్వారా ఆ వేడిని వాతావరణపు దిగువ ఎత్తుల్లో ఉంచేస్తాయి. పైన వివరించినట్లుగా, కొన్ని గ్రీన్‌హౌస్ వాయువులు వాతావరణంలో దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు ఉంటాయి. అందువల్ల భూమి యొక్క శక్తి సమతుల్యతను సుదీర్ఘకాలం ప్రభావితం చేస్తాయి. రేడియేటివ్ వత్తిడి గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతలలో మార్పులతో సహా భూమి యొక్క శక్తి సమతుల్యతను ప్రభావితం చేసే కారకాల ప్రభావాన్ని అంచనా వేస్తుంది. పాజిటివ్ రేడియేటివ్ వత్తిడి నికర ఇన్కమింగ్ శక్తిని పెంచడం ద్వారా వేడెక్కించగా, నెగటివ్ రేడియేటివ్ వత్తిడి చల్లబడడానికి దారితీస్తుంది.

గ్లోబల్ వార్మింగ్ సంభావ్యత

ఒక అణువు యొక్క గ్లోబల్ వార్మింగ్ సంభావ్యత (జిడబ్ల్యుపి), గ్రీన్‌హౌస్ వాయువుగా సదరు అణువు సమర్థత, దాని వాతావరణ జీవితకాలం ఈ రెండింటి పైన ఆధారపడి ఉంటుంది. ఒక నిర్దుష్ట కాలావధిలో ఒక నిర్దుష్ట వాయువు యొక్క జిడబ్ల్యుపిని అంతే బరువు గల CO2 జిడబ్ల్యుపి తో పోల్చి కొలుస్తారు. అందువల్ల, అధిక (సానుకూల) రేడియేటివ్ వత్తిడి కలిగిన ఒక వాయువుకు జీవితకాలం తక్కువగా ఉంటే, 20 సంవత్సరాల స్కేల్‌లో ఆ వాయువు జిడబ్ల్యుపి చాలా ఎక్కువగా ఉంటుంది. అదే, 100 సంవత్సరాల స్కేల్‌లో అయితే, తక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా, ఒక అణువుకు CO2 కంటే ఎక్కువ వాతావరణ జీవితకాలం ఉంటే, దాని జిడబ్ల్యుపి పెరుగుతూ పోతుంది. కార్బన్ డయాక్సైడ్ జిడబ్ల్యుపి, అన్ని కాలావధుల్లోనూ 1 అని నిర్వచించారు.

మీథేన్ వాతావరణ జీవితకాలం 12 ± 3 సంవత్సరాలు. 2007 ఐపిసిసి నివేదిక జిడబ్ల్యుపిని 20 సంవత్సరాల కాలావధిలో 72 గాను, 100 సంవత్సరాలకు 25, 500 సంవత్సరాలకు 7.6 గానూ నమోదు చేసింది. [32] అయితే, 2014 విశ్లేషణ ప్రకారం, మీథేన్ ప్రారంభ ప్రభావం CO2 కంటే 100 రెట్లు ఎక్కువ ఐనప్పటికీ, తక్కువ వాతావరణ జీవితకాలం కారణంగా, ఆరు లేదా ఏడు దశాబ్దాల తరువాత, రెండు వాయువుల ప్రభావాలు సమాన మౌతాయి. ఆ తరువాత కూడా మీథేన్ యొక్క సాపేక్షక పాత్ర క్షీణిస్తూనే పోతుంది. [33] దీర్ఘకాలంలో జిడబ్ల్యుపిలో తగ్గుదల ఎందుకంటే, వాతావరణంలో జరిగే రసాయన చర్యల్లో మీథేన్ - నీరు, CO2 లుగా మారిపోతుంది.

CO2 తో పోలికలో వివిధ గ్రీన్‌హౌస్ వాయువుల వాతావరణ జీవితకాలం, జిడబ్ల్యుపిలు క్రింది పట్టికలో చూడవచ్చు:

CO2 తో పోలికలో వివిధ గ్రీన్‌హౌస్ వాయువుల వాతావరణ జీవితకాలం, వేర్వేరు కాలావధుల వద్ద
గ్యాస్ పేరురసాయినిక
సూత్రం
జీవితకాలం
(సంవత్సరాలు) [19]
వివిధ కాలావధుల్లో జిడబ్ల్యుపి
20-ఏళ్ళు100-ఏళ్ళు500-ఏళ్ళు [32]
బొగ్గుపులుసు వాయువుCO230-95111
మీథేన్CH
4
1284287.6
నైట్రస్ ఆక్సైడ్N
2
O
121264265153
CFC-12CCl
2
F
2
10010 80010 2005 200
HCFC-22CHClF
2
125 2801 760549
టెట్రాఫ్లోరోమీథేన్     CF
4
50 0004 8806 63011 200
హెక్సాఫ్లోరోఈథేన్C
2
F
6
10 0008 21011 10018 200
సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్SF
6
3 20017 50023 50032 600
నత్రజని ట్రిఫ్లోరైడ్NF
3
50012 80016 10020 700

ఓజోన్ను క్షీణింపజేసే లక్షణాల కారణంగా CFC-12 వినియోగాన్ని (కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు మినహా) దశలవారీగా ఆపేసారు. తక్కువ చురుకైన HCFC- సమ్మేళనాల దశల వారీ తొలగింపు 2030 లో పూర్తవుతుంది. [34]

ప్రకృతి జనితం, మానవ జనితం

పూర్తిగా మానవుడు ఉత్పత్తి చేసినవే అయిన సింథటిక్ హేలోకార్బన్‌లను పక్కన పెడితే, చాలా గ్రీన్‌హౌస్ వాయువులు సహజంగాను, మానవ-కారణాల వలనా కూడా ఉత్పత్తి అవుతాయి. హోలోసీన్ కాలంలో, పారిశ్రామిక యుగానికి పూర్వం ఉన్న వాయువుల సాంద్రతలు దాదాపుగా స్థిరంగానే ఉండేవి. ఎందుకంటే వాటిని ఉత్పత్తి చేసే పెద్ద సహజ వనరులూ సహజ సింకులూ సమతుల్యతలో ఉండేవి. పారిశ్రామిక యుగంలో మానవ కార్యకలాపాలు, ప్రధానంగా శిలాజ ఇంధనాలను మండించడం, అడవులను నరికివెయ్యడం వంటి వాటి వలన వాతావరణం లోకి గ్రీన్‌హౌస్ వాయువులు అదనంగా చేరాయి. [35]

ఐపిసిసి సంకలనం చేసిన 2007 నాల్గవ అసెస్‌మెంట్ రిపోర్ట్ (ఎఆర్ 4) లో "వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువులు, ఏరోసోల్ ల సాంద్రతల్లో మార్పులు, ల్యాండ్ కవర్, సౌర వికిరణాల్లో మార్పులు వాతావరణ వ్యవస్థ యొక్క శక్తి సమతుల్యతను మారుస్తాయి" అని పేర్కొన్నారు. "20 వ శతాబ్దం మధ్యకాలం నుండి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలలో చాలావరకూ, గ్రీన్‌హౌస్ వాయువు సాంద్రతల్లో మానవజనిత పెరుగుదలే కారణమైంది". [36] AR4 లో, "చాలావరకు" అంటే 50% కంటే ఎక్కువ అని నిర్వచించింది.

దిగువ రెండు పట్టికలలో ఉపయోగించిన సంక్షిప్తాలు: ppm = పార్ట్స్ పర్ మిలియన్; ppb = పార్ట్స్ పర్ బిలియన్; ppt = పార్ట్స్ పర్ ట్రిలియన్; చదరపు మీటరుకు W / m 2 = వాట్స్

ప్రస్తుత గ్రీన్‌హౌస్ వాయువు సాంద్రతలు
గ్యాస్1750 కి ముందు
ట్రోపో స్ఫియరులో
సాంద్రత
ట్రోపో స్ఫియరులో
ఇటీవలి సాంద్రత
సంపూర్ణ పెరుగుదల
1750 నుండి
1750 నుండి పెరుగుదల శాతం
పెరిగిన
రేడియేటివ్ వత్తిడి
(ప / మ 2)
కార్బన్ డయాక్సైడ్ (CO)280   ppm395.4 ppm115.4 ppm41.2%1.88
మీథేన్ (CH
4
)
700 ppb [37]1893 ppb / [38]
1762 ppb
1193 ppb /
1062 ppb
170.4% / ]151,7%0.49
నైట్రస్ ఆక్సైడ్ (N
2
O
)
270 ppb326 ppb /
324 ppb
56 ppb /
54 ppb
20.7% /
20.0%
0.17
ట్రోపోస్పియర్ ఓజోన్ (O
3
)
237 ppb337 ppb100 ppb42%0.4
రేడియేటివ్ వత్తిడికి, ఓజోన్ క్షీణతకూ సంబంధించినది ; కింది వాటికి సహజ వనరులు లేవు. అందువల్ల పారిశ్రామికానికి పూర్వం సున్నా ఉంటాయి
గ్యాస్ట్రోపో స్ఫియరులో ఇటీవలి
సాంద్రత
పెరిగిన
రేడియేటివ్
(ప / మ 2)
CFC-11 (trichlorofluoromethane) (CCl
3
F
)
236 ppt / 234 ppt0,061
సిఎఫ్‌సి -12 (CCl
2
F
2
)
527 ppt / 527 ppt0,169
CFC-113 (Cl
2
FC-CClF
2
)
74 ppt / 74 ppt0.022
CHClF
2
-22 (CHClF
2
)
231 ppt / 210 ppt0.046
హెచ్‌సిఎఫ్‌సి -141 బి (CH
3
CCl
2
F
)
24 ppt / 21 ppt0,0036
హెచ్‌సిఎఫ్‌సి -142 బి (CH
3
CClF
2
)
23 ppt / 21 ppt0,0042
హలోన్ 1211 (CBrClF
2
)
4.1 ppt / 4.0 ppt0,0012
హలోన్ 1301 (CBrClF
3
)
3.3 ppt / 3.3 ppt0.001
హెచ్‌ఎఫ్‌సి -134 ఎ (CH
2
FCF
3
)
75 ppt / 64 ppt0,0108
కార్బన్ టెట్రాక్లోరైడ్ (CCl
4
)
85 ppt / 83 ppt0,0143
సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ (SF
6
)
7.79 ppt / 7.39 ppt0,0043
ఇతర హలోకార్బన్లుపదార్ధాన్ని బట్టి

మారుతుంది

సామూహికంగా
0.02
మొత్తం హాలోకార్బన్లు0,3574
400,000 సంవత్సరాల ఐస్ కోర్ డేటా

గత 8,00,000 సంవత్సరాల్లో గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతల్లో హెచ్చుతగ్గులకు ఐస్ కోర్‌లు ఆధారాలుగా నిలుస్తాయి. CO2, CH
4
ల సాంద్రతలు రెండూ గ్లేసియల్, ఇంటర్‌గ్లేసియల్ దశల్లో మారుతూ ఉండేవి. ఉష్ణోగ్రతల్లో మార్పులకు అనుగుణంగా ఈ వాయువుల సాంద్రతలు మారుతూంటాయి. ఐస్ కోర్ రికార్డ్‌లో ప్రాతినిధ్యం వహించిన కాలానికి ముందు ప్రత్యక్ష డేటా లేదు. గత 250 సంవత్సరాలుగా జరిగిన పెరుగుదలకు ముందు, 8,00,000 సంవత్సరాల పాటు CO2 స్థాయి 180 ppm నుండి 280 ppm మధ్యనే ఉంది. అయితే, వివిధ ప్రాక్సీలూ మోడలింగులను బట్టి, గత యుగాలలో పెద్దయెత్తున వైవిధ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది; 50 కోట్ల సంవత్సరాల క్రితం CO2 స్థాయిలు ఇప్పటి కంటే 10 రెట్లు ఉండేవి. [39] నిజానికి, ఫానెరోజోయిక్ ఇయాన్ అంతటా CO2 సాంద్రత ఇప్పటి కంటే బాగా హెచ్చుగా ఉండేది. మెసోజోయిక్ ఎరాలో ఇప్పటి కంటే నాలుగు నుంచి ఆరు రెట్లు, పాలియోజోయిక్ ఎరా తొలినాళ్ళ నుండి మధ్య డెవోనియన్ పీరియడ్ వరకు (40 కోట్ల సంవత్సరాల క్రితం) పది, పదిహేను రెట్లు ఉండేది. [40] [41] [42] నేలపై పెరిగే వృక్షజాలం వ్యాప్తి చెందడంతో CO2 తగ్గిందని భావిస్తున్నారు. ఈ కాలాని కంటే ఇంకా ముందు, అంటే సుమారు 55 కోట్ల సంవత్సరాల క్రితం, ఒక మహా అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా హఠాత్తుగా వాతావరణంలో CO2 ఇప్పటి స్థాయికి 350 రెట్ల స్థాయికి పెరిగిపోయి, తీవ్రమైన గ్రీన్‌హౌస్ పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజుకు 1 మి.మీ. మందాన సున్నపురాయి జమ అయింది. అంతకు ముందు 20 కోట్ల సంవత్సరాల పాటు సాగిన గ్లేసియేషను దీంతో అకస్మాత్తుగా ముగిసిపోయింది. [43] ఈ సంఘటనతో ప్రీకాంబ్రియన్ ఇయాన్ ముగిసింది. వెచ్చటి కాలమైన ఫానెరోజోయిక్ ఎరా మొదలైంది. ఈ సమయంలో బహుళ కణ జీవులు, మొక్కలూ ఉద్భవించాయి. ఆ అగ్నిపర్వత ఘటన తరువాత ,దానితో పోల్చదగిన స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు భుమిపై మళ్ళీ ఎప్పుడూ సంభవించలేదు. ఆధునిక యుగంలో, అగ్నిపర్వతాలు వాతావరణం లోకి వెదజల్లే CO2 ఏడాదికి సుమారు 64.5 కోట్ల టన్నులు కాగా, మానవ జనితమైనది 2900 కోట్ల టన్నులు. [44] [45]

ఐస్ కోర్లు

పారిశ్రామిక ఉద్గారాలు మొదలవడానికి ముందు వాతావరణంలో CO2 280 పిపిఎం ఉండేదనీ, మునుపటి పది వేల సంవత్సరాలలోనూ ఇది 260 - 280 పిపిఎం మధ్య ఉండేదనీ అంటార్కిటిక్ మంచు కోర్‌లపై చేసిన పరిశీలనల్లో తెలిసింది. [46] 1900 ల నుండి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వాటా 35 శాతం పెరిగింది. ఘనపరిమాణం ప్రకారం 280 పిపిఎం నుండి 2009 లో 387 పిపిఎంకు పెరిగింది. శిలాజాలుగా మారిన ఆకుల స్టోమాటా నుండి లభించిన ఆధారాలను బట్టి చేసిన ఒక అధ్యయనం, ఏడు నుండి పది వేల సంవత్సరాల క్రితం 300 పిపిఎం కంటే ఎక్కువ ఉండేదని సూచించింది. [47] అయితే, ఈ పరిశోధనలు వాస్తవ CO2 విలువను చూపించవనీ, ఇందులో స్థానికంగా ఉండే వైవిధ్యం కొంత ఉంటుందనీ వాదించారు. [48] [49] ఈ గణాంకాలు శతాబ్దాల స్థాయిలో వాతావరణ సాంద్రతల సగటును సూచిస్తాయి గానీ, వార్షిక, దశాబ్ద స్థాయిలను కాదు.

పారిశ్రామిక విప్లవం తరువాత వచ్చిన మార్పులు

వాతావరణ CO2 లో ఇటీవలి వార్షిక పెరుగుదల
ప్రధాన గ్రీన్‌హౌస్ గ్యాస్ పోకడలు.

పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనప్పటి నుండి, చాలా గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతలు పెరిగాయి. ఉదాహరణకు, కార్బన్ డయాక్సైడ్ 280 ppm నుండి 415 ppm వరకు (మొత్తం 120 పిపిఎమ్) పెరిగింది. మొదటి 30 ppm పెరగడానికి సుమారు 200 ఏళ్ళు, పారిశ్రామిక విప్లవం ప్రారంభం నుండి 1958 వరకూ, పట్టింది. అయితే తదుపరి 90 ppm పెరుగుదలకు 56 సంవత్సరాలు మాత్రమే, 1958 నుండి 2014 వరకు, పట్టింది. [50]

సాంద్రతలు అధిక రేటుతో పెరుగుతున్నట్లు కూడా ఇటీవలి డేటా చూపిస్తోంది. 1960 లలో, సగటు వార్షిక పెరుగుదల వేగం, 2000 - 2007 మధ్య పెరిగిన వేగంలో 37% మాత్రమే ఉంది. [51]

1870 నుండి 2017 వరకు శిలాజ ఇంధనాలు, పరిశ్రమల నుండి వెలువడిన మొత్తం ఉద్గారాలు 425 ± 20 GtC (1539 GtCO2) కాగా, భూ వినియోగ మార్పు వలన 180 ± 60 GtC (660 GtCO2). 1870–2017 కాలంలో అటవీ నిర్మూలన వంటి భూ వినియోగ మార్పు 31% సంచిత ఉద్గారాలకు కారణం కాగా, బొగ్గు 32%, చమురు 25% సహజ వాయువు 10% కీ కారణమయ్యాయి. [52]

శిలాజ ఇంధనాలను మండించడం, ఉష్ణమండల, బోరియల్ ప్రాంతాలలో అటవీ నిర్మూలన వంటి మానవ కార్యకలాపాల ఫలితంగా వాతవరణంలో కార్బన్ పెరుగుతోంది. [53]

మానవ కార్యకలాపాల వలన ఇతర గ్రీన్‌హౌస్ వాయువుల విషయంలో కూడా పరిమాణం లోను, పెరుగుదల రేటు లోనూ కూడా ఇలాంటి పెరుగుదలే కనిపిస్తోంది. అనేక పరిశీలనలు ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి.

నీటి ఆవిరి పాత్ర

కొలరాడోలోని బౌల్డర్ వద్ద స్ట్రాటోస్ఫియరులో నీటి ఆవిరి పెరుగుదల

మొత్తం గ్రీన్‌హౌస్ ప్రభావంలో నీటి ఆవిరిది అత్యధిక పాత్ర. ఆకాశం నిర్మలంగా ఉన్నపుడు దీని ప్రభావం 36% - 66% మధ్య ఉంటుంది. మబ్బులు కమ్మి ఉన్నపుడు ఇది 66% - 85% మధ్య ఉంటుంది. నీటి ఆవిరి సాంద్రతలు ప్రాంతీయంగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అయితే, ఏదో పొలాల దగ్గర ఉండే కొద్దిపాటి తేడాలు తప్ప, మానవ కార్యకలాపాలు నీటి ఆవిరి సాంద్రతలను నేరుగా ప్రభావితం చేయవు. ప్రపంచ ఉష్ణోగ్రతను పెంచే మానవ కార్యకలాపాలు పరోక్షంగా నీటి ఆవిరి సాంద్రతలను పెంచుతాయి. ఈ ప్రక్రియను నీటి ఆవిరి ఫీడ్‌బ్యాక్ అంటారు. [54] వాతావరణంలో నీటి ఆవిరి సాంద్రత చాలా ఎక్కువగా మారుతూంటుంది. ఇది ఉష్ణోగ్రతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది; చాలా శీతల ప్రాంతాలలో 0.01% కంటే తక్కువ నుండి 32°C వద్ద 3% వరకు ఉంటుంది. [55]

వాతావరణంలో నీటి అణువు నివసించే సగటు సమయం కేవలం తొమ్మిది రోజులు మాత్రమే. CH
4
వంటి ఇతర గ్రీన్‌హౌస్ వాయువులు సంవత్సరాలు లేదా శతాబ్దాల పాటు ఉంటాయి. ఇతర గ్రీన్‌హౌస్ వాయువుల ప్రభావాలకు నీటి ఆవిరి ప్రతిస్పందించి, ఆ ప్రభావాలను హెచ్చింపజేస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే ఒక యూనిట్ ఘనపరిమాణంలో ఉండే నీటి ఆవిరి ఎక్కువౌతుందని క్లాసియస్-క్లాపెరాన్ సంబంధం నిర్ధారిస్తుంది. ఇతర గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతలు పెరగడంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లే, నీటి ఆవిరి సాంద్రత కూడా పెరుగుతుందని ఇదీ, ఇతర ప్రాథమిక సూత్రాలూ సూచిస్తున్నాయి. నీటి ఆవిరి గ్రీన్‌హౌస్ వాయువు కాబట్టి, ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. అంచేత ఇది, ఒరిజినల్‌గా పెరిగిన తాపాన్ని మరింతగా పెంచే "పాజిటివ్ ఫీడ్‌బ్యాక్". అంతిమంగా, భూమ్మీది ఇతర ప్రక్రియలు ఈ సానుకూల స్పందనలను ఆఫ్‌సెట్ చెయ్యడంతో, ప్రపంచ ఉష్ణోగ్రత కొత్త సమతుల్యత వద్ద స్థిరపడుతుంది. శుక్రగ్రహంపై జరిగినట్లుగా అడ్డూఆపూ లేని నిర్నిరోధ (రన్అవే) గ్రీన్‌హౌస్ ప్రభావం ఏర్పడి, మొత్తం భూమ్మీది నీరంతా కోల్పోకుండా చేస్తుంది. [54]

మానవ జనిత గ్రీన్‌హౌస్ వాయువులు

సుమారు 1750 నుండి మానవ కార్యకలాపాల వలన కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతలు పెరిగాయి. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే ప్రస్తుతం 100 ppm ఎక్కువ. కార్బన్ డయాక్సైడ్ సహజ వనరులు, మానవ జనిత మూలాల కంటే 20 రెట్లు ఎక్కువ. కానీ కొన్ని సంవత్సరాల కన్నా ఎక్కువ కాలావధిలో సహజ వనరులకూ, సహజ సింక్‌లకూ మధ్య సమానమైన సమతుల్యత ఏర్పడడంతో, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత సుమారు గత 10,000 సంవత్సరాలుగా 260 - 280 పిపిఎమ్‌ల మధ్య స్థిరంగా ఉంది.

మానవజనిత తాపం అనేక భౌతిక, జీవ వ్యవస్థలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. [56] తాపం వలన భవిష్యత్తులో సముద్ర మట్టం పెరగడం, [57] కొన్ని తీవ్రమైన శీతీష్ణస్థితి సంఘటనల తీవ్రత, తరచుదనం పెరగడం జీవవైవిధ్యం కోల్పోవడం, [58] వ్యవసాయ దిగుబడిలో ప్రాంతీయ మార్పులతో సహా అనేక రకాల ప్రభావాలు కలుగుతాయని అంచనా వేసారు.

గ్రీన్‌హౌస్ వాయువులకు ప్రధాన మానవ కార్యకలాపాల వనరులు:

  • శిలాజ ఇంధనాల దహనం, అటవీ నిర్మూలనల వలన గాలిలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రతలు పెరుగుతాయి. మొత్తం మానవజనిత CO2లో భూ వినియోగ మార్పు (ప్రధానంగా ఉష్ణమండలాల్లో అటవీ నిర్మూలన) ఒక్కటే మూడింట ఒక వంతుకు కారణమౌతోంది
  • పశువుల ఎంటెరిక్ ఫెర్మెంటేషన్, ఎరువుల నిర్వహణ, [59] వరి పెంపకం, భూ వినియోగం, చిత్తడి నేల మార్పులు, మానవ నిర్మిత సరస్సులు, [60] పైప్‌లైన్ నష్టాలు, అధిక మీథేన్ సాంద్రతలకు దారితీసే ల్యాండ్‌ఫిల్ ఉద్గారాలు.
  • శీతలీకరణ వ్యవస్థలలో క్లోరోఫ్లోరోకార్బన్‌ల (సిఎఫ్‌సి) వాడకం, నిప్పునార్పే వ్యవస్థల్లోను, తయారీ ప్రక్రియల్లోనూ సిఎఫ్‌సిలు, హాలోన్‌ల వాడకం.
  • ఎరువుల వాడకంతో సహా అధిక నైట్రస్ ఆక్సైడ్ (N
    2
    O
    ) సాంద్రతలకు దారితీసే వ్యవసాయ కార్యకలాపాలు.
Mean greenhouse gas emissions for different food types[61]
Food TypesGreenhouse Gas Emissions (g CO2-Ceq per g protein)
Ruminant Meat
62
Recirculating Aquaculture
30
Trawling Fishery
26
Non-recirculating Aquaculture
12
Pork
10
Poultry
10
Dairy
9.1
Non-trawling Fishery
8.6
Eggs
6.8
Starchy Roots
1.7
Wheat
1.2
Maize
1.2
Legumes
0.25

శిలాజ ఇంధన దహన నుండి వెలువడే CO2 - ఏడు ప్రధాన వనరులు (2000-2004 నాటి లెక్కలు శాతాల్లో): [62]

  • ద్రవ ఇంధనాలు (ఉదా., గ్యాసోలిన్, ఇంధన నూనె): 36%
  • ఘన ఇంధనాలు (ఉదా., బొగ్గు): 35%
  • వాయు ఇంధనాలు (ఉదా., సహజ వాయువు): 20%
  • సిమెంట్ ఉత్పత్తి: 3%
  • పరిశ్రమల వద్ద, బావుల వద్ద మండే వాయువు: 1%
  • ఇంధనం కాని హైడ్రోకార్బన్లు: 1%
  • రవాణా యొక్క "అంతర్జాతీయ బంకర్ ఇంధనాలు": 4%

కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ (N
2
O
), మూడు ఫ్లోరినేటెడ్ వాయు సమూహాలు (సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ (SF
6
), హైడ్రోఫ్లోరోకార్బన్లు (హెచ్‌ఎఫ్‌సి), పెర్ఫ్లోరోకార్బన్లు (పిఎఫ్‌సి)) ప్రధాన మానవజనిత గ్రీన్‌హౌస్ వాయువులు. [63] : 147  ఇవి 2005 లో అమల్లోకి వచ్చిన క్యోటో ప్రోటోకాల్ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం వీటిని నియంత్రిస్తారు. క్యోటో ప్రోటోకాల్‌లో పేర్కొన్న ఉద్గార పరిమితులు 2012 లో ముగిశాయి. 2010 లో అంగీకరించిన కాన్‌కున్ ఒప్పందంలో, ఉద్గారాలను నియంత్రించడానికి 76 దేశాలు చేసిన స్వచ్ఛంద ప్రతిజ్ఞలు ఉన్నాయి. ఒప్పందం సమయంలో, ఈ 76 దేశాలు 85% వార్షిక ప్రపంచ ఉద్గారాలకు సమష్టిగా బాధ్యత వహించాయి.

CFC లు కూడా గ్రీన్‌హౌస్ వాయువులే అయినప్పటికీ, అవి మాంట్రియల్ ప్రోటోకాల్ నియంత్రణలో ఉంటాయి. ఇది గ్లోబల్ వార్మింగులో వాటి పాత్రకు కాక, ఓజోన్ క్షీణతలో పాత్రకు గాను ఈ ప్రోటోకోల్‌ను ఏర్పాటు చేసారు. గ్రీన్‌హౌస్ ప్రభావంలో ఓజోన్ క్షీణత పాత్ర చాలా చిన్నదే అయినప్పటికీ, ఈ రెండింటి విషయంలో మీడియా తికమక పడుతూంటుంది. 2016 అక్టోబరు 15 న, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ శిఖరాగ్ర సమావేశంలో 170 కి పైగా దేశాలు మాంట్రియల్ ప్రోటోకాల్‌కు చేసిన సవరణలో హైడ్రోఫ్లోరోకార్బన్‌లను (హెచ్‌ఎఫ్‌సి) తొలగించడానికి చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. [64] [65] [66]

రంగాల వారీగా 2016 ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను చూపించే చార్ట్.[67] అన్ని క్యోటో గ్రీన్‌హౌస్ వాయువుల అంచనా ప్రపంచ ఉద్గారాల నుండి శాతం లెక్కించబడుతుంది, ఇవి CO2 సమాన పరిమాణాలకు (GtCO2e) మార్చబడతాయి.

గ్లోబల్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను ఆర్థిక వ్యవస్థ లోని వివిధ రంగాలకు ఆపాదించవచ్చు. వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలు గ్లోబల్ వార్మింగ్‌కు ఎలా కారణమౌతున్నాయో, శీతోష్ణస్థితి మార్పును తగ్గించడానికి ఆయా రంగాల్లో ఏయే మార్పులు చెయ్యాలో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

మానవ నిర్మిత గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను - శక్తిని ఉత్పత్తి చేయడానికి ఇంధనాలను దహనం చెయ్యడం వలన ఉత్పత్తి అయ్యేవి, ఇతర ప్రక్రియల ద్వారా ఉత్పన్నమయ్యేవి అని రెండు వర్గాలుగా విభజించవచ్చు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో మూడింట రెండు వంతులు, ఇంధనాల దహనం నుండే ఉత్పన్నమవుతాయి.[68]

వినియోగించే చోటనే శక్తిని ఉత్పత్తి చెయ్యవచ్చు. లేదా ఇతరులు కూడా వినియోగించేలా జనరేటరు ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. అందువల్ల శక్తి ఉత్పత్తి నుండి ఉత్పన్నమయ్యే ఉద్గారాలను అవి ఎక్కడ విడుదల చేస్తున్నారనే దాన్ని బట్టి, లేదా ఉత్పత్తి చేసిన శక్తిని ఎక్కడ వినియోగిస్తున్నారనే దాన్ని బట్టి ఉద్గారాలను వర్గీకరించవచ్చు. ఉత్పత్తి జరిగే చోటికే ఉద్గారాలను ఆపాదిస్తే, ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 25% వరకు విద్యుత్ జనరేటర్లు దోహదం చేస్తున్నట్లు. [69] ఉద్గారాలను తుది వినియోగదారునికి ఆపాదిస్తే, మొత్తం ఉద్గారాలలో 24% తయారీ, నిర్మాణం నుండి, 17% రవాణా నుండి, 11% గృహ వినియోగదారుల నుండి, 7% వాణిజ్య వినియోగదారుల నుండీ ఉత్పన్నమవుతున్నట్లు చెప్పవచ్చు. [70] సుమారు 4% ఉద్గారాలు స్వయంగా శక్తి, ఇంధన పరిశ్రమలు వినియోగించే శక్తి నుండి ఉత్పన్నమవుతాయి.

ఉద్గారాలలో మిగిలిన మూడవ భాగం శక్తి ఉత్పత్తి కాకుండా ఇతర ప్రక్రియల నుండి ఉత్పన్నమవుతుంది. మొత్తం ఉద్గారాలలో 12% వ్యవసాయం నుండి, 7% భూ వినియోగ మార్పు, అడవులను నరకడం నుండి, 6% పారిశ్రామిక ప్రక్రియల నుండి, 3% వ్యర్థాల నుండి ఉత్పన్నమవుతాయి.[68] ఉద్గారాలలో 6% ఫ్యూజిటివ్ ఉద్గారాలు -ఇవి శిలాజ ఇంధనాల వెలికితీసేటపుడు విడుదలయ్యే వ్యర్థ వాయువులు.

విద్యుత్ ఉత్పత్తి

ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయువులలో నాలుగో వంతు విద్యుత్ ఉత్పత్తిలో వెలువడుతుంది. [71] 2018 లో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు 10 GtCO2 పైబడిన ఉద్గారాలను వెలువరించాయి. [72] బొగ్గు ప్లాంట్ల కంటే చాలా తక్కువ కాలుష్యం వెలువరిస్తున్నప్పటికీ, సహజ వాయువుతో పనిచేసే విద్యుత్ ప్లాంట్లు కూడా ప్రధాన ఉద్గార కారకాలే. [73]

పర్యాటకం

UNEP ప్రకారం, ప్రపంచ పర్యాటకం వాతావరణ మార్పుతో ముడిపడి ఉంది. వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రత పెరుగుదలకు పర్యాటకం ఒక ముఖ్యమైన కారణం. ట్రాఫిక్ కదలికల్లో పర్యాటక రంగం వాటా 50% ఉంటుంది. వేగంగా పెరుగుతున్న విమాన ట్రాఫిక్ CO2 ఉత్పత్తికి 2.5% వరకూ దోహదం చేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 1996 లో 59.4 కోట్ల నుండి 2020 నాటికి 160 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఉద్గారాలను తగ్గించడానికి చర్యలు తీసుకోకపోతే సమస్యకు చాలా తీవ్రతర మౌతుంది. [74]

రోడ్డు ద్వారా సరుకు రవాణా

CO2 ఉత్పత్తిలో రోడ్డు ద్వారా సరుకు రవాణా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ పరిశ్రమలో సగటు కార్బన్ ఉద్గారాలు పడిపోతున్నాయి-1977 నుండి 2007 వరకు ఉన్న ముప్పై సంవత్సరాల కాలంలో, 200-మైళ్ల దూరం చేసే ప్రయాణంలో కార్బన్ ఉద్గారాలు 21 శాతం తగ్గాయి; NOx ఉద్గారాలు కూడా 87 శాతం తగ్గాయి. ప్రయాణ సమయాలు కూడా మూడో వంతు తగ్గాయి.

ప్లాస్టిక్

ప్లాస్టిక్ ప్రధానంగా శిలాజ ఇంధనాల నుండి ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ వార్షిక ప్రపంచ చమురు ఉత్పత్తిలో 8 శాతం ప్లాస్టిక్ తయారీ పరిశ్రమ ఉపయోగిస్తుందని అంచనా. ప్లాస్టిక్ సీసాలు తయారు చేసేందుకు వాడే పాలీఎథిలిన్ టెరఫ్తాలేట్ (PET) ఎంత ద్రవ్యరాశి ఉత్పత్తి చేస్తే అంతకు ఐదురెట్ల ద్రవ్యరాశి గల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని అంచనా. ఆయ వస్తువుల రవాణా కూడా గ్రీన్‌హౌస్ వాయువుల ఉత్పత్తికి దోహదపడుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు క్షీణించే క్రమంలో కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి. వాతావరణంలో అత్యంత సాధారణమైన ప్లాస్టిక్‌లు ఎండకు గురైనప్పుడు గ్రీన్‌హౌస్ వాయువులైన మీథేన్, ఇథిలీన్‌లను విడుదల చేస్తాయనీ, ఇది భూ వాతావరణాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుందనీ 2018 పరిశోధనలో పేర్కొంది. [75] [76]

ఇదే ప్లాస్టిక్‌ను, పల్లపు ప్రదేశంలో పూడ్చిపెడితే, అది కార్బన్ సింక్‌గా పనిచేస్తుంది. [77] కాకపోతే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్‌లు మీథేన్ ఉద్గారాలను వెలువరిస్తాయి. [78] ప్లాస్టిక్ తేలిగ్గా ఉన్నందున గ్లాస్ కంటే, లోహాల కంటే శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకు, గాజు, లోహానికి బదులుగా పిఇటి సీసాల్లోని పానీయాలను రవాణా చేసేందుకు 52% తక్కువ శక్తి ఖర్చవుతుందని అంచనా వేసారు., గాజు, లోహ సీసాలు కూడా ఒకే ఉపయోగం కోసం అని లెక్కించినపుడు మాత్రమే ఈ లెక్క వర్తిస్తుంది.

2019 లో వెలువడిన "ప్లాస్టిక్ అండ్ క్లైమేట్" అనే నివేదిక ప్రకారం, 2019 లో ప్లాస్టిక్ వలన 850 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ (CO2) కు సమానమైన గ్రీన్‌హౌస్ వాయువులు వాతావరణం లోకి చేరుతాయి. ప్రస్తుత ధోరణిలో, 2030 నాటికి వార్షిక ఉద్గారాలు 134 కోట్ల టన్నులకు పెరుగుతాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడమే పరిష్కారమని, ప్లాస్టిక్ పరిశ్రమలో పునరుత్పాదక శక్తిని ఉపయోగించడం, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాడడమ్, ఓషన్ క్లీనప్ వంటివి పెద్దగా ఉపయోగపడవనీ, పైగా వీటి వలన కొన్ని సందర్భాల్లో పరిస్థితి మరింత దిగజారిపోతుందనీ నివేదిక పేర్కొంది. [79]

ఔషధ పరిశ్రమ

ఔషధ పరిశ్రమ 2015 లో 52 మెగాటన్ల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేసింది. ఇది ఆటోమోటివ్ రంగం కంటే ఎక్కువ. అయితే ఈ విశ్లేషణ ఔషధాలతో పాటు ఆయా కంపెనీలు ఉత్పత్తి చేసే ఇతర ఉత్పత్తులను కూడా ఇందులో భాగంగానే పరిగణించారు. [80]

వార్షిక ఉద్గారాలు

భూ వినియోగ మార్పుతో సహా 2000 సంవత్సరానికి దేశాల తలసరి మానవజనిత గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు.

పారిశ్రామిక దేశాలలో వార్షిక తలసరి ఉద్గారాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు కంటే పది రెట్లు ఎక్కువ. [63] : 144  చైనా యొక్క వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి కారణంగా, దాని వార్షిక తలసరి ఉద్గారాలు క్యోటో ప్రోటోకాల్ యొక్క అనెక్స్ I సమూహంలో (అంటే, యుఎస్ మినహా అభివృద్ధి చెందిన దేశాలు) స్థాయిలను వేగంగా చేరుకుంటున్నాయి . వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలు దక్షిణ కొరియా, ఇరాన్, ఆస్ట్రేలియా (పర్షియన్ గల్ఫ్ దేశాల తరువాత ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక పర్ కాపిటా ఉద్గార రేటు ఆస్ట్రేలియాదే). మరోవైపు, EU-15, అమెరికా ల్లో వార్షిక తలసరి ఉద్గారాలు క్రమేణా తగ్గుతున్నాయి. ఆర్థిక పునర్నిర్మాణం కారణంగా రష్యా, ఉక్రెయిన్‌లలో ఉద్గారాలు 1990 నుండి అత్యంత వేగంగా తగ్గాయి.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల శక్తి గణాంకాలు పారిశ్రామిక దేశాల కన్నా తక్కువ ఖచ్చితమైనవి. 2008 లో చైనా వార్షిక ఉద్గారాలకు సంబంధించి సుమారు 10% అనిశ్చితి ఉంటుందని నెదర్లాండ్స్ ఎన్విరాన్‌మెంటల్ అసెస్‌మెంట్ ఏజెన్సీ అంచనా వేసింది. [81]

గ్రీన్‌హౌస్ వాయువు పాదముద్ర అనేది ఉత్పత్తులు, సేవల తయారీలో వెలువడే ఉద్గారాలను సూచిస్తుంది. ఇది సాధారణంగా ఉపయోగించే కార్బన్ పాదముద్ర కంటే చాలా విస్తృతమైనది. కార్బన్ పాదముద్ర చాలా గ్రీన్‌హౌస్ వాయువులలో ఒకటైన కార్బన్ డయాక్సైడ్ను మాత్రమే కొలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, కార్బన్ ఉద్గారాల తగ్గింపు - ఈ రెండింటినీ చూసిన మొట్టమొదటి సంవత్సరం 2015. [82]

అగ్ర ఉద్గారక దేశాలు

దేశం వారీగా ప్రపంచ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు .
గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేసే అగ్ర 40 దేశాలు. "World Resources Institute data".

వార్షిక

2009 లో, ఉద్గారాల్లో అగ్రస్థానాన ఉన్న పది దేశాలకు ప్రపంచంలోని వార్షిక ఇంధన-సంబంధిత CO2 లో మూడింట రెండు వంతుల వాటా ఉంది

టాప్ -10 2017 సంవత్సరానికి వార్షిక CO2 ఉద్గారకాలు [83]
దేశంప్రపంచపు మొత్తం
వార్షిక ఉద్గారాల్లో %
2017 లోమొత్తం CO2 ఉద్గారాలు

(కిలోటన్నులు) [84]

తలసరి [85]టన్నుల్లో
border  China29.3108772177.7
border  United States13.8510739315.7
border  India6.624547731.8
border  Russia4.8176486512.2
border  Japan3.6132077610.4
border  Germany2.17965289.7
దక్షిణ కొరియా1.867332313.2
ఇరాన్1.86714508.2
సౌదీ అరేబియా1.763876119.3
కెనడా1.761730016.9

సంచిత

1850 - 2008 మధ్య శక్తి-సంబంధ, సంచిత CO2 ఉద్గారకాలుటాప్ -10 దేశాలు
దేశంప్రపంచపు
మొత్తంలో %
తలసరి CO2

మెట్రిక్ టన్నులు

border  United States28.51,132.7
border  China9,3685,4
border  Russia7.95677,2
border  Germany6.78998,9
border  United Kingdom5.731,127.8
border  Japan3.88367
border  France2.73514,9
border  India2.5226.7
border  Canada2.17789,2
border  Ukraine2.13556,4

వివిధ ఇంధనాల నుండి CO ఉద్గారాలు

ఒక లీటరు గ్యాసోలిన్‌ను ఇంధనంగా ఉపయోగించినప్పుడు, 2.32 కిలోల (సుమారు 1300 లీటర్లు లేదా 1.3 క్యూబిక్ మీటర్లు) కార్బన్ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వివిధ ఇంధనాలు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ ద్రవ్యరాశి
ఇంధనంవిడుదలైన
CO2
(పౌండ్లు / 106 Btu)
విడుదలైన
CO2
(గ్రా / MJ)
విడుదలైన
CO2
(గ్రా / kWh)
సహజ వాయువు11750,30181,08
ద్రవీకృత పెట్రోలియం వాయువు13959,76215,14
ప్రొపేన్13959,76215,14
ఏవియేషన్ గ్యాసోలిన్15365,78236,81
ఆటోమొబైల్ గ్యాసోలిన్15667,07241,45
కిరోసిన్15968,36246,10
ఇంధన చమురు16169,22249,19
టైర్లు / టైర్ ఉత్పన్న ఇంధనం18981,26292,54
చెక్క, కలప వ్యర్థాలు19583,83301,79
బొగ్గు (బిటుమినస్)20588,13317,27
బొగ్గు (ఉప బిటుమినస్)21391,57329,65
బొగ్గు (లిగ్నైట్)21592,43332,75
పెట్రోలియం కోక్22596,73348,23
తారు-ఇసుక బిటుమెన్
బొగ్గు (ఆంత్రాసైట్)22797,59351,32

వివిధ శక్తి వనరుల జీవిత కాల గ్రీన్‌హౌస్ ఉద్గారాలు

2011 ఐపిసిసి నివేదికలో వివిధ శక్తి వనరులు మొత్తం జీవిత చక్రంలో విడుదల చేసే CO2 ఉద్గారాల సమీక్ష ఉంది . అన్ని సర్వేల 50 వ పెర్సెంటైల్ వద్ద ఉన్న CO2 ఉద్గార విలువలు కింద ఇచ్చాం. [86]

విద్యుత్ వనరు ద్వారా లైఫ్‌సైకిల్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు.
సాంకేతికంవివరణ50 వ పర్సెంటైల్

(g CO2/ kWhe)

జలవిద్యుత్జలాశయం4
ఓషన్ ఎనర్జీఅలలు, తరంగాలు8
పవనసాగరతీర12
విడివివిధ తరం II రియాక్టర్ రకాలు16
బయోమాస్వివిధ18
సౌర థర్మల్పారాబొలిక్ పతన22
భూఉష్ణవేడి పొడి రాక్45
సౌర పివిపాలీక్రిస్టలైన్ సిలికాన్46
సహజ వాయువుస్క్రబ్ చేయకుండా వివిధ మిశ్రమ చక్ర టర్బైన్లు469
బొగ్గుస్క్రబ్ చేయకుండా వివిధ జనరేటర్ రకాలు1001

వాతావరణం నుండి వాయువుల తొలగింపు

సహజ ప్రక్రియలు

గ్రీన్‌హౌస్ వాయువులను వాతావరణం నుండి వివిధ ప్రక్రియల ద్వారా తొలగించవచ్చు, కింది విధాలుగా -

  • భౌతిక మార్పు (ఉదా:ద్రవీభవనం, అవపాతం -ఇవి వాతావరణం నుండి నీటి ఆవిరిని తొలగిస్తాయి).
  • వాతావరణంలో జరిగే రసాయనిక చర్య. ఉదాహరణకు, మీథేన్ సహజంగా లభించే హైడ్రాక్సిల్ రాడికల్ తో చర్య జరపి ఆక్సీకరణం చెందుతుంది.
  • వాతావరణానికి, గ్రహం లోని ఇతర భాగాలకూ మధ్య జరిగే భౌతిక చర్య. వాతావరణంలోని వాయువులు మహాసముద్రాలలో కలవడం ఒక ఉదాహరణ.
  • వాతావరణానికీ గ్రహం లోని ఇతర భాగాలకూ మధ్య హద్దు వద్ద జరిగే రసాయన చర్య. వృక్షాల కిరణజన్య సంయోగక్రియ ద్వారా CO2తగ్గడం ఒక ఉదాహరణ.
  • ఫోటోకెమికల్ మార్పు . హేలోకార్బన్లు UV కాంతి వలన విశ్లేషణ చెంది, Cl·, F· వంటి ఫ్రీ ర్యాడికల్‌లను స్ట్రాటోస్ఫియరు లోకి విడుదల చేస్తాయి. ఇవి అక్కడి ఓజోన్‌పై హానికరమైన ప్రభావాలు చూపిస్తాయి.

మూలాలు