పిటాయ

పిటాయ (Pitaya) అనేది కాక్టస్ కుటుంబంలో ఒక జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం హైలోసరస్ అండాటస్ (Hylocerus Undatus). పిటాయ కాసే కాయలను డ్రాగన్ కాయలు (Dragon Fruits) అని అంటారు. ఇది రాళ్ళపై లేదా మట్టిలో పెరిగే మొక్క. పిటాయ మెక్సికో, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో పెరుగుతాయి.[1] డ్రాగన్ కాయల్లో ఎన్నో పోషక విలువలు వుండటంతో ఈ మధ్య వీటికి వాణిజ్యపరమైన డిమాండ్ పెరిగింది. ఇప్పుడు పిటాయాను ఇండొనేషియా, తైవాన్, వియత్నాం, థాయ్ లాండ్, పిలిప్పియన్స్, శ్రీలంక, మలేషియా, బంగ్లాదేశ్లో సాగు చేస్తున్నారు. ఈ మధ్యనే దక్షిణ భారతదేశంలో కూడా వీటిని కొంతమంది సాగు చేస్తున్నారు. పిటాయా సాగు ఒకినావా, హవాయ్, ఇశ్రాయేల్, పాలస్తీనా, ఆస్ట్రేలియా, చైనా, సైప్రస్ దేశాల్లో కూడా కనబడుతోంది. మార్కెట్ లో ఎక్కువ ధర పలికే డ్రాగన్ కాయ తినడానికి కొద్దిగా ముంజికాయ (Borassus flabellifer) రుచి వలె వుంటుంది. డ్రాగన్ కాయలు మెట్రో నగరాల్లో మాత్రమే లభ్యమవుతాయి.

Longitudinal section of a ripe pitahaya

సాగు

పిటాయా మొక్కలను సాధారణంగా విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేయవచ్చు. సరిగా పండిన కాయలోంచి నల్లటి గింజలను సేకరించి, నీడలో ఒక రోజు పూర్తిగా ఆరబెట్టి వుంచుకోవాలి. ఆ తర్వాత కుండీల్లో మెత్తటి నర్సరీ మట్టితో నింపాలి. విత్తనాలను కుండీ మట్టిపై చల్లి, వాటిపై పల్చగా మట్టి పొరగా వేయాలి. నీళ్ళు నెమ్మదిగా పోసి నీడలో వారం రోజులు ఒక చోట పెట్టాలి. నాటిన వారం రోజులకే విత్తనాలు మొలకెత్తుతాయి. 1 లేదా 2 అడుగుల ఎత్తు ఎదిగిన మొక్కలను పొలంలో నాటవచ్చు.

పిటాయా సాగుకు తేలికగా నీరు ఇంకిపోయే నేలలు, సుమారు 20 డిగ్రీల నుండి 40 డిగ్రీల ఎండ వేడి, నీటి సదుపాయం అవసరం. ముందుగా పొలాన్ని శుభ్రంగా దున్ని కలుపు మొక్కలు లేకుండా చేసుకొని వారం రోజులు ఎండబెట్టాలి. ప్రతి ఐదు అడుగులకు ఒక ఫెన్సింగ్ స్తంభం (Fencing Pole) చొప్పున పొలం అంతా స్తంభాలను పాతాలి. ఆ తర్వాత ప్రతి సిమ్మెంటు స్తంభం అడుగు భాగం వద్ద 1 లేదా రెండు మొక్కలను నాటి వాటిని తీగతో గాని లేదా త్రాడుతో గాని స్తంభానికి కట్టాలి. మొక్క నాటిన 2 లేక 3 సంవత్సరాలకే పుష్పిస్తుంది. పిటాయా మొక్కలకు నేల పూర్తిగా ఆరినప్పుడు మాత్రమే నీటి తడి పెట్టాలి. మొక్క నాటిన తొమ్మిది నెలలకే కాపు వచ్చి ఆరు నెలలపాటు కాపు వస్తుంది. పాతిక నుండి ముఫ్పై సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. నీటివసతి సరిగా లేని ప్రాంతాలలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్లు పెరుగుతాయి[2].

పిటాయా పువ్వులు ఆర్కిడ్ కాక్టస్ (Epiphylum Oxypetalum) వలె అర్ధరాత్రి విచ్చుకొని ఉదయానికి వాలిపోతాయి. పువ్వు రాలిన నెలకు కాయ పక్వానికి వస్తుంది. పక్వానికి వచ్చిన కాయను ముచ్చిక వద్ద చాకుతో కోయాలి. డ్రాగన్ కాయలు ఎక్కువగా నిల్వ వుండవు గనుక వాటిని కోసిన 24 గంటల లోపు మార్కెట్ కు తరలించాలి.

ఆదాయం

సైజును బట్టి ఒక్కొక్క డ్రాగన్ కాయ 200 రూపాయల నుండి 250 రూపాయలవరకూ ధర పలుకుతుంది. ఎర్రటి గుజ్జు గల డ్రాగన్ కాయ మాత్రం 400 నుండి 450 రూపాయల వరకూ ధర పలుకుతుంది.

లభ్యం

ఎక్కువ ఖరీదు పలికే డ్రాగన్ కాయలు సంపన్నులకే తప్ప మధ్య తరగతి వారికి అందుబాటులో వుండవు. గ్రామాల్లో సంపన్నులు అతి తక్కువగా వుంటారు, కనుక డ్రాగన్ కాయలను సంపన్నులు ఎక్కువగా వుండే నగరాల్లో మాత్రమే లభ్యమవుతాయి.

పోషకాలు

డ్రాగన్ పండ్ల లలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి, వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి. సుమారు 100 గ్రాముల డ్రాగన్ పండులో ఈ పోషకాలు లభిస్తాయి. క్యాలరీలు - 60 గ్రాములు ,ప్రోటీన్ - 2.0 గ్రాములు, కార్బోహైడ్రేట్లు - 9.0 గ్రాములు, కొవ్వు – 2.0 గ్రాములు, ఫైబర్ - 1.5 గ్రాములు, ఇవిగాక డ్రాగన్ పండ్ల లాభాలను చూస్తే, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది, గర్భధారణ సమయంలో రక్తహీనతను దూరం చేస్తుంది,వాపును నివారిస్తుంది, చర్మ ఆరోగ్యాన్నికాపాడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం,క్యాన్సర్-నివారణ లక్షణాలను కలిగి ఉంది,శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.[3]

భారతదేశంలో పంట

ప్రధానంగా ఉష్ణమండల దేశాలలో పెరిగే ఈ డ్రాగన్ ఫ్రూట్, ఇటీవల కాలంలో భారతదేశంలో వాణిజ్య పంటగా సాగుచేస్తున్నారు. దేశంలో పంజాబ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో విస్తారంగా వీటి సాగు జరుగుతుంది[4].

డ్రాగన్ ఫ్రూట్ ను 1990 సంవత్సరం లో భారతదేశంలో ఇంటి తోటలలో పెంచడం జరిగింది. ఈ మొక్క  నిలదొక్కుకున్న  తర్వాత 20 సంవత్సరాలకు పైగా దిగుబడి వస్తుంది. , న్యూట్రాస్యూటికల్ లక్షణాలు అధికంగా ఉండి, విలువ ఆధారిత ప్రాసెసింగ్ పరిశ్రమలకు మంచిది. డ్రాగన్ పండ్ల సాగులో  తక్కువ నిర్వహణ, అధిక లాభదాయకత భారతదేశం అంతటా వ్యవసాయం చేసేవారిని  ఆకర్షించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులతో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు బాగా పెరిగింది.మహారాష్ట్రలోని బారామతిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబియోటిక్ స్ట్రెస్ మేనేజ్ మెంట్ ఉన్నది. ఇటీవలి అంచనా ప్రకారం డ్రాగన్ పండ్లు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో 3,000-4,000 హెక్టార్లలో పండించబడుతున్నాయి. దేశం ప్రతి సంవత్సరం సుమారు 12,000 టన్నుల పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ పండును పర్షియన్ గల్ఫ్ దేశాలు, యూరోపియన్ యూనియన్ కు , యునైటెడ్ స్టేట్స్ కు  ఎగుమతి చేయవచ్చు.[5]

బయటి లంకెలు

మూలాలు