బాల్కన్లు

బాల్కన్లు, ఆగ్నేయ ఐరోపాలోని ఒక భౌగోళిక ప్రాంతం. [1] [2] బల్గేరియా అంతటా విస్తరించి ఉన్న బాల్కన్ పర్వతాల నుండి ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. దీనిని బాల్కన్ ద్వీపకల్పం అని కూడా పిలుస్తారు. దీనికి వివిధ భౌగోళిక, చారిత్రక నిర్వచనాలున్నాయి. బాల్కన్ ద్వీపకల్పానికి వాయవ్యంలో అడ్రియాటిక్ సముద్రం, నైరుతిలో అయోనియన్ సముద్రం, దక్షిణాన ఏజియన్ సముద్రం, తూర్పున టర్కిష్ జలసంధి, ఈశాన్యంలో నల్ల సముద్రం లు సరిహద్దులుగా ఉన్నాయి. ద్వీపకల్పపు ఉత్తర సరిహద్దు వివిధ రకాలుగా నిర్వచించబడింది. [3] బల్గేరియాలోని రిలా పర్వత శ్రేణిలో ఉన్న మౌంట్ ముసాలా, (2,925 metres (9,596 ft), బాల్కన్‌లోని ఎత్తైన ప్రదేశం.

బాల్కన్లు
ఫ్రొ. ఆర్.జె. క్రాంప్టన్ ప్రకారం బాల్కన్ ప్రాంతం
బాల్కన్ ద్వీపకల్పపు భౌగోళిక మ్యాపు
భూగోళశాస్త్రం
ప్రదేశంఆగ్నేయ ఐరోపా
(8–11 దేశాలు)
అక్షాంశ,రేఖాంశాలు42°N 22°E / 42°N 22°E / 42; 22
విస్తీర్ణం466,827–562,614 km2 (180,243–217,226 sq mi)
అత్యధిక ఎత్తు2,925 m (9,596 ft)
ఎత్తైన పర్వతంముసాలా (బల్గేరియా)
నిర్వహణ
జనాభా వివరాలు
జనాభా6 కోట్లు (ద్వీపకల్పంలో మాత్రమే 4.5 కోట్లు)
ఐరోపా పటంలో బాల్కన్ ద్వీపకల్పం స్థానం
బాల్కన్ ద్వీపకల్పపు టోపోగ్రాఫిక్ మ్యాప్

బాల్కన్ ద్వీపకల్ప భావనను 1808లో జర్మన్ భౌగోళిక శాస్త్రవేత్త ఆగస్ట్ జ్యూన్ రూపొందించాడు. [4] బాల్కన్ పర్వతాలు అడ్రియాటిక్ సముద్రం నుండి నల్ల సముద్రం వరకు విస్తరించి, ఆగ్నేయ ఐరోపాలోని ఆధిపత్య పర్వత వ్యవస్థగా ఉన్నాయని అతను పొరపాటు పడ్డాడు. బాల్కన్ ద్వీపకల్పం అనే పదం, 19వ శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యంలోని యూరోపియన్ ప్రావిన్సులైన రుమేలియాకు పర్యాయపదంగా ఉండేది. ఇది, భౌగోళిక నిర్వచనం కంటే భౌగోళిక రాజకీయ నిర్వచనంగానే భావించాలి. ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో యుగోస్లేవియా రాజ్యాన్ని సృష్టించే సమయంలో మరింత ప్రచారం పొందింది. బాల్కన్ ద్వీపకల్పపు సహజ సరిహద్దుల నిర్వచనం, ద్వీపకల్పానికి ఉన్న సాంకేతిక నిర్వచనానికి లోబడదు; అందువల్ల ఆధునిక భూగోళ శాస్త్రవేత్తలు బాల్కన్ ద్వీపకల్పం అనే ఆలోచనను తిరస్కరించారు. చారిత్రికులు బాల్కన్‌లను ఒక ప్రాంతం అని భావిస్తారు. ఈ పదం బాల్కనైజేషన్ [బా] అనే ప్రక్రియకు సంబంధించి, కళంకిత పదంగా, అవమానకరమైన అర్థాన్ని పొందింది. [3] [5] ఈ ప్రాంతాన్ని సూచించేందుకు ఆగ్నేయ ఐరోపా అని ప్రత్యామ్నాయంగా వాడతారు.

నిర్వచనాలు, సరిహద్దులు

బాల్కన్ ద్వీపకల్పం

బాల్కన్ దేశాలు
                     డాన్యూబ్-సావా-సోచా హద్దు ప్రకారం బాల్కన్ ద్వీపకల్పం
 బాల్కన్‌లలో చేర్చిఉన్న రాజకీయ సంఘాలు [6]
  బాల్కన్‌లలో ఉన్నట్లుగా అప్పుడప్పుడూ చూపించే రాజకీయ సంఘాలు [6]

బాల్కన్ ద్వీపకల్పానికి పశ్చిమాన అడ్రియాటిక్ సముద్రం, మధ్యధరా సముద్రం (అయోనియన్, ఏజియన్ సముద్రాలతో సహా), దక్షిణాన మర్మారా సముద్రం, తూర్పున నల్ల సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. డాన్యూబ్, సావా, కుపా నదులను దీని ఉత్తర సరిహద్దుగా సూచించడం కద్దు. [7]   బాల్కన్ ద్వీపకల్పం విస్తీర్ణం దాదాపు 470,000 km2 (181,000 sq mi) (స్పెయిన్ కంటే కొంచెం చిన్నది). ఇది ఆగ్నేయ ఐరోపా అని పిలువబడే ప్రాంతం, బాల్కన్లు - ఈ రెండూ దాదాపుగా ఒకటే

1920 నుండి రెండవ ప్రపంచ యుద్ధం వరకు ఇటలీ, బాల్కన్ ద్వీపకల్పపు సాధారణ నిర్వచనంలో ఇస్ట్రియా, కొన్ని డాల్మేషియన్ ప్రాంతాలను (జారా, నేటి జాదర్ వంటివి) కూడా ఇమిడి ఉన్నట్లు చూపించేది. ఇటలీ ప్రస్తుత భూభాగంలో, ట్రియెస్టే చుట్టూ ఉన్న కొద్ది ప్రాంతం మాత్రమే బాల్కన్ ద్వీపకల్పం లోపల ఉంది. అయితే, ట్రియెస్టే, ఇస్ట్రియా ప్రాంతాలు బాల్కన్‌లలో భాగంగా ఉన్నట్లు ఇటాలియన్ భౌగోళిక శాస్త్రవేత్తలు పరిగణించరు. బాల్కన్‌లకు వారిచ్చే నిర్వచనం ప్రకారం, దాని పశ్చిమ సరిహద్దును కుపా నది వరకే పరిమితం చేస్తారు. [8]

డాన్యూబ్ - సావా నిర్వచనం ప్రకారం బాల్కన్ ద్వీపకల్పంలోని [9] భూభాగంలో దాదాపు సగం భూభాగంలో బల్గేరియా, గ్రీస్ లు ఉంటాయి. మొత్తం వైశాల్యంలో ఇవి 23% చొప్పున ఉంటాయి.

పూర్తిగా బాల్కన్ ద్వీపకల్పంలోనే ఉన్న దేశాలు:

తమ భూభాగంలో ఎక్కువ భాగం బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్న దేశాలు (బ్రాకెట్లో ఉన్నది బాల్కన్‌లో ఉన్న భూభాగ శాతం):

  •  Greece (ప్రధాన భూభాగం): 110,496 km2 (83.7%); according to another source, 106,247 km2[12] (80.5%); including islands adjacent to the Balkan Peninsula, 126,023 km2 (95.5%)
  •  Serbia (మధ్య సెర్బియా) 55,968 km2 (63.2%); excluding Kosovo (72.2%)

పాక్షికంగా బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్న దేశాలు (బ్రాకెట్లో ఉన్నది బాల్కన్‌లో ఉన్న భూభాగ శాతం):

  •  Croatia (దక్షిణ భూభాగం): 24,013 km2 (42.4%)[13][14]
  •  Slovenia (నైరుతి భాగం): 5,000 km2 (24.7%)

బాల్కన్ ద్వీపకల్పంలో కొద్ది భాగం మాత్రమే ఉండి, ఎక్కువ భాగం వెలుపల ఉన్న దేశాలు (బ్రాకెట్లో ఉన్నది బాల్కన్‌లో ఉన్న భూభాగ శాతం):

  •  Romania (ఉత్తర దోబ్రుజా): 11,000 km2 (4.6%)
  •  Turkey (తూర్పు థ్రేస్ [b]): 23,764 km2 (3%)
  •  Italy (మోన్‌ఫాల్కోన్, ట్రియెస్టె): 200 km2 (0.1%)

బాల్కన్లు

"బాల్కన్స్" అనే పదాన్ని సాధారణంగా ఈ ప్రాంతానికి మాత్రమే ఉపయోగిస్తారు; ఇందులో ద్వీపకల్పానికి బయట ఉన్న దేశాలు కూడా కలిసి ఉండవచ్చు.

అల్బేనియా, బోస్నియా అండ్ హెర్జెగోవినా, బల్గేరియా, క్రొయేషియా, గ్రీస్, కొసోవో, మోంటెనెగ్రో, నార్త్ మాసిడోనియా, రొమేనియా, సెర్బియా, స్లోవేనియాలను బాల్కన్‌లు అంటారని చరిత్రకారులు పేర్కొన్నారు. [15] [16] దీని మొత్తం వైశాల్యం 666,700 km2 (257,400 sq mi) గా చెబుతారు. జనాభా 5,92,97,000 (2002 నాటి అంచనా). [17] ఇటలీ భూభాగంలో కొంత భాగం బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్నప్పటికీ, ఆ దేశాన్ని "బాల్కన్స్" లో చేర్చలేదు.

ఈ ప్రాంతాన్ని సూచించేందుకు, ఆగ్నేయ ఐరోపా అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. బాల్కన్ దేశాలు విడివిడిగా దక్షిణ ఐరోపా, తూర్పు ఐరోపా, మధ్య ఐరోపాతో సహా ఇతర ప్రాంతాలలో భాగంగా కూడా పరిగణించబడతాయి. టర్కీని, దాని యూరోపియన్ భూభాగంతో సహా, పశ్చిమ ఆసియా లేదా మధ్యప్రాచ్యంలో చేర్చుతారు.

ఇటీవలి చరిత్ర

ప్రపంచ యుద్ధాలు

1912-1913లో బల్గేరియా, సెర్బియా, గ్రీస్, మాంటెనెగ్రో దేశాలు ఒట్టోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడినప్పుడు మొదటి బాల్కన్ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ఫలితంగా, ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న యూరోపియన్ భూభాగాలు దాదాపుగా అన్నీ మిత్రరాజ్యాల పరమై, విభజించబడ్డాయి. తదనంతర సంఘటనలు స్వతంత్ర అల్బేనియా దేశం ఏర్పడటానికి కూడా దారితీశాయి. బల్గేరియా, యుద్ధానికి ముందరి తన ప్రాదేశిక సమగ్రతను నొక్కి చెప్పింది. మొదటి బాల్కన్ యుద్ధం ముగింపులో విజయఫలాలను పంచుకోవడంలో తన మాజీ మిత్రదేశాలైన సెర్బియా, గ్రీస్ లు తెరవెనుక ఒప్పందాలు చేసుకోవడం బల్గేరియాను రెచ్చగొట్టింది. ఆ సమయంలో, బల్గేరియా ప్రధాన థ్రాసియన్ ఫ్రంట్‌లో పోరాడుతోంది. బల్గేరియా వారిపై దాడి చేయడంతో, రెండవ బాల్కన్ యుద్ధం మొదలైంది. సెర్బ్‌లు, గ్రీకులు ఒకటై ఆ దాడులను తిప్పికొట్టారు. అయితే గ్రీకు సైన్యం బల్గేరియాపై దాడి చేయడం, అదే సమయంలో వెనుకనుండి రోమేనియా దాడి చెయ్యడంతో బల్గేరియా కూలిపోయింది. ఒట్టోమన్ సామ్రాజ్యం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తూర్పు థ్రేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది. దానితో పశ్చిమాన తన సరిహద్దులను కొత్తగా నిర్వచించుకుంది. ఆధునిక టర్కీలో భాగంగా నేటికీ అది నిలిచి ఉంది.

ప్రధానంగా సెర్బ్, యుగోస్లావ్ అనుకూల సభ్యులతో కూడిన విప్లవ సంస్థ యంగ్ బోస్నియాకు చెందిన సభ్యులు ఆస్ట్రియాకు చెందిన ఆస్ట్రో-హంగేరియన్ వారసుడు ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌ను బోస్నియా, హెర్జెగోవినా రాజధాని సారాయెవోలో హత్య చేయడంతో 1914లో బాల్కన్లలో యుద్ధం మొదలైంది. ఇది ఆస్ట్రియా-హంగేరీ, సెర్బియా మధ్య యుద్ధంగా మొదలై, అప్పటికే ఉన్న పొత్తుల గొలుసుల ద్వారా - మొదటి ప్రపంచ యుద్ధంగా మారింది. త్వరలోనే ఒట్టోమన్ సామ్రాజ్యం సెంట్రల్ పవర్స్‌లో చేరి ఆ కూటమిలో ఉన్న మూడు సామ్రాజ్యాలలో ఒకటైంది. మరుసటి సంవత్సరం బల్గేరియా కూడా సెంట్రల్ పవర్స్‌లో చేరి, సెర్బియాపై దాడి చేసింది. ఇది అప్పటికే ఉత్తరాన ఆస్ట్రో-హంగేరీతో ఒక సంవత్సరం నుండి విజయవంతంగా పోరాడుతోంది. ఈ కొత్త దాడితో సెర్బియా ఓడిపోయింది, బాల్కన్‌లలో ట్రిపుల్ ఎంటెంటె జోక్యానికి దారితీసింది. అది ఒక సైనిక దళాన్ని పంపి, ఆ యుద్ధంలో మూడవ ఫ్రంటుకు తెరదీసింది. మూడు సంవత్సరాల తరువాత, 1918లో ఎంటెంటె పక్షాన గ్రీస్, యుద్ధంలో పాల్గొనడంతో ప్రత్యర్థుల మధ్య సమతుల్యత మారి, అక్కడ జర్మన్-బల్గేరియన్ ఫ్రంట్ పతనానికి దారితీసింది. దాంతో యుద్ధం నుండి బల్గేరియా నిష్క్రమించింది. క్రమంగా, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం పతనమై , మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. [18]

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, రెండు యుద్ధాల మధ్య కాలంలో, ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ స్థితిని కొనసాగించడానికి గాను గ్రీస్, రొమేనియా, టర్కీ, యుగోస్లేవియాల మధ్య 1934 ఫిబ్రవరి 9 న ఏథెన్స్‌లో బాల్కన్ ఒడంబడిక కుదిరింది. [19]

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో, గ్రీస్ మినహా బాల్కన్ దేశాలన్నీ నాజీ జర్మనీకి మిత్రదేశాలు గానో, దానితో ద్వైపాక్షిక సైనిక ఒప్పందాలను కలిగి ఉండడమో లేదా యాక్సిస్ ఒప్పందంలో భాగం గానో ఉన్నాయి. ఫాసిస్ట్ ఇటలీ, గ్రీస్‌పై దాడి చేయడానికి తన రక్షణలో ఉన్న అల్బేనియాను ఉపయోగించడం ద్వారా బాల్కన్‌ల లోకి యుద్ధాన్ని విస్తరించింది. గ్రీకులు ఆ దాడిని తిప్పికొట్టి, ఇటలీ ఆధీనంలో ఉన్న అల్బేనియాపై దాడి ఎదురుదాడి చేశారు. దీనితో బాల్కన్‌లో తన మిత్రదేశానికి మద్దతుగా నాజీ జర్మనీ జోక్యం చేసుకోవడానికి కారణమయ్యారు. [20] జర్మన్ దండయాత్రకు కొన్ని రోజుల ముందు, బెల్గ్రేడ్‌లో తటస్థ సైనిక సిబ్బంది తిరుగుబాటు చేసి, అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. [21]

కొత్త ప్రభుత్వం యాక్సిస్ సభ్యునిగా తన బాధ్యతలను నెరవేర్చే ఉద్దేశాలను పునరుద్ఘాటించినప్పటికీ, [22] జర్మనీ, బల్గేరియాతో కలిసి గ్రీస్, యుగోస్లేవియా రెండింటినీ ఆక్రమించింది. సెర్బియా రాజుకు, క్రొయేషియన్ యూనిట్లకూ విధేయులుగా ఉన్నవారు తిరుగుబాటు చేయడంతో యుగోస్లేవియా వెంటనే విచ్ఛిన్నమైంది. [23] గ్రీస్ ప్రతిఘటించింది గానీ, రెండు నెలల పోరాటం తర్వాత, కూలిపోయి, ఆక్రమించబడింది. ఈ రెండు దేశాలను మూడు యాక్సిస్ మిత్రదేశాలైన బల్గేరియా, జర్మనీ, ఇటలీలు పంచుకున్నాయి. ఇటలీ, జర్మనీల తోలుబొమ్మ రాజ్యమైన క్రొయేషియా కూడా కొంత భాగాన్ని పంచుకుంది.

ఆక్రమణ సమయంలో, అణచివేత, ఆకలి కారణంగా జనాభా గణనీయమైన కష్టాలను ఎదుర్కొంది. దీనికి ప్రజలు ప్రతిఘటన ఉద్యమాన్ని లేవదీసారు. [24] ఆ సంవత్సరం ముందే వచ్చిన శీతాకాలం, పైగా తీవ్రమైన చలి వలన (దీని వలన పేద జనాభాలో వందల వేల మంది మరణాలు సంభవించాయి), జర్మనీ రష్యాపై తలపెట్టిన దండయాత్ర టైమ్‌టేబుల్‌లో గణనీయమైన జాప్యం జరిగింది. [25] దానివలన యుద్ధంలో ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయి [26]

చివరగా, 1944 చివరిలో, సోవియట్ లు రొమేనియా, బల్గేరియాల్లోకి ప్రవేశించి జర్మన్లను బాల్కన్ నుండి తరిమేసారు. వారు చేసిన యుద్ధకాల దోపిడీ కారణంగా ఆ ప్రాంతం దాదాపు శిథిలమయమై పోయింది.

ప్రచ్ఛన్న యుద్ధం

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, బాల్కన్‌లోని చాలా దేశాలను కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు పరిపాలించాయి. ప్రచ్ఛన్న యుద్ధంలో గ్రీస్ మొదటి యుద్ధభూమిగా మారింది. 1944 నుండి 1949 వరకు జరిగిన అంతర్యుద్ధానికి, అమెరికా ప్రతిస్పందనగా ట్రూమన్ సిద్ధాంతం వచ్చింది. పొరుగు దేశాల (అల్బేనియా, బల్గేరియా, యుగోస్లేవియా) కమ్యూనిస్ట్ వాలంటీర్ల మద్దతుతో గ్రీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించిన ఈ అంతర్యుద్ధం, కమ్యూనిస్ట్-యేతర గ్రీకు ప్రభుత్వానికి అమెరికా భారీగా సహాయం చేసేందుకు దారితీసింది. ఈ మద్దతుతో గ్రీసు, పక్షపాతులను ఓడించగలిగింది. చివరికి, ఆ ప్రాంతంలోని రెండు కమ్యూనిస్టేతర దేశాలలో ఒకటిగా (టర్కీతో పాటు) నిలిచింది.

అయితే, కమ్యూనిస్ట్ ప్రభుత్వాల క్రింద ఉన్నప్పటికీ, యుగోస్లేవియా (1948), అల్బేనియా (1961) లు సోవియట్ యూనియన్‌తో విభేదించాయి. మార్షల్ జోసిప్ బ్రోజ్ టిటో (1892-1980) నేతృత్వంలోని యుగోస్లేవియా, మొదట బల్గేరియాతో విలీనమయ్యే ఆలోచనను తిరస్కరించింది. బదులుగా పాశ్చాత్య దేశాలతో సన్నిహిత సంబంధాలకు ప్రయత్నించింది. తరువాత భారతదేశం, ఈజిప్టులతో కలిసి అలీన ఉద్యమానికి నాయకత్వం వహించింది. మరోవైపు అల్బేనియా, తొలుత కమ్యూనిస్టు చైనా వైపు ఆకర్షితురాలై, ఆ తర్వాత ఏకాంత వైఖరిని అవలంబించింది.

1953 ఫిబ్రవరి 28 న, గ్రీస్, టర్కీ, యుగోస్లేవియాలు 1953 నాటి బాల్కన్ ఒప్పందాన్ని రూపొందిస్తూ, అంకారాలో స్నేహ, సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. బాల్కన్‌లలో సోవియట్ విస్తరణను నిరోధించడం, చివరికి మూడు దేశాలకు ఉమ్మడి సైనిక సిబ్బందిని సృష్టించడం ఈ ఒప్పందపు లక్ష్యం. ఒప్పందంపై సంతకం చేసినప్పుడు, టర్కీ, గ్రీస్ లు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)లో సభ్యులుగా ఉండగా, యుగోస్లేవియా అలీన కమ్యూనిస్ట్ దేశంగా ఉంది. ఈ ఒడంబడికతో యుగోస్లేవియా నాటోతో పరోక్షంగా అనుబంధం పొందగలిగింది. అయితే, ఈ ఒప్పందం 20 ఏళ్లపాటు అమల్లో ఉండేలా ప్రణాళిక చేసినప్పటికీ, 1960 లోనే అది రద్దయిపోయింది. [27]

ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత

1990వ దశకంలో, ప్రజాస్వామ్య స్వేచ్ఛా-మార్కెట్ సమాజాల వైపు మాజీ-ఈస్టర్న్ బ్లాక్ దేశాల పరివర్తన శాంతియుతంగా సాగింది. అలీన దేశమైన యుగోస్లేవియాలో, స్లోవేనియా, క్రొయేషియాలు స్వేచ్ఛా ఎన్నికలను నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణల్లో తమతమ దేశాల ప్రజలు స్వాతంత్ర్యం కోసం ఓటు వేసిన తర్వాత మాజీ యుగోస్లావ్ రిపబ్లిక్‌ల మధ్య యుద్ధాలు జరిగాయి. సెర్బియా, యూనియన్ రద్దు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. యథాతథ స్థితిని కొనసాగించడంలో యుగోస్లావ్ పీపుల్స్ ఆర్మీ విఫలమైంది. స్లోవేనియా, క్రొయేషియాలు 1991 జూన్ 25 న స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. దీంతో క్రొయేషియాలో క్రొయేషియా స్వాతంత్ర్య యుద్ధం, స్లోవేనియాలో పది రోజుల యుద్ధం మొదలయ్యాయి. యుగోస్లావ్ దళాలు 1991లో స్లోవేనియా నుండి వైదొలిగాయి. క్రొయేషియాలో యుద్ధం 1995 చివరి వరకు కొనసాగింది. ఈ రెంటి తర్వాత, మాసిడోనియా, ఆ తరువాత బోస్నియా హెర్జెగోవినా లలో యుద్ధాలు మొదలయ్యాయి. దీంతో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుంది. బోస్నియా అండ్ హెర్జెగోవినా, FR యుగోస్లేవియా (అంటే సెర్బియా, మోంటెనెగ్రో) లలో నాటో దళాలు జోక్యం చేసుకుని సెర్బియా దళాలపై దాడులు చేసాయి.

పూర్వ యుగోస్లేవియా భూభాగంలోని దేశాలు, 2008

యుగోస్లేవియా రద్దవడంతో, ఆరు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దేశాలు సార్వభౌమాధికారాన్ని సాధించాయి. అవి: స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా అండ్‌ హెర్జెగోవినా, ఉత్తర మాసిడోనియా, మోంటెనెగ్రో, సెర్బియా. ఇవన్నీ సాంప్రదాయకంగా బాల్కన్‌లలో భాగంగానే భావించేవారు. అయితే ఇది తరచూ వివాదాస్పదమవుతూ ఉండేది. 2008లో, ఐక్యరాజ్య సమితి పరిపాలనలో ఉన్న కొసోవో స్వాతంత్ర్యం ప్రకటించుకుంది (సెర్బియా అధికారిక విధానం ప్రకారం, కొసోవో ఇప్పటికీ ఆ దేశపు అంతర్గత స్వయంప్రతిపత్త ప్రాంతమే). 2010 జూలైలో అంతర్జాతీయ న్యాయస్థానం, కోసోవో స్వాతంత్ర్య ప్రకటన చట్టబద్ధమైనదేనని తీర్పునిచ్చింది. [28] చాలా ఐరాస సభ్య దేశాలు కొసోవోను గుర్తించాయి. యుద్ధాలు ముగిసిన తర్వాత సెర్బియాలో విప్లవం చెలరేగింది, సెర్బియా కమ్యూనిస్ట్ నాయకుడైన స్లోబోడాన్ మిలోసెవిచ్ (1989 - 2000 మధ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు) పదవీచ్యుతుడయ్యాడు. యుగోస్లావ్ సమయంలో అంతర్జాతీయ మానవతా చట్టానికి వ్యతిరేకంగా అతడు చేసిన నేరాలకు గాను అతన్ని అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్‌కు అప్పగించారు. ట్రిబ్యునల్ తీర్పు వెలువడకముందే 2006 లో, మిలోసెవిచ్ గుండెపోటుతో మరణించాడు. 2001లో మాసిడోనియా (నార్త్ మాసిడోనియా)లో అల్బేనియన్ తిరుగుబాటు కారణంగా అల్బేనియన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వారికి స్థానిక స్వయంప్రతిపత్తిని కల్పించవలసి వచ్చింది.

యుగోస్లేవియా రద్దుతో, మాజీ (ఫెడరేటెడ్) రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియాకు పేరు ఏది ఉండాలనే అంశంపై కొత్త దేశమైన మాసిడోనియాకు, గ్రీస్‌కూ మధ్య ఒక సమస్య ఉద్భవించింది. చివరికి ఈ వివాదం 2018 జూన్ లో ఐరాస మధ్యవర్తిత్వంలో పరిష్కరించబడి, ప్రెస్పా ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం, ఈ దేశానికి 2019లో ఉత్తర మాసిడోనియాగా పేరు మార్చారు.

గణాంకాలు

ఆల్బేనియాబోస్నియా, హెర్జెగోవినాబల్గేరియాక్రొయేషియాగ్రీస్కొసోవో[a]మోంటెనెగ్రోఉత్తర మాసిడోనియారొమేనియాసెర్బియాస్లోవేనియాటర్కీ
జెండా
కోట్ ఆఫ్ ఆర్మ్స్  Albania  Bosnia and Herzegovina  Kosovo  Romania  Serbia  Slovenia
రాజధానిటిరానాసారాయెవోసోఫియాజాగ్రెబ్ఏథెెన్స్ప్రిస్టినాపోడ్‌గోరికాస్కోప్యేబుకారెస్ట్బెల్గ్రేడ్ల్యుబ్ల్యానాఅంకారా
స్వాతంత్ర్యం1912 నవంబరు 281992 మార్చి 31908 అక్టోబరు 51991 జూన్ 261821 మార్చి 252008 ఫిబ్రవరి 172006 జూన్ 31991 నవంబరు 171878 మే 92006 జూన్ 51991 జూన్ 251923 అక్టోబరు 29
జనాభా (2019) 2,862,427 3,502,550 (2018) 7,000,039 4,076,246 10,722,287 1,795,666 622,182 2,077,132 19,401,658 6,963,764 2,080,908 82,003,882
విస్తీర్ణం28,749 km251,197 km2111,900 km256,594 km2131,117 km210,908 km213,812 km225,713 km2238,391 km277,474 km2[29]20,273 km2781,162 km2
జన సాంద్రత100/km269/km297/km274/km282/km2159/km245/km281/km283/km291/km2102/km2101/km2
నీటి ప్రాంతం (%)4.7%0.02%2.22%1.1%0.99%1.00%2.61%1.09%2.97%0.13%0.6%1.3%
GDP (నామమాత్రం, 2019) $15.418 bln $20.106 bln $66.250 bln $60.702 bln $214.012 bln $8.402 bln $5.424 bln $12.672 bln $243.698 bln $55.437 bln $54.154 bln $774.708 bln
GDP (PPP, 2018) $38.305 bln $47.590 bln $162.186 bln $107.362 bln $312.267 bln $20.912 bln $11.940 bln $32.638 bln $516.359 bln $122.740 bln $75.967 bln $2,300 bln
తలసరి GDP (నామినల్, 2019) $5,373 $5,742 $9,518 $14,950 $19,974 $4,649 $8,704 $6,096 $12,483 $7,992 $26,170 $8,958
తలసరి GDP (PPP, 2018) $13,327 $13,583 $23,169 $26,256 $29,072 $11,664 $19,172 $15,715 $26,448 $17,552 $36,741 $28,044
జినీ సూచిక (2018)29.0 తక్కువ (2012)[30]33.0 మధ్యస్థం (2011)[31] 39.6 మధ్యస్థం 29.7 తక్కువ 32.3 మధ్యస్థం 29.0 తక్కువ (2017)[32] 36.7 మధ్యస్థం (2017) 31.9 మధ్యస్థం 35.1 మధ్యస్థం 35.6 మధ్యస్థం 23.4 తక్కువ 43.0 మధ్యస్థం
HDI (2018) 0.791 ఎక్కువ 0.769 ఎక్కువ 0.816 చాలా ఎక్కువ 0.837 చాలా ఎక్కువ 0.872 చాలా ఎక్కువ0.739 ఎక్కువ (2016) 0.816 చాలా ఎక్కువ 0.759 ఎక్కువ 0.816 చాలా ఎక్కువ 0.799 ఎక్కువ 0.902 చాలా ఎక్కువ 0.806 చాలా ఎక్కువ
IHDI (2018) 0.705 ఎక్కువ 0.658 మధ్యస్థం 0.713 ఎక్కువ 0.768 ఎక్కువ 0.766 ఎక్కువ N/A 0.746 ఎక్కువ 0.660 మధ్యస్థం 0.725 ఎక్కువ 0.710 ఎక్కువ 0.858 చాలా ఎక్కువ 0.676 మధ్యస్థం
ఇంటర్నెట్ TLD.al.ba.bg.hr.grDoesn't have.me.mk.ro.rs.si.tr
కాలింగ్ కోడ్+355+387+359+385+30+383+382+389+40+381+386+90

జనాభా

ఈ ప్రాంతంలో అల్బేనియన్లు, అరోమేనియన్లు, బల్గేరియన్లు, బోస్నియాక్స్, క్రొయేట్స్, గోరాని, గ్రీకులు, ఇస్ట్రో-రొమేనియన్లు, మాసిడోనియన్లు, మెగ్లెనో -రొమేనియన్లు, మాంటెనెగ్రిన్స్, సెర్బ్స్, స్లోవేనియన్లు, రొమేనియన్లు నివసిస్తున్నారు. రోమానీ, అష్కాలి వంటి మైనారిటీలు, ఇతర మైనర్ జాతులు కూడా ఇక్కడ నివసిస్తున్నారు.

దేశంజనాభా (2018) [33]సాంద్రత/కిమీ2 (2018) [34]ఆయుర్దాయం (2018) [35]
అల్బేనియా28,70,32410078.3 సంవత్సరాలు
బోస్నియా ,హెర్జెగోవినా35,02,5506977.2 సంవత్సరాలు
బల్గేరియా70,50,0346479.9 సంవత్సరాలు
క్రొయేషియా41,05,4937376.2 సంవత్సరాలు
గ్రీస్1,07,68,1938280.1 సంవత్సరాలు
కొసోవో17,98,50616577.7 సంవత్సరాలు
మోంటెనెగ్రో6,22,3594576.4 సంవత్సరాలు
ఉత్తర మాసిడోనియా20,75,3018176.2 సంవత్సరాలు
రొమేనియా1,95,23,6218276.3 సంవత్సరాలు
సెర్బియా70,01,4449076.5 సంవత్సరాలు
స్లోవేనియా20,66,880.10280.3 సంవత్సరాలు
టర్కీ1,19,29,013 [36]10178.5 సంవత్సరాలు

మతం

మతపరమైన తెగలను చూపుతున్న మ్యాప్

ఆర్థడాక్స్ క్రిస్టియానిటీ, ఇస్లాం, రోమన్ క్యాథలిక్ క్రిస్టియానిటీలకు ఈ ప్రాంతం సమ్మేళనం వంటిది. [37] బాల్కన్ ద్వీపకల్పం, బాల్కన్ ప్రాంతం రెండింటిలోనూ తూర్పు ఆర్థోడాక్స్, మెజారిటీ మతంగా ఉంది. తూర్పు, ఆగ్నేయ ఐరోపా చరిత్ర, సంస్కృతిలో తూర్పు ఆర్థోడాక్స్ చర్చి ప్రముఖ పాత్ర పోషించింది. [38] ప్రతి మతం లోనూ విభిన్న సంప్రదాయాలను ఇక్కడ ఆచరిస్తారు. తూర్పు ఆర్థోడాక్స్ దేశాల్లో వాటివాటి స్వంత జాతీయ చర్చి ఉంటుంది. బాల్కన్‌లోని జనాభాలో కొంత భాగం తమను తాము మతాతీతంగా నిర్వచించుకుంటారు.

జనాభాలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్న ప్రాంతంలో ఇస్లాంకు గణనీయమైన చరిత్ర ఉంది. 2013 అంచనా ప్రకారం బాల్కన్‌లోని మొత్తం ముస్లిం జనాభా సుమారు 80 లక్షలు. [39] అల్బేనియా, బోస్నియా-హెర్జెగోవినా, కొసోవో వంటి దేశాలలో ఇస్లాం అతిపెద్ద మతం. బల్గేరియా, నార్త్ మాసిడోనియా, మోంటెనెగ్రోలలో ముస్లిం మైనారిటీలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. రొమేనియా, సెర్బియా, గ్రీస్‌లో కూడా ముస్లింలు, తక్కువగానే అయినప్పటికీ, ఉన్నారు. [39]

ప్రధాన మతం తూర్పు ఆర్థోడాక్సీ (బ్రాకెట్లలో ఇక్కడి జాతీయ చర్చిలు ఉన్నాయి) [40]ఈ భూభాగాల్లోని మతపరమైన మైనారిటీలు [40]
బల్గేరియా: 59% ( బల్గేరియన్ ఆర్థోడాక్స్ చర్చి )ఇస్లాం (8%), ప్రకటించనిది (27%)
గ్రీస్: 81-90% ( గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చి )ఇస్లాం (2%), కాథలిక్కులు, ఇతరులు, ప్రకటించనివి
మాంటెనెగ్రో: 72% ( సెర్బియన్ ఆర్థోడాక్స్ చర్చి )ఇస్లాం (19%), కాథలిక్కులు (3%), ఇతరులు, ప్రకటించని (5%)
ఉత్తర మాసిడోనియా: 64% ( మాసిడోనియన్ ఆర్థోడాక్స్ చర్చి )ఇస్లాం (33%), కాథలిక్కులు
రొమేనియా: 81% ( రొమేనియన్ ఆర్థోడాక్స్ చర్చి )ప్రొటెస్టాంటిజం (6%), కాథలిక్కులు (5%), ఇతరులు, ప్రకటించని (8%)
సెర్బియా: 84% ( సెర్బియన్ ఆర్థోడాక్స్ చర్చి )కాథలిక్కులు (5%), ఇస్లాం మతం (3%), ప్రొటెస్టంటిజం (1%), ఇతరులు, ప్రకటించని (6%)
ప్రధాన మతం కాథలిక్కులు [40]ఈ భూభాగాల్లోని మతపరమైన మైనారిటీలు [40]
క్రొయేషియా (86%)తూర్పు సంప్రదాయం (4%), ఇస్లాం (1%), ఇతరులు, ప్రకటించని (7%)
స్లోవేనియా (57%)ఇస్లాం (2%), ఆర్థడాక్స్ (2%), ఇతరులు, ప్రకటించని (36%)
ఇస్లాం ప్రధాన మతంగా ఉన్న దేశాలు [40]ఈ దేశాల్లో మతపరమైన మైనారిటీలు [40]
అల్బేనియా (58%)కాథలిక్కులు (10%), సనాతన ధర్మం (7%), ఇతరులు, ప్రకటించని (24%)
బోస్నియా, హెర్జెగోవినా (51%)సనాతన ధర్మం (31%), కాథలిక్కులు (15%), ఇతరులు, ప్రకటించని (4%)
కొసోవో (95%)కాథలిక్కులు (2%), సనాతన ధర్మం (2%), ఇతరులు, ప్రకటించని (1%)
టర్కీ (90-99% [40] [c])సనాతన ధర్మం, మతపరమైన (5%-10%)

భాషలు

భాషాపరంగా బాల్కన్ ప్రాంతం చాలా వైవిధ్యమైనది. ఇది అనేక స్లావిక్, రొమాన్స్ భాషలకూ అలాగే అల్బేనియన్, గ్రీక్, టర్కిష్, హంగేరియన్ తదితర భాషలకూ నిలయం. బాల్కన్ దేశాలలో నివసిస్తున్న రోమానీలలో ఎక్కువ భాగం రోమాని మాట్లాడతారు. చరిత్రలో, అనేక ఇతర జాతుల సమూహాలు తమ స్వంత భాషలతో ఈ ప్రాంతంలో నివసించాయి. వారిలో థ్రేసియన్లు, ఇల్లిరియన్లు, రోమన్లు, సెల్ట్స్, వివిధ జర్మానిక్ తెగలు ఉన్నాయి. టర్కిక్ భాషలు (ఉదా, టర్కిష్, గగౌజ్), హంగేరియన్ మినహా, పైన పేర్కొన్న భాషలన్నీ విస్తృతమైన ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి.

దేశంఎక్కువగా మాట్లాడే భాష [41]భాషాపరమైన మైనారిటీలు [41]
 Albania98% అల్బేనియన్2% ఇతరులు
 Bosnia and Herzegovina53% బోస్నియన్31% సెర్బియన్ (అధికారిక), 15% క్రొయేషియన్ (అధికారిక), 2% ఇతరులు
 Bulgaria86% బల్గేరియన్8% టర్కిష్, 4% రోమానీ, 1% ఇతరులు, 1% పేర్కొనబడలేదు
 Croatia96% క్రొయేషియన్1% సెర్బియన్, 3% ఇతరులు
 Greece99% గ్రీకు1% ఇతరులు
 Kosovo94% అల్బేనియన్2% బోస్నియన్, 2% సెర్బియన్ (అధికారిక), 1% టర్కిష్, 1% ఇతరులు
 Montenegro43% సెర్బియన్37% మాంటెనెగ్రిన్ (అధికారిక), 5% అల్బేనియన్, 5% బోస్నియన్, 5% ఇతరులు, 4% పేర్కొనబడలేదు
 North Macedonia67% మాసిడోనియన్25% అల్బేనియన్ (అధికారిక), 4% టర్కిష్, 2% రోమానీ, 1% సెర్బియన్, 2% ఇతరులు
 Romania85% రోమేనియన్6% హంగేరియన్, 1% రోమానీ
 Serbia88% సెర్బియన్3% హంగేరియన్, 2% బోస్నియన్, 1% రోమానీ, 3% ఇతరులు, 2% పేర్కొనబడలేదు
 Slovenia91% స్లోవేనే5% సెర్బో-క్రొయేషియన్, 4% ఇతరులు
 Turkey85% టర్కిష్ [42]12% కుర్దిష్, 3% ఇతరులు, పేర్కొనబడలేదు [42]

పట్టణీకరణ

బాల్కన్‌లోని చాలా దేశాలు పట్టణీకరణ చెందాయి, మొత్తం జనాభాలో అతి తక్కువ పట్టణ జనాభా శాతం కలిగిన దేశాల్లో 40% కంటే తక్కువగా కొసోవో, 40% తో బోస్నియా అండ్ హెర్జెగోవినా, 50% తో స్లోవేనియా ఉన్నాయి. [43]

అతిపెద్ద నగరాల జాబితా:

నగరందేశంపట్టణ ప్రాంతంనగరం మాత్రమేసంవత్సరం
ఇస్తాంబుల్  Turkey1,00,97,8621,00,97,8622019[44]
ఏథెన్స్  Greece37,53,7836,64,0462018[45]
బుకారెస్ట్  Romania22,72,16318,87,4852018[46]
సోఫియా  Bulgaria19,95,95013,13,5952018[47]
బెల్గ్రేడ్  Serbia16,59,44011,19,6962018[48]
జాగ్రెబ్  Croatia11,13,1117,92,8752011[49]
టెల్కిర్‌డాగ్  Turkey10,55,41210,55,4122019[50]
థెస్సలోనికి  Greece10,12,2973,25,1822018[45]
టిరానా  Albania8,00,9864,18,4952018[51]
లుబ్ల్జానా  Slovenia5,37,7122,92,9882018[52]
స్కోప్జే  Macedonia5,06,9264,44,8002018[53]
స్థిరత్వం  Romania4,25,9162,83,8722018[46]
క్రయోవా  Romania4,20,0002,69,5062018[46]
ఎడిర్నే  Turkey4,13,9033,06,4642019[54]
సారాజెవో  Bosnia and Herzegovina4,13,5932,75,5242018
క్లజ్-నపోకా  Romania4,11,3793,24,5762018[46]
ప్లోవ్డివ్  Bulgaria3,96,0924,11,5672018[47]
వర్ణం  Bulgaria3,83,0753,95,9492018[47]
లాసి  Romania3,82,4842,90,4222018[46]
బ్రాసోవ్  Romania3,69,8962,53,2002018[46]
కిర్క్లరేలి  Turkey3,61,8362,59,3022019[55]
టిమిసోరా  Romania3,56,4433,19,2792018[46]
నోవి సాడ్  Serbia3,41,6252,77,5222018[56]
స్ప్లిట్  Croatia3,25,6001,61,3122021[49]

b ఇస్తాంబుల్ నగరం లోని ఐరోపా ప్రాంతమే బాల్కన్ల లోకి వస్తుంది.[57] నగరం లోని మొత్తం జనాభా 15,519,267 లో రెండింట మూడు వంతులు ఇందులోకి వస్తుంది.[44]

గమనికలు

గ.  ^ ఒక దేశం లేదా ప్రాంతం అనేక ముక్కలు చెక్కలుగా విడిపోవడాన్ని బాల్కనైజేషను అంటారు. ఈ శకలాలు ఒకదానితో ఒకటి కలహించుకుంటూనో లేదా పరస్పరం అసహిష్ణుత తోనో ఉండవచ్చు. జాతి పరమైన, సాంస్కృతిక, మత పరమైన వైరుధ్యాలు దీనికి కారణంగా ఉంటాయి. గతకాలపు ధ్వేష భావాలు కూడా కారణం కావచ్చు. ఈ విచ్ఛిన్నానికి బయటి శక్తులు కారణమైన సందర్భంలో, ఆ బయటి శక్తులను ఉద్దేశించి ఈ పదాన్ని అవమానకరమైన అర్థంలో ఉపయోగిస్తారు. [58] వివాదాస్పదమైన మరొక అర్ధంలో,[59] ఈ విభజనలను, విచ్ఛిన్నాలనూ, వేర్పాటునూ వ్యతిరేకించి, యథాతథ స్థితిని కొనసాగించాలని కోరుకునే శక్తులు కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తాయి. బాల్కనైజేషను అనేది ఒక రకమైన రాజకీయ విచ్ఛిన్నం.
a.  ^ కొసోవో రాజకీయ స్థితి వివాదాస్పదంగా ఉంది. 2008 లో సెర్బియా నుండి స్వాతంత్ర్యాన్ని ఏకపక్షంగా ప్రకటించుకున్నాక, 101 ఐరాస సభ్య దేశాలు లాంఛనంగా కోసోవోను స్వతంత్ర దేశంగా గుర్తించాయి (మరో 13 దేశాలు ఏదో ఒక సందర్భంలో గుర్తించినప్పటికీ అ తరువాత దాన్ని వెనక్కు తీసుకున్నాయి). 92 దేశాలు దాన్ని గుర్తించలేదు. సెర్బియా మాత్రం కోసోవోను తన సార్వభౌమిక ప్రాంతం లోని భాగంగానే పరిగణిస్తోంది.
b.  ^ ది వరల్డ్ ఫోయాక్ట్‌బుక్ ఉదహరించినట్లు, టర్కీ, ఆగ్నేయ ఐరోపాకు సంబంధించి; "బాస్పోరస్‌కు పశ్చిమాన ఉన్న టర్కీ భాగం భౌగోళికంగా ఐరోపాలో భాగం."
c.  ^ టర్కీ లోని ఐరోపా భాగపు జనాభా మాత్రమే. 7,56,27,384 జనాభా (జనసాంద్రత 97) ఉన్న అనటోలియా ద్వీపకల్పం అందులో భాగం కాదు.

మూలాలు