బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనా ప్రభుత్వం 2013 లో చేపట్టిన ప్రపంచవ్యాప్త అభివృద్ధి వ్యూహం. ఆసియా, యూరప్, ఆఫ్రికాల్లోని దాదాపు 70 దేశాలు, అంతర్జాతీయ సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులు ఇందులో భాగంగా ఉన్నాయి. [1] [2]

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్
స్థాపన2013; 11 సంవత్సరాల క్రితం (2013)
2017 (2017) (Forum)
కేంద్రీకరణ"పరస్పర సాంస్కృతిక మార్పిడి ద్వారా ఏకీకృతమైన పెద్ద మార్కెట్టును నిర్మించడం, అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లను పూర్తిగా ఉపయోగించుకోవడం. సభ్యదేశాల మధ్య పరస్పర అవగాహనను, విశ్వాసాన్నీ పెంపొందించడం. అంతిమంగా మూలధన ప్రవాహం, ప్రతిభా సంచయం, టెక్నాలజీ డేటాబేస్ లను పెంపొందించడం"
కార్యస్థానం
సేవా ప్రాంతాలుఆసియా
ఆఫ్రికా
ఐరోపా
మధ్య ఆసియా
అమెరికాలు
నేత షీ జిన్‌పింగ్ (2019)

చైనా సర్వోన్నత నాయకుడు షీ జిన్‌పింగ్ మొదట 2013 లో ఇండోనేషియా, కజకిస్థాన్‌లలో చేసిన అధికారిక పర్యటనల సందర్భంగా ఈ వ్యూహాన్ని ప్రకటించారు. ఈ పేరులోని "బెల్ట్" అనేది నేలపై నున్న రోడ్లు, రైలు మార్గాలను సూచిస్తుంది. దీనిని " సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ " అని పిలుస్తారు; పేరు లోని "రోడ్", సముద్ర మార్గాలను సూచిస్తుంది. దీన్ని 21 వ శతాబ్దపు మారిటైమ్ సిల్క్ రోడ్డును అనవచ్చు.[3]

గతంలో దీన్ని వన్ బెల్ట్ వన్ రోడ్ అనేవారు. 2016 నుండి దీనిని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI ) గా పిలుస్తున్నారు. ఆ పేరులో వన్ అనే పదానికిస్తున్న ప్రాధాన్యత వలన ఈ పథకాన్ని పార్థం చేసుకునే అవకాశం ఉందని చైనా ప్రభుత్వం భావించింది. అయితే, "వన్ బెల్ట్ వన్ రోడ్" అనే పేరును ఇప్పటికీ చైనీస్ భాషా మీడియాలో వాడుతున్నారు.[4]

చైనా ప్రభుత్వం, "ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడానికీ, ఉజ్వల భవిష్యత్తును సాధించడానికీ చేసే ప్రయత్నం" అని ఈ కార్యక్రమం గురించి చెబుతుంది.[5] కొంతమంది పరిశీలకులు దీనిని చైనా కేంద్రంగా వాణిజ్య నెట్‌వర్కును నెలకొల్పి, తద్వారా ప్రపంచ వ్యవహారాల్లో చైనా ఆధిపత్యం స్థాపించే ప్రయత్నంగా చూస్తారు.[6] [7] ఈ ప్రాజెక్టును పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడిన 100 వ వార్షికోత్సవమైన 2049 నాటికి పూర్తి చెయ్యాలని సంకల్పించారు.[8]

చరిత్ర

2013 సెప్టెంబరు, అక్టోబరు నెలలలో కజకిస్తాన్, ఇండోనేషియా సందర్శనల సందర్భంగా చైనా సర్వోన్నత నాయకుడు షీ జిన్‌పింగ్ ఈ పథకాన్ని ఆవిష్కరించాడు. [9] ఆసియా, ఐరోపా పర్యటనల సందర్భంగా చైనా ప్రధాని లీ కెకియాంగ్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఈ కార్యక్రమానికి చైనా ప్రభుత్వ మాధ్యమాలు విస్తారంగా ప్రాచుర్యం కల్పించాయి. 2016 నాటికి ఈ పథకానికి చెందిన విశేషాలను చైనా పీపుల్స్ డైలీ తరచూ ప్రచురిస్తూండేది.

ప్రారంభంలో, ఈ చొరవను వన్ బెల్ట్ వన్ రోడ్ స్ట్రాటజీ (వ్యూహం) అని పిలిచేవారు. కాని చైనా అధికారులు "వ్యూహం" అనే పదం అనుమానాలను సృష్టిస్తుందని భావించి దాని ఇంగ్లీషు అనువాదాన్ని "ఇనిషియేటివ్" గా మార్చారు. [10]

తొలి లక్ష్యాలు

పేర్కొన్న లక్ష్యాలు "సభ్య దేశాల మధ్య పరస్పర అవగాహననూ నమ్మకాన్నీ పెంపొందించడం మొదలైన చర్యల ద్వారా ఏకీకృత పెద్ద మార్కెట్‌ను నిర్మించడం, సాంస్కృతిక మార్పిడి ద్వారా అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లను పూర్తిగా ఉపయోగించుకోవడం. అంతిమంగా మూలధన ప్రవాహం, టాలెంట్ పూల్‌, టెక్నాలజీ డేటాబేస్ లను పెంపొందించడం " తొలుత మౌలిక సదుపాయాల పెట్టుబడి, విద్య, నిర్మాణ సామగ్రి, రైల్వేలు, హైవేలు, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, పవర్ గ్రిడ్, ఇనుము-ఉక్కు లపై దృష్టి పెట్టారు. [11] ఇప్పటికే, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ చరిత్రలో అతిపెద్ద మౌలిక సదుపాయాలు, పెట్టుబడి ప్రాజెక్టులలో ఒకటిగా కొన్ని అంచనాలు పేర్కొన్నాయి. ఈ పథకంలో 68 కి పైగా దేశాలు ఉన్నాయి, వీటిలో ప్రపంచ జనాభాలో 65%, 2017 నాటికి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 40% ఈ పథకంలో భాగం. [12] [13]

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ "మౌలిక సదుపాయాల అంతరాన్ని" పరిష్కరిస్తుంది. తద్వారా ఆసియా పసిఫిక్ ప్రాంతం, ఆఫ్రికా, మధ్య ఐరోపా, తూర్పు ఐరోపా లంతటా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే అవకాశం ఉంది. వరల్డ్ పెన్షన్ కౌన్సిల్ (డబ్ల్యుపిసి) ఇచ్చిన నివేదిక ప్రకారం చైనాను మినహాయించి ఆసియా దేశాల్లోని మౌలిక సదుపాయాల్లో వచ్చే దశాబ్దంలో సంవత్సరానికి US $ 900 బిలియన్ల పెట్టుబడులు అవసరమౌతాయి. ఈపెట్టుబడులు ఎక్కువగా రుణాల రూపంలో ఉంటాయి. ప్రస్తుతం మౌలిక సదుపాయాలపై జరుగుతున్న వ్యయం కంటే ఇది 50% అధికం. [14] దీర్ఘకాలిక మూలధనపు ఆవశ్యకతకూ ప్రస్తుతం తమకు అందుబాటులో ఉన్నదానికీ మధ్య ఉన్న అంతరం కారణంగా, "చాలా మంది ఆసియా, తూర్పు యూరోపియన్ దేశాధినేతలు ఈ కొత్త అంతర్జాతీయ విత్త సంస్థలో చేరేందుకు సంతోషంగా ముందుకు వచ్చారు". [15]

ప్రాజెక్టులు

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఎరుపు రంగులో చైనా. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సభ్యులు నారింజ రంగులో[16]

138 దేశాలు, 30 అంతర్జాతీయ సంస్థలతో చైనా, బెల్ట్ అండ్ రోడ్ సహకార పత్రంపై సంతకం చేసింది. మౌలిక సదుపాయాల నిర్మాణ పరంగా, చైనాతో పాటు, బెల్ట్ అండ్ రోడ్ వెంట ఉన్న దేశాలు ఓడరేవులు, రైల్వేలు, రహదారులు, విద్యుత్ కేంద్రాలు, విమానయానం, టెలికమ్యూనికేషన్లలో సమర్థవంతమైన సహకారాన్ని చేపట్టాయి.

2014-2018 కాలంలో దేశం వారీగా BRI పెట్టిన పెట్టుబడులు, - బిలియన్ డాలర్లలో [17]
నిర్మాణాల విలువచైనా పెట్టుబడి
 Pakistan31.9  Singapore24.3
 Nigeria23.2  Malaysia14.1
 Bangladesh17.5మూస:Country data Russian Federation10.4
 Indonesia16.8  Indonesia9.4
 Malaysia15.8  South Korea8.1
 Egypt15.3  Israel7.9
 UAE14.7  Pakistan7.6

ఆఫ్రికా

జిబౌటీ

జిబౌటి లోని డోరాలేహ్ బహుళ-ప్రయోజన రేవు, హసన్ గౌలెద్ ఆప్టిడాన్ అంతర్జాతీయ విమానాశ్రయం. [18] [19] ఆఫ్రికా కొమ్ములో ఉన్న మారుమూల దేశం జిబౌటి, చైనా యొక్క బహుళ బిలియన్ డాలర్ల "బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్" కు గుండెకాయ వంటిది. బీజింగ్ ఉద్దేశ్యాల పట్ల పాశ్చాత్య దేశాల్లో ఉన్న అనుమానాల మధ్య వాణిజ్య, సైనిక లక్ష్యాలతో చైనా చేసే గారడీకి ఇది సూచిక.

ఈజిప్ట్

ఈజిప్ట్ యొక్క కొత్త పరిపాలనా రాజధాని నిర్మాణం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో ఒక మైలురాయి. [20]

ఇథియోపియా

ఇథియోపియా లోని తూర్పు పారిశ్రామిక మండలం అడ్డిస్ అబాబా బయట ఉన్న ప్రధాన ఉత్పాదక కేంద్రం. దీనిని చైనా నిర్మించింది. దీన్నిండా చైనా తయారీ కర్మాగారాలే ఉన్నాయి. [21] చైనా మీడియా, ఇండస్ట్రియల్ జోన్ వైస్ డైరెక్టర్‌ల ప్రకారం, ఈ జోన్ పరిధిలో 83 కంపెనీలు ఉండగా వాటిలో 56 ఉత్పత్తిని ప్రారంభించాయి. [22] అయితే, జియోఫోరంలోని ఒక అధ్యయనం ప్రకారం, జోన్ వెలుపల తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవదం వంటి అనేక కారణాల వల్ల ఇథియోపియా మొత్తం ఆర్థికాభివృద్ధికి EIZ ఇంకా ఉత్ప్రేరకం లాగా పనిచేయలేదు. రెండు దేశాల పరిశ్రమల మధ్య ఉన్న వ్యత్యాసాల కారణంగా ప్రత్యక్ష సాంకేతిక బదిలీ వలన, నూత్న ఆవిష్కరణల వలనా ఇథియోపియాకు ప్రయోజనం పొందజాలదు. [23]

శతాబ్దాల నాటి ఇథియో-జిబౌటి రైలుమార్గం స్థానంలో కొత్త ఎలక్ట్రిక్, స్టాండర్డ్ గేజ్ అడిస్ అబాబా-జిబౌటి రైలుమార్గాన్ని నిర్మించేందుకు అక్టోబరు 2011 - ఫిబ్రవరి 2012 మధ్య చైనా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 750 kilometres (470 mi) కంటే 750 kilometres (470 mi) 750 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే మార్గంపై, 120 కి.మీ./గంట వేగంతో ప్రయాణించవచ్చు.అడిస్ అబాబా, జిబౌటి మధ్య ప్రయాణ సమయం మూడు రోజుల నుండి 12 గంటలకు తగ్గిపోతుంది. [24] ఈ మార్గంపై మొదటి సరుకు రవాణా సేవ 2015 నవంబరు లో ప్రారంభమైంది. ప్రయాణీకుల సేవ 2016 అక్టోబరు లో ప్రారంభమైంది. అంతర్జాతీయ వ్యవహారాలపై చైనా-ఇథియోపియా సహకారంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ చైనా, ఇథియోపియా రెండూ అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇరు దేశాలు సంక్లిష్టమైన అంతర్జాతీయ వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి అని అన్నాడు. చైనా-ఆఫ్రికా సంబంధాలను అభివృద్ధి చేయడంలో ఈ భాగస్వామ్యం ముందంజలో ఉంటుందని అతడు పేర్కొన్నాడు. [25]

కెన్యా

2014 మే లో, మొంబాసాను నైరోబికి కలిపే మొంబాసా -నైరోబి స్టాండర్డ్ గేజ్ రైలుమార్గాన్ని నిర్మించడానికి ప్రీమియర్ లీ కెకియాంగ్ కెన్యా ప్రభుత్వంతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని నిర్మాణానికి US $ 3.2 బిలియన్లు వ్యయమవుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కెన్యా చేపట్టిన అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఇది. బస్సులో 9 గంటలు, మునుపటి రైల్వేలో 12 గంటలు పట్టే ప్రయాణ సమయం 4.5 గంటలకు తగ్గుతుందని రైల్వే పేర్కొంది. 2017 మే లో, కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా, ఈ 470 కి.మీ. రైలు మార్గాన్ని ఒక కొత్త అధ్యాయం అని చెబుతూ, "రాబోయే 100 సంవత్సరాల కెన్యా కథను పునర్నిర్మించడం ప్రారంభిస్తుంది". [26] ఈ రైల్వే తన మొదటి సంవత్సరంలో 96.7% సీట్ల ఆక్యుపెన్సీతో 13 లక్షల ప్రయాణీకులను తీసుకువెళ్ళింది. 6,00,000 టన్నుల సరుకును రవాణా చేసింది అని కెన్యా రైల్వే కార్పొరేషన్ చెప్పింది. ఈ రైలు మార్గం దేశ జిడిపిని 1.5% పెంచిందని, స్థానికులకు 46,000 ఉద్యోగాలను సృష్టించిందని, 1,600 రైల్వే నిపుణులకు శిక్షణ ఇచ్చిందనీ చైనా మీడియా పేర్కొంది. [27]

నైజీరియా

2019 జనవరి 12 న, 900 రోజులు విజయవంతంగా నడుస్తున్న నైజీరియా యొక్క మొట్టమొదటి ప్రామాణిక గేజ్ రైల్వే ప్రారంభమైనప్పటి నుండి పెద్ద ప్రమాదాలు జరగలేదు. చైనా సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ (సిసిఇసిసి) రైల్వే నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో, అబుజా కడునా రైలు సర్వీసు 2016 జూలై 27 న వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. నైజీరియాలో మొదటి ప్రామాణిక గేజ్ రైల్‌రోడ్ రైల్వే ఆధునీకరణ ప్రాజెక్టులలో (ఎస్‌జిఆర్‌ఎంపి) అబుజా-కడునా రైల్వే లైన్ ఒకటి. ఇది లాగోస్-కానో ప్రామాణిక కొలమానాల ప్రాజెక్టు లోని మొదటి భాగం. ఇది నైజీరియా వ్యాపార కేంద్రాలను దేశంపు వాయవ్య భాగంలోని ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలతో కలుపుతుంది. [28]

2015 లో చైనా-ఆఫ్రికా సహకార ఫోరం యొక్క జోహన్నెస్‌బర్గ్ సమావేశపు తీర్మానంలో, చైనా ప్రభుత్వం 10,000 ఆఫ్రికన్ గ్రామాలకు ఉపగ్రహ టెలివిజన్‌ను అందిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా, ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో ఎంచుకున్న 1,000 గ్రామాలలో ప్రతి రెండు సెట్ల సోలార్ ప్రొజెక్షన్ టెలివిజన్ వ్యవస్థలు, 32-అంగుళాల సౌర డిజిటల్ టీవీ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ వ్యవస్థలు లభిస్తుందని తెలిపారు. మొత్తం 20,000 నైజీరియా గ్రామీణ కుటుంబాలు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతాయి. నైజీరియా రాజధాని అబూజాను ఆనుకుని ఉన్న అభివృద్ధి చెందని గ్రామీణ సమాజమైన క్పాదుమా అనలాగ్ టీవీ మాత్రమే అందుబాటులో ఉంది. నైజీరియా పట్టణాల్లోని ప్రజలు ఆనందించే ఉపగ్రహ టీవీ ఛానెళ్లను చూసే అవకాశం వీరికి లేదు. ఈ ప్రాజెక్టు అమలు వల్ల మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. ఎంచుకున్న గ్రామాల్లోని 1,000 మంది నైజీరియన్లు శాటిలైట్ టీవీ వ్యవస్థలను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, రీఛార్జ్ చేసుకోవాలి, ఆపరేట్ చేయాలి అనే దానిపై శిక్షణ పొందారు. [29]

సూడాన్

సుడాన్లో, చమురు పరిశ్రమను స్థాపించడానికి చైనా సహాయపడింది. పత్తి పరిశ్రమకు సహాయం అందించింది.  

భవిష్యత్ ప్రణాళికలలో రైల్వేలు, రోడ్లు, ఓడరేవులు, ఒక అణు విద్యుత్ కేంద్రం, సౌర విద్యుత్ క్షేత్రాలు, నీటిపారుదల కోసం విద్యుత్ ఉత్పత్తి కోసం మరిన్ని ఆనకట్టలూ ఉన్నాయి. [30]

ఐరోపా

చైనా ఐరోపాల మధ్య సరుకు రవాణా సేవలను 2011 మార్చి లో ప్రారంభించారు. [31] ఇందులో మొదటి సరుకు రవాణా మార్గం చైనాను టెహ్రాన్‌తో కలిపింది. చైనా-బ్రిటన్ మార్గాన్ని 2017 జనవరి లో ప్రారంభించారు. [32] 2018 నాటికి 48 చైనా నగరాలు, 42 యూరోపియన్ గమ్యస్థానాలకు విస్తరించి, చైనా ఐరోపాల మధ్య సరుకులను పంపిణీ చేసింది. 2018 ఆగస్టు 26 న జర్మనీలోని హాంబర్గ్ నుండి చైనాలోని వుహాన్‌కు సరుకు రవాణా రైలు X8044 రావడంతో 10,000 వ యాత్ర పూర్తయింది. [33] ఈ నెట్‌వర్కును 2018 మార్చి లో దక్షిణ దిశగా వియత్నాం వరకూ విస్తరించారు. [34]

పోలాండ్

2016 జూన్ 20, వార్సాలో చైనా రైల్వే ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా పోలండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా షీ జిన్‌పింగ్ ప్రేక్షకులకు అభివాదం చేస్తున్నారు

2015 లో BRI గురించి చైనాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మొదటి యూరోపియన్ దేశాలలో పోలండ్ ఒకటి. పోలండ్ అధ్యక్షుడు దూడా మాట్లాడుతూ, పోలండ్ చైనాకు యూరప్‌కు ప్రవేశ ద్వారంగా మారుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. [35]

గ్రీస్

చైనా, గ్రీస్‌ల విదేశాంగ మంత్రులు 2018 ఆగస్టు 29 న బెల్ట్ అండ్ రోడ్ చొరవ కింద మరింత సహకారానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. కోస్కో పునరుజ్జీవం పొందింది. ప్రస్తుతం పిరయస్ నౌకాశ్రయాన్ని నడుపుతోంది. [36] [37] [38] బెల్ట్ & రోడ్‌ను అభివృద్ధి చేయడంలో చైనా, గ్రీస్‌లు రెండూ ఒకరినొకరు సహజ మిత్రులుగా చూస్తున్నాయి అని చైనా నాయకుడు షీ జిన్‌పింగ్ ఒక పర్యటన ప్రారంభంలో మాట్లాడుతూ అన్నాడు. గ్రీస్‌తో సహకారాన్ని మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా,"ఊపును కొనసాగించడాన్ని", ద్వైపాక్షిక సంబంధాలను "బలోపేతం" చేయడాన్ని తాను ఆశిస్తున్నటు అతడు చెప్పాడు.

పోర్చుగల్

అధ్యక్షుడు షీ 2018 డిసెంబరు లో లిస్బన్ పర్యటన సందర్భంగా, ఆ దేశం చైనాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. [39]

ఇటలీ

2019 మార్చి లో, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో చేరిన మొదటి జి 7 దేశంగా ఇటలీ నిలిచింది. [40]

2019 ఏప్రిల్ లో ఛాన్సలర్ కుర్జ్ చైనా పర్యటన సందర్భంగా, BRI ప్రాజెక్టులో ఆస్ట్రియా సహకారంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కుర్జ్ ప్రకారం, ఆస్ట్రియా "వన్ బెల్ట్ వన్ రోడ్ చొరవకు మద్దతు ఇస్తుంది. [చైనాతో] దగ్గరి ఆర్థిక సహకారాన్ని ఏర్పరచటానికి ప్రయత్నిస్తోంది. చైనా సహకారం ఆశిస్తున్న అనేక ప్రాంతాలలో ఆస్ట్రియాకు విజ్ఞానం నైపుణ్యం ఉన్నాయి". [41]

లక్సెంబర్గ్

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌పై సహకరించడానికి లక్సెంబర్గ్ 2019 మార్చి 27 న చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది. [42]

స్విట్జర్లాండ్

2019 ఏప్రిల్ 29 న, బీజింగ్ పర్యటనలో, స్విస్ అధ్యక్షుడు యులీ మౌరర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చైనాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. [43]

కాకసస్

అర్మేనియా

2019 ఏప్రిల్ 4 న, అర్మేనియా అధ్యక్షుడు అర్మెన్ సర్కిసియన్, అర్మేనియాలోని యెరెవాన్‌లో జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆఫ్ చైనా వైస్ చైర్‌మెన్ షెన్ యుయు నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని స్వాగతించాడు. సిల్క్ రోడ్ కాలం నుండీ అర్మేనియా, చైనాలు శతాబ్దాల సహకార సంప్రదాయం ఉన్న పురాతన దేశాలు అని అధ్యక్షుడు సర్కిసియన్ పేర్కొన్నాడు. 21 వ శతాబ్దంలో చైనా అగ్ర నాయకత్వం ప్రారంభించిన వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమంలో సహకార అభివృద్ధిని అధ్యక్షుడు గుర్తించాడు. "అర్మేనియా కొత్త సిల్క్ రోడ్‌లో భాగమయ్యే సమయం ఇది" అని అతడు పేర్కొన్నాడు. [44]

అజెర్‌బైజాన్

2019 ఏప్రిల్ 25-27 లలో, చైనాలోని బీజింగ్‌లో అంతర్జాతీయ సహకారం కోసం రెండవ బెల్ట్ అండ్ రోడ్ ఫోరం జరిగింది. అజర్‌బైజాన్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఫోరమ్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అజర్‌బైజాన్, రష్యా, పాకిస్తాన్, కజాఖ్స్తాన్, ఆస్ట్రియా, బెలారస్, చెక్ రిపబ్లిక్, గ్రీస్, హంగరీ, ఇటలీ, సెర్బియా, సింగపూర్, యుఎఇ వంటి 37 దేశాల ప్రభుత్వాధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల నేతలు కూడా వచ్చారు. తన ప్రసంగంలో, అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ ఇలా అన్నారు, “చైనా నాయకుడు షీ జిన్‌పింగ్ ప్రతిపాదించిన బెల్ట్ అండ్ రోడ్ చొరవకు అజర్బైజాన్ మొదటి నుంచీ మద్దతు ఇచ్చింది. ఈ చొరవ ఉత్పాదకతను రవాణా చెయ్యడమే కాకుండా, వివిధ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. సహకారానికి ఉపయోగపడుతుంది, అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ”

ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన అజర్‌బైజాన్‌ ప్రాధాన్యతలలో ఒకటి. యూరప్, ఆసియాల మధ్య అంతరాలను నిర్మించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో బాకు-టిబిలిసి-కార్స్ రైల్వే, యురేషియాలో రవాణాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న బాకు ఇంటర్నేషనల్ సీ ట్రేడ్ పోర్ట్ (బాకు నౌకాశ్రయం) ఉన్నాయి. ప్రస్తుతం, బాకు నౌకాశ్రయానికి 1,00,000 టిఇయుతో సహా 1.5 కోట్ల టన్నుల సరుకును నిర్వహించగల సామర్థ్యం ఉంది. ఇది భవిష్యత్తులో 2.5 కోట్ల టన్నుల సరుకుకూ, 5,00,000 టియుయులకూ పెరుగుతుంది. ఆధునిక రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అజర్‌బైజాన్ ఒక ముఖ్యమైన రవాణా కేంద్రంగా మారడమే కాక, తూర్పు-పడమర, ఉత్తర-దక్షిణ కారిడార్లలో పాల్గొనే దేశాలతో సహకారానికి దోహదం చేస్తుంది.

జార్జియా

2019 ఏప్రిల్ 25 న, జార్జియా మౌలిక సదుపాయాలు ప్రాంతీయ అభివృద్ధి శాఖ మంత్రి మాయా స్కిటిష్విలి, " జార్జియాకు వన్ బెల్ట్-వన్ రోడ్ చొరవ ముఖ్యమైనది. దేశం దాని అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటుంది" అని పేర్కొంది. 2015 మార్చి లో 'వన్ బెల్ట్-వన్ రోడ్' చొరవను అభివృద్ధి చేయడానికి మెమోరాండంపై సంతకం చేసిన మొదటి దేశాలలో జార్జియా కూడా ఉందని ఆమె గుర్తు చేసింది. [45]

2017 లో బీజింగ్‌లో జరిగిన బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్‌లో పాల్గొన్నవారు
మధ్య ఆసియా దేశాలు

2019 ఏప్రిల్ 26 న, రష్యా, చైనా నాయకులు తమ దేశాలు "మంచి స్నేహితులు" అని చెప్పారు. యురేషియాలో మరింత ఆర్థిక సమైక్యతను నెలకొల్పడంలో కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. బీజింగ్‌లోని బెల్ట్ అండ్ రోడ్ ఫోరం సందర్భంగా, చైనా సర్వోన్నత నాయకుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లు ఇరుదేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. "బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, యురేషియన్ ఎకనామిక్ యూనియన్ కింద సమావేశమయ్యే దేశాలు శాంతి, అభివృద్ధిల విషయంలో దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను పంచుకుంటాయి" అని వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నాడు. [46]

2019 జూన్ లో, షీ, పుతిన్ లు "గ్రేట్ యురేషియన్ పార్టనర్‌షిప్" నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. యురేషియా ఎకనామిక్ యూనియన్‌ను చైనాకు చెందిన బెల్ట్ & రోడ్ ఇనిషియేటివ్‌తో అనుసంధానించడానికి పుతిన్‌తో తాను అంగీకరించినట్లు షీ చెప్పాడు. [47] [48]

చైనా-బేలారస్ ఇండస్ట్రియల్ పార్కు 91.5 చ.కి.మీ. ప్రత్యేక ఆర్థిక మండలి. దీన్ని 2013 లో మిన్స్క్ లోని స్మోలెవిచిలో స్థాపించారు. 2018 ఆగస్టు నాటికి 36 అంతర్జాతీయ కంపెనీలు ఈ పార్కులో స్థిరపడ్డాయని పార్కు చీఫ్ అడ్మినిస్ట్రేటరు చెప్పాడు. [49] ఈ పార్కు 6,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2020 నాటికి 10,000 మంది నివాసితులతో నిజమైన నగరంగా మారుతుందనీ చైనా మీడియా తెలిపింది. [50]

ఆసియా

మధ్య ఆసియా

మధ్య ఆసియాలోని ఐదు దేశాలు - కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ - బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) యొక్క భూమార్గంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. [51] సెంట్రల్ ఆసియా డేటా-గాదరింగ్ అండ్ ఎనాలిసిస్ టీం మధ్య ఆసియా దేశాలలో 261 బిఆర్ఐ ప్రాజెక్టులను గుర్తించింది. వీటిలో పెట్టే కనిష్ట పెట్టుబడి మొత్తం 136 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. [52]

2019 ఏప్రిల్ నాటికి, కజకిస్తాన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా, లాజిస్టిక్స్ పై సుమారు $30 బిలియన్లు పెట్టుబడి పెట్టింది. కజాఖ్‌స్తాన్ యొక్క మౌలిక సదుపాయాల ఆధునీకరణ కారణంగా, ది పశ్చిమ ఐరోపా - పశ్చిమ చైనా ఖండాంతర రహదారి ఇప్పుడు యూరప్, చైనాలను రష్యా, కజాఖ్స్తాన్‌ల ద్వారా కలుపుతుంది. [53] కజకిస్తాన్ గుండా వెళ్ళే వస్తువులపై వేసే రవాణా రుసుము ద్వారా ఆ దేశం ఏటా $5 బిలియన్లు అందుకుంటుంది. [54]

కిర్గిస్తాన్లో, 2011-2017 BRI ప్రాజెక్టుల మొత్తం నిబద్ధత నిధులు 4.1 బిలియన్ డాలర్లకు సమానం. స్థాపించబడిన సంస్థల నుండి సృష్టించబడిన ఉపాధి గొప్పదేమీ కాదు - దేశంలోని మొత్తం ఉపాధిలో 0.1-0.3% మాత్రమే ఉంది. BRI ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలపై 5-11 సంవత్సరాల వరకు ఉన్న గ్రేస్ పీరియడ్స్ కారణంగా అప్పు తీర్చే బరువు 2020 వరకు ఉండదు. పన్నుల చట్టాన్ని చక్కగా నిర్వహిస్తే BRI వలన కిర్గిస్తాన్‌కు ఎంతో ప్రయోజనం కలిగే అవకాసం ఉంది. ముఖ్యంగా తయారీ, రవాణా ప్రాజెక్టులలో, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. [55]

"ఉజ్బెకిస్తాన్ దృక్పథంలో, పెర్షియన్ గల్ఫ్కు కారిడార్ తెరవడానికి BRI సహాయపడుతుంది. ఇది దేశపు వాణిజ్య మార్గాల విస్తరణకు వీలు కల్పిస్తుంది." ఉజ్బెక్ వస్తువులను మరిన్ని ప్రాంతాలకు ఎగుమతి చేయగలగడం ఈ ప్రాజెక్టులో ఉజ్బెకిస్తాన్‌కు ఉన్న అత్యంత ఆకర్షణీయమైన ప్రోత్సాహకం. మే 2017, బీజింగ్‌లో జరిగిన తొలి బెల్ట్ అండ్ రోడ్ ఫోరంలో ఉజ్బెకిస్తాన్‌, చైనాల అధ్యక్షులు మిర్జియోయేవ్, షీ జిన్‌పింగ్ ఇద్దరూ బిఆర్‌ఐ పురోగతిలో భవిష్యత్ సహకారం గురించి సానుకూలంగా మాట్లాడారు. ఆ సమావేశాలలో, "విద్యుత్ శక్తి, చమురు ఉత్పత్తి, రసాయనాలు, వాస్తుశిల్పం, వస్త్రాలు, ఔషధ ఇంజనీరింగ్, రవాణా, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం వంటి రంగాల్లో సహకారాన్ని పెంచడానికి రెండు దేశాలు 23 బిలియన్ డాలర్ల విలువైన 115 ఒప్పందాలపై సంతకం చేశాయి." [56] 2019 లో ఉజ్బెకిస్తాన్ చైనా యొక్క BRI ఆశయాలతో తమ సొంత దేశ అభివృద్ధి ప్రణాళికను సమకూర్చుకునే బాధ్యతతో ఒక సమూహాన్ని ఏర్పాటు చేసింది. చైనా, ఉజ్బెకిస్తాన్ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామి (దిగుమతులు, ఎగుమతులు రెండింటిలోనూ). దాని భూభాగంలో 1500 కంటే ఎక్కువ చైనా వ్యాపారాలున్నాయి. 2018 లో, "చైనా-ఉజ్బెకిస్తాన్ వాణిజ్యం సంవత్సరానికి 48.4 శాతం పెరిగి 6.26 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకుంది." [57]

"తజికిస్తాన్లో BRI ప్రాజెక్టులు రోడ్లు, రైల్వేల నుండి పైప్లైన్లు, విద్యుత్ ప్లాంట్ల వరకు ఉన్నాయి, ట్రాఫిక్ కెమెరాలతో సహా." [58] 2018 లో, “తజికిస్తాన్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తున్న చైనా కంపెనీకి బంగారు గనిని చెల్లింపుగా ఇచ్చింది; అంతకు కొన్నేళ్ళ ముందు, చైనాకు తీర్చాల్సిన అప్పుకు మారుగా తన భూభాగాన్ని ఇచ్చింది” [59]

తుర్క్మెనిస్తాన్ చాలా వరకు ప్రపంచంతో సంబంధాలు లేవు. అయితే, తమ మౌలిక సదుపాయాలు, ఇంధన ప్రాజెక్టులు ముందుకు తీసుకు పోవాలనే కోరిక కారణంగా, దేశం తలుపులు తెరుస్తోంది. తన ప్రాజెక్టులను స్వయంగా పూర్తిచేసుకునేంత సామర్థ్యాలు తుర్క్మెనిస్తాన్‌కు లేవు. 2016 జూన్ లో, తుర్క్మెనిస్తాన్ అధ్యక్షుడు గుర్బంగూలీ, షీ జిన్‌పింగ్‌ను సంప్రదించి, బిఆర్‌ఐలో మరింతగా పాలుపంచుకోవాలనే కోరిక గురించి చర్చించాడు. ఇంతకుముందు ప్రణాళిక చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసుకునేందుకు, విస్తరించుకునేందుకూ ఆసక్తి చూపాడు. ఈ ప్రాజెక్టులలో కొన్ని: తుర్క్మెనిస్తాన్-చైనా గ్యాస్ పైప్‌లైన్, ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (ఇది రష్యా, కజాఖ్స్తాన్, తుర్క్మెనిస్తాన్, ఇరాన్ల మధ్య రైల్వే కనెక్షన్‌లను అందిస్తుంది, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్‌ల ద్వారా చైనాను ఇరాన్‌కు అనుసంధానించే మరొక మార్గం), లాపిస్ లాజులి అంతర్జాతీయ రవాణా కారిడార్ (ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అజర్‌బైజాన్, జార్జియా, టర్కీలను కలిపే రైలు), తుర్క్మేనిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్- పాకిస్తాన్-ఇండియా (టాపి) పైప్‌లైన్ ప్రాజెక్ట్. [60]

హాంగ్ కాంగ్

2016 నాటి విధాన ప్రసంగంలో హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెంగ్ చున్-యింగ్, బీజింగ్ ఆర్థిక విధానానికి అనుగుణంగా హాంకాంగ్ సముద్ర రవాణా లాజిస్టిక్‌లను బలోపేతం చేసే లక్ష్యంతో మారిటైమ్ అథారిటీని ఏర్పాటు చేయాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించాడు. [61] ఈ ప్రసంగంలో తెంగ్, "వన్ బెల్ట్, వన్ రోడ్" ను 48 సార్లు ప్రస్తావించాడు. [62] కానీ వివరాలు పెద్దగా చెప్పలేదు. [63] [64]

ఇండోనేషియా

2016 లో, ఇండోనేషియా లోని మొట్టమొదటి హై-స్పీడ్ రైలు ను నిర్మించే కాంట్రాక్టును చైనా రైల్వే ఇంటర్నేషనల్ గెలుచుకుంది. 140 కి.మీ/సె వేగంతో నడిచే జకార్తా-బాండుంగ్ హై స్పీడ్ రైలు, జకార్తా, బాండుంగ్ ల మధ్య ప్రయాణ సమయాన్ని మూడు గంటల నుండి నలభై నిమిషాలకు తగ్గిస్తుంది [65] తొలుత, 2019 లో పూర్తి చేయాలని తలపెట్టిన ఈ ప్రాజెక్టు భూసేకరణ సమస్యల వల్ల ఆలస్యం అయింది. [66] 2000 మంది స్థానికులు ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.

లావోస్

లావోస్‌లో 414 కి.మీ.ల వియంటియాన్-బోటెన్ రైలుమార్గ నిర్మాణం 2016 డిసెంబరు 25 న ప్రారంభమైంది. 2021 లో ఇది పూర్తి కావాల్సి ఉంది. చైనా రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానించే మొట్టమొదటి విదేశీ రైల్వే ప్రాజెక్టు ఇది. [67] లావోస్-చైనా రైల్వే లావోస్ లో అత్యంత పొడవైన రైలుమార్గం అవుతుంది. ఇది థాయ్‌లాండ్‌తో అనుసంధానమై, ప్రతిపాదిత కున్మింగ్-సింగపూర్ రైల్వేలో భాగం అవుతుంది. ఈ రైలుమార్గం చైనా నగరమైన కున్మింగ్‌లో మొదలై, థాయ్‌లాండ్, లావోస్ మీదుగా సింగపూర్‌లో ముగుస్తుంది. [68] [69] దీనికి 5.95 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. ఈ రైల్వేలో 70% చైనా స్వతం. లావోస్ కు చెందిన మిగిలిన 30% వాటాలో ఎక్కువ భాగాన్ని చైనా అప్పు ఇచ్చి సమకూరుస్తుంది. [70] అయితే, అధిక వ్యయం కారణంగా ఈ ప్రాజెక్టుపై లావోస్‌లో వ్యతిరేకత ఎదురైంది. [71]

మాల్దీవులు

మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ (2013–18) పదవీకాలంలో చైనా మాల్దీవుల మైత్రీ వారధి, ది వెలానా అంతర్జాతీయ విమానాశ్రయం, కృత్రిమ ద్వీపం హల్హుల్‌మలేతో వంటి అనేక చైనా నిధుల ప్రాజెక్టులను చేపట్టారు. ఈ ప్రాజెక్టులకు అవుతున్న వ్యయం గురించి, ఇతర నియమ నిబంధనల గురించీ ప్రజలకు తగినంత సమాచారం వెల్లడి చెయ్యలేదు. ప్రెసిడెంట్ యమీన్ హయాంలో, మాల్దీవులులో విదేశీయులు భూమిని కలిగి ఉండేలా దాని రాజ్యాంగాన్ని కూడా సవరించారు. ఆ తరువాతనే ఫేధూ ఫిన్హోలు ద్వీపాన్ని ఒక చైనా సంస్థ దీర్ఘకాలిక లీజుకు తీసుకుంది. [72]

మలేషియా

ప్రధాఅని నజీబ్ రజాక్ నేతృత్వంలో మలేషియా, చైనాతో పలు పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది, వీటిలో US $ 27 బిలియన్ల ఈస్ట్ కోస్ట్ రైల్ లింక్ ప్రాజెక్టు, 3.1 బిలియన్ డాలర్ల పైచిలుకు వ్యయంతో పైప్‌లైన్ ప్రాజెక్టులు, అలాగే జోహోర్‌లోని 100 బిలియన్ డాలర్ల ఫారెస్ట్ సిటీ ఉన్నాయి. [73] 2018 మలేషియా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, అప్పటి ప్రతిపక్ష నాయకుడు మహతీర్ మొహమాద్ మలేషియాలో చైనా పెట్టుబడులను నిరాకరించాడు. దేశాన్ని విదేశీయులకు అమ్మడంతో సమానంగా దాన్ని పోల్చాడు. [74] మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైన తరువాత మహతీర్, మాజీ ప్రధాని నజీబ్ రజాక్ మొదలుపెట్టిన చైనా నిధులతో కూడిన ప్రాజెక్టులను "అన్యాయమైన" ఒప్పందాలుగా ముద్రవేసాడు. మలేషియాను చైనాకు "రుణపడిపోయేలా" చేస్తాయని చెప్పాడు. [75] సిటీబ్యాంకుకు చెందిన కిట్ వీ జెంగ్ వాదించినట్లుగానే మహతీర్ కూడా, లాభాల లాభాపేక్షతో కాకుండా చైనా భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టులు ఎక్కువగా నడిచే అవకాశం ఉందని చెప్పాడు. మలక్కా జలసంధిలోకి చైనాకు ప్రవేశం ఉంటుందని అతడు అభిప్రాయపడ్డాడు.

2018 ఆగష్టు లో, చైనా అధికారిక పర్యటన ముగిసాక, చైనా పెట్రోలియం పైప్‌లైన్ బ్యూరోకు లభించిన ఈస్ట్ కోస్ట్ రైల్ లింక్ ప్రాజెక్టు, మరో రెండు పైప్‌లైన్ ప్రాజెక్టులను మహతీర్ రద్దు చేశాడు. 1 మలేషియా డెవలప్‌మెంట్ బెర్హాడ్ లో జరిగిన అవినీతితో ఇవి ముడిపడి ఉన్నాయని అతడు చెప్పాడు. [75] గత ప్రభుత్వం చేసిన అప్పులను తగ్గించాల్సిన అవసరాన్ని పేర్కొన్నాడు. [76] [77] [78] [79]

అంతేకాకుండా, విదేశీ కొనుగోలుదారులకు దీర్ఘకాల వీసాను నిరాకరిస్తామని మహతీర్ బెదిరించాడు. దీనిపై హౌసింగ్ మంత్రి జురైదా కమరుద్దీన్, ప్రధాన మంత్రి కార్యాలయాలు స్పష్టత ఇచ్చాయి. [80]

ఈ ప్రాజెక్టుపై చాలా నెలలు చర్చలు జరిగాయి. [81] ప్రాజెక్టును రద్దు చేసేంత వరకూ పరిస్థితి క్షీణించింది. [82] అనేక రౌండ్ల చర్చలు, దౌత్య కార్యకలాపాల తరువాత, ప్రాజెక్టు వ్యయాన్ని RM 65.5 బిలియన్ల నుండి RM 44 బిలియన్లకు (US $ 10.68 బిలియన్) తగ్గిస్తూ ఈ ప్రాజెక్టును కొనసాగించడానికి మలేషియా, చైనాలు అంగీకరించాయి. [83]

పాకిస్థాన్

చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ రవాణా, ఇంధనం, సముద్ర మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టే ప్రాజెక్టు. ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో ఒక ప్రధానమైన ప్రాజెక్టు.

శ్రీలంక

శ్రీలంకలో చైనా ప్రధాన పెట్టుబడి మగంపూరా మహీంద రాజపక్సే ఓడరేవు. దీనికి చైనా ప్రభుత్వమే ఎక్కువ నిధులు సమకూర్చింది. దీన్ని రెండు చైనా కంపెనీలు నిర్మించాయి. కొలంబో నౌకాశ్రయం తరువాత శ్రీలంకలో అతిపెద్ద ఓడరేవు ఇది. "దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద ఓడరేవు" అని చైనా ప్రభుత్వం పేర్కొంది. ఇది మొదట శ్రీలంక ప్రభుత్వానికి చెందుతుందని, దీన్ని శ్రీలంక పోర్ట్స్ అథారిటీ నడుపుతుందనీ భావించారు. అయితే ఇది భారీ నష్టాలను చవిచూసింది. శ్రీలంక ప్రభుత్వం చైనాకు అప్పు తీర్చలేకపోయింది. 2017 డిసెంబరు 9 న రుణ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా 70% ఓడరేవును చైన లీజుకు తీసుకుంది. పోర్ట్ కార్యకలాపాలను 99 సంవత్సరాల పాటు చైనాకు అప్పగించారు. [37] ఈ ఒప్పందం వలన శ్రీలంక ప్రభుత్వానికి $1.4 బిలియన్లు వచ్చాయి. దీన్ని వారు చైనా అప్పు తీర్చడానికి ఉపయోగిస్తారు. [84] [85] [86] ఇది చైనా రుణాల-ఉచ్చు దౌత్యం పాటిస్తోందనే ఆరోపణలకు దారితీసింది. [87]

ఓడరేవు యొక్క వ్యూహాత్మక స్థానం, తదుపరి యాజమాన్యం హిందూ మహాసముద్రంలో చైనా పెరుగుతున్న ఆర్థిక అడుగుజాడలపై ఆందోళనను రేకెత్తించింది. దీనిని నావికా స్థావరంగా ఉపయోగించవచ్చనే ఊహాగానాలు రేగాయి. ఇది "పూర్తిగా పౌర ఉపయోగం కోసం" ఉద్దేశించినదని శ్రీలంక ప్రభుత్వం హామీ ఇచ్చింది.

కొలంబో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిటీని $ 1.4 బిలియన్ల చైనా పెట్టుబడితో హిందూ మహాసముద్రాన్ని పూడ్చి నిర్మించారు. ఇదొక ప్రత్యేక ఆర్థిక జోన్, శ్రీలంకలో చైనా పెట్టిన మరో పెద్ద పెట్టుబడి. [88]

థాయిలాండ్

2005 లో థాయ్‌లాండ్‌లో, చైనా ఔషధ సంస్థ హోలీ గ్రూప్, థాయ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలపర్ అమాటా గ్రూప్‌లు థాయ్-చైనీస్ రేయాంగ్ ఇండస్ట్రియల్ జోన్‌ను అభివృద్ధి చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. 2012 నుండి, చైనా కంపెనీలు జోన్లో సౌర, రబ్బరు, పారిశ్రామిక ఉత్పాదక కర్మాగారాలను కూడా తెరిచాయి. 2021 నాటికి కంపెనీల సంఖ్య 500 కి పెరుగుతుందని జోన్ ఆశిస్తోంది. [89] భూ వినియోగం, ఎగుమతి ఉత్పత్తులపై థాయ్‌లాండ్ పన్ను లేని ప్రోత్సాహకాలతో పాటు కార్మిక వ్యయాలకు అనుకూలంగా ఉందని చైనా మీడియా పేర్కొంది. ఈ జోన్ 3000 కంటే ఎక్కువ స్థానిక ఉద్యోగాలను సృష్టించిందని పేర్కొంది. [90]

ప్రణాళికాబద్ధమైన కున్మింగ్-సింగపూర్ రైల్వేలో భాగంగా, 2017 డిసెంబరు లో బ్యాంకాక్ నాఖోన్ రాట్చసిమా నగరాలను అనుసంధానించే హై-స్పీడ్ రైల్వే నిర్మాణాన్ని చైనా, థాయిలాండ్‌లు ప్రారంభించాయి. దీన్ని లావోస్‌ లోని నాంగ్ ఖై వరకు విస్తరిస్తరు. [91] థాయ్‌లాండ్‌లోని మొట్టమొదటి హై-స్పీడ్ రైల్ రైలు స్టేషన్ 2021 లో పూర్తి కావాల్సి ఉంది. 2024 లో సేవల్లోకి ప్రవేశించడానికి లైన్లు ఉంటాయి.

టర్కీ

అధ్యక్షుడు ఎర్డోగాన్ తన చైనా పర్యటనలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చైనాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసి, వాణిజ్య పరిమాణాన్ని పెంచాలని ఆశించాడు. ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం మొదటి దశలో 50 బిలియన్ డాలర్లకు చేరుకుందని, రెండవ దశలో $100 బిలియన్లకు చేరిందని చెప్పాడు. బాకు-టిబిలిసి-కార్స్ రైల్వే ఎడిర్న్-కార్స్ హై-స్పీడ్ రైలుతో అనుసంధానించడంతో చైనా తమ వస్తువులను యూరప్‌కు చాలా త్వరగా రవాణా చేయగలుగుతుంది. [92]

ఉత్తర, దక్షిణ అమెరికా

BRI ఒప్పందాలపై మొట్టమొదట సంతకం చేసిన పనామా, తరువాత బొలీవియా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, గయానాలు ఉన్నాయి. [93]

అర్జంటైనా

అర్జెంటైనా-చైనా జాయింట్ జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగంగా దక్షిణ అర్జెంటీనాలోని శాంటా క్రజ్ నదిపై కాండోర్ క్లిఫ్, లా బారంకోసా అనే రెండు ఆనకట్టలను నిర్మిస్తారు. దేశంలో 5,000 ప్రత్యక్ష, 15,000 పరోక్ష ఉద్యోగాలు కల్పించనున్న ఈ ప్రాజెక్టుకు చైనా గెజౌబా గ్రూప్ కార్పొరేషన్ (సిజిజిసి) బాధ్యత వహించనుంది. ఇది 4,950 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. తద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. [94]

జమైకా

2019 ఏప్రిల్ 11 న, జమైకా BRI లో చేరడానికి ఒక అవగాహన ఒప్పందంపై జమైకా చైనాలు సంతకాలు చేసాయి. . [95]

విమర్శ

నేపధ్యం: మౌలిక సదుపాయాల ఆధారిత అభివృద్ధి

మౌలిక సదుపాయాల పెట్టుబడిలో చైనా ప్రపంచ నాయకురాలు. 1980 తరువాత పారిశ్రామిక ప్రపంచంలో రవాణా మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు తగ్గించరు. చాలా ఆసియా, తూర్పు ఐరోపా దేశాలలో ఎగుమతి-ఆధారిత అభివృద్ధి విధానాలను చేపట్టారు. [96] [97] వీటికి భిన్నంగా చైనా, మౌలిక సదుపాయాల ఆధారిత అభివృద్ధి వ్యూహాన్ని అనుసరించింది. ఫలితంగా ఇంజనీరింగు, నిర్మాణ నైపుణ్యం, రహదారులు, వంతెనలు, సొరంగాలు, హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులతో సహా అనేక రకాల ఆధునిక ప్రాజెక్టులు చేపట్టింది. [98] సమష్టిగా, చైనా చేపట్టిన అనేక ప్రాజెక్టులను " మెగా-ఇన్ఫ్రాస్ట్రక్చర్ " అని పిలుస్తారు.

ప్రపంచ పెన్షన్ కౌన్సిల్ (డబ్ల్యుపిసి) అనే లాభాపేక్షలేని విధాన పరిశోధన సంస్థ ఇలా అంటోంది: చైనా వారి మౌలిక సదుపాయాల ఆధారిత ఆర్థిక అభివృద్ధి చట్రం యొక్క సహజమైన పొడిగింపే బెల్ట్ అండ్ రోడ్ చొరవ. ఛైర్మన్ డెంగ్ జియావోపింగ్ నేతృత్వంలోని చైనా ఆర్థిక సంస్కరణల్లో భాగంగా దీన్ని చైనా స్వీకరించినప్పటి నుండి చైనా వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించింది. [99] ఇది చివరికి యురేషియా ఆర్థిక స్థిరిని మార్చగలదు. అంతర్జాతీయ ఆర్థిక క్రమాన్నీ మార్చగలదు. [100] [101]

2014 - 2016 మధ్య, బెల్ట్ అండ్ రోడ్ వెంబడి ఉన్న దేశాలలో చైనా మొత్తం వాణిజ్య పరిమాణం 3 ట్రిలియన్ డాలర్లను దాటింది. ఇందులో భాగంగా ఉన్న దేశాలకు 1.1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, 1,80,000 ఉద్యోగాలనూ సృష్టించింది. [102] అయితే, ఇనిషియేటివ్ను ప్రోత్సహించడానికి చైనా ఇస్తున్న రుణాల పట్ల భాగస్వామ్య దేశాలు ఆందోళన చెందుతున్నాయి. [103]

కొత్త వలసవాద ఆరోపణలు

ఈ ప్రాజెక్టు, కొత్త వలసవాదానికి మరో రూపం అనే ఆందోళన ఉంది. కొన్ని పాశ్చాత్య ప్రభుత్వాలు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కొత్త వలసవాదమనీ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి చైనా అప్పుల ఉచ్చు దౌత్యం పాటిస్తున్నట్లూ ఆరోపించాయి. [104]

ఈ ఆరోపణల్లో పసలేదని, భుతద్దంలోంచి చూపిస్తున్నారనీ స్వైన్ (2019) అన్నారు. చెల్లింపులను సమర్ధంగా నిర్వహించలేని కొన్ని నిర్లక్ష్య, అనుభవం లేని కొన్ని కేసులే తప్ప పెట్టుబడుల్లో చైనా దురుద్దేశమేమీ లేదని కూడా అన్నారు. [105] కొత్త సామ్రాజ్యవాదం లేదా అప్పు ఉచ్చు దౌత్యం వాదనలన్నీ చైనా ఉద్దేశాలపై అపనమ్మకాన్ని విత్తడానికి చేస్తున్న చర్యలేనని చైనా ప్రభుత్వం ఆరోపించింది. [106] ఈ చొరవ వస్తువులకు మార్కెట్లను చూపించింది. వనరులకు మెరుగైన ధరలు ఇచ్చింది, తద్వారా మార్పిడిలో అసమానతలు తగ్గాయి. మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. ఉపాధిని సృష్టించాయి. పారిశ్రామికీకరణను ప్రోత్సహించాయి. సాంకేతిక బదిలీని విస్తరించింది. తద్వారా ఆయా దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని చైనా వాదించింది. [107] బ్లాన్‌చార్డ్ (2018) వాదిస్తూ, ప్రయోజనాలను పూర్తిగా గుర్తించి ఉండకపోవచ్చు. ప్రతికూలతలు మాత్రం అతిశయోక్తుల స్థాయిలో ఉన్నాయి. విమర్శకులు చైనా పెట్టుబడులను అగౌరవపరిచే విషయంలో తొందరపడుతున్నారనీ దాని బదులు వారు తమ దృష్టిని ఆయా దేశాల సాధికారత వైపు మళ్లించాలనీ సూచించారు. పశ్చిమ యూరోపియన్ వలసవాదులు చేసినట్లు వనరుల కోసం ఇతరులను దోపిడీ చేయని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులను సరిన తీరులో అర్థం చేసుకోలేకపోతున్నారని చైనా నిపుణులు భావిస్తున్నారని పోగోస్యాన్ (2018) పేర్కొన్నారు.

2018 లో, మలేషియా ప్రధాన మంత్రి మహతీర్ మొహమ్మద్ చైనా నిధుల ప్రాజెక్టులను రద్దు చేసి, "వలసవాదపు కొత్త రూపం తలెత్తుతోంది" అని హెచ్చరించాడు.[75] తానన్నది చైనా దాని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి కాదని తరువాత బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశాడు. [108] [109] భారతదేశంలోని ప్రభుత్వ అధికారులు చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌పై పదేపదే అభ్యంతరం వ్యక్తం చేశారు, ప్రత్యేకించి " చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ " (సిపిఇసి) ప్రాజెక్టు తమ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై న్యూ ఢిల్లీ యొక్క ముఖ్యమైన ఆందోళనలను విస్మరిస్తోందని వారు భావిస్తున్నారు. [110]

ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందనలు

ప్రాజెక్టు సమర్ధకులు

రష్యా

న్యూ సిల్క్ రోడ్స్ ప్రాజెక్టులో రష్యా, చైనాకు ప్రారంభ భాగస్వామి. ప్రెసిడెంట్ పుతిన్, ప్రెసిడెంట్ షీ లు గత దశాబ్దంలో అనేకసార్లు కలుసుకున్నారు. పరస్పర ప్రయోజనం కలిగించే పరిణామాలపై అంగీకరానికి వచ్చారు. 2015 మార్చి లో, రష్యా మొదటి ఉప ప్రధాన మంత్రి షువలోవ్ "సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్‌ను రష్యా తన సాంప్రదాయ, ప్రాంతీయ ప్రభావ రంగానికి ముప్పుగా చూడకూడదని […] కానీ యురేషియా ఎకనామిక్ యూనియన్‌కు అవకాశంగా చూడాలనీ" అన్నాడు. రష్యా, చైనాలు ఇప్పుడు మొత్తం 150 ప్రాజెక్టులను చేపట్టాయి. ఈ ప్రాజెక్టులలో కొన్ని "పోలార్ సిల్క్ రోడ్" [111] ప్రణాళికలో భాగం. ఇందులో గ్యాస్ సరఫరా వ్యవస్థ, గ్యాస్ రిఫైనరీ ప్లాంట్లు, వాహనాల తయారీ, భారీ పరిశ్రమలు, కొత్త రకాల సేవలు ఉన్నాయి. అంతే కాదు, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ రష్యాకు 9.6 బిలియన్ యుఎస్ డాలర్లకు సమానమైన అప్పు ఇచ్చింది. [112] "ది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్: ప్రోగ్రెస్, కాంట్రిబ్యూషన్స్, అండ్ ప్రాస్పెక్ట్స్" అనే అధికారిక నివేదిక రష్యాను 18 సార్లు ప్రస్తావించింది. చైనా తరువాత ఇదే అత్యధికం. ఈ ప్రాజెక్టులో రష్యా ప్రాధాన్యత ఈ విధంగా తెలుస్తోంది. [113]

ఆసియా

సింగపూర్ ఇప్పటికే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ. దేశీయ మౌలిక సదుపాయాల నిర్మాణానికి బయటినుంచి భారీ విత్త సాయం లేదా సాంకేతిక సహాయం అవసరం లేదు. అయినప్పటికీ ఇది బెల్ట్-అండ్-రోడ్ ఇనిషియేటివ్‌ను సమర్ధించింది. సంబంధిత ప్రాజెక్టులలో సహకరించింది. ప్రపంచ స్థాయిలో తమ స్థానం కోసం అన్వేషించడం, BRI గ్రహీతలతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే దీని ప్రేరణ. ఇంకా వ్యూహాత్మక రక్షణ కారకం కూడా ఉంది: ఆసియా ఆర్థిక రంగంలో చైనా ఒక్కటే ఆధిపత్య స్థాఅయిలో ఉండకూడదని నిర్ధారించుకోవడం. [114]

చారిత్రికంగా ఫిలిప్పీన్స్‌కు అమెరికాకూ దగ్గరి సంబంధాలు ఉన్నప్పటికీ, దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం కోసం, BRI కి ఫిలిప్పీన్స్ మద్దతు కావాలని చైనా కోరింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తరణకు అనుకూలంగా ఫిలిప్పీన్స్ తన విధానాన్ని సర్దుబాటు చేసుకోవడాంతో, చైనా వ్యూహం చాలావరకు విజయవంతమైంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో రో డ్యూటెర్టే, చైనా విస్తరణను ప్రతిఘటించే తన పూర్వ అధ్యక్షుల విధానాన్ని తిప్పికొట్టాడు. ఇది పాత ఆర్థిక సిల్కురోడ్డు పునరుజ్జీవనాన్ని ఆశిస్తూ, ఆర్థికంగా మరింత ప్రయోజనకరమైన మార్గంగా ఉంటుందనీ, భారీ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం తన ప్రణాళికలకు మద్దతు ఇస్తుందనీ అతడు లెక్కవేసుకున్నాడు. [115]

అరబ్బు దేశాలు

2019 ఏప్రిల్ లోను, సంస్కరణ అభివృద్ధిపై జరిగిన రెండవ అరబ్ ఫోరం సందర్భంగానూ చైనా, 18 అరబ్ దేశాలతో "బిల్డ్ ది బెల్ట్ అండ్ రోడ్, షేర్ డెవలప్మెంట్ అండ్ ప్రోస్పెరిటీ" అనే భాగస్వామ్య కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంది. గత 10 సంవత్సరాల్లో రెండు సంస్థల మధ్య వాణిజ్యం దాదాపు పది రెట్లు పెరిగింది. ఎందుకంటే మధ్యప్రాచ్యాన్ని చైనా తమ 'పెట్రోల్ స్టేషన్'గా చూడదు. అనేక వాణిజ్య రంగాల్లో ఈ దేశాలు పాల్గొంటున్నాయి; ఒమన్‌లోని ఓడరేవులు, అల్జీరియాలోని కర్మాగారాలు, ఈజిప్ట్ కొత్త రాజధానిలోని ఆకాశహర్మ్యాలు మొదలైనవి ఇందులో భాగం. అనేక అరబ్ యుద్ధాలు అమెరికన్ జోక్యాల తరువాత, అమెరికా మద్దతుతో జీవిస్తున్న ఆ దేశాలకు ఆర్థిక భద్రత కల్పించడానికి చైనా ఆసక్తి చూపుతోంది. ఒక వైపు, అరబ్ దేశాలు స్వాతంత్ర్యం పొందుతాయి, మరోవైపు చైనా భారీ మార్కెట్టుకు తలుపులు తెరుస్తుంది. లెబనాన్ అధ్యక్షుడు మిచెల్ ఔన్ చెప్పినట్లుగా, "మేము చైనాను మంచి స్నేహితుడిగా భావిస్తున్నాము. చైనాతో సంబంధాన్ని మరింత పటిష్టం చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాము. చైనా సంస్కరణ, అభివృద్ధి నుండి అనుభవాన్ని మన ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికీ అభివృద్ధిలో మా అవకాశాలనూ కోరుకుంటున్నాము ". [116] చైనాతో అదనపు ప్రయోజనం ఏమిటంటే ఇది దౌత్య స్థాయిలో తటస్థ పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు సౌదీ అరేబియా, ఇరాన్ వివాదాల మధ్య జోక్యం చేసుకోవడానికి చైనా ఆసక్తి చూపడం లేదు. అందువల్ల, శత్రువులుగా ఉన్న దేశాలతో వర్తకం చేయడంలో ఇది విజయవంతమవుతోంది. [117]

ఆఫ్రికా

రెండవ బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్‌కు హాజరైన ప్రపంచ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు, యునెకా (ఆఫ్రికాకు ఐరాస ఆర్థిక కమిషన్) ప్రస్తుత అధ్యక్షుడు వెరా సాంగ్వే ఇలా అన్నాడు: "ఇది (బిఆర్‌ఐ) బహుశా ప్రపంచంలో మనకు ఉన్న అతిపెద్ద అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటి". ఈ ప్రకటన ఆఫ్రికన్ దేశాల సాధారణ వైఖరిని సంక్షిప్తీకరిస్తుంది. అరబ్ దేశాల మాదిరిగానే, వారు BRI ని విదేశీ సహాయం, ప్రభావాల నుండి స్వాతంత్ర్యం పొందే అద్భుతమైన అవకాశంగా చూస్తారు. సగానికి పైగా ఖండం ఇప్పటికే మిడిల్ కింగ్‌డమ్‌ (చైనా) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లు కాంగ్ ఇటీవల ఇలా ప్రకటించాడు: "మేము పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, పెట్టుబడులతో సహా రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకువెళతాము, ఆఫ్రికన్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాము, ఆఫ్రికన్ దేశాలకు మరింత అభివృద్ధి డివిడెండ్లను తీసుకువస్తాము. చైనా, ఆఫ్రికా ప్రజలకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తాము". అంతే కాదు, "ఇరుపక్షాలు ఇప్పటికే చాలా ముఖ్యమైన సహకార ప్రాజెక్టులను ప్రారంభించాయి. తొలి దిగుబడులను సాధించాయి కూడా" అని ఆయన అన్నాడు. [118]

యూరపియన్ యూనియన్

షీ జిన్‌పింగ్, పోలిష్ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా పోలాండ్, చైనా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించిన ప్రకటనపై సంతకం చేశారు

గ్రీస్, క్రొయేషియా, మరో 14 తూర్పు ఐరోపా దేశాలు ఇప్పటికే చైనాతో BRI చట్రంలో ఉన్నాయి. వారిలో చాలా మంది 2008 ఆర్థిక సంక్షోభ ప్రభావంతో బాధపడుతున్నప్పటికీ, చైనా విధానం కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రతిపాదకులు వాదించారు. 2019 మార్చి లో చైనా ఇనిషియేటివ్‌లో చేరిన ఏడు దేశాల సమూహంలో ఇటలీ మొదటిది. కొత్త భాగస్వాములు ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి రవాణా, లాజిస్టిక్స్, రేవు మౌలిక సదుపాయాల వంటి రంగాలలో 2.5 బిలియన్ యూరోల “ అవగాహన ఒప్పందంపై ” పై సంతకం చేశారు. [119] ఇటాలియన్ ప్రధాని వెంటనే చైనా పట్ల తన నమ్మకాన్ని ధృవీకరించాడు: "చైనా, ఐరోపాల మధ్య పోటీ కంటే సహకారం పెద్దది". ఇటలీ ప్రధాని గియుసేప్ కాంటే నిర్ణయాన్ని త్వరలోనే పొరుగు దేశాలు లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ లు అనుసరించాయి. కొన్ని వారాల తరువాత, 16 + 1 దేశాలతో బిలియన్ డాలర్ల విలువైన మౌలిక సదుపాయాల ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా చైనా మరో విజయాన్ని సాధించింది. దాని పేరును 17 + 1 సమూహంగా మార్చింది. గ్రీస్ కూడా కూటమిలో చేరేట్లు చూసింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి "పోలిష్ కంపెనీలు భారీగా లాభపడతాయి" అని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా పేర్కొన్నాడు. [120] దుడా షీ లు వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఒక ప్రకటనపై సంతకం చేశారు, దీనిలో పోలాండ్, చైనాలు ఒకరినొకరు దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వాములుగా భావిస్తున్నాయని వారు పునరుద్ఘాటించారు. [121]

ప్రాజెక్టు వ్యతిరేకులు

ఆస్ట్రేలియా, జపాన్, భారతదేశం, అమెరికాల 'ఇండో-పసిఫిక్ విజన్'

బెల్ట్ అండ్ రోడ్‌కు ప్రత్యామ్నాయంగా "బ్లూ డాట్ నెట్‌వర్కు" ను రూపొందించడానికి జపాన్, భారతదేశం, ఆస్ట్రేలియాలు చేతులు కలిపాయి. వాస్తవానికి, ఈ ప్రాజెక్టు ఆలోచనలు 2016 లోనే మొదలైనప్పటికీ, దీని గురించి తెలిసిన వువరాలు బహు తక్కువ. స్థూలంగా, ఈ సహకారం రెండు అంశాలను హైలైట్ చేసింది: పసిఫిక్ మహాసముద్రాన్ని భద్రపరచుకోవడం, ఈ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి హామీ ఇవ్వడం.

2019 నాటికి, అమెరికా ఈ ప్రయత్నంలో చేరింది. తద్వారా ఈ కూటమిని "ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ స్ట్రాటజీ" (FOIP) గా మార్చారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ స్ట్రాటజీ (ఎఫ్ఓఐపి) ను భద్రత, ఆర్థికం, పాలన అనే మూడు నిర్మాణాత్మకమైన కార్యక్రమాలుగా చేపట్టాడు. దీన్ని చైనాకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఎదురుదాడిగా చూడవచ్చు. [122]

అమెరికా, దాని మిత్రదేశాలు పెన్షన్ ఫండ్స్ వంటి పెద్ద ప్రైవేటు రంగ ఆస్తుల యజమానులు ఆసియా పసిఫిక్ ప్రాంతమంతటా ప్రముఖమైన భౌగోళిక-ఆర్ధిక పాత్ర పోషించాల్సిందిగా కోరుతాయని ప్రపంచ పెన్షన్ కౌన్సిల్ డైరెక్టర్ ఎం. నికోలస్ జె. ఫిర్జ్లీ చెప్పాడు.

జూన్ 2019 ప్రారంభంలో, "స్వేచ్ఛాయుత", "సార్వజనిక" ల సాధారణ నిర్వచనాలను నాలుగు నిర్దిష్ట సూత్రాలుగా పునర్నిర్వచించారు - సార్వభౌమాధికారానికీ, స్వాతంత్ర్యానికీ గౌరవం; వివాదాల శాంతియుత పరిష్కారం; స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన పరస్పర వాణిజ్యం; అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండడం. [123] "తమ దేశాలను బలోపేతం చేయడానికీ తమ పౌరులను మరింత సంపన్నంగా మార్చడానికీ" అమెరికా భారతదేశాలు తమ ఆర్థిక సహకారాన్ని తీవ్రతరం చేయాలని నాయకులు కట్టుబడి ఉన్నారు.

వియత్నాంకు చైనాతో వెయ్యి సంవత్సరాలుగా విభేదాలున్నాయి. అది దక్షిణ చైనా సముద్ర విస్తరణను వ్యతిరేకిస్తుంది. ఇటీవలి దశాబ్దాల్లో వియత్నాం, అమెరికా, జపాన్‌లతో సన్నిహితంగా ఉంది. అయితే, చైనా చాలా పెద్దది, చాలా దగ్గరగా ఉంది. దాంతో వియత్నాం BR కి సమర్ధన / వ్యతిరేకతల పట్ల అనిశ్చితంగా ఉంది. [124]

దక్షిణ కొరియా తన ప్రతిస్పందనగా, చైనీయుల మైత్రీ సైగల నుండి ఊరంగా ఉండడం, తానే స్వయంగా ఒక "యురేషియా ఇనిషియేటివ్" (EAI) ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించడం ఉన్నాయి.. పురాతన సిల్క్ రోడ్ పునరుజ్జీవనం కోసం పిలుపునివ్వడంలో ప్రెసిడెంట్ పార్క్ జియున్-హే ప్రధాన లక్ష్యం కొరియా ద్వీపకల్పం ద్వారా యూరప్ నుండి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరస్పర చర్యలను ప్రోత్సహించడం. ఆమె వారసుడు, ప్రెసిడెంట్ మూన్ జే-ఇన్ తన సొంత విదేశాంగ విధానమైన న్యూ సదరన్ పాలసీ "(ఎన్ఎస్పి) ని ప్రకటించాడు. ఇది ఆగ్నేయాసియాతో సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఉత్తర కొరియాతో దీర్ఘకాలిక శాంతి లక్ష్యాన్ని బలోపేతం చేయడానికి EAI, NSP లు రెంటినీ ప్రతిపాదించారు. దక్షిణ కొరియా ఎదుర్కొంటున్న గొప్ప పోటీ వలన ఉద్భవించినవే ఈ విధానాలు. [125]

ఇటీవల ఇటలీ, గ్రీస్ లు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో చేరిన తొలి ప్రధాన దేశాలు. చైనా అంతర్జాతీయ విధానాల పట్ల EU తన అభిప్రాయాలను స్పష్టం చేయవలసిన ఆవశ్యకతను ఈ చేరికలు నొక్కిచెప్పాయి. వాస్తవానికి, ఇటలీ ఉప ప్రధాన మంత్రి లుయిగి డి మైయో ఈ ఒప్పందం గురించి ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని చెప్పినప్పటికీ, ఫ్రెంచ్, జర్మన్ నాయకులు దానిపై ఏమంత ఆశాజనకంగా లేరు. ప్రెసిడెంట్ మాక్రాన్ బ్రస్సెల్స్లో "ఐరోపా అమాయకత్వానికి సమయం ముగిసింది" అని అన్నాడు. "చాలా సంవత్సరాలుగా మా విధానాల్లో సమన్వయం లేకుండా పోయింది. చైనా మా విభేదాలను సద్వినియోగం చేసుకుంది" అని అతడు అన్నాడు. [126]

మార్చి 2019 చివరలో, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ జీన్-క్లాడ్ జుంకర్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి పారిస్‌లో షీ తో చర్చలు జరిపారు. అక్కడ, "యూరోపియన్ యూనియన్ ఐక్యతనూ, ప్రపంచంలో దానికి ఉన్న విలువలనూ గౌరవించాలని" మాక్రాన్ చైనాను కోరాడు. "ఐరోపాలో చైనీయులకు లభించిన స్థాయిలో స్వేచ్ఛ, చైనా మార్కెట్లో యూరోపియన్ కంపెనీలకూ లభించాల"ని జంకర్ నొక్కిచెప్పాడు. అదే పంథాలో మెర్కెల్, "BRI ఒక నిర్దిష్ట పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడానికి దారి తీయాలి. కానీ మేమింకా ఆ విషయం మీదనే గొడవ పడుతున్నాము" అని ప్రకటించింది. 2019 జనవరి లో మాక్రాన్ ఇలా అన్నాడు: "పురాతన సిల్క్ రోడ్లు చైనీస్‌వి మాత్రమే కావు అలాగే.. కొత్త రోడ్లు వన్‌వేలుగా ఉండాలంటే కుదరదు." [119]

డిసెంబరు 2018 చివరలో జర్మనీ విదేశీ వాణిజ్యంపై తన విధానాలను కఠినతరం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా జర్మన్ కంపెనీలలో వాటాల ప్రత్యక్ష, పరోక్ష కొనుగోళ్లపై నియంత్రణలను పెంచింది. [127]

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పెరుగుతున్న విమర్శలకు పర్యవసానంగాను, పారదర్శకత లేమి వల్లనూ, యూరోపియన్ కమిషన్ చీఫ్ జీన్-క్లాడ్ జంకర్, జపనీస్ ప్రధాన మంత్రి షింజో ఆబే లు 2019 సెప్టెంబరు 27 న బ్రస్సెల్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐరోపా, జపాన్ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ను ఎదుర్కోవటానికీ, మౌలిక సదుపాయాలు, రవాణా, డిజిటల్ ప్రాజెక్టులను సమన్వయం చేయడానికీ యూరప్ ఆసియాలను అనుసంధానించడానికీ ఉద్దేశించబడింది. [128]

ఇంకా, EU ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి విరాళ దాతలలో ఒకటి. అనేక ఆఫ్రికన్ ఆర్థిక వ్యవస్థలు, EU పెట్టుబడులు, భాగస్వామ్యాలకు బ్యాక్‌డోర్గా గుర్తించబడుతున్నాయి. ఇటీవలి దశాబ్దాలలో ఈ దేశాలను EU నిర్లక్ష్యం చేసింది. అందువల్ల, ఆఫ్రికన్ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలలో ప్రధాన పెట్టుబడులు పెడుతున్న చైనా తమను వెనక్కి నెట్టేస్తుందని EU భయపడుతోంది. [129]

EU లో ఇప్పటికే క్షీణిస్తున్న ఐక్యత నేపథ్యంలో, ఈ దేశాలలో చైన పట్ల ఉన్న భిన్నమైన వైఖరులు విధానాల కారణంగాను, పెరుగుతున్న చైనా భౌగోళిక రాజకీయ శక్తి కారణంగానూ ఈ ప్రాంతం మరింత అస్థిరతకు లోనౌతుందని - ముఖ్యంగా అప్పుల ఊబిలోకి దిగుతున్న ఆగ్నేయ ఐరోపా దేశాలకు సంబంధించి - EU దౌత్యవేత్తలు భయపడుతున్నారు. [130]

యూరోపియన్ ఆర్థికవేత్తలు, రాయబారులు అంతర్జాతీయ వాణిజ్యంలో శక్తి సమతుల్యతపై న్యూ సిల్క్ రోడ్ చూపించే ప్రభావాల గురించి తీవ్రమైన ఆందోళనలు చెందుతున్నారు. [131] అంతేకాకుండా డిజిటలైజేషన్‌లో చైనా సాధీంచిన ఆర్థిక విజయాలు, ఇటీవలి దశాబ్దాల్లో చైనా కంపెనీలు ఈ రంగంలో సాధీంచిన ప్రగతి యూరోపియన్ కంపెనీలను సవాలు చేయబోతున్నాయి. యూరోపియన్ కంపెనీల పోటీ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి EU లో సంస్కరణలు అవసరం. [132]

చైనా తన భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ప్రభావితమవుతున్న ప్రతి దేశానికి ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నప్పటికీ, యూరోపియన్ పర్యావరణ, సామాజిక ప్రమాణాలను అణగదొక్కి, వాణిజ్యాన్ని సరళీకృతం చేయడానికి EU యొక్క ఎజెండాను ఎదుర్కోవటానికి ఇనిషియేటివ్ పనిచేస్తుందనే భయం యూరోపియన్ దేశాలలో ఉంది. [133]

ఇవి కూడా చూడండి

  • ఆసియా హైవే నెట్‌వర్క్
  • యురేషియన్ ల్యాండ్ బ్రిడ్జ్
  • చైనా విదేశాంగ విధానం
  • ఇండో-పసిఫిక్
  • చైనా యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల జాబితా
  • ట్రాన్స్-ఏషియన్ రైల్వే
  • అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్
  • ఆసియా-ఆఫ్రికా గ్రోత్ కారిడార్

మూలాలు