మియోసిన్

సిస్టమ్/
పీరియడ్
సీరీస్/
ఇపోక్
స్టేజ్/
ఏజ్
వయసు (Ma)
క్వాటర్నరీప్లైస్టోసీన్గెలాసియన్younger
నియోజీన్ప్లయోసీన్పియాసెంజియన్2.583.600
జాంక్లియన్3.6005.333
మయోసీన్మెస్సీనియన్5.3337.246
టోర్టోరియన్7.24611.63
సెర్రావాలియన్11.6313.82
లాంగియన్13.8215.97
బుర్డిగాలియన్15.9720.44
అక్విటానియన్20.4423.03
పాలియోజీన్ఓలిగోసీన్చాటియన్older
Subdivision of the Neogene Period
according to the ICS, as of 2017.[1]

నియోజీన్ పీరియడ్‌లో సుమారు 230.3 - 53.33 లక్షల సంవత్సరాల క్రితం మధ్య నున్న కాలాన్ని మయోసీన్ ఇపోక్ అంటారు. భౌగోళిక కాలమానంలో మయోసీన్‌కు ముందు ఓలిగోసీన్ ఇపోక్, మయోసీన్ తరువాత ప్లయోసీన్‌ ఇపోక్‌లూ ఉన్నాయి.

భూమి ఓలిగోసీన్ కాలం నుండి మయోసీన్‌కు, ఆపై ప్లయోసీన్‌లోకీ వెళ్ళేటప్పుడు, వాతావరణం నెమ్మదిగా చల్లబడుతూ వరుస మంచు యుగాల వైపు ప్రయాణించింది. మయోసీన్‌ సరిహద్దును గుర్తించే ప్రత్యేకమైన ప్రపంచవ్యాప్త సంఘటన ఏమీ లేదు. కాని వెచ్చని ఓలిగోసీన్, శీతల ప్లయోసీన్ ఇపోక్‌ల మధ్య ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ సరిహద్దు లున్నాయి.

ప్రారంభ మయోసీన్ (అక్విటానియన్, బర్డిగాలియన్ స్టేజ్‌లు) సమయంలో కోతులు మొదట ఉద్భవించి, వృద్ధిచెంది, వైవిధ్యత చెందాయి. ఇవి పాత ప్రపంచంలో విస్తృతంగా వ్యాపించాయి. ఈ ఇపోక్ ముగిసి, తరువాతి ఇపోక్ మొదలయ్యే సమయానికి, మానవ పూర్వీకులు చింపాంజీల పూర్వీకుల నుండి వేరుపడి మయోసీన్ దశల్లో చివరిదైన మెస్సీనియన్ దశలో (75–53 లక్షల సంవత్సరాల క్రితం) వాటివాటి స్వంత పరిణామ మార్గాలను అనుసరించాయి. దీనికి ముందరి ఓలిగోసీన్‌లో లాగానే, మయోసీన్‌లో కూడా గడ్డి భూములు విస్తరిస్తూ, అడవులు తగ్గుతూ ఉన్నాయి. మయోసీన్ లోనే సముద్రాల్లో మొట్టమొదటిసారిగా కెల్ప్ అడవులు ఈ కనిపించాయి. కొద్ది కాలంలోనే అవి భూమి యొక్క అత్యంత ఉత్పాదక పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా మారాయి.[2]

మయోసీన్ కాలపు మొక్కలు, జంతువులు ఆధునికమైనవి. క్షీరదాలు, పక్షులూ ఈ కాలంలో బాగా స్థిరపడ్డాయి. తిమింగలాలు, పిన్నిపెడ్లు, కెల్ప్‌లు వ్యాప్తి చెందాయి.

హిమాలయాల జియాలజీలోని ప్రధాన దశలు మయోసీన్ కాలంలో సంభవించాయి. ఈ కారణాన భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, పాలియో క్లైమటాలజిస్టులకు ఈ కాలమంటే ప్రత్యేక ఆసక్తి. హిమాలయాలు ఆసియాలో రుతుపవనాలను ప్రభావితం చేస్తాయి. ఇవి ఉత్తరార్ధగోళంలోని హిమనదీయ కాలాలతో అనుసంధానమై ఉన్నాయి.[3]

ఉపవిభాగాలు

మయోసీన్ ఉపవిభాగాలు

ఇంటర్నేషనల్ కమీషన్ ఆన్ స్ట్రాటిగ్రాఫీ ప్రకారం జంతుజాల దశలు ఇటీవలి నుండి అతి పురాతనం వరకూ ఇలా ఉన్నాయి:[4]

ఉప ఇపోక్జంతుజాల దశసమయ పరిధి
అంత్య మయోసీన్మెస్సీనియన్72.46–53.33 లసంక్రి [గమనిక 1]
టోర్టోనియన్116.08–72.46 లసంక్రి
మధ్య మయోసీన్సెర్రావాలియన్136.5–116.08 లసంక్రి
లాంఘియన్159.7–136.5 లసంక్రి
ప్రారంభ మయోసీన్బర్డిగాలియన్204.3–159.7 లసంక్రి
అక్విటానియన్230.3–204.3 లసంక్రి

ప్రాంతీయంగా, భూ క్షీరదాల ఆధారంగా ఇతర వ్యవస్థలు వినియోగంలో ఉన్నాయి; వాటిలో కొన్ని మునుపటి ఓలిగోసీన్‌, తరువాతి ప్లయోసీన్ లలోకి విస్తరించి ఉన్నాయి:

యూరోపియన్ భూ క్షీరదాల ఏజ్‌లు

  • టురోలియన్ (90 నుండి 53 లసంక్రి)
  • వల్లేసియన్ (116 నుండి 90 లసంక్రి)
  • అస్టరాసియన్ (160 నుండి 116 లసంక్రి)
  • ఓర్లేనియన్ (200 నుండి 160 లసంక్రి)
  • అజేనియన్ (238 నుండి 200 లసంక్రి)

ఉత్తర అమెరికా భూ క్షీరదాల ఏజ్‌లు

  • హెంఫిలియన్ (103 నుండి 49 లసంక్రి)
  • క్లారెండోనియన్ (136 నుండి 103 లసంక్రి)
  • బార్స్టోవియన్ (163 నుండి 136 లసంక్రి)
  • హెమింగ్‌ఫోర్డియన్ (206 నుండి 163 లసంక్రి)
  • అరికరీన్ (306 నుండి 206 లసంక్రి)

దక్షిణ అమెరికా భూ క్షీరదాల ఏజ్‌లు

  • మాంటెహెర్మోసన్ (68 నుండి 40 లసంక్రి)
  • హుయెక్వేరియన్ (90 నుండి 68 లసంక్రి)
  • మయోన్ (118 నుండి 90 లసంక్రి)
  • లావెంటన్ (138 నుండి 118 లసంక్రి)
  • కొలోన్కురాన్ (155 నుండి 138 లసంక్రి)
  • ఫ్రియాసియన్ (163 నుండి 155 లసంక్రి)
  • శాంటాక్రూసియన్ (175 నుండి 163 లసంక్రి)
  • కొల్హువాపియన్ (210 నుండి 175 లసంక్రి)

పాలియోజియాగ్రఫీ

ఖండాలు ఇప్పుడున్న స్థానాల దిశగా వాటి చలనం కొనసాగింది. వర్తమాన భౌగోళిక లక్షణాల్లో, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాల మధ్య ఉన్న మధ్య భూ వంతెన మాత్రమే అప్పట్లో లేదు. దక్షిణ అమెరికా ఖండం పసిఫిక్ మహాసముద్రంలోని పశ్చిమ సబ్డక్షన్ జోన్ వైపుగా చలనం మాత్రం జరుగుతోంది. దీనివల్ల అండీస్ పర్వతాల ఎత్తు పెరిగింది. మధ్య అమెరికా ద్వీపకల్పం దక్షిణ దిశగా విస్తరించింది.

పశ్చిమ ఉత్తర అమెరికా, యూరప్, తూర్పు ఆసియాల్లో పర్వతాలు ఎత్తు పెరుగుదల జరిగింది.

భారతదేశం, ఆసియాతో ఢీకొనడం కొనసాగి, ఈ క్రమంలో కొత్త పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. 190 - 120 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య టర్కిష్ - అరేబియా ప్రాంతంలో ఆఫ్రికా యురేషియాతో ఢీకొనడంతో టెథిస్ సముద్రమార్గం కుంచించుకుపోతూ, చివరికి అదృశ్యమైంది. తదుపరి, పశ్చిమ మధ్యధరా ప్రాంతంలో పర్వతాలు పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాలు తగ్గడం కారణంగా మయోసీన్ చివర్లో మధ్యధరా సముద్రం తాత్కాలికంగా ఎండిపోయింది. దీన్ని "మెస్సీనియన్ లవణీయత సంక్షోభం" అని అంటారు.

ప్రపంచవ్యాప్త శీతలీకరణ కారణంగా తేమను పీల్చుకునే వాతావరణపు సామర్థ్యం తగ్గి పొడి పరిస్థితులు ఏర్పడే సరళి ప్రపంచ వ్యాప్తంగా ఉండేది. మయోసీన్ చివర్లో తూర్పు ఆఫ్రికా పైకి పొంగడం, ఆ ప్రాంతంలోని ఉష్ణమండల వర్షారణ్యాలు తగ్గిపోవడానికి కొంతవరకు కారణమైంది. అంత్య మయోసీన్‌లో ఆస్ట్రేలియా తక్కువ వర్షపాత కాలంలోకి ప్రవేశించడంతో అది పొడిగా మారింది.

దక్షిణ అమెరికా

ఓలిగోసీన్ లోను, మయోసీన్ మొదట్లోనూ ఉత్తర బ్రెజిల్ తీరం,[5] కొలంబియా, దక్షిణ-మధ్య పెరూ, మధ్య చిలీ, లోతట్టు పెటగోనియా లోని విశాలమైన ప్రాంతాలను సముద్రం ముంచేసింది.[6] దక్షిణ అమెరికా యొక్క పశ్చిమ తీరం ముంపుకు గురౌడానికి ప్రాంతీయ కారణాలున్నాయని భావిస్తున్నారు. అయితే క్రమంగా ఎత్తు పెరుగుతున్న అండీస్ పర్వత శ్రేణి మధ్య భాగం దీనికి మినహాయింపు. ప్రపంచవ్యాప్తంగా ఓలిగో-మయోసీన్ కాలాల్లో అనేక ముంపు ఘటనలు జరిగిన ఆధారా లున్నప్పటికీ, వీటికి పరస్పర సంబంధం ఉందా అనేది సందేహాస్పదమే.

మధ్య మయోసీన్ కాలంలో (140–120 లక్షల సంవత్సరాల క్రితం) లో దక్షిణ అండీస్ పెరిగిన ఫలితంగా వర్షచ్ఛాయా ప్రాంతం ఏర్పడి, తూర్పున పెటగోనియా ఎడారి ఉద్భవించింది.[7]

శీతోష్ణస్థితి

ప్లైస్టోసీన్ కాలంలో ఏర్పడిన గ్లేసియేషన్లకు దారితీసిన శీతలీకరణ మయోసీన్ కాలమంతా నెమ్మదిగా జరుగుతూ ఉన్నప్పటికీ, శీతోష్ణస్థితులు మొత్తమ్మీద కాస్త వెచ్చగానే ఉండేవి.

దీర్ఘకాలిక శీతలీకరణ బాగా జరుగుతూ ఉన్నప్పటికీ, ఓలిగోసీన్‌తో పోల్చితే మయోసీన్ కాలంలో మరింత వెచ్చని శీతోష్ణస్థితి ఉండేదని ఆధారాలు ఉన్నాయి. మయోసీన్ కాలంలో వెచ్చబడడం 210 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమై, 140 లక్షల సంవత్సరాల క్రితం ప్రపంచ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయేంత వరకూ కొనసాగింది. దీన్ని మధ్య మయోసీన్ శీతోష్ణస్థితి ప్రస్థానం (MMCT) అంటారు. 80 లక్షల సంవత్సరాల క్రితం, ఉష్ణోగ్రతలు మరోసారి బాగా పడిపోయాయి. అప్పటికే అంటార్కిటిక్ మంచు పలక దాని ప్రస్తుత పరిమాణం, మందానికి చేరువలో ఉంది. శీతోష్ణస్థితి చాలావరకు ప్లయోసీన్‌లో అడవులు పెరిగేందుకు అనుకూలంగాఉండేంత వెచ్చగానే ఉన్నప్పటికీ, 70 నుండి 80 లక్షల సంవత్సరాల క్రితం నాటికి గ్రీన్లాండ్లో పెద్ద హిమానీనదాలు ఏర్పడుతూ ఉండటం మొదలై ఉండవచ్చు.

జీవం

మయోసీన్ ఇపోక్‌లో కొత్తగా ఏర్పడిన కెల్ప్ అడవులు, గడ్డి భూములు ఎక్కువగా జీవులకు ఆధారమయ్యాయి. గుర్రాలు, ఖడ్గమృగం, హిప్పోస్ వంటి జంతువులు గడ్డి భూముల్లో మేసేవి. ఈ ఇపోక్ ముగిసేనాటికి ఆధునిక వృక్షజాతుల్లో తొంభై ఐదు శాతం వరకూ ఉద్భవించాయి.

ఫ్లోరా

డ్రాగన్ రక్త వృక్షం. మయో-ప్లయోసీన్ కాలపు లారాసియన్ ఉప ఉష్ణమండల అడవుల అవశేషంగా భావిస్తున్నారు. ఇప్పుడివి ఉత్తర ఆఫ్రికాలో దాదాపు అంతరించిపోయాయి.[8]

పీచుపదార్థం కలిగిన, మంటలకు తట్టుకునే గట్టి గడ్డి ఈ కాలంలో ఉద్భవించింది. అదే సమయంలో పొడవాటి కాళ్ళు కలిగి, గుంపులుగా జీవించే గిట్టలజంతువులు కూడా వర్ధిల్లాయి. ఈ గడ్డిభూములు, మేసే జంతువులు, ఈ జంతువులను వేటాడి తినే వేటజంతువులూ వీటన్నిటితో ఒక పర్యావరణ వ్యవస్థలు ఎడారి, అటవీ వ్యవస్థల స్థానాన్ని ఆక్రమించాయి.

గడ్డి భూముల నేలలలో ఉండే అధిక సేంద్రియ పదార్థం, ఈ భూముల నీటి నిల్వ సామర్థ్యాలు దీర్ఘకాలం పాటు సెడిమెంట్లలో ఉన్న కార్బన్‌తో కలిసి ఒక కార్బన్, నీటిఆవిరి సింక్ ఏర్పడింది. నేలపై ఉండే అధిక అల్బెడోతోటి, గడ్డి భూముల వలన తక్కువైన బాష్పీభవనంతోటీ కలిసి చల్లటి, పొడి శీతోష్ణస్థితి ఏర్పడటానికి దోహదపడింది.[9] సి3 గడ్డి కంటే కార్బన్ డయాక్సైడ్ను, నీటిని మరింత సమర్థవంతంగా పీల్చుకోగలిగే సి4 గడ్డి, మయోసీన్ చివరిలో 60 - 70 లక్షల సంవత్సరాల క్రితం విస్తరించి, పర్యావరణపరంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.[10] గడ్డి భూములు, భూచర శాకాహారుల విస్తరణ CO2 లోని హెచ్చుతగ్గులతో సంబంధం కలిగి ఉంది.[11]

శీతోష్ణస్థితిలో ఏర్పడిన మార్పుల కారణంగా తగ్గిన సైకాడ్ల సంఖ్య, 115 - 50 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య తిరిగి పెరగడం మొదలైంది.[12] న్యూజిలాండ్ లో మయోసీన్ కాలపు యూకలిప్టస్ ఆకుల శిలాజాలు లభించాయి. అయితే, ప్రస్తుతం అక్కడ ఉన్న యూకలిప్టస్ జాతికి స్థానికత లేదు; అది ఆస్ట్రేలియా నుండి వచ్చింది.

జంతుజాలం

హోమినిన్ కాలరేఖ
view • discuss • edit
-10 —
-9 —
-8 —
-7 —
-6 —
-5 —
-4 —
-3 —
-2 —
-1 —
0 —
తొలి కోతులు
LCA–Gorilla
separation
Possibly bipedal
LCA–Chimpanzee
separation
తొట్టతొలి ద్విపాది
తొట్టతొలి రాతి పనిముట్లు
Earliest exit from Africa
తొట్టతొలిగా నిప్పు వాడకం
తొలి వంట
తొలి దుస్తులు
ఆధునిక మాట
ఆధునిక మానవులు
Axis scale: million years
Also see: Life timeline and Nature timeline
కాలిఫోర్నియాలోని రెయిన్బో బేసిన్ యొక్క బార్‌స్టో ఫార్మేషన్ (మయోసీన్) లో లభించిన కామెలాయిడ్ పాదముద్ర (లామైచ్నమ్ ఆల్ఫీ - సర్జియంట్, రేనాల్డ్స్, 1999; కుంభాకార హైపోరెలీఫ్).

సముద్ర క్షీరదాలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ సముద్ర, భూతల జంతుజాలాలు రెండూ కూడా ఆధునికమైనవే. వేరుగా ఉండే దక్షిణ అమెరికా,ఆస్ట్రేలియాల్లో మాత్రమే విస్తృతంగా భిన్నమైన జంతుజాలం ఉండేవి.

ప్రారంభ మయోసీన్లో, వైవిధ్య భరితమైన ఓలిగోసీన్ సమూహాలు అనేకం ఉండేవి. వీటిలో నిమ్రావిడ్‌లు, ఎంటెలోడ్ంట్‌లు, మూడు గిట్టల ఈక్విడ్‌లూ ఉన్నాయి. మునుపటి ఓలిగోసీన్ ఇపోక్‌లో వలె, ఓరియోడాంట్లు ఈ కాలంలోనూ వైవిధ్యంగా ఉన్నాయి. ప్రారంభ ప్లయోసీన్లోనే ఇవి కనుమరుగయ్యాయి. తరువాతి మయోసీన్ కాలంలోని క్షీరదాలు మరింత ఆధునికమైనవి. సులభంగా గుర్తించగలిగే కానైడ్లు, ఎలుగుబంట్లు, ప్రోసియోనిడ్లు, ఈక్విడ్లు, బీవర్లు, జింకలు, ఒంటెలు, తిమింగలాలు, ప్రస్తుతం అంతరించిపోయిన బోరోఫాగిన్ కానైడ్లు, కొన్ని గోమ్ఫోథేర్లు, మూడు గిట్టల గుర్రాలు, టెలియోసెరాస్, అఫెలోప్స్ వంటి కొమ్ము లేని సెమీ ఆక్వాటిక్ ఖడ్గమృగాలు వీటిలో ఉన్నాయి. అంత్య మయోసీన్లో దక్షిణ, ఉత్తర అమెరికాల మధ్య ద్వీపాలు ఏర్పడటం మొదలైంది. దీంతో థీనోబాడిస్టెస్ వంటి భూచర స్లోత్‌లు ఈ ద్వీపాల మీదుగా ఉత్తర అమెరికాలోకి దూకడానికి వీలైంది. సిలికా అధికంగా ఉండే సి4 గడ్డి విస్తరణతో ఎత్తైన పళ్ళు లేని శాకాహార జాతులు ప్రపంచవ్యాప్తంగా అంతరించి పోయాయి.[13]

దస్త్రం:Miocene.jpg
ఉత్తర అమెరికాలోని మయోసీన్ కాలపు జంతుజాలం - పాలియో చిత్రకారుడు జే మాటెర్నెస్ గీసిన చిత్రం.

దక్షిణ అమెరికా డ్రైయోలెస్టాయిడ్ నెక్రోలెస్టెస్, పటగోనియా లోని గోండ్వానాథేర్, న్యూజిలాండ్ లోని సెయింట్ బాథన్స్ లతో సహా దక్షిణాది భూభాగాలలోని కొన్ని ప్రాథమిక క్షీరదాలు ఈ ఇపోక్‌లో కూడా కొనసాగాయి. అమెరికన్, యూరేషియన్ హైపర్‌టోథరీడ్ల వంటి నాన్-మార్సుపియల్ మెటాథేరియన్‌లు, సియామోపెరడెక్టెస్ వంటి పెరడెక్టిడ్లు, దక్షిణ అమెరికా స్పరస్సోడాంట్లు కూడా కొనసాగాయి.

నిస్సందేహంగా గుర్తించదగిన డబ్లింగ్ బాతులు, ప్లోవర్లు, సాధారణ గుడ్లగూబలు, కాకాటూలు, కాకులు మయోసీన్ సమయంలో కనిపించాయి. ఇపోక్ ముగిసే సమయానికి, అన్నీ లేదా దాదాపుగా అన్ని, ఆధునిక పక్షి సమూహాలూ ఉండేవని భావిస్తున్నారు. ఈ ఇపోక్‌లో సముద్ర పక్షులు అత్యధిక వైవిధ్యంతో ఉండేవి.

ఈ సమయంలో సుమారు 100 జాతుల కోతులు ఆఫ్రికా, ఆసియా, యూరప్ అంతటా నివసించాయి. పరిమాణం, ఆహారం, శరీర నిర్మాణంలో వీటిలో చాలా వైవిధ్యత ఉండేది. తగినన్ని శిలాజ ఆధారాలు లేని కారణంగా ఆధునిక హోమినిడ్‌లు ఏ కోతి లేదా కోతుల నుండి వచ్చాయో స్పష్టంగా తెలీడం లేదు. అయితే మాలిక్యులర్ ఆధారాలు మాత్రం ఆ కోతి 70 - 80 లక్షల సంవత్సరాల క్రితం నివసించినట్లు సూచిస్తున్నాయి.[14] అహెలాంత్రోపస్, ఒర్రోరిన్, తొలి రూపపు ఆర్డిపిథెకస్ (ఎ. కడబ్బా) వంటి తొలి హోమినిన్లు (మానవ వంశపు ద్విపాద కోతులు) మయోసీన్ చివర్లో ఆఫ్రికాలో కనిపించాయి. ఈ కాలం లోనే చింపాంజీ-మానవ వంశాల వేర్పాటు జరిగి ఉంటుందని భావిస్తున్నారు.[15]

ఉత్తర అమెరికాలో గడ్డి భూముల విస్తరించడం పాముల విస్తరణకు దారితీసింది.[16] గతంలో, పాములు ఉత్తర అమెరికా జంతుజాలంలో ఓ చిన్న భాగంగా ఉండేవి. కానీ మయోసీన్ కాలంలో, వీటి సంఖ్య, ప్రాబల్యమూ నాటకీయంగా పెరిగింది.

కాల్వెర్ట్ నిర్మాణం, జోన్ 10, కాల్వెర్ట్ కో, MD (మయోసీన్) నుండి శిలాజాలు
చిల్డ్రన్స్ మ్యూజియం ఆఫ్ ఇండియానాపోలిస్ సేకరణ లోని మయోసీన్ కాలపు పీత (టుమిడోకార్సినస్ గిగాంటెయస్ )

మహాసముద్రాలలో, కెల్ప్ అనే బ్రౌన్ ఆల్గే విస్తరించింది. దాంతో దీనిపై ఆధారపడిన కొత్త జాతుల సముద్ర జీవులు విలసిల్లాయి. వీటిలో ఓటర్స్, చేపలు, వివిధ అకశేరుకాలూ ఉన్నాయి .

మయోసీన్ సమయంలో సెటాసియన్లు అత్యధిక వైవిధ్యాన్ని చేరుకున్నాయి.[17] ప్రస్తుతం కేవలం ఆరు జీనస్‌లే ఉన్న బాలీన్ తిమింగలాలు, మయోసీన్‌లో 20 కి పైగా ఉండేవి.[18] ఈ వైవిధ్యం పెద్దకోరల సొరచేపలు, రాప్టోరియల్ స్పెర్మ్ తిమింగలాల వంటి భారీ కాయ మాంసాహారుల ఆవిర్భావంతో సంబంధం కలిగి ఉంది.[19] సి. మెగాలోడాన్, ఎల్. మెల్విల్లి దీనికి ప్రముఖ ఉదాహరణలు. ఇతర ముఖ్యమైన అతిపెద్ద షార్కుల్లో సి.చుబుటెన్సిస్, ఐసూరస్ హస్ట్లిస్, హెమిప్రైస్టిస్ సెర్రాలు ఉన్నాయి.

మయోసీన్ సమయంలో మొసళ్ళు కూడా వృద్ధి చెందాయి. వాటిలో అతిపెద్ద రూపం కలిగినది, దక్షిణ అమెరికాలో నివసించే పెద్ద కైమన్ పురుస్సారస్.[20] మరొక భారీ జీవి, ఘరియల్ రాంఫోసుచస్. ఇది ఆధునిక భారతదేశంలో నివసించింది. ఒక వింత రూపం గల మౌరసూకస్ కూడా పురుస్సారస్‌తో పాటు వర్ధిల్లింది. ఈ జాతి ప్రత్యేకమైన వడపోత పద్ధతిలో తిండి తినే విధానాన్ని అభివృద్ధి చేసింది. పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ ఇది చిన్న జంతుజాలాన్ని వేటాడి తినేది.

ఓలిగోసీన్ చివరలో కనిపించిన పిన్నిపెడ్లు మరింతగా జలచరాలుగా మారాయి. వీటిలో ప్రముఖమైనది అలోడెస్మస్ జీనస్.[21] భయంకరమైన వాల్రస్, పెలాగియార్క్టోస్‌లు అలోడెస్మస్‌ తో సహా ఇతర జాతుల పిన్నిపెడ్‌లను వేటాడి ఉండవచ్చు.

ఇంకా, దక్షిణ అమెరికా జలాల్లో మెగాపిరాన్హా పారానెన్సిస్ ఉండేది. ఇవి ఆధునిక కాలపు పిరానాల కంటే చాలా పెద్దవి.

న్యూజిలాండ్ లోని మయోసీన్ శిలాజాల రికార్డు ప్రత్యేకించి విలువైనది. సముద్ర నిక్షేపాలు వివిధ రకాలైన సెటాసీయన్లు, పెంగ్విన్‌లు ఉన్నాయి. ఈ రెండు సమూహాలు ఆధునిక జాతులుగా పరిణామం చెందాయి. ప్రారంభ మయోసీన్ కాలం నాటి సెయింట్ బాథన్స్ ఫౌనా మాత్రమే సెనోజోయిక్ కాలానికి చెంది, ప్రస్తుతానికి లభ్యమైన భూగోళ శిలాజాల రికార్డు. ఇందులో మోవా, కివీస్, ఆడ్జెబిల్ వంటి అనేక రకాల పక్షులే కాక, స్ఫెనోడాంటియన్‌లు, మొసళ్ళు, తాబేళ్ళు, అలాగే వివిధ జాతుల గబ్బిలాలు, అంతుబట్టని సెయింట్ బాథన్స్ క్షీరదాల శిలాజాలు ఉన్నాయి.

మహాసముద్రాలు

ఇయోసీన్‌లో, 360 లక్షల సంవత్సరాల క్రితం, అంటార్కిటికాలో మంచు ఏర్పడడం మొదలైందని సముద్రాల్లో డ్రిల్లింగ్ చేసే చోట్ల లభించిన ఆక్సిజన్ ఐసోటోప్‌ల పరిశీలనలో తేలింది. మధ్య మయోసీన్ కాలంలో 150 లక్షల సంవత్సరాల క్రితం, ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గడం, అంటార్కిటికాలో పెరిగిన మంచుకు సూచిక. అందువల్ల తూర్పు అంటార్కిటికాలో మయోసీన్ (230 –150 లక్షల సంవత్సరాల క్రితం) ప్రారంభం నుండి మధ్యకాలం వరకు కొన్ని హిమానీనదాలు ఉండేవని అనుకోవచ్చు. అంటార్కిటిక్ ధ్రువావర్తన ప్రవాహం (సర్కం పోలార్ కరెంట్) ఏర్పడటం వల్ల మహాసముద్రాలు కొంతవరకు చల్లబడ్డాయి. సుమారు 150 లక్షల సంవత్సరాల క్రితం దక్షిణార్ధగోళంలోని మంచు టోపీ ప్రస్తుత రూపానికి పెరగడం ప్రారంభించింది. గ్రీన్లాండ్ మంచు టోపీ, తరువాతి కాలంలో, 30 లక్షల సంవత్సరాల క్రితం మధ్య ప్లయోసీన్ కాలంలో వృద్ధి చెందింది.

మధ్య మయోసీన్ అంతరాయం

"మధ్య మయోసీన్ అంతరాయం" అనేది మయోసీన్ క్లైమాటిక్ ఆప్టిమం (180 - 160 లక్షల సంవత్సరాల క్రితం) తరువాత, సుమారు 148 - 145 లక్షల సంవత్సరాల క్రితం, లాంగియన్ దశలో భూ, జల చరాలు అంతరించిపోయిన ఘటనను సూచిస్తుంది. అంటార్కిటిక్ లోతుల్లోని శీతల జలాలు, తూర్పు అంటార్కిటిక్ మంచు పలక వ్యాప్తి కారణంగా 148 - 141 లక్షల సంవత్సరాల క్రితం ఓ పెద్ద శాశ్వత శీతల దశ సంభవించింది. మధ్య మయోసీన్లో, పసిఫిక్, దక్షిణ మహాసముద్రం, దక్షిణ అట్లాంటిక్‌లలో δ 18 O (ఆక్సిజన్ భారీ ఐసోటోపు) పెరిగిందని గుర్తించారు.[22]

గుద్దుడు ఘటన

మయోసీన్ కాలంలో (230 - 53 లక్షల సంవత్సరాల క్రితం) గానీ, ప్లయోసీన్ (53 - 26 లక్షల సంవత్సరాల క్రితం) కాలంలో గానీ పెద్ద గుద్దుడు ఘటన జరిగింది. ఈ ఘటనలో 52 కి.మీ వ్యాసం గల కరాకుల్ బిలం ఏర్పడింది. దీని వయస్సు 230 లక్షల సంవత్సరాల క్రితం కన్నా తక్కువ గానీ,[23] లేదా 5 లక్షల సంవత్సరాల క్రితం కన్నా తక్కువ గానీ ఉండవచ్చని అంచనా వేసారు.[24]

ఇవి కూడా చూడండి

గమనికలు

మూలాలు

మరింత చదవడానికి

బయటి లింకులు