మిఖాయిల్ గోర్బచేవ్

మిఖాయిల్ సెర్గేయివిచ్ గోర్బచేవ్ (1931 మార్చి 2 - 2022 ఆగస్టు 30) రష్యన్ రాజకీయ నాయకుడు, మాజీ సోవియట్ యూనియన్ రాజకీయ నాయకుడు. సోవియట్ యూనియన్కు ఎనిమిదవ, చివరి నేత. 1985 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. 1988 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ దేశాధినేతగా, 1988 నుండి 1989 వరకు సుప్రీం సోవియట్ ప్రెసీడియం ఛైర్మన్‌గా, 1989 నుండి 1990 వరకు సుప్రీం సోవియట్ ఛైర్మన్‌గా, 1990 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. సైద్ధాంతికంగా, అతడు మొదట్లో మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడి ఉన్నాడు, అయితే 1990 ల ప్రారంభంలో సామ్యవాద ప్రజాస్వామ్యం వైపు వెళ్ళాడు.

మిఖాయిల్ గోర్బచేవ్
Михаил Горбачёв
సోవియట్ యూనియన్ అధ్యక్షుడు
In office
1990 మార్చి 15 – 1991 డిసెంబరు 25
Vice Presidentగెన్నడి యనయేవ్
తరువాత వారు
  • బోరిస్ యెల్ట్‌సిన్ (రష్యా అధ్యక్షుడిగా)
ప్రధాన కార్యదర్శి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్
In office
1990 మార్చి 11 – 1991 ఆగస్టు 24
ప్రథాన మంత్రి
  • నికొలాయ్ రిజ్కోవ్]
  • వాలెంటిన్ పావ్లోవ్
  • ఇవాన్ సిలయేవ్
Deputyవ్లాడిమిర్ ఇవాష్కో
అంతకు ముందు వారుకాన్‌స్టాంటిన్ చెర్నెంకో
తరువాత వారువ్లాడిమిర్ ఇవాష్కో (acting)
ఛైర్మన్, సుప్రీమ్‌ సోవియట్ ఆఫ్ సోవియట్ యూనియన్
In office
1989 మే 25 – 1990 మార్చి 15
Deputyఅనాటొలీ లుక్యానొవ్
తరువాత వారుఅనాటొలీ లుక్యానొవ్
ప్రిసీడియమ్
In office
1988 అక్టోబరు 1 – 1989 మే 25
అంతకు ముందు వారుఆండ్రీ గ్రోమికో
కో-ఛైర్మన్, యూనియన్ ఆఫ్ సోషల్ డెమోక్రాట్స్
Incumbent
Assumed office
2000 మార్చి 11
సెకండ్ సెక్రెటరీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్
In office
1984 ఫిబ్రవరి 9 – 1985 మార్చి 10
అంతకు ముందు వారుకాన్‌స్టాంటిన్ చెర్నెంకో
తరువాత వారుయెగొర్ లిగచెవ్
వ్యక్తిగత వివరాలు
జననం
మిఖాయిల్ సెర్గేయివిచ్ గోర్బచేవ్

(1931-03-02) 1931 మార్చి 2 (వయసు 93)
ప్రవాల్నోయ్, రష్యన్ SFSR, సోవియట్ యూనియన్
మరణం30 ఆగస్టు 2022
మాస్కో, రష్యా
జాతీయత
  • సోవియట్ (1931–1991)
  • రష్యన్ (1991 నుండి)
రాజకీయ పార్టీయూనియన్ ఆఫ్ సోషల్ డెమోక్రాట్స్ (2007–ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
  • కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ (1952–1991)
  • ఇండిపెండెంట్ (1991–2000)
  • యునైటెడ్ సోషియల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ రష్యా (2000–2001)
  • సోషియల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ రష్యా (2001–2007)
జీవిత భాగస్వామి
రైసా గోర్బచేవ్
(m. 1953; died 1999)
సంతానం1
కళాశాలమాస్కో స్టేట్ యూనివర్సిటీ
పురస్కారాలునోబెల్‌ శాంతి బహుమతి
సంతకం
కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర సభ్యత్వం
  • 1980–1991: పూర్తి సభ్యుడు, 25వ,26వ,27వ,28వ పొలిట్ బ్యూరో
  • 1979–1980: కాండిడేట్ సభ్యుడు, 25వ పొలిట్ బ్యూరో
  • 1978–1991: సభ్యుడు, 25వ,26వ,27వ,28వ సెక్రెటేరియట్
  • 1971–1991: పూర్తి సభ్యుడు, 24వ,25వ,26వ,27వ,28వ కేంద్రకమిటీ

ఇతర పదవులు
  • 2001–2004: ఛైర్మన్, సోషియల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ రష్యా
  • 1985–1991: ఛైర్మన్, డిఫెన్స్ కౌన్సిల్
  • 1970–1978: ఫస్ట్ సెక్రెటరీ, స్తావ్రొపోల్ ప్రాంతీయ కమిటీ

రష్యన్, ఉక్రేనియన్ మిశ్రమ వారసత్వానికి చెందిన గోర్బచేవ్, స్టావ్రోపోల్ క్రాయ్‌ లోని ప్రివోల్నోయేలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు. జోసెఫ్ స్టాలిన్ పాలనలో పెరిగిన అతడు, యవ్వనంలో కమ్యూనిస్ట్ పార్టీలో చేరడానికి ముందు కొన్నాళ్ళు సమష్టి పొలంలో హార్వెస్టర్లను నడిపాడు. అప్పట్లో మార్క్సిస్ట్-లెనినిస్ట్ సిద్ధాంతం ప్రకారం సోవియట్ యూనియన్‌ను ఏకపక్షంగా పరిపాలిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. మాస్కో స్టేట్ యూనివర్శిటీ నుండి 1955 లో న్యాయ పట్టా పొందాడు. అంతకు ముందు, 1953 లో, మాస్కో స్టేట్ యూనివర్శిటీలో ఉన్నప్పుడే తోటి విద్యార్థిని రైసా టైటారెంకోను వివాహం చేసుకున్నాడు. స్టావ్రోపోల్‌కు వెళ్లిన అతడు కొమ్సోమోల్ యువజన సంస్థలో పనిచేశాడు. స్టాలిన్ మరణం తరువాత, నికిటా కృశ్చేవ్ మొదలుపెట్టిన డీస్టాలినైజేషన్ సంస్కరణలను సమర్ధించాడు. 1970 లో స్టావ్రోపోల్ ప్రాంతీయ కమిటీకి మొదటి పార్టీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు, ఈ పదవిలో అతడు గ్రేట్ స్టావ్రోపోల్ కాలువ నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా 1978 లో మాస్కో వెళ్ళాడు. 1979 లో దాని పాలక పొలిట్‌బ్యూరోలో చేరాడు. సోవియట్ నాయకుడు, లియోనిద్ బ్రెజ్నెవ్ మరణానంతరం మూడేళ్ల పాటు యూరీ ఆండ్రోపోవ్, కాన్‌స్టాంటిన్ చెర్నెంకో ల ప్రభుత్వాలు గడిచాక, 1985 లో, గోర్బచేవ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, వాస్తవ ప్రభుత్వాధినేతగా ఎన్నికయ్యాడు.

సోవియట్ రాజ్యాన్ని, దాని సోషలిస్ట్ ఆదర్శాలనూ పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నప్పటికీ, గోర్బచేవ్ గణనీయమైన సంస్కరణలు అవసరమని నమ్మాడు -ముఖ్యంగా 1986 చెర్నోబిల్ విపత్తు తరువాత. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం నుండి వైదొలిగాడు. అణ్వాయుధాలను పరిమితం చేయడానికీ, ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడానికీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌తో శిఖరాగ్ర సమావేశాలను ప్రారంభించాడు. దేశీయంగా, వాక్ స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛనూ మెరుగుపర్చడానికి గ్లాస్‌నోస్ట్ విధానాన్ని ("బహిరంగత") ఉద్దేశించాడు. సమర్ధతను మెరుగుపరచడానికి, ఆర్థిక నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరించడానికీ పెరెస్త్రోయికా ("పునర్నిర్మాణం")ను ఉద్దేశించాడు. అతడి ప్రజాస్వామిక చర్యలు, పీపుల్స్ డిప్యూటీస్ కాంగ్రెస్ (ఇందులోని సభ్యులను ప్రజలే ఎన్నుకుంటారు) ఏర్పాటూ ఏకపక్ష దేశాన్ని బలహీన పరచాయి. 1989-90లో వివిధ తూర్పు బ్లాక్ దేశాలు మార్క్సిస్ట్-లెనినిస్ట్ పాలన నుండి వైదొలగినప్పుడు గోర్బచేవ్ సైనికపరంగా జోక్యం చేసుకోవడానికి నిరాకరించాడు. దేశంలో అంతర్గతంగా పెరుగుతున్న జాతీయవాద భావాలు సోవియట్ యూనియన్‌ను విచ్ఛిన్నం చేసే స్థాయిలో బెదిరించాయి. దీంతో, మార్క్సిస్ట్-లెనినిస్ట్ అతివాదులు 1991 లో గోర్బచేవ్‌పై ఆగస్టు తిరుగుబాటు చేసారు. అయితే అది విఫలమైంది. దీని నేపథ్యంలో, గోర్బచేవ్ కోరికకు వ్యతిరేకంగా, యెల్ట్‌సిన్ తదితఉలు సోవియట్ యూనియన్ను రద్దు చేసారు. అతడు రాజీనామా చేశాడు. పదవీవిరమణ తరువాత, అతడు గోర్బచేవ్ ఫౌండేషన్‌ను ప్రారంభించాడు, రష్యన్ అధ్యక్షులు బోరిస్ యెల్ట్‌సిన్, వ్లాదిమిర్ పుతిన్‌లపై విమర్శలు చేసాడు. రష్యాలో సామాజిక-ప్రజాస్వామ్య ఉద్యమం కోసం ప్రచారం చేశాడు.

20 వ శతాబ్దపు రెండవ భాగానికి చెందిన అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకడుగా గోర్బచేవ్‌ను పరిగణిస్తారు. గోర్బచేవ్ వివాదాలకు కేంద్రమయ్యాడు. నోబెల్ శాంతి బహుమతితో సహా అనేక పురస్కారాలు పొందాడు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడంలో, సోవియట్ యూనియన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను తగ్గించడంలో, తూర్పున మార్క్సిస్ట్-లెనినిస్ట్ పరిపాలనల పతనం, జర్మనీ పునరేకీకరణ - రెండింటినీ తట్టుకోవడంలో అతడు కీలక పాత్ర పోషించినందుకు ప్రశంసలు పొందాడు. దీనికి విరుద్ధంగా, సోవియట్ పతనాన్ని ఆపలేక పోయినందుకు రష్యాలో నిందారోపణలకు గురౌతూ ఉంటాడు. ఈ సంఘటన ప్రపంచంలో రష్యా యొక్క ప్రభావం క్షీణించడానికీ, ఆర్థిక సంక్షోభానికీ దారితీసింది.

బాల్యం, విద్యాభ్యాసం

గోర్బచేవ్ 1931, మార్చి 2న సోవియట్ యూనియన్‌లోని రష్యన్ SFSRకు చెందిన స్తావ్రోపోల్‌ సమీపంలోని ప్రవాల్నోయ్ గ్రామంలో సెర్జీ ఆంధ్రేయివిచ్ గోర్బొచెవ్, మారియా పాంటెలెయవ్నా గోర్బచేవా దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ఇతనికి విక్టర్ అని పేరు పెట్టాడు. కానీ ఉక్రేనియన్ తెగకు చెందిన ఇతని మాతామహుడు ఇతనికి బాప్తిజము ఇచ్చి, పేరును మిఖాయిల్‌గా మార్చాడు. [1] ఇతని తల్లిదండ్రులు నిరుపేద[2]రైతులు.[3]

1930లలో అమ్మమ్మ తాతయ్యలతో గోర్బచేవ్

గోర్బచేవ్ బాల్యంలో సోవియట్ యూనియన్‌ను స్టాలిన్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలిస్తూ ఉండేది. స్టాలిన్ తన మార్క్సిస్ట్-లెనినిస్ట్ భావాలకు అనుగుణంగా దేశాన్ని సోషలిస్ట్ సొసైటీగా మార్చడానికి సమష్టి వ్యవసాయ పద్ధతిని ప్రారంభించాడు.[4] గోర్బచేవ్ మాతామహుడు కమ్యూనిస్ట్ పార్టీలో చేరి 1929లో ప్రవాల్నోయ్ గ్రామంలో సమష్టి వ్యవసాయక్షేత్రాన్ని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించాడు.[5]

రెండవ ప్రపంచయుద్ధంలో 1941లో జర్మన్ సైన్యం సోవియట్ యూనియన్‌పై దాడి చేసింది. జర్మనీ సైనిక దళాలు 1942లో నాలుగున్నర నెలల పాటు ప్రవాల్నోయ్‌ని ఆక్రమించింది.[6] గోర్బొచేవ్ తండ్రి సోవియట్ రెడ్ ఆర్మీలో చేరి యుద్ధంలో పాల్గొన్నాడు.[7] జర్మనీ ఓటమితో యుద్ధం ముగిసింది. ఆ తర్వాత 1947లో ఇతని తమ్ముడు అలెగ్జాండర్ జన్మించాడు.[8]

యుద్ధ సమయంలో గ్రామంలోని పాఠశాల మూసివేసి 1944లో తెరిచారు[9].గోర్బచేవ్ స్కూలుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ వెళ్ళిన తర్వాత విద్యలో రాణించాడు.[10] ఇతడు పాశ్చాత్య నవలలు మొదలుకొని బెలిన్‌స్కీ, పూష్కిన్, గొగోల్, లెర్మెంటోవ్ వంటి రష్యన్ రచయితల నవలల దాకా విపరీతంగా చదివేవాడు.[11] 1946లో ఇతడు సోవియట్ రాజకీయ యువసంస్థ కొమ్‌సొమోల్‌లో చేరి జిల్లా కమిటీకి ఎన్నికైనాడు.[12] ప్రాథమిక విద్య అనంతరం ఇతడు మొలోటోవిస్కెయ్ లోని హైస్కూలులో చేరాడు. వారాంతాలలో అక్కడి నుండి 12 మైళ్ల దూరంలో ఉన్న తన గ్రామానికి నడుచుకుని వెళ్లేవాడు.[13] ఇతడు స్కూలు డ్రామా సొసైటీ సభ్యుడు[14]గా క్రీడా, సాంఘిక కార్యక్రమాలను నిర్వహించేవాడు. ఉదయం వ్యాయామ క్లాసులకు నాయకత్వం వహించేవాడు. [15]. 1946 నుండి ఐదేళ్లపాటు ప్రతి వేసవికీ ఇంటికి వచ్చి తండ్రికి వ్యవసాయంలో సహాయపడేవాడు. కొన్నిసార్లు ఇద్దరూ రోజుకు 20 గంటలు కష్టపడేవారు.[16] 1948లో వీరు 800ల టన్నుల ధాన్యాన్ని పండించారు. ఈ ఘనత సాధించినందుకు తండ్రి సెర్జీకి ఆర్డర్ ఆఫ్ లెనిన్, కుమారుడు మిఖాయిల్‌కు ఆర్డర్ ఆఫ్ రెడ్ బ్యానర్ ఆఫ్ లేబర్ పురస్కారాలు లభించాయి.[17]

1950-1955ల మధ్య గోర్బచేవ్ చదివిన మాస్కో స్టేట్ యూనివర్సిటీ

1950లో గోర్బచేవ్ దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన మాస్కో స్టేట్ యూనివర్సిటిలోని న్యాయకళాశాలకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్డర్ ఆఫ్ రెడ్ బ్యానర్ ఆఫ్ లేబర్ అవార్డు కారణంగా ఇతనికి ప్రవేశ పరీక్షలేకుండానే యూనివర్సిటీలో సీటు లభించింది.[18] తన 19వ యేట మొదటిసారి తన గ్రామం విడిచి చదువుకోసం మాస్కో చేరాడు.[19] యూనివర్సిటీలో చదివే సమయంలో ఇతడు రైసా అనే యువతిని కలుసుకున్నాడు. వారిరువురూ ప్రేమించుకుని 1953, సెప్టెంబరు 23 న వివాహం చేసుకున్నారు.1955 జూన్ నెలలో గోర్బచేవ్ డిస్టింక్షన్‌తో న్యాయ పట్టా పుచ్చుకున్నాడు.

కమ్యూనిస్టు పార్టీలో ఎదుగుదల

స్టావ్రోపోల్ కొమ్‌సొమోల్: 1955-1969

నికిటా కృశ్చేవ్, సోవియట్ నాయకుడు. అతడి స్టాలినిస్ట్ వ్యతిరేక సంస్కరణలకు గోర్బచేవ్ మద్దతు ఇచ్చాడు

1955 ఆగస్టులో, గోర్బచేవ్ స్టావ్రోపోల్ ప్రాంతీయ ప్రొక్యూరేటర్ కార్యాలయంలో పనిని ప్రారంభించాడు. కాని అతడు ఆ పనిని ఇష్టపడలేదు. తన పరిచయాలను ఉపయోగించుకుని కొమ్‌సొమోల్‌లో[నోట్స్ 1] చేరాడు.[20] ఆ ప్రాంతానికి చెందిన కొమ్‌సొమోల్‌లో ఆందోళనలు, ప్రచార విభాగానికి డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు.[21] ఈ పదవిలో అతడు, ఆ ప్రాంతంలోని గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి ప్రయత్నించాడు; అతడు గోర్కాయ బాల్కా గ్రామంలో ఒక చర్చా సమూహాన్ని స్థాపించాడు. తద్వారా రైతులు సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడంలో సహాయపడ్డాడు. [22]

గోర్బచేవ్, అతడి భార్య మొదట్లో స్టావ్రోపోల్‌లో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు.[23] రోజూ సాయంత్రం నగరంలో నడక, వారాంతాల్లో గ్రామీణ ప్రాంతాలలో హైకింగ్ వారికి అలవాటు. [24] 1957 జనవరిలో వారికి కుమార్తె ఇరినా పుట్టింది.[25] 1958 లో వారు వేరేవారితో కలిసి ఉండే రెండు గదుల అపార్టుమెంట్లోకి మారారు. 1961 లో గోర్బచేవ్ వ్యవసాయ ఉత్పత్తిపై రెండవ డిగ్రీ పొందాడు; అతడు స్థానిక స్టావ్రోపోల్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ నుండి కరస్పాండెన్స్ కోర్సు చదివి, 1967 లో డిప్లొమా పొందాడు. [26] అతడి భార్య కూడా రెండవ డిగ్రీ అభ్యసించింది, మాస్కో పెడగోగికల్ ఇన్స్టిట్యూట్ నుండి 1967 లో సామాజిక శాస్త్రంలో పిహెచ్‌డి సాధించింది;[27] స్టావ్రోపోల్‌లో ఉన్నప్పుడు ఆమె కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరింది. [28]

స్టాలిన్ తరువాత నికిటా కృశ్చేవ్ సోవియట్ నాయకుడయ్యాడు. 1956 ఫిబ్రవరిలో చేసిన ప్రసంగంలో అతడు, స్టాలిన్ పద్ధతులను ఖండించాడు. ఆ తరువాత అతడు సోవియట్ సమాజంలో స్టాలినీకరణను తుడిచివేసే పని మొదలుపెట్టాడు. [29] తరువాతి కాలంలో గోర్బచేవ్ జీవిత చరిత్ర రాసిన విలియం టౌబ్మాన్, కృశ్చేవ్ శకం నాటి "సంస్కరణవాద స్ఫూర్తి" గోర్బచేవ్‌లో "మూర్తీభవించిందని" అన్నాడు. [30] స్టాలిన్ విపరీతబుద్ధికి భిన్నంగా తమను తాము "నిజమైన మార్క్సిస్టులు" లేదా "నిజమైన లెనినిస్టులు"గా భావించిన వారిలో గోర్బచేవ్ కూడా ఉన్నాడు. [31] కృశ్చేవ్ ఇచ్చిన స్టాలినిస్ట్ వ్యతిరేక సందేశాన్ని అతడు, స్టావ్రోపోల్‌లో వ్యాప్తి చేసాడు. కాని స్టాలిన్‌ను ఇంకా ఒక హీరోగా భావిస్తున్నవారు గాని, స్టాలినిస్ట్ ప్రక్షాళనను ప్రశంసించే వారు గానీ, చాలా మంది అతడికి ఎదురయ్యారు. [32]

గోర్బచేవ్ స్థానిక పరిపాలనలో క్రమంగా ఎదుగుతూ వచ్చాడు. [33] అధికారులు అతన్ని రాజకీయంగా విశ్వసనీయ వ్యక్తిగా భావించారు, [34] అతడు తన పై అధికారులను పొగడుతూండేవాడు -ప్రముఖ స్థానిక రాజకీయ నాయకుడు ఫ్యోదోర్ కులకోవ్‌ దగ్గర పొందిన ప్రాపకాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.[35] ప్రత్యర్థులపై పైచేయి సాధించగల అతడి సామర్థ్యం, కొంతమంది సహచరులకు కంటగింపు కలిగించింది. [36] 1956 సెప్టెంబరులో, అతడు స్టావ్రోపోల్ నగర కొమ్‌సొమోల్‌కు మొదటి కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. 1958 ఏప్రిల్‌లో అతడు ఆ ప్రాంతం మొత్తానికి కొమ్‌సొమోల్ డిప్యూటీ నేతగా నియమితుడయ్యాడు.[37] ఈ సమయంలో అతడికి మెరుగైన వసతి లభించింది: రెండు-గదుల ఫ్లాట్‌లో స్వంత వంటగది, టాయిలెట్, బాత్రూం లుండేవి. [38] స్టావ్రోపోల్‌లో, అతడు యువకుల కోసం ఒక చర్చా క్లబ్‌ను ఏర్పాటు చేశాడు.[39] కృశ్చేవ్ వ్యవసాయ, అభివృద్ధి ప్రచారాలలో పాల్గొనడానికి స్థానిక యువకులను సమీకరించాడు. [40]

గోర్బచేవ్, 1966 లో తూర్పు జర్మనీ పర్యటనలో ఉండగా

1961 మార్చిలో, గోర్బచేవ్ ప్రాంతీయ కొమ్‌సొమోల్‌కు మొదటి కార్యదర్శి అయ్యాడు.[41] ఈ పదవిలో ఉండగా అతడు సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలను నగర, జిల్లా నాయకులుగా నియమించాడు. [42] 1961 లో, గోర్బచేవ్ మాస్కోలో జరిగిన ప్రపంచ యువ ఉత్సవంలో ఇటాలియన్ ప్రతినిధి బృందానికి ఆతిథ్యమిచ్చాడు; [43] ఆ అక్టోబరులో, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ 22 వ కాంగ్రెస్‌కు కూడా హాజరయ్యాడు. 1963 జనవరిలో, గోర్బచేవ్ ప్రాంతీయ పార్టీ వ్యవసాయ కమిటీకి సిబ్బంది చీఫ్‌గా పదోన్నతి పొందాడు, [44] 1966 సెప్టెంబరులో స్టావ్రోపోల్ నగర పార్టీకి ("గోర్కామ్") మొదటి కార్యదర్శి అయ్యాడు.[45] 1968 నాటికి కృశ్చేవ్ సంస్కరణలు నిలిచిపోవడం, వెనక్కి నడవడంతో అతడు తన ఉద్యోగంలో నిస్పృహ చెందాడు. రాజకీయాలను వదిలేసి, ఏదైనా విద్యాసంస్థలో పనిచేయాలని అనుకున్నాడు. [46] అయితే, 1968 ఆగస్టులో, అతన్ని స్టావ్రోపోల్ క్రైకోమ్‌కు రెండవ కార్యదర్శిగా, మొదటి కార్యదర్శి లియోనిద్ యెఫ్రెమోవ్ కు డిప్యూటీగా నియమించారు. స్టావ్రోపోల్ ప్రాంతంలో గోర్బచేవ్ రెండవ అత్యంత సీనియర్ వ్యక్తి అయ్యాడు.[47] 1969 లో అతడు సోవియట్ యూనియన్ సుప్రీం సోవియట్‌కు డిప్యూటీగా ఎన్నికయ్యాడు. దాని పర్యావరణ పరిరక్షణ స్టాండింగ్ కమిషన్‌లో సభ్యుడయ్యాడు. [48]

ఈస్టర్న్ బ్లాక్ దేశాలకు ప్రయాణాలు చెయ్యడానికి అతణ్ణి క్లియర్ చేయడంతో, 1966 లో తూర్పు జర్మనీని సందర్శించే ప్రతినిధి బృందంలో భాగమయ్యాడు. 1969, 1974 ల్లో బల్గేరియా సందర్శించాడు. [49] 1968 ఆగస్టులో, సోవియట్ యూనియన్ చెకోస్లోవేకియాపై దండెత్తి. ఆ మార్క్సిస్ట్-లెనినిస్ట్ దేశంలో రాజకీయ సరళీకరణల ఆలోచనలకు ముగింపు పలికింది. ఆ ఆక్రమణ గురించి తనలో ఆందోళన ఉండేదని గోర్బచేవ్ తరువాతి కాలంలో పేర్కొన్నప్పటికీ, అతడు దానిని బహిరంగంగా సమర్థించాడు. [50] 1969 సెప్టెంబరులో, చెకోస్లోవేకియాకు వెళ్ళిన సోవియట్ ప్రతినిధి బృందంలో భాగంగా ఉన్నాడు. చెకోస్లోవాక్ ప్రజలు తమను ఇష్టపడడం లేదని అతడికి అర్థమైంది.[51] ఆ సంవత్సరం, స్టావ్రోపోల్ లోని వ్యవసాయ శాస్త్రవేత్త ఫాగిన్ బి. సాదికోవ్ ఆలోచనలు సోవియట్ వ్యవసాయ విధానాన్ని విమర్శించే ధోరణిలో ఉన్నాయి కాబట్టి, అతణ్ణి శిక్షించాలని సోవియట్ అధికారులు గోర్బచేవ్‌ను ఆదేశించారు. గోర్బచేవ్ సాదికోవ్‌ను అధ్యాపకత్వం నుండి తొలగించి, అక్కడితో వదిలేసాడు. కఠినమైన శిక్షను విధించాలన్న పిలుపును పక్కన పెట్టాడు. [52] ఈ సంఘటనతో "తీవ్రంగా ప్రభావితమయ్యాన"ని గోర్బచేవ్ ఆ తరువాత చెప్పాడు. సాదికోవ్ పై శిక్షను పర్యవేక్షించినందుకు "నా మనస్సాక్షి నన్ను హింసించింది". [53]

స్టావ్రోపోల్ ప్రాంతానికి నేతృత్వం: 1970-1977

1970 ఏప్రిల్లో, యెఫ్రెమోవ్ మాస్కోలో ఉన్నత పదవికి ఎంపికయ్యాడు. దాంతో గోర్బచేవ్ అతడి తరువాత స్టావ్రోపోల్ క్రైకోమ్ కు మొదటి కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. ఇది గోర్బచేవ్‌కు స్టావ్రోపోల్ ప్రాంతంపై గణనీయమైన అధికారాన్ని ఇచ్చింది.[54] సీనియర్ క్రెమ్లిన్ నాయకులు ఈ పదవి కోసం అతణ్ణి వ్యక్తిగతంగా పరిశీలించారు. సోవియట్ నాయకుడు లియొనిద్ బ్రెజ్నెవ్ స్వయంగా ఆ నిర్ణయాన్ని తెలియజేశాడు. [55] 39 సంవత్సరాల వయస్సులో, అప్పటివరకూ ఆ పదవి నిర్వహించిన వారందరి కంటే అతడు చాలా చిన్నవాడు. [56] స్టావ్రోపోల్ ప్రాంతానికి అధిపతి హోదాలో అతడు ఆటోమాటిగ్గా 1971 లో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో సభ్యుడయ్యాడు.[57] జీవిత చరిత్ర రచయిత జోర్స్ మెద్వెదేవ్ ప్రకారం, గోర్బచేవ్ "ఇప్పుడు పార్టీలో సూపర్-ఎలైట్‌లో చేరాడు" . [58] ప్రాంతీయ నాయకుడిగా ఉండగా, ఆర్థిక వైఫల్యాలకు, ఇతర వైఫల్యాలకూ "కార్యకర్తల అసమర్థత, చేతకానితనం, నిర్వహణలో లోపాలు, చట్టంలోని అంతరాలూ" కారణమని గోర్బచేవ్ పేర్కొన్నాడు. కానీ, నిర్ణయాధికారమంతా మాస్కోలో కేద్రీకృతమవడం వల్లనే ఇవి సంభవించాయని అంతిమంగా తేల్చాడు. [59] అతడు ఆంటోనియో గ్రామ్సి, లూయిస్ ఆరగాన్, రోజర్ గరాడీ, గియుసేప్ బోఫా వంటి పాశ్చాత్య మార్క్సిస్ట్ రచయితల రచనల అనువాదాలను చదవడం మొదలుపెట్టాడు. వారి ప్రభావానికి లోనయ్యాడు. [59]

గోర్బచేవ్ నాయకత్వంలో నిర్మించిన గ్రేట్ స్టావ్రోపోల్ కాలువలో భాగం

ప్రాంతీయ నాయకుడిగా గోర్బచేవ్ ప్రధానమైన పని వ్యవసాయ ఉత్పత్తి స్థాయిలను పెంచడం. 1975, 1976 లో తీవ్రమైన కరువులతో ఉత్పత్తి దెబ్బతింది. [60] గ్రేట్ స్టావ్రోపోల్ కాలువ నిర్మాణం ద్వారా నీటిపారుదల వ్యవస్థల విస్తరణను అతడు పర్యవేక్షించాడు.[61] ఇపటోవ్‌స్కీ జిల్లాలో రికార్డు ధాన్యం దిగుబడిని సాధించినందుకు 1972 మార్చిలో, మాస్కోలో జరిగిన వేడుకలో బ్రెజ్నెవ్ నుండి ఆర్డర్ ఆఫ్ ది అక్టోబర్ రివల్యూషన్ అందుకున్నాడు. [62] బ్రెజ్నెవ్ నమ్మకాన్ని నిలుపుకోడానికి గోర్బచేవ్ ఎప్పుడూ ప్రయత్నిస్తూండేవాడు; [63] ప్రాంతీయ నాయకుడిగా, అతడు బ్రెజ్నెవ్‌ను తన ప్రసంగాలలో పదేపదే ప్రశంసించేవాడు. అతన్ని "మన కాలపు అత్యుత్తమ రాజనీతిజ్ఞుడు" అని పేర్కొన్నాడు. [64] గోర్బచేవ్ దంపతులు మాస్కో, లెనిన్‌గ్రాడ్, ఉజ్బెకిస్తాన్, ఉత్తర కాకసస్ లోని రిసార్ట్స్ లో సెలవులు గడిపారు; [65] ఆ సందర్భాల్లో ఒకసారి KGB అధినేత యూరీ ఆండ్రోపోవ్‌తో కాలం గడిపాడు. ఆండ్రోపోవ్ అతడికి అనుకూలంగా, ఒక ముఖ్యమైన అండగా ఉండేవాడు.[66] గోర్బచేవ్ సోవియట్ ప్రధాన మంత్రి, అలెక్సీ కోసిగిన్, [67] దీర్ఘకాల సీనియర్ పార్టీ సభ్యుడు మిఖాయిల్ సుస్లోవ్ వంటి సీనియర్ వ్యక్తులతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు.[68]

పశ్చిమ ఐరోపాకు వెళ్ళే సోవియట్ ప్రతినిధి బృందాలలో భాగంగా పంపడానికి తగినంత విశ్వసనీయత గోర్బచేవ్‌కు ఉందని ప్రభుత్వం భావించింది; అతడు 1970 - 1977 మధ్య ఐదు పర్యటనలు చేశాడు.[69] 1971 సెప్టెంబరులో అతడు ఇటలీకి వెళ్ళిన ప్రతినిధి బృందంలో భాగంగా, ఇటాలియన్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యాడు. గోర్బచేవ్ ఇటాలియన్ సంస్కృతిని ఇష్టపడ్డాడు. కాని ఆ దేశంలో పేదరికం, అసమానతలను చూసి బాధపడ్డాడు. [70] 1972 లో అతడు బెల్జియం, నెదర్లాండ్స్ వెళ్ళాడు. 1973 లో పశ్చిమ జర్మనీ సందర్శించాడు.[71] గోర్బచేవ్, అతడి భార్య 1976, 1977 లో ఫ్రాన్స్‌ సందర్శించారు. రెండోసారి వెళ్ళినపుడు ఫ్రెంచ్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మార్గదర్శి వెంట ఆ దేశంలో పర్యటించారు. [72] పశ్చిమ యూరోపియన్లు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడం, వారి రాజకీయ నాయకులను బహిరంగంగా విమర్శించడమూ చూసి అతడు ఆశ్చర్య పోయాడు. సోవియట్ యూనియన్‌లో అలాంటిది లేదు, అంత బహిరంగంగా మాట్లాడే ధైర్యం అక్కడ చెయ్యరు. [73] ఈ సందర్శనల తరువాత తనకూ తన భార్యకూ "బూర్జువా ప్రజాస్వామ్యంపై సోషలిస్టు ఆధిపత్యం గురించిన మా పూర్వ విశ్వాసాలు కదిలిపోయాయి" అని అతడు తరువాతి కాలంలో చెప్పాడు. [74]

గోర్బచేవ్ తన తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉండేవాడు; 1974 లో అనారోగ్యానికి గురైన తండ్రి మరణానికి కొంతకాలం ముందు గోర్బచేవ్ ప్రివోల్నో వెళ్ళి అతడితో గడిపాడు. [75]

కుమార్తె, ఇరినా, 1978 ఏప్రిల్లో సహవిద్యార్థి అనటోలీ విర్గాన్‌స్కీని పెళ్ళి చేసుకుంది [76]

కోమ్‌సొమోల్‌లో యువకులను సమీకరించడంలో గోర్బచేవ్‌కు ఉన్న అనుభవం కారణంగా 1977 లో అతణ్ణి సుప్రీం సోవియట్ యువజన వ్యవహారాల స్టాండింగ్ కమిషన్ అధ్యక్షుడిగా నియమించింది. [77]

కేంద్ర కమిటీ కార్యదర్శి: 1978-1984

ఆఫ్ఘనిస్తాన్‌లో[permanent dead link] సోవియట్ దళాలను మోహరించడం పట్ల గోర్బచేవ్‌కు సందేహాలుండేవి (1986 చిత్రం)

1978 నవంబరులో గోర్బచేవ్‌ను కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించారు.[78] అతడి నియామకాన్ని కేంద్ర కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. [79] ఈ పనిలో చేరేందుకు, గోర్బచేవ్, భార్యతో కలిసి మాస్కోకు మకాం మార్చారు. అక్కడ వారి నివాసం కోసం మొదట నగరం వెలుపల పాత డాచా ఇచ్చారు. తరువాత సోస్నోవ్కా వద్ద మరొక ఇంటికి మారారు. చివరకు కొత్తగా నిర్మించిన ఇటుక ఇంటి లోకి మారారు [80] అతడికి నగరం లోపల ఒక అపార్ట్మెంట్ కూడా ఇచ్చారు. కాని అతడు దాన్ని తన కుమార్తెకు, అల్లుడికీ ఇచ్చాడు. ఇరినా మాస్కో లోని రెండవ వైద్య సంస్థలో పని ప్రారంభించింది. [81] మాస్కో రాజకీయ కులీనులలో భాగంగా, గోర్బచేవ్ దంపతులకు ఇప్పుడు మెరుగైన వైద్య సంరక్షణ అందుతుంది. ప్రత్యేకమైన దుకాణాలకు వెళ్లవచ్చు; వారికి వంటవాళ్ళు, సేవకులు, అంగరక్షకులు, కార్యదర్శులను కూడా నియమించారు. అయితే, వీరిలో చాలామంది కెజిబి గూఢచారులే. [82] కొత్త ఉద్యోగంలో గోర్బచేవ్ పన్నెండు నుండి పదహారు గంటలు పని చేసేవాడు. [82] అతడు, అతడి భార్య సంఘంలో పెద్దగా కలిసేవారు కాదు గానీ, మాస్కో థియేటర్లు, మ్యూజియాలకు వెళ్తూండేవారు.[83]

1978 లో, గోర్బచేవ్ పాత స్నేహితుడు కులకోవ్ గుండెపోటుతో మరణించడంతో, సెంట్రల్ కమిటీ సెక్రటేరియట్ ఫర్ అగ్రికల్చర్‌లో అతడి స్థానంలో గోర్బచేవ్‌ను నియమించారు.[84] అక్కడ వ్యవసాయంపై తన దృష్టిని కేంద్రీకరించాడు: 1979, 1980, 1981 సంవత్సరాల్లో వాతావరణం అనుకూలించక పోవడంతో పంటలు సరిగా పండలేదు.[85] దేశం ధాన్యాన్ని దిగుమతి చేసుకోవలసి వచ్చింది.[86] దేశ వ్యవసాయ యాజమాన్య వ్యవస్థ పట్ల గోర్బచేవ్‌కు అందోళనగా ఉండేది. మితిమీరిన కేంద్రీకరణ ఉందనీ, దాన్ని వికేంద్రీకరించి, కింది స్థాయిల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందనీ భావించేవాడు. [87] 1978 జూలైలో కేంద్ర కమిటీ ప్లీనంలో చేసిన తన మొదటి ప్రసంగంలో ఈ విషయాలను అతడు లేవనెత్తాడు. [88] ఇతర విధానాల గురించి కూడా ఆందోళన చెందుతూండేవాడు. 1979 డిసెంబరులో పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ అనుకూల ప్రభుత్వానికి మద్దతుగా, అక్కడి ఇస్లామిక్ తిరుగుబాటు దారులకు వ్యతిరేకంగా సోవియట్ యూనియన్ తన ఎర్ర సైన్యాన్ని ఆ దేశం లోకి పంపింది; గోర్బచేవ్ దానిని తప్పుగా భావించాడు. [89] కొన్ని సమయాల్లో అతడు ప్రభుత్వ చర్యకు బహిరంగంగా మద్దతు పలికాడు; 1980 అక్టోబరులో పోలండ్‌లో పెరుగుతున్న అంతర్గత అసమ్మతిని అరికట్టాలని ఆ దేశంలోని మార్క్సిస్ట్-లెనినిస్ట్ ప్రభుత్వానికి సోవియట్ ఇచ్చిన పిలుపును అతడు సమర్ధించాడు. [89] అదే నెలలో, అతడు పొలిట్‌బ్యూరోలో క్యాండిడేట్ సభ్యుడి స్థాయి నుండి పూర్తి స్థాయి సభ్యునిగా పదోన్నతి పొందాడు. పొలిట్‌బ్యూరో, కమ్యూనిస్ట్ పార్టీలో అత్యున్నత నిర్ణయాధికారం గల వ్యవస్థ. [90] ఆ నియామకం జరిగేనాటికి, అతడు పొలిట్‌బ్యూరో లోని అతి పిన్న వయస్కుడు. [90]

1983[permanent dead link] ఏప్రిల్లో సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు లెనిన్ (చిత్రపటం) పుట్టినరోజున గోర్బచేవ్ ప్రసంగించాడు

1982 నవంబరులో బ్రెజ్నెవ్ మరణించిన తరువాత, ఆండ్రొపోవ్, కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. సోవియట్ యూనియన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శే ప్రభుత్వానికి కూడా పైకి కనబడని, అనధికారిక నేత. ఈ నియామకం పట్ల గోర్బచేవ్ ఉత్సాహంగా ఉన్నాడు.[91] అయితే, ఆండ్రోపోవ్ సరళీకరణ సంస్కరణలను ప్రవేశపెడతాడని గోర్బచేవ్ భావించినప్పటికీ, అతడు వ్యవస్థలో మార్పులు చెయ్యకుండా, సిబ్బంది మార్పులకు మాత్రమే పరిమితమయ్యాడు. [92] గోర్బచేవ్, పొలిట్‌బ్యూరోలో ఆండ్రోపోవ్‌కు అత్యంత సన్నిహితు డయ్యాడు; [93] ఆండ్రోపోవ్ ప్రోత్సాహంతో, గోర్బచేవ్ కొన్నిసార్లు పొలిట్‌బ్యూరో సమావేశాలకు అధ్యక్షత వహించాడు. [94] ఆండ్రోపోవ్ గోర్బచేవ్‌ను వ్యవసాయమే కాకుండా ఇతర విధాన రంగాలలోకి కూడా విస్తరించమని ప్రోత్సహించాడు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవుల కోసం అతన్ని సిద్ధం చేశాడు.[95] 1983 ఏప్రిల్లో, గోర్బచేవ్ సోవియట్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ పుట్టినరోజు సందర్భంగా వార్షిక ప్రసంగం చేశాడు. [96] దీని కోసం అతడు లెనిన్ రచనలను తిరిగి చదవవలసి వచ్చింది, దీనిలో 1920 ల కొత్త ఆర్థిక విధానం నేపథ్యంలో సంస్కరణల కోసం లెనిన్ ఇచ్చిన పిలుపు గురించి తెలుసుకున్నాడు. సంస్కరణలు అవసరమన్న తన నమ్మకానికి ప్రోత్సాహం లభించింది. [97] 1983 మేలో గోర్బచేవ్ కెనడా సందర్శించాడు. అక్కడ అతడు ప్రధాన మంత్రి పియరీ ట్రూడోను కలుసుకున్నాడు. కెనడియన్ పార్లమెంటులో ప్రసంగించాడు. [98] అక్కడ, అతడు సోవియట్ రాయబారి అలెక్సాండర్ యాకోవ్లెవ్‌ను కలుసుకున్నాడు. అతడితో మైత్రి కలిపాడు. తరువాతి కాలంలో అతడు గోర్బచేవ్‌కు కీలకమైన రాజకీయ మిత్రుడయ్యాడు.[99]

1984 ఫిబ్రవరిలో ఆండ్రోపోవ్ మరణించాడు; మరణ శయ్యపై, గోర్బచేవ్ తనకు వారసుడవ్వాలని చెప్పాడు.[100] అయితే 53 ఏళ్ల గోర్బచేవ్ చాలా చిన్నవాడు, అనుభవం లేనివాడు అని సెంట్రల్ కమిటీలో చాలామంది భావించారు.[101] దీర్ఘకాలం పాటు బ్రెజ్నెవ్‌కు మిత్రుడైన కాన్‌స్టాంటిన్ చెర్నెంకో ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. కాని అతడు కూడా చాలా అనారోగ్యంగా ఉండేవాడు.[102] పొలిట్‌బ్యూరో సమావేశాలకు అధ్యక్షత వహించడానికి తరచూ అతడికి అనారోగ్యం అడ్డం వచ్చేది. చివరి నిమిషంలో గోర్బచేవ్ ఆ బాధ్యత తీసుకునేవాడు.[103] గోర్బచేవ్, క్రెమ్లిన్ లోనూ బయటా మిత్రులను పెంపొందించుకుంటూ ఉండేవాడు. [104] సోవియట్ భావజాలంపై జరిగిన సదస్సులో ప్రధాన ఉపన్యాసం ఇస్తూ, దేశంలో సంస్కరణలు అవసరం అని ధ్వనించినందుకు పార్టీలోని అతివాదుల ఆగ్రహానికి గురయ్యాడు.[105]

1984 ఏప్రిల్లో, అతడు సోవియట్ చట్టసభలో విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఇది అలంకార ప్రాయమైన పదవి. జూన్‌లో ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎన్రికో బెర్లింగర్ అంత్యక్రియలకు సోవియట్ ప్రతినిధిగా హాజరయ్యాడు. [106] సెప్టెంబరులో బల్గేరియా విముక్తి యొక్క నలభయ్యవ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు సోఫియా వెళ్ళాడు. [107] డిసెంబరులో ప్రధాన మంత్రి మార్గరెట్ థాచర్ అభ్యర్థన మేరకు బ్రిటన్ సందర్శించాడు; అతడు సమర్థవంతమైన సంస్కర్త అని ఆమెకు తెలిసే, అతన్ని కలవాలనుకుంది.[108] సందర్శన ముగింపులో, థాచర్ ఇలా అంది: "నాకు మిస్టర్ గోర్బచేవ్ అంటే ఇష్టం, మేమిద్దరం కలిసి వ్యాపారం చేయవచ్చు".[109] ఆ పర్యటనతో సోవియట్ విదేశాంగ విధానంపై ఆండ్రీ గ్రోమికో కున్న పట్టును కొంత సడలిందని గోర్బచేవ్ భావించాడు. అదే సమయంలో సోవియట్-అమెరికా సంబంధాలను మెరుగు పరచాలని తాను కోరుకుంటున్నాననే సందేశాన్ని అమెరికాకు పంపించగలిగానని కూడా భావించాడు . [110]

సిపిఎస్‌యు ప్రధాన కార్యదర్శి

గోర్బచేవ్[permanent dead link] 1985 లో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో

1985 మార్చి 10 న చెర్నెంకో మరణించాడు. గ్రోమికో గోర్బచేవ్‌ను తదుపరి ప్రధాన కార్యదర్శిగా ప్రతిపాదించాడు; దీర్ఘకాల పార్టీ సభ్యునిగా గ్రోమికో చేసిన సిఫార్సుకు కేంద్ర కమిటీలో చాలా విలువ ఉంది. గోర్బచేవ్ ప్రధాన కార్యదర్శిగా తన నామినేషనుకు చాలా వ్యతిరేకత ఉంటుందని అనుకున్నాడు. కాని చివరికి మిగిలిన పొలిట్‌బ్యూరో అంతా అతడికి మద్దతు ఇచ్చింది. [111] చెర్నెంకో మరణం తరువాత, పొలిట్‌బ్యూరో గోర్బచేవ్‌ను తన వారసుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.[112] గోర్బచేవ్ సోవియట్ యూనియన్‌కు ఎనిమిదవ నాయకుడయ్యాడు. [3] తరువాతి కాలంలో చాలా తీవ్రమైన సంస్కరణలు చేపట్తబోతున్నాడని అప్పుడెవరూ ఊహించి ఉండరు. [113] సోవియట్ ప్రజల్లో గోర్బచేవ్ బాగా ప్రఖ్యాతి ఉన్న వ్యక్తి కానప్పటికీ, కొత్త నాయకుడు వృద్ధుడూ, రోగిష్ఠీ కాడని తెలిసి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. [114] నాయకుడైన తరువాత, మార్చి 14 న రెడ్ స్క్వేర్‌లో జరిగిన చెర్నెంకో అంత్యక్రియల్లో మొదటిసారి గోర్బచేవ్ కనిపించాడు. [115] ఎన్నికైన రెండు నెలల తరువాత, మొదటిసారి అతడు మాస్కో నుండి బయటపడ్డాడు. లెనిన్‌గ్రాడ్ వెళ్ళి, అక్కడ సమావేశమైన జనాలతో మాట్లాడాడు. జూన్‌లో యుక్రెయిన్, జూలైలో బేలారస్, సెప్టెంబరులో ట్యూమెన్ ఓబ్లాస్ట్ లలో పర్యటించాడు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం మరింత బాధ్యత తీసుకోవాలని ఈ ప్రాంతాల్లోని పార్టీ సభ్యులకు పిలుపు నిచ్చాడు.[116]

తొలినాళ్ళు: 1985-1986

గోర్బచేవ్ నాయకత్వ శైలి అతడి పూర్వీకుల కంటే భిన్నంగా ఉంటుంది. అతడు వీధిలో ఆగి, పౌరులతో మాట్లాడతాడు. 1985 రెడ్ స్క్వేర్ సెలవు వేడుకల్లో తన ఫోటోను ప్రదర్శించడాన్ని నిషేధించాడు. పొలిట్‌బ్యూరో సమావేశాలలో స్పష్టమైన, బహిరంగ చర్చలను ప్రోత్సహించాడు. [117] పశ్చిమ దేశాలకు, గోర్బచేవ్ మరింత మితమైన, తక్కువ ప్రమాదకరమైన సోవియట్ నాయకుడిగా కనబడ్డాడు. పాశ్చాత్య ప్రభుత్వాలను తప్పుడు భద్రతా భావనలోకి నెట్టడానికి ఇది ఒక చర్య అని కొంతమంది పాశ్చాత్య వ్యాఖ్యాతలు భావిస్తూంటారు. [118] అతడి భార్య అతడికి సన్నిహిత సలహాదారు. విదేశీ పర్యటనలలో అతడితో ఉంటూ అనధికార "ప్రథమ మహిళ" పాత్రను పోషించింది. అలా ఆమె బహిరంగంగా కనబడడం సోవియట్ సంప్రదాయాన్ని ఉల్లంఘించడమే. అది కొందరికి ఆగ్రహాన్ని కలిగించింది.[119] అతడి ఇతర సన్నిహితులు జార్జీ షఖ్నజారోవ్, అనటోలీ చెర్నియేవ్.[119]

పొలిట్‌బ్యూరో తనను పదవి నుంచి తొలగించగలదనీ, పొలిట్‌బ్యూరోలో ఎక్కువ మంది మద్దతుదారులు లేకుండా మరింత తీవ్రమైన సంస్కరణలను కొనసాగించలేననీ గోర్బచేవ్‌కు తెలుసు. [120] పోలిట్‌బ్యూరో నుండి పలు వృద్ధ సభ్యులను తొలగించ దలచి, గ్రిగొరీ రోమనోవ్, నికోలాయ్ టిఖోనోవ్, విక్టర్ గిషిన్ లను రిటైరయేందుకు ప్రోత్సహించాడు.[121] గ్రోమికోను రాజ్యాధినేతగా చేసి, ఉత్సవ విగ్రహంలా కూర్చోబెట్టాడు. అతడి స్థానంలో విదేశాంగ విధాన బాధ్యతలను తన అనుచరుడు ఎడువార్డో షెవర్దనడ్జెకు అప్పజెప్పాడు.[122] యాకోవ్లెవ్, అనటోలీ లుక్యనోవ్, వదీమ్ మెద్వెదేవ్ వంటి అనుచరులకు కూడా ప్రమోషనిచ్చాడు. గోర్బచేవ్ ప్రమోషను ఇచ్చిన వారిలో బోరిస్ యెల్ట్‌సిన్ కూడా ఒకడు. 1985 జూలైలో అతణ్ణి కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించాడు.[123] వీరిలో చాలామంది బ్రెజ్నెవ్ కాలంలో నిస్పృహ పాలైన, ఉన్నత విద్యావంతులైన అధికారులే. [124] గోర్బచేవ్ తన మొదటి సంవత్సరంలో, సచివాలయంలోని 23 విభాగాధిపతులలో 14 మందిని మార్చేసి, ఒక సంవత్సరంలోనే పొలిట్‌బ్యూరోలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకున్నాడు. [125] ఈ విషయంలో గోర్బచేవ్, స్టాలిన్ కంటే, కృశ్చేవ్, బ్రెజ్నెవ్ ల కంటే వేగంగా వెళ్ళాడు. [126]

దేశీయ విధానాలు

తూర్పు[permanent dead link] జర్మనీ పర్యటన సందర్భంగా 1986 ఏప్రిల్ లో బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద గోర్బచేవ్

గోర్బచేవ్ పెరెస్త్రోయికా అనే పదాన్ని 1984 మార్చిలో తొలిసారి బహిరంగంగా ఉపయోగించాడు. ఆ తరువాత పదేపదే ప్రస్తావించాడు [127] సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థనూ పునర్నిర్మించడానికి అవసరమైన సంక్లిష్ట సంస్కరణల మార్గంగా అతడు పెరెస్త్రోయికాను చూశాడు. [128] దేశంలో ఉన్న తక్కువ ఉత్పాదకత, అధమ స్థాయి పని సంస్కృతి, నాణ్యత లేని వస్తువుల తయారీ వంటి వాటి పట్ల అతడు ఆందోళన చెందాడు; [129] అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పినట్లు తన దేశం ద్వితీయ స్థాయి శక్తిగా మారుతుందేమోనని భయపడ్డాడు. [130] పెరెస్త్రోయికాలోని తొలి దశ ఉస్కోరేనియే ("త్వరణం"). ఈ పదాన్ని తన నాయకత్వంలోని మొదటి రెండు సంవత్సరాల్లో క్రమం తప్పకుండా ఉపయోగించాడు.[131] సోవియట్ యూనియన్, ఉత్పత్తికి సంబంధించిన అనేక రంగాలలో అమెరికా కంటే వెనకబడి ఉండేది. [132] కానీ ఉస్కోరేనియే పారిశ్రామిక ఉత్పత్తిని వేగవంతం చేసి 2000 నాటికి అమెరికాతో సరితూగేలా చేస్తుందని గోర్బచేవ్ పేర్కొన్నాడు. [133] 1985-90 పంచవర్ష ప్రణాళికలో యంత్ర నిర్మాణాన్ని 50 నుండి 100% వరకూ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. [134] వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, అతడు ఐదు మంత్రిత్వ శాఖలనూ, ఒక రాష్ట్ర కమిటీనీ ఒకే సంస్థ అయిన అగ్రోప్రోమ్‌లో విలీనం చేశాడు. అయితే, 1986 చివరి నాటికి ఈ విలీనం విఫలమైందని అంగీకరించాడు. [135]

సంస్కరణల ఉద్దేశం కేంద్ర ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం - మార్కెట్ సోషలిజానికి పరివర్తన కాదు. తూర్పు యూరోపియన్ కమ్యూనిస్ట్ పార్టీల కేంద్ర కమిటీల ఆర్థిక వ్యవహారాల కార్యదర్శులతో 1985 వేసవి చివరలో గోర్బచేవ్ ఇలా అన్నాడు: "ప్రత్యక్ష ప్రణాళిక స్థానంలో మార్కెట్ యంత్రాంగాలను ఆశ్రయించడంలోనే మీ సమస్యలకు పరిష్కార ముందని మీలో చాలా మంది భావిస్తున్నారు. మార్కెట్‌ను మీ ఆర్థిక వ్యవస్థలకు లైఫ్ బోటుగా చూస్తున్నారు. కాని, కామ్రేడ్స్, మీరు ఆలోచించాల్సింది లైఫ్ బోట్ల గురించి కాదు, ఓడ గురించి. సోషలిజమే ఆ ఓడ." [136] ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలపై కేంద్ర ప్రణాళికదారుల గుత్తాధిపత్యం నుండి విముక్తి పొందిన తరువాత,అవే మార్కెట్ ఏజెంట్లుగా పనిచేస్తాయని అతడు అభిప్రాయపడ్డారు. [137] పెరెస్త్రోయికా సంస్కరణలకు వ్యతిరేకత ఉంటుందని గోర్బచేవ్ గానీ, ఇతర సోవియట్ నాయకులు గానీ ఊహించలేదు; మార్క్సిజం గురించి వారు అర్థం చేసుకున్నదాని ప్రకారం, సోవియట్ యూనియన్ వంటి సోషలిస్ట్ సమాజంలో "శత్రుపూరిత వైరుధ్యాలు" ఉండవని వారు విశ్వసించారు. [138] అయితే, ఓవైపు సంస్కరణలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తూనే, చాలా మంది బ్యూరోక్రాట్లు సంస్కరణల గురించి పైపై కబుర్లు చెబుతున్నారని ప్రజల్లో అభిప్రాయం నెలకొంది.[139] తాను నాయకుడిగా ఉన్న కాలంలో లోనే గోస్ప్రియోమ్కా (ఉత్పత్తిపై ప్రభుత్వామోదం) అనే భావనను కూడా గోర్బచేవ్ ప్రవేశపెట్టాడు.[140] ఇది నాణ్యతా నియంత్రణను సూచిస్తుంది.[141] 1986 ఏప్రిల్లో, అతడు ఒక వ్యవసాయ సంస్కరణను ప్రవేశపెట్టాడు. జీతాలను ఉత్పత్తితో ముడిపెట్టాడు. సామూహిక సాగుదారులు తమ ఉత్పత్తులలో 30% నేరుగా దుకాణాలకు లేదా సహకార సంస్థలకు విక్రయించడానికి అనుమతించాడు. [142] 1986 సెప్టెంబరులో చేసిన ప్రసంగంలో, పరిమిత ప్రైవేట్ సంస్థలతో పాటు మార్కెట్ ఎకనామిక్స్‌ను తిరిగి ప్రవేశపెట్టాలనే ఆలోచనను వెలిబుచ్చాడు. ఈ సందర్భంలో లెనిన్ చెప్పిన కొత్త ఆర్థిక విధానాన్ని ఒక ఉదాహరణగా పేర్కొన్నాడు. అయితే ఇది పెట్టుబడిదారీ విధానానికి తిరిగి వెళ్తున్నట్లు కాదని నొక్కి చెప్పాడు. [142]

సోవియట్ యూనియన్లో, 1950 - 1985 మధ్య మద్యపానం క్రమంగా పెరిగింది. 1980 ల నాటికి, తాగుడు ఒక పెద్ద సామాజిక సమస్యగా మారింది. మద్యపానాన్ని పరిమితం చేయడానికి ఆండ్రోపోవ్ ఒక ప్రచారాన్ని ప్లాన్ చేశాడు. ఈ ప్రచారం ఆరోగ్యాన్ని, పని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్మిన గోర్బచేవ్, భార్య ప్రోత్సాహంతో దాన్ని అమలు చేసాడు.[143] ఆల్కహాల్ ఉత్పత్తి 40 శాతం తగ్గింది, చట్టపరంగా మద్యపానం సేవించే వయసు 18 నుండి 21 కి పెంచారు. మద్యం ధరలు పెంచారు. మధ్యాహ్నం 2 గంటకు ముందు అమ్మడాన్ని నిషేధించారు. కార్యాలయంలో, బహిరంగంగా మద్యపానం చేసినా, ఇళ్లలో తయారు చేసినా కఠినమైన జరిమానాలు విధించారు.[144] నిగ్రహాన్ని ప్రోత్సహించడానికి ఆల్-యూనియన్ వాలంటరీ సొసైటీ ఫర్ ది స్ట్రగుల్ ఫర్ టెంపరెన్స్ ఏర్పడింది; మూడు సంవత్సరాలలో దీనిలో కోటీ నలభై లక్షలకు పైగా సభ్యులయ్యారు.[145] ఫలితంగా 1986 - 1987 మధ్య నేరాల రేట్లు తగ్గాయి, ఆయుర్దాయం కొద్దిగా పెరిగింది. [146] అయితే, నాటుసారా ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.[147] ఈ సంస్కరణ సోవియట్ ఆర్థిక వ్యవస్థకు పెను భారమైంది. 1985 - 1990 మధ్య US $ 100 బిలియన్ల నష్టాన్ని కలిగించింది. తరువాతి కాలంలో గోర్బచేవ్, ఈ ప్రచారాన్ని పొరపాటుగా భావించాడు. [148] 1988 అక్టోబరులో ఈ కార్యక్రమానికి ముగింపు పలికారు.[149] ఆ తరువాత, ఉత్పత్తి మునుపటి స్థితికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. 1990 1993 మధ్య రష్యాలో మద్యపానం విపరీతంగా పెరిగింది. [150]

తన నాయకత్వం యొక్క రెండవ సంవత్సరంలో, గోర్బచేవ్ గ్లాస్‌నోస్త్ ("బహిరంగత") గురించి మాట్లాడటం ప్రారంభించాడు. [151] డోడర్, బ్రాన్‌స్టన్ ల ప్రకారం, దీని అర్థం "ప్రభుత్వ వ్యవహారాలలో ఎక్కువ బహిరంగత. నిష్కాపట్యం, రాజకీయ చర్చలలో, పత్రికలలో, సోవియట్ సంస్కృతిలో విభిన్నమైన, కొన్నిసార్లు విరుద్ధమైన అభిప్రాయాల పరస్పర చర్య కోసం." [152] సంస్కర్తలను ప్రముఖ మీడియా పదవుల్లోకి ప్రోత్సహిస్తూ, సెర్గీ జాలిగిన్‌ను నోవీ మిర్ పత్రిక అధిపతిగా, యెగోర్ యాకోవ్లెవ్‌ను మాస్కో న్యూస్ సంపాదకుడిగా తీసుకువచ్చాడు. [153] చరిత్రకారుడు యూరీక్ అఫనాసియేవ్‌ను స్టేట్ హిస్టారికల్ ఆర్కైవ్ ఫ్యాకల్టీకి డీన్‌గా నియమించాడు. అక్కడ నుండి అఫనాసియేవ్ రహస్య ఆర్కైవ్‌లను తెరిచేందుకు, సోవియట్ చరిత్రను పునర్మూల్యాంకనం చేసేందుకూ ఒత్తిడి చేసాడు. [124] ఆండ్రీ సఖరోవ్ వంటి ప్రముఖ అసమ్మతివాదులు అంతర్గత బహిష్కరణ నుండీ, జైళ్ళ నుండి విడుదలయ్యారు.[154] పెరెస్త్రోయికాను అమలు చేసేందుకు అవసరమైన చర్యగా గ్లాస్‌నోస్త్‌ను గోర్బచేవ్ చూశాడు. సోవియట్ ప్రజలకు దేశ సమస్యల గురించి తెలియజేసి, వారిని అప్రమత్తం చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి అతడు చేసే ప్రయత్నాలకు వారు మద్దతు ఇస్తారనే అతడు భావించాడు. [155] మేధావి వర్గం దీన్ని మెచ్చింది, గోర్బచేవ్‌కు మద్దతు పలికింది. [156] గ్లాస్‌నోస్త్‌తో దేశంలో అతడి ప్రజాదరణ పెరిగింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ లోని అతివాదులకు ఆందోళన కలిగించింది. [157] కొత్తగా వచ్చిన మాట్లాడే స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, వీటి పర్యవసానంగా దేశ గతం గురించి వెల్లడైన విశేషాలూ చాలా మంది సోవియట్ పౌరులకు అసౌకర్యం కలిగించాయి. [158]

గోర్బచేవ్ తన సంస్కరణల విషయంలో వెళ్ళాల్సినంత దూరం వెళ్ళడం లేదని పార్టీలో కొందరు భావించారు; వారిలో ఒక ప్రముఖ విమర్శకుడు బోరిస్ యెల్ట్‌సిన్. అతడు 1985 నుండి వేగంగా ఎదిగి, మాస్కో నగరానికి నేత అయ్యాడు. [159] ప్రభుత్వంలోని చాలా మంది సభ్యుల మాదిరిగానే, గోర్బచేవ్ కూడా యెల్ట్‌సిన్ పై సంశయాత్మకంగా ఉండేవాడు. అతడు స్వీయ ఎదుగుదలలోనే నిమగ్నమై ఉన్నాడని నమ్మాడు. [160] గోర్బచేవ్‌ను యెల్ట్‌సిన్ విమర్శించాడు, అతన్ని తన స్వంత గ్రూపు పోషకుడిగా భావించాడు. [159] 1986 ప్రారంభంలో, యెల్ట్‌సిన్ పొలిట్‌బ్యూరో సమావేశాలలో గోర్బచేవ్ పై చాటుమాటు విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. [160] ఫిబ్రవరిలో జరిగిన ఇరవై-ఏడో పార్టీ కాంగ్రెస్ లో, యెల్ట్‌సిన్ మరింత లోతైన సంస్కరణలు జరగాలని పిలుపు నిచ్చాడు. గోర్బచేవ్‌ను పేరుపెట్టి విమర్శించకుండా, ప్రస్తుతం ఓ కొత్త రకపు వ్యక్తిపూజ రూపుతీసుకుంటోందని ఆరోపించాడు. దీనిపై గోర్బచేవ్, ఇతర ప్రతినిధుల ప్రతిస్పందనలను ఆహ్వానించాడు. దాంతో అక్కడ హాజరైనవారు యెల్ట్‌సిన్‌ను చాలా గంటల పాటు బహిరంగంగా విమర్శించారు.[161] ఆ తరువాత, గోర్బచేవ్ కూడా యెల్ట్‌సిన్‌ను విమర్శిస్తూ, అతడు తన స్వార్థం మాత్రమే చూసుకుంటాడనీ, అతడొక "రాజకీయంగా నిరక్షరాస్యుడ" నీ ఆరోపించాడు. [162] దాంతో యెల్ట్‌సిన్ మాస్కో బాస్ పదవికీ, పొలిట్‌బ్యూరో సభ్యత్వానికీ రాజీనామా చేశాడు. [162] ఈ దశ నుండి, ఆ ఇద్దరి మధ్య ఉన్న ఉద్రిక్తతలు పరస్పర ద్వేషంగా రూపు తీసుకున్నాయి. [163]

1986 ఏప్రిల్లో చెర్నోబిల్ విపత్తు సంభవించింది.[164] వెంటనే, ఈ సంఘటనను తక్కువ చేయడానికి అధికారులు గోర్బచేవ్‌కు తప్పు సమాచారం ఇచ్చారు. విపత్తు తీవ్రత స్పష్టంగా తెలిసాక, చెర్నోబిల్ చుట్టుపక్కల ప్రాంతం నుండి 3,36,000 మందిని తరలించారు. [165] ఈ విపత్తు "గోర్బచేవ్‌కూ, సోవియట్ పాలనకూ ఒక మలుపు" అని టౌబ్‌మాన్ గుర్తించాడు. [166] ఇది జరిగిన చాలా రోజుల తరువాత, అతడు దేశానికి టెలివిజన్ నివేదిక ఇచ్చాడు. [167] సోవియట్ సమాజంలో వ్యాపించి ఉన్న నాణ్యతలేని పనితనం, కార్యాలయంలో జడత్వం వంటి సమస్యలకు ఈ విపత్తే సాక్ష్యం అని అతడు చెప్పాడు [168] తరువాతి కాలంలో గోర్బచేవ్ ఈ సంఘటన గురించి ప్రస్తావిస్తూ, సోవియట్ యూనియన్‌లో అసమర్థత, కప్పిపుచ్చడం ఏ స్థాయిలో ఉందో చెర్నోబైల్ సంఘటనతో తనకు అర్థమైందని అన్నాడు. [166] ఏప్రిల్ నుండి సంవత్సరాంతం వరకూ ఆహార ఉత్పత్తి, బ్యూరోక్రసీ, మిలిటరీ డ్రాఫ్ట్, పెద్ద సంఖ్యలో ఉన్న జైలు పక్షులు వంటి వాటితో సహా సోవియట్ వ్యవస్థపై గోర్బచేవ్ విమర్శలు గుప్పించాడు. [169]

విదేశాంగ విధానం

1986లో[permanent dead link] ఐస్లాండ్‌లో అమెరికా అధ్యక్షుడు రీగన్, గోర్బచేవ్ సమావేశం

1985 మేలో సోవియట్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చేసిన ప్రసంగంలో - ఓ సోవియట్ నాయకుడు తన దేశ దౌత్యవేత్తలను ఉద్దేశించి ప్రసంగించడం అదే తొలిసారి - గోర్బచేవ్ విదేశాంగ విధానం యొక్క "సమూల పునర్నిర్మాణం" గురించి మాట్లాడాడు. [170] అతడి నాయకత్వం ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య ఆఫ్ఘన్ సివిల్ వార్లో సోవియట్ ప్రమేయం. అప్పటికి ఇది ఐదేళ్ళుగా సాగుతోంది. [171] యుద్ధ సమయంలో, సోవియట్ సైన్యానికి భారీ ప్రాణనష్టం జరిగింది. ప్రజల్లోను, సైనికుల్లోనూ సోవియట్ ప్రమేయం పట్ల చాలా వ్యతిరేకత ఉంది. [171] నాయకుడైన తరువాత, ఆ యుద్ధం నుండి వైదొలగడం ఒక ముఖ్యమైన ప్రాథమ్యంగా గోర్బచేవ్ భావించాడు. [172] 1985 అక్టోబరులో, అతడు ఆఫ్ఘన్ మార్క్సిస్ట్ నాయకుడు బబ్రక్ కర్మాల్‌తో సమావేశమయ్యాడు. అతడి ప్రభుత్వానికి విస్తృతంగా ప్రజల మద్దతు లేకపోవడాన్ని గుర్తించమనీ, ప్రతిపక్షాలతో అధికారాన్ని పంచుకునే ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనీ కోరాడు. [172] ఆ నెలలో, ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనిక దళాలను ఉపసంహరించుకోవాలని గోర్బచేవ్ తీసుకున్న నిర్ణయాన్ని పొలిట్‌బ్యూరో ఆమోదించింది. కానీ, 1989 ఫిబ్రవరి నాటికి గానీ దళాల ఉపసంహరణ పూర్తి కాలేదు.[173]

ప్రచ్ఛన్న యుద్ధంలో ఉద్రిక్తతలు పెరిగిన కాలాన్ని గోర్బచేవ్ వారసత్వంగా పొందాడు. [174] అమెరికాతో సంబంధాలను బాగా మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని అతడు గట్టిగా నమ్మాడు; అణు యుద్ధం జరిగే అవకాశం పట్ల అతడు భీతిల్లాడు. ఆయుధ పోటీలో సోవియట్ యూనియన్ గెలిచే అవకాశం లేదని అతడికి తెలుసు. సైన్యంపై అలాగే ఖర్చు పెట్టుకుంటూ పోతే తాను తలపెట్టిన దేశీయ సంస్కరణలకు హానికరమని భావించాడు. [174] అణు యుద్ధం అవకాశం పట్ల రోనాల్డ్ రీగన్ కూడా లోలోపల భయపడినా బహిరంగంగా మాత్రం ఉద్రిక్తతలు తగ్గడానికి సుముఖంగా లేనట్లు కనిపించాడు. సౌమనస్యాన్ని పక్కన పెట్టాడు, ఆయుధాల నియంత్రణను పట్టించుకోలేదు, ఆయుధ సేకరణ చేసాడు, సోవియట్ యూనియన్‌ను "దుష్ట సామ్రాజ్యం" (ఈవిల్ ఎంపైర్) అని పిలిచాడు. [175]

గోర్బచేవ్, రీగన్ లిద్దరూ ప్రచ్ఛన్న యుద్ధం గురించి చర్చించడానికి ఒక శిఖరాగ్ర సమావేశం జరపాలని కోరుకున్నారు. కాని ఇటువంటి చర్య పట్ల ఇద్దరూ తమ తమ ప్రభుత్వాలలో కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. [176] చివరికి 1985 నవంబరులో స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఈ సమావేశం నిర్వహించడానికి ఇరు దేశాలూ ఆమోదించాయి.[177] ఈ సన్నాహకాల్లో భాగంగా గోర్బచేవ్, అమెరికా వారి నాటో మిత్రులతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని తలచాడు. 1985 అక్టోబరులో ఫ్రాన్స్ సందర్శించి, అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ మిట్టరాండ్‌ను కలిసాడు.[178] జెనీవా శిఖరాగ్ర సమావేశంలో, గోర్బచేవ్, రీగన్ల మధ్య చర్చలు కొన్నిసార్లు వేడెక్కాయి. గోర్బచేవ్ తొలుత నిరాశకు గురయ్యాడు, అమెరికా అధ్యక్షుడు "నేను చెప్పేది అసలు వింటున్నట్లే లేదు". [179] ఆఫ్ఘనిస్తాన్, నికరాగువాలో జరిగిన సంఘర్షణలు, మానవ హక్కుల సమస్యలపై చర్చించడంతో పాటు, వాళ్ళిద్దరూ యుఎస్ స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ (ఎస్‌డిఐ - దీన్నే స్టార్ వార్స్ అని పిలిచేవారు) గురించి చర్చించింది. ఎస్‌డిఐని గోర్బచేవ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. [180] వీరిద్దరి భార్యలు కూడా సమావేశమై శిఖరాగ్రంలో కలిసి గడిపారు. [181] అణు యుద్ధాన్ని నివారించడానికి సంయుక్తంగా బద్ధులౌతూ సమావేశం ముగిసింది. మరో రెండు సార్లు, 1986 లో వాషింగ్టన్ DC లోను, 1987 లో మాస్కోలోనూ, సమావేశమవ్వాలని కూడా తీర్మనించారు. [180] సమావేశ పరిణామాల గురించి ఇతర వార్సా ఒప్పంద నాయకులకు తెలియజేయడానికి గోర్బచేవ్ ప్రాగ్ వెళ్ళాడు. [182]

తూర్పు[permanent dead link] జర్మనీకి చెందిన ఎరిక్ హోనెక్కర్‌తో గోర్బచేవ్. ప్రైవేటుగా ఉండగా గోర్బచేవ్ చెర్నేవ్‌తో, హోనెక్కర్ ఒక "స్కమ్‌బ్యాగ్" అని చెప్పాడు.[183]

20 వ శతాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని అణ్వాయుధాలన్నిటినీ రద్దు చేయడానికి మూడు దశల కార్యక్రమాన్ని గోర్బచేవ్ 1986 జనవరిలో బహిరంగంగా ప్రతిపాదించాడు.[184] అక్టోబరులో ఐస్‌లాండ్‌లోని రేక్‌యవిక్‌లో రీగన్‌తో సమావేశమవడానికి ఒక ఒప్పందం కుదిరింది. రీగన్ ఎస్డిఐ అమలు చెయ్యడం ఆపాలనీ, ఆపుతానని హామీ ఇస్తే దానికి బదులుగా సోవియట్ల దీర్ఘ శ్రేణి అణు క్షిపణులను 50% తగ్గించడంతో సహా రాయితీలు ఇవ్వడానికి సిద్ధమనీ చెప్పాడు.[185] అణ్వాయుధాలను రద్దు చేయాలనే ఉమ్మడి లక్ష్యంతో ఇరువురు నాయకులు అంగీకరించినా, రీగన్ ఎస్డిఐ కార్యక్రమాన్ని ముగించడానికి నిరాకరించడంతో ఎటువంటి ఒప్పందమూ కుదరలేదు. [186] శిఖరాగ్ర సమావేశం తరువాత, రీగన్ మిత్రదేశాలు చాలా మంది, అణ్వాయుధాలను రద్దు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నందుకు అతణ్ణి విమర్శించారు. [187] అదే సమయంలో గోర్బచేవ్ పొలిట్‌బ్యూరోతో మాట్లాడుతూ, రీగన్ "ఆదిమ మానవుడు, గుహల్లో జీవించేవాడు, మేధోపరంగా బలహీనుడ"ని చెప్పాడు. [187]

అభివృద్ధి చెందుతున్న దేశాలతో తన సంబంధాలలో, గోర్బచేవ్ చాలా మంది నాయకులను విప్లవాత్మక సోషలిస్ట్ భావాలనూ సోవియట్ అనుకూల వైఖరినీ పైకి ప్రవచిస్తూ ఉండే - లిబియా గడ్డాఫీ, సిరియా హఫీజ్ అల్-అస్సాద్ వంటివారిని చూచి విసుగెత్తాడు. కానీ, భారత ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీతో అతడికి ఉత్తమ వ్యక్తిగత సంబంధా లుండేవి. [171] మార్క్సిస్టు-లెనినిస్టులు పాలించే ఈస్టర్న్ బ్లాక్ దేశాలతోను, ఉత్తర కొరియా, వియత్నాం, క్యూబా వంటి దేశాలతోనూ కూడిన సామ్యవాద శిబిరం, సోవియట్ ఆర్థిక వ్యవస్థపై ఒక భారమని అతడు భావించాడు. సోవియట్ యూనియన్ నుండి వస్తువులను తీసుకుపోవడమే తప్ప, వాళ్ళు తిరిగి ఇచ్చింది పెద్దగా లేదని అతడు భావించాడు. [188] సోవియట్లతో సంబంధాలను తెంచుకుని స్వంత సంస్కరణలను చేపట్టిన మార్క్సిస్టు చైనాతో మెరుగైన సంబంధాలు నెలకొల్పుకోవాలని గోర్బచేవ్ కోరుకున్నాడు. 1985 జూన్‌లో, ఆ దేశంతో 14 బిలియన్ అమెరికా డాలర్ల ఐదేళ్ల వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాడు. 1986 జూలైలో, సోవియట్-చైనా సరిహద్దులో దళాలను తగ్గించాలని ప్రతిపాదించాడు. చైనాను "గొప్ప సోషలిస్ట్ దేశమ"ని ప్రశంసించాడు. [189] ఆసియా అభివృద్ధి బ్యాంకులో సభ్యత్వం కావాలని, పసిఫిక్ దేశాలతో, ముఖ్యంగా చైనా జపాన్‌లతో సత్సంబంధాలు పెట్టుకోవాలన్న తన కోరికను అతడు స్పష్టం చేశాడు. [190]

మరింత సంస్కరణ: 1987-1989

దేశీయ సంస్కరణలు

గోర్బచేవ్[permanent dead link], 1987 లో

1987 జనవరిలో, గోర్బచేవ్ సెంట్రల్ కమిటీ ప్లీనానికి హాజరయ్యాడు. అక్కడ విస్తృతమైన అవినీతిని విమర్శిస్తూ, పెరెస్త్రోయికా గురించి, ప్రజాస్వామ్యీకరణ గురించీ మాట్లాడాడు.[191] అతడు తన ప్రసంగంలో బహుళ-పార్టీ ఎన్నికలను అనుమతించే ప్రతిపాదనను చేర్చాలని ముందు భావించాడు గానీ, తరువాత వద్దనుకున్నాడు. [192] ప్లీనం తరువాత, ప్రభుత్వాధికారులు, ఆర్థికవేత్తలతో జరిపిన చర్చల్లో ఆర్థిక సంస్కరణలపై తన దృష్టిని కేంద్రీకరించాడు. [193] చాలా మంది ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థపై మంత్రిత్వశాఖ నియంత్రణలను తగ్గించాలనీ, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు తమ లక్ష్యాలను తామే నిర్దేశించుకునేందుకు అనుమతించాలనీ ప్రతిపాదించారు; రిజ్కోవ్ వంటి ప్రభుత్వ ప్రముఖులు దీన్ని సందేహించారు. [194] జూన్‌లో, గోర్బచేవ్ ఆర్థిక సంస్కరణపై తన నివేదికను పూర్తి చేశాడు. అందులో ఒక రాజీ ధోరణి కనబడింది: మంత్రులకు ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణయించే అధికారం ఉంటుంది, కాని వీటిని అనివార్యంగా పరిగణించరు. [195] ఆ నెలలో, ఒక ప్లీనం అతడి సిఫార్సులను అంగీకరించింది. సుప్రీం సోవియట్ మార్పులను అమలు చేస్తూ, "సంస్థలపై చట్టం"ను ఆమోదించింది.[196] ఆర్థిక సమస్యలు మిగిలే ఉన్నాయి: 1980 ల చివరినాటికి ప్రాథమిక వస్తువుల కొరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్షీణించిన జీవన ప్రమాణాలు అలాగే ఉన్నాయి. [197] ఇవి 1989 లో అనేక గని కార్మికుల సమ్మెలకు కారణమయ్యాయి.[198]

1987 నాటికి, గ్లాస్‌నోస్త్ నీతి సోవియట్ సమాజంలో వ్యాపించింది: పాత్రికేయులు బహిరంగంగానే రాస్తున్నారు, [199] అనేక ఆర్థిక సమస్యలను బహిరంగంగా వెల్లడిస్తున్నారు, [200] సోవియట్ చరిత్రను విమర్శనాత్మకంగా పునఃపరిశీలించిన అధ్యయనాలు వెలుగు చూసాయి. [201] గోర్బచేవ్ వీటికి విస్తృతంగా మద్దతు ఇచ్చాడు. గ్లాస్‌నోస్త్‌ను "పెరెస్త్రోయికా చేతిలోని కీలకమైన, తిరుగులేని ఆయుధం"గా అభివర్ణించాడు. [199] అయినప్పటికీ, ప్రజలు కొత్తగా వచ్చిన స్వేచ్ఛను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని అతడు నొక్కిచెప్పాడు. పాత్రికేయులు, రచయితలూ వారి రచనల్లో "సంచలనాత్మకత"ను నివారించాలనీ "పూర్తిగా వస్తుగతం"గా ఉండాలనీ పేర్కొన్నాడు. [202] ఇంతకుముందు నిషేధించిన దాదాపు రెండు వందల సోవియట్ సినిమాలు విడుదలయ్యాయి. పాశ్చాత్య చిత్రాల శ్రేణి కూడా అందుబాటులోకి వచ్చింది.[203] 1940 నాటి కాటిన్ ఊచకోతలో సోవియట్ అపరాధం ఎట్టకేలకు 1989 లో వెల్లడైంది. [204]

1987 సెప్టెంబరులో ప్రభుత్వం, బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్, వాయిస్ ఆఫ్ అమెరికాల సిగ్నళ్ళను అడ్డుకోవడం ఆపేసింది.[205] సంస్కరణలలో మతం పట్ల మరింత సహనం కూడా ఉంది; [206] ఈస్టర్ ప్రార్థనలను మొదటిసారి సోవియట్ టెలివిజన్‌లో ప్రసారం చేసారు. రష్యన్ ఆర్థడాక్స్ చర్చి యొక్క సహస్రాబ్ది వేడుకలు మీడియాలో వచ్చాయి. [207] స్వతంత్ర సంస్థలు, గోర్బచేవ్‌కు అత్యంత మద్దతుదార్లు. అయితే అతి-జాతీయవాద, యూదు వ్యతిరేక సంస్థ యైన పామ్యాట్ వీరిలో అత్యంత పెద్దది. [208] ఇజ్రాయెల్‌కు వలస వెళ్లాలనుకునే సోవియట్ యూదులను అనుమతిస్తామని గోర్బచేవ్ ప్రకటించాడు. ఇంతకు ముందు దానిపై నిషేధం ఉంది. [209]

ఆగష్టు 1987 లో, అతడు ఉక్రెయిన్‌లోని నీజ్నియా ఒరెండాలో సెలవు గడిపాడు. అక్కడ యుఎస్ ప్రచురణకర్తల సూచన మేరకు పెరెస్త్రోయికా: న్యూ థింకింగ్ ఫర్ అవర్ కంట్రీ అండ్ అవర్ వరల్డ్ అనే పుస్తకాన్ని రాశాడు.[210] లెనిన్ను, కమ్యూనిస్ట్ పార్టీనీ అధికారంలోకి తెచ్చిన 1917 అక్టోబర్ విప్లవం యొక్క 70 వ వార్షికోత్సవం కోసం, గోర్బచేవ్ "అక్టోబర్ అండ్ పెరెస్త్రోయికా: ది రివల్యూషన్ కంటిన్యూస్" పై ప్రసంగించాడు. క్రెమ్లిన్ ప్యాలెస్ ఆఫ్ కాంగ్రెస్‌లో సెంట్రల్ కమిటీ, సుప్రీం సోవియట్ల సంయుక్త సమావేశంలో లెనిన్‌ను ప్రశంసించాడు. కాని సామూహిక మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను స్టాలిన్ను విమర్శించాడు.[211] పార్టీ కఠినవాదులు ప్రసంగం చాలా దూరం పోయిందని భావించారు; ఉదారవాదులేమో కావాల్సినంత దూరం పోలేదని భావించారు.[212]

1988 మార్చిలో, సోవెట్స్కాయ రోసియా అనే పత్రిక నీనా ఆండ్రియేవా అనే ఉపాధ్యాయురాలు రాసిన బహిరంగ లేఖను ప్రచురించింది. ఇందులో ఆమె గోర్బచేవ్ చేపట్టిన సంస్కరణల లోని అంశాలను విమర్శించింది. స్టాలినిస్టు శకం యొక్క తిరస్కరణగా ఆమె భావించిన వాటిపై దాడి చేసింది. సంస్కరణల బృందమే - ఇందులో ఎక్కువగా యూదులు, మైనారిటీ జాతుల వారే అని ఆమె సూచనగా చెప్పింది - దీనికి కారణమని వాదించింది.[213] 900 కి పైగా సోవియట్ వార్తాపత్రికలు దీనిని పునర్ముద్రించాయి. సంస్కరణ వ్యతిరేకవాదులు దాని చుట్టూ కూడదీసుకున్నారు; పెరెస్త్రోయికాకు వ్యతిరేకంగా ఎదురుదెబ్బ తగులుతుందేమోనని చాలామంది సంస్కరణవాదులు భయపడ్డారు. [214] యుగోస్లేవియా నుండి తిరిగి వచ్చిన తరువాత, గోర్బచేవ్ ఈ లేఖ గురించి చర్చించడానికి పొలిట్‌బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. ఆ సమావేశంలో అతడు, ఆ లేఖలోని మనోభావాలను సమర్ధించే వారిని ఎదుర్కొన్నాడు. చివరకు, ఆండ్రియేవా లేఖను నిరాకరించాలనీ, ప్రావ్దాలో ఖండనను ప్రచురించాలనీ ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు.[215] యాకోవ్లెవ్, గోర్బచేవ్ ల ఖండనలో "ప్రతిచోటా అంతర్గత శత్రువులను చూసేవారు" "దేశభక్తులు కార"ని చెప్పారు. స్టాలిన్ యొక్క "భారీ అణిచివేత, చట్టరాహిత్యా"లు "అపారమైనవి, క్షమించరానివీ" అని అభివర్ణించింది. [216]

పీపుల్స్ డిప్యూటీస్ కాంగ్రెస్ ఏర్పాటు

తరువాత జరపాల్సిన పార్టీ కాంగ్రెస్ 1991 వరకు లేనప్పటికీ, గోర్బచేవ్ 1988 జూన్‌లో 19 వ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మునుపటి సమావేశాలలో కంటే విస్తృత స్థాయిలో ప్రజలు హాజరుకావడం ద్వారా, తన సంస్కరణలకు అదనపు మద్దతు లభిస్తుందని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. [217] సానుభూతిపరులైన అధికారులు, విద్యావేత్తలతో, గోర్బచేవ్ సంస్కరణల కోసం ప్రణాళికలను రూపొందించాడు. ఇవి అధికారాన్ని పొలిట్‌బ్యూరో నుండి సోవియట్‌ల వైపుకు మార్చేలా వాటిని రూపొందించారు. పొలిట్‌బ్యూరో విధానాలకు తలూపే రబ్బర్ స్టాంపులుగా మారినప్పటికీ, ఈ సోవియట్‌లు ఏడాది పొడవునా పనిచేసే శాసనసభలుగా మారాలని అతడు కోరుకున్నాడు. కాంగ్రెస్ ఆఫ్ పీపుల్స్ డిప్యూటీస్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని అతడు ప్రతిపాదించాడు. దీని సభ్యులను ఎక్కువగా స్వేచ్ఛా ఓటుతో ఎన్నుకోవాలి.[218] ఈ కాంగ్రెసే యుఎస్ఎస్ఆర్ సుప్రీం సోవియట్ను ఎన్నుకుంటుంది. ఇది చాలా శాసనాలను చేస్తుంది. [219]

గోర్బచేవ్[permanent dead link], అతడి భార్య రైసా 1988 లో పోలాండ్ పర్యటనలో ఉండగా

ఈ ప్రతిపాదనలు మరింత ప్రజాస్వామ్యం కోసం గోర్బచేవ్ పడుతున్న తపనను ప్రతిబింబిస్తాయి; అయితే, శతాబ్దాల జారిస్ట్ నిరంకుశత్వం లోను, మార్క్సిస్ట్-లెనినిస్టుల నిరంకుశాధికారం లోనూ మగ్గిన సోవియట్ ప్రజల్లో "బానిస మనస్తత్వం" నేలకొందని, అది సంస్కరణలకు పెద్ద అడ్డంకి అనీ అతడు భావించాడు. [220] క్రెమ్లిన్ ప్యాలెస్ ఆఫ్ కాంగ్రెస్‌లో జరిగిన ఈ సమావేశంలో 5,000 మంది ప్రతినిధులు ఒకచోట చేరారు. అతివాదులు, ఉదారవాదుల మధ్య వాదనలు జరిగాయి. కార్యకలాపాలను టెలివిజన్‌లో ప్రసారం చేసారు. 1920 ల తరువాత మొట్టమొదటిసారి అక్కడ ఓటింగ్ ఏకగ్రీవంగా జరగలేదు. [221] సమావేశం ముగిసిన తరువాతి నెలల్లో, గోర్బచేవ్ పార్టీ వ్యవస్థను పునఃరూపకల్పన చేయడం, క్రమబద్ధీకరించడంపై దృష్టి పెట్టాడు; సెంట్రల్ కమిటీ సిబ్బందిని - అప్పుడు 3,000 మంది ఉన్నారు - సగానికి తగ్గించాడు. వివిధ కేంద్ర కమిటీ విభాగాలను విలీనం చేసి, మొత్తం సంఖ్యను ఇరవై నుండి తొమ్మిదికి తగ్గించాడు.[222]

1989 మార్చి, ఏప్రిల్ లలో, కొత్త కాంగ్రెస్‌కు ఎన్నికలు జరిగాయి.[223] ఎన్నికైన 2,250 మంది శాసనసభ్యులలో వంద మందిని కమ్యూనిస్టు పార్టీ నేరుగా ఎన్నుకుంది. వీరిని "రెడ్ హండ్రెడ్" అని పిలుస్తారు. వీరిలో చాలామంది సంస్కరణవాదులు ఉండేలా గోర్బచేవ్ జాగ్రత్త పడ్డాడు.[224] ఎన్నికైన వారిలో 85% పైగా పార్టీ సభ్యులే అయినప్పటికీ,[225] వారిలో చాలామంది-సఖరోవ్, యెల్ట్‌సిన్ లతో సహా-ఉదారవాదులే.[226] గోర్బచేవ్ ఈ ఫలితాన్ని చూసి సంతోషించాడు. "అసాధారణమైన క్లిష్ట పరిస్థితులలో అపారమైన రాజకీయ విజయం"గా దాన్ని అభివర్ణించాడు. [227] 1989 మేలో కొత్త కాంగ్రెస్ సమావేశమైంది. [228] గోర్బచేవ్ దాని అధ్యక్షుడిగా - కొత్త వాస్తవ దేశాధినేత -ఎన్నికయ్యాడు. 2,123 ఓట్లు అనుకూలంగాను, 87 వ్యతిరేకంగానూ వచ్చాయి.[229] దీని సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేసారు. దాని సభ్యులు కొత్త సుప్రీం సోవియట్‌ను ఎన్నుకున్నారు. [230] కాంగ్రెస్‌లో, సఖరోవ్ పదేపదే మాట్లాడాడు. మరింత సరళీకరణ చెయ్యాలని, ప్రైవేట్ ఆస్తిని ప్రవేశపెట్టాలనీ కోరుతూ గోర్బచేవ్‌ను రెచ్చగొట్టాడు. [231] కొంతకాలం తర్వాత సఖరోవ్ మరణించాక, ఉదారవాద ప్రతిపక్షానికి యెల్ట్‌సిన్ నాయకత్వం వహించాడు. [232]

చైనాతో, పాశ్చాత్య దేశాలతో సంబంధాలు

గోర్బచేవ్ రీగన్‌ చర్చలు

గోర్బచేవ్ UK, ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీలతో సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నించాడు; [233] మునుపటి సోవియట్ నాయకుల మాదిరిగానే, పశ్చిమ ఐరోపాను యుఎస్ ప్రభావం నుండి బయటకు లాగడానికి అతడు ఆసక్తి చూపాడు. [234] మరింత పాన్-యూరోపియన్ సహకారం కోసం పిలుపునిస్తూ, అతడు " కామన్ యూరోపియన్ హోమ్ " గురించి, "అట్లాంటిక్ నుండి యురల్స్ వరకు" ఉన్న ఐరోపా గురించీ బహిరంగంగా మాట్లాడాడు. 1987 మార్చిలో, థాచర్ మాస్కోలో గోర్బచేవ్‌ను సందర్శించింది; సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ, వారు ఒకరినొకరు ఇష్టపడ్డారు.[235] 1989 ఏప్రిల్లో అతడు లండన్ సందర్శించాడు, ఎలిజబెత్ IIతో కలిసి భోజనం చేశాడు. 1987 మేలో, గోర్బచేవ్ మళ్ళీ ఫ్రాన్స్‌ సందర్శించాడు. 1988 నవంబరులో మిట్టరాండ్ మాస్కో గోర్బచేవ్‌ను కలిసాడు. [236] వెస్ట్ జర్మనీ ఛాన్సలర్, హెల్మెట్ కోల్ తొలుత గోర్బచేవ్‌ను నాజీ ప్రచారకర్త జోసెఫ్ గోబెల్స్ తో పోల్చి మనస్తాపం కలిగించినా, తరువాత అనధికారికంగా క్షమాపణ చెప్పాడు. 1988 అక్టోబరులో కోల్ మాస్కో సందర్శించాడు.1989 జూన్‌లో గోర్బచేవ్ పశ్చిమ జర్మనీలోని కోల్‌ను కలిసాడు. [237] 1989 నవంబరులో అతడు ఇటలీని సందర్శనలో పోప్ జాన్ పాల్ II తో సమావేశమయ్యాడు . [238] ఈ పశ్చిమ యూరోపియన్ నాయకులతో గోర్బచేవ్ సంబంధాలు అతడి తూర్పు బ్లాక్ సహచరులతో ఉన్న సంబంధాల కంటే చాలా సుహృద్భావంతో ఉండేవి. [239]

చైనా-సోవియట్ చీలికను మాన్పడానికి గోర్బచేవ్ చైనాతో మంచి సంబంధాలను కొనసాగించాడు. 1989 మేలో అతడు బీజింగ్‌ సందర్శించాడు. అక్కడ దాని నాయకుడు డెంగ్ జియాపింగ్‌ను కలిశాడు; డెంగ్ ఆర్థిక సంస్కరణపై గోర్బచేవ్ నమ్మకాన్ని పంచుకున్నాడు కాని ప్రజాస్వామ్యీకరణ కోసం చేసిన పిలుపులను తిరస్కరించాడు. [240]గోర్బచేవ్ పర్యటన సందర్భంగా ప్రజాస్వామ్య అనుకూల విద్యార్థులు టియానాన్మెన్ స్క్వేర్లో గుమిగూడారు. కాని అతడు వెళ్ళిన తరువాత, దళాలు వారిని ఊచకోత కోశాయి. గోర్బచేవ్ ఈ ఊచకోతను బహిరంగంగా ఖండించలేదు. కాని తూర్పు బ్లాక్‌లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనలను ఎదుర్కోవడంలో హింసాత్మక శక్తిని ఉపయోగించకూడదనే అతడి నిబద్ధతకు చైనా సంఘటన బలం చేకూర్చింది. [241]

అమెరికాతో మునుపటి చర్చల వైఫల్యాల తరువాత గోర్బచేవ్, 1987 ఫిబ్రవరిలో మాస్కోలో "అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం, మానవజాతి మనుగడ కోసం" అనే పేరుతో ఒక సమావేశాన్ని నిర్వహించాడు. దీనికి వివిధ అంతర్జాతీయ ప్రముఖులు, రాజకీయ నాయకులూ హాజరయ్యారు. [242] అణ్వాయుధ నిరాయుధీకరణ కోసం బహిరంగంగా ముందుకు రావడం ద్వారా, గోర్బచేవ్ సోవియట్ యూనియన్‌ను నైతికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నించాడు. తమకే నైతిక ఆధిపత్యం ఉందనే పశ్చిమ దేశాల అవగాహనను బలహీనపరిచాడు. [243] రీగన్ ఎస్డిఐపై వెనక్కి తగ్గడని తెలుసు కాబట్టి, గోర్బచేవ్ "ఇంటర్మీడియట్-రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్"ను తగ్గించడంపై దృష్టి పెట్టాడు. దీనికి రీగన్ అంగీకరించాడు. [244] 1987 ఏప్రిల్లో, గోర్బచేవ్ మాస్కోలో యుఎస్ విదేశాంగ కార్యదర్శి జార్జ్ పి. షుల్ట్జ్‌తో చర్చించాడు; సోవియట్ యొక్క ఎస్ఎస్ -23 రాకెట్లను తొలగించడానికీ, యుఎస్ ఇన్స్పెక్టర్లను సోవియట్ సైనిక సౌకర్యాలను సందర్శించడాన్ని అనుమతించటానికీ అతడు అంగీకరించాడు. [245] దీన్ని సోవియట్ మిలిటరీ వ్యతిరేకించింది. కానీ 1987 మేలో మథియాస్ రస్ట్ అనే పశ్చిమ జర్మన్ యువకుడు ఫిన్లాండ్ నుండి విమానంలో ఎగురుతూ వచ్చి రెడ్ స్క్వేర్‌లో దిగిన సంఘటనలో అతణ్ణి భూమి నుండి ఎవరూ గుర్తించలేదు. దీనిపై కోపించిన గోర్బచేవ్, అసమర్ధత కారణంగా అనేక మంది సీనియర్ సైనిక అధికారులను తొలగించాడు. [246] 1987 డిసెంబరులో గోర్బచేవ్ వాషింగ్టన్ DC ని సందర్శించాడు. అక్కడ అతడు, రీగన్‌లు ఇంటర్మీడియట్-రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందంపై సంతకం చేశారు.[247] టౌబ్మాన్ దీనిని "గోర్బచేవ్ కెరీర్‌లో ఉచ్ఛతమ బిందువులలో ఒకటి" అని అన్నాడు. [248]

రీగన్[permanent dead link], గోర్బచేవ్ భార్యలతో (వరుసగా నాన్సీ, రైసా) వాషింగ్టన్, 1987 డిసెంబరు 9 లో వాషింగ్టన్లోని సోవియట్ రాయబార కార్యాలయంలో విందుకు హాజరయ్యారు.

1988 మే- 1988 జూన్ లలో మాస్కోలో రెండవ యుఎస్-సోవియట్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇది ఒక ప్రతీక మాత్రంగానే ఉంటుందని గోర్బచేవ్ భావించాడు. మళ్ళీ, అతడు, రీగన్ ఒకరి దేశాన్నొకరు విమర్శించుకున్నరు - మత స్వేచ్ఛపై సోవియట్ ఆంక్షలను రీగన్ ప్రస్తావించగా, గోర్బచేవ్ అమెరికాలో ఉన్న పేదరికాన్ని, జాతి వివక్షతనూ ఎత్తిచూపాడు. కాని వారు "స్నేహపూర్వకంగానే" మాట్లాడుకున్నట్లు గోర్బచేవ్ పేర్కొన్నాడు. [249] బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించడానికి ముందు ఒకరినొకరు తెలియజేసుకోవాలని వారు ఒక ఒప్పందానికి వచ్చారు. రవాణా, ఫిషింగ్, రేడియో నావిగేషన్‌పై ఒప్పందాలు చేసుకున్నారు. [250] శిఖరాగ్ర సమావేశంలో, రీగన్ విలేకరులతో మాట్లాడుతూ, తాను ఇకపై సోవియట్ యూనియన్‌ను "దుష్ట సామ్రాజ్యం"గా పరిగణించడంలేదని చెప్పాడు. ఇరువురూ తమను తాము స్నేహితులుగా భావిస్తున్నామని వెల్లడించారు.[251]

మూడవ శిఖరాగ్ర సమావేశం డిసెంబరులో న్యూయార్క్ నగరంలో జరిగింది. [252] అక్కడికి చేరుకున్న గోర్బచేవ్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించాడు. అక్కడ సోవియట్ సాయుధ దళాలను 5,00,000 తగ్గిస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించాడు; మధ్య, తూర్పు ఐరోపా నుండి 50,000 మంది సైనికులను ఉపసంహరించుకుంటామని కూడా ప్రకటించాడు.[253]అమెరికా ప్రెసిడెంట్ అయిన తరువాత, బుష్ గోర్బచేవ్‌తో చర్చలు కొనసాగించడానికి ఆసక్తి కనబరిచాడు, కాని తన రిపబ్లికన్ పార్టీ లోని మితవాదుల నుండి విమర్శలు వస్తాయనే భయంతో సోవియట్స్‌పై కఠినంగా ఉన్నట్లు కనిపించాలని అనుకున్నాడు. [254] 1989 డిసెంబరులో గోర్బచేవ్, బుష్ లు మాల్టా శిఖరాగ్ర సమావేశంలో కలిసారు. జాక్సన్-వానిక్ సవరణను నిలిపివేయడం ద్వారా, స్టీవెన్సన్ - బైర్డ్ సవరణలను రద్దు చేయడం ద్వారా సోవియట్ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తానని బుష్ ప్రతిపాదించాడు. [255] అక్కడ, వీరిద్దరూ ఉమ్మడి విలేకరుల సమావేశానికి అంగీకరించారు. అమెరికా సోవియట్ నాయకులు అలా ఉమ్మడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చెయ్యడం అదే మొదటిసారి. [256] క్యూబాతో సంబంధాలను సాధారణీకరించాలని, దాని అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను కలవాలనీ గోర్బచేవ్ బుష్‌ను కోరాడు. బుష్ నిరాకరించాడు [257]

జాతీయత అంశం, ఈస్టర్న్ బ్లాక్

గోర్బచేవ్[permanent dead link] రొమేనియన్ మార్క్సిస్ట్-లెనినిస్ట్ నాయకుడు నికోలే సిసెస్క్యూను కలిశారు . టౌబ్మాన్ ఉద్దేశంలో సిసెస్క్యూ గోర్బచేవ్‌కు "ఫేవరిట్ పంచింగ్ బ్యాగ్". [171]

అధికారం చేపట్టిన తరువాత, గోర్బచేవ్ సోవియట్ యూనియన్‌లోని వివిధ జాతీయ సమూహాలలో కొంత అశాంతిని గమనించాడు. కజఖ్ ప్రాంతానికి అధిపతిగా ఒక రష్యన్‌ను నియమించడంతో 1986 డిసెంబరులో అనేక కజఖ్ నగరాల్లో అల్లర్లు జరిగాయి. [258] 1987 లో క్రిమియాలో పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ క్రిమియన్ తాతార్లు మాస్కోలో నిరసన తెలిపారు. 1944 లో స్టాలిన్ ఆజ్ఞలతో వీరిని దేశంనుండి బహిష్కరించారు. గోర్బచేవ్ వారి పరిస్థితిని పరిశీలించాలని గ్రోమికో నేతృత్వంలో ఒక కమిషన్‌ వేసాడు. క్రిమియాలో తాతార్ పునరావాసాన్ని గ్రోమికో నివేదిక వ్యతిరేకించింది.[259] 1988 నాటికి, సోవియట్ "జాతీయత అంశం" బలపడుతూ వచ్చింది. ఫిబ్రవరిలో, నగోర్నో-కరాబాఖ్ ప్రాంతపు ప్రభుత్వం తమను అజర్‌బైజాన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ నుండి అర్మేనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌కు బదిలీ చేయాలని అధికారికంగా అభ్యర్థించింది; ఈ ప్రాంత జనాభాలో ఎక్కువ భాగం జాతిపరంగా అర్మేనియన్లు. వీరు ఇతర మెజారిటీ అర్మేనియన్ ప్రాంతాలతో కలవాలని కోరుకున్నారు. [260] నగోర్నో-కరాబాఖ్‌లో అర్మేనియన్ అజర్‌బైజాన్ ప్రత్యర్థులు ప్రదర్శనలు నిర్వహించగా, గోర్బచేవ్ పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశాన్ని పిలిచాడు. [261] అంతిమంగా, గోర్బచేవ్ నగోర్నో-కరాబాఖ్‌కు ఎక్కువ స్వయంప్రతిపత్తిని వాగ్దానం చేసాడు. కాని సోవియట్ యూనియన్ అంతటా ఇలాంటి జాతి ఉద్రిక్తతలు, డిమాండ్లు తలెత్తుతాయనే భయంతో బదిలీని నిరాకరించాడు.[262]

ఆ నెల, అజర్‌బైజాన్ నగరమైన సుమ్‌గైట్‌లో, అజర్‌బైజాన్ ముఠాలు అర్మేనియన్ మైనారిటీ సభ్యులను చంపడం ప్రారంభించాయి. స్థానిక దళాలు అశాంతిని అరికట్టడానికి ప్రయత్నించినప్పటికీ వారిపై మూకలు దాడి చేశాయి. పొలిట్‌బ్యూరో నగరంలోకి అదనపు దళాలను పంపించింది. కాని భారీ శక్తిని ప్రదర్శించాలనుకునే లిగచేవ్ వంటివారి ఆలోచనలకు భిన్నంగా గోర్బచేవ్, సంయమనం పాటించాలని కోరాడు. అర్మేనియన్, అజర్‌బైజాన్ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య చర్చలు జరపాలని, రాజకీయ పరిష్కారం ద్వారా పరిస్థితిని పరిష్కరించవచ్చనీ అతడు అభిప్రాయపడ్డాడు. [263] 1990 లో అజర్‌బైజాంరాజధాని బాకులో అర్మేనియన్ వ్యతిరేక హింస చెలరేగింది. జార్జియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌లో కూడా సమస్యలు తలెత్తాయి; 1989 ఏప్రిల్ లో, స్వాతంత్ర్యం కోరుతూ జార్జియన్ జాతీయవాదులు టిబిలిసిలో దళాలతో ఘర్షణ పడ్డారు. బాల్టిక్ రాష్ట్రాల్లో కూడా స్వతంత్ర భావన పెరుగుతోంది; ఈస్టోనియన్, లిథుయేనియన్, లాట్వియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ల సుప్రీం సోవియట్లు రష్యా నుండి తమ ఆర్థిక "స్వయంప్రతిపత్తి"ని ప్రకటించుకున్నాయి. రష్యన్ వలసలను కట్టడి చేసే చర్యలను ప్రవేశపెట్టాయి. 1989 ఆగస్టులో, నిరసనకారులు మూడు రిపబ్లిక్కుల్లో వారి స్వాతంత్ర్య వాంఛకు ప్రతీకగా, బాల్టిక్ వే అనే మానవ గొలుసును ఏర్పాటు చేశారు.[264] ఆ నెలలో, లిథుయేనియన్ సుప్రీం సోవియట్ 1940 లో సోవియట్ యూనియన్ తమ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చింది; [265] 1990 జనవరిలో, గోర్బచేవ్, సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండమని ప్రోత్సహించడానికి ఆ రిపబ్లిక్‌ను సందర్శించారు.

బెర్లిన్[permanent dead link] వాల్, "ధన్యవాదాలు, గోర్బీ!", 1990 అక్టోబర్

ఇతర మార్క్సిస్ట్-లెనినిస్ట్ దేశాలలో ప్రభుత్వాలకు ముప్పు ఎదురైతే, ఆ దేశాల్లో సైనికపరంగా జోక్యం చేసుకునే హక్కు సోవియట్ యూనియన్‌కు ఉంది అనేది "బ్రెజ్నెవ్ సూత్రం". గోర్బచేవ్ దాన్ని తిరస్కరించాడు.[266] 1987 డిసెంబరులో, మధ్య, తూర్పు ఐరోపా నుండి 5,00,000 సోవియట్ దళాలను ఉపసంహరించుకుంటానని ప్రకటించాడు. [267] దేశీయ సంస్కరణలను అనుసరిస్తూనే, అతడు ఈస్టర్న్ బ్లాక్‌లో మరెక్కడా సంస్కర్తలకు బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు. [268] ఆచరణ ద్వారా నేతృత్వం వహించాలని బహుశా అతడు ఆశించి ఉండవచ్చు. తరువాతి కాలంలో తను వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదలచ లేదని అతడు అన్నాడు. కానీ మధ్య, తూర్పు ఐరోపాలో సంస్కరణలను రుద్దడం తన సొంత దేశంలోని అతివాదులకు ఆగ్రహం కలిగిస్తుందని అతడు భయపడి ఉండవచ్చు. [269] హంగరీకి చెందిన జెనోస్ కోడార్, పోలాండ్ యొక్క వోజ్జెక్ యరుజెల్‌స్కీ వంటి కొంతమంది ఈస్టర్న్ బ్లాక్ నాయకులు సంస్కరణ పట్ల సానుభూతితో ఉన్నారు; రొమేనియా లోని నికోలే సిసెస్క్యూ వంటి ఇతరులు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. [270] 1987 మేలో గోర్బచేవ్ రొమేనియాను సందర్శించాడు. అతడు ఆ దేశం పరిస్థితిని చూసి భయపడ్డాడు. తరువాత పొలిట్‌బ్యూరోతో "మానవత్వ గౌరవానికి అక్కడ ఎటువంటి విలువ లేదు" అని చెప్పాడు. [271] అతడు, సిసెస్క్యూ ఒకరినొకరు ఇష్టపడలేదు. గోర్బచేవ్ సంస్కరణలపై వాదించుకున్నారు.[272]

యుఎస్‌ఎస్‌ఆర్ విచ్ఛిన్న క్రమం

1989 నాటి విప్లవాలలో, మధ్య, తూర్పు ఐరోపాలోని చాలా మార్క్సిస్ట్-లెనినిస్ట్ దేశాలు బహుళ-పార్టీ ఎన్నికలను నిర్వహించాయి. ఫలితంగా పాలకుల్లో మార్పులు జరిగాయి. [273] పోలాండ్, హంగేరి వంటి చాలా దేశాలలో, ఇది శాంతియుతంగా జరిగింది. కానీ రొమేనియాలో విప్లవం హింసాత్మకంగా మారింది. చివరికి సిసెస్క్యూను పదవి నుండి దించి, కోర్టులో విచారించి, మరణశిక్ష విధించి అమలు చేసారు. [273] గోర్బచేవ్ ఈ సంఘటనలపై శ్రద్ధ పెట్టలేనంతగా దేశీయ సమస్యలలో మునిగిపోయాడు. [274] ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగినంత మాత్రాన, తూర్పు యూరోపియన్ దేశాలను సోషలిజం పట్ల తమ నిబద్ధతను వదలివేయవని అతడు అభిప్రాయపడ్డారు. 1989 లో అతడు తూర్పు జర్మనీని స్థాపించిన నలభైవ వార్షికోత్సవం సందర్భంగా సందర్శించాడు; కొంతకాలం తర్వాత, నవంబరులో, తూర్పు జర్మన్ ప్రభుత్వం తన పౌరులను బెర్లిన్ గోడను దాటడానికి అనుమతించింది, ఈ నిర్ణయాన్ని గోర్బచేవ్ ప్రశంసించాడు. తరువాతి సంవత్సరాల్లో, గోడను చాలావరకు కూల్చివేసారు. [275] గోర్బచేవ్ లేదా థాచర్ లేదా మిట్టరాండ్ జర్మనీ పునరేకీకరణ వేగంగా జరిగిపోవాలని కోరుకోలేదు -అది ఐరోపాలో ప్రబలమైన శక్తిగా మారే అవకాశం ఉందని వారికి తెలుసు. ఏకీకరణ ప్రక్రియ క్రమంగా జరగాలని గోర్బచేవ్ కోరుకున్నాడు. కాని కోల్ వేగవంతమైన పునరేకీకరణకు పిలుపునిచ్చాడు. [276] జర్మనీ పునరేకీకరణతో, ప్రచ్ఛన్న యుద్ధం ముగుసినట్లేనని చాలా మంది పరిశీలకులు ప్రకటించారు. [277]

సోవియట్ యూనియన్ అధ్యక్షుడు: 1990-1991

1988[permanent dead link] డిసెంబరులో ఐరాస సర్వసభ్య సమావేశంలో చేసిన ఈ ప్రసంగంలో తూర్పు ఐరోపాలోని సోవియట్ సైనిక దళాలను తగ్గించేస్తున్నట్లు నాటకీయంగా ప్రకటించాడు.

1990 ఫిబ్రవరిలో, ఉదారవాదులు, మార్క్సిస్ట్-లెనినిస్ట్ అతివాదులూ గోర్బచేవ్ పై తమ దాడులను ముమ్మరం చేశారు. [278] కమ్యూనిస్టు పార్టీ పాలనను విమర్శిస్తూ మాస్కోలో ఒక ప్రదర్శన జరిగింది. [279] కేంద్ర కమిటీ సమావేశంలో అతివాది వ్లాదిమిర్ బ్రోవికోవ్ అయితే గోర్బచేవ్ దేశాన్ని "అరాచకత్వం" వైపు, "నాశనం" వైపు నడిపిస్తున్నాడని, పశ్చిమ దేశాల ఆమోదం కోసం సోవియట్ యూనియన్‌, మార్క్సిస్ట్-లెనినిస్ట్ ప్రయోజనాలను పణంగా పెడుతున్నాడనీ విమర్శించాడు. [280] సెంట్రల్ కమిటీ తనను ప్రధాన కార్యదర్శి పదవి నుండి తొలగించగలదని గోర్బచేవ్‌కు తెలుసు. అందువల్ల ప్రభుత్వాధినేత పాత్రను అధ్యక్ష పదవికి ఆపాదించాలని నిర్ణయించుకున్నాడు. కమిటీ వారు ఆ పదవి నుండి తొలగించలేరు. [281] అధ్యక్షుడిని ఎన్నుకునేది కాంగ్రెస్ ఆఫ్ పీపుల్స్ డిప్యూటీస్ అని అతడు నిర్ణయించాడు. ప్రజాబాహుళ్యం నుండి ఎన్నికవడంకంటే ఈ పద్ధతే నయమని అనుకున్నాడు. ఎందుకంటే ఎన్నికల్లో ఉద్రిక్తతలు పెరుగుతాయని అతడు భావించాడు. పైగా తాను ఓడిపోతానేమోనని భయపడ్డాడు.[282] అయినప్పటికీ 1990 వసంతకాలంలో జరిపిన సర్వేలో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు అతడేనని తేలింది. [283]

మార్చిలో, కాంగ్రెస్ ఆఫ్ పీపుల్స్ డిప్యూటీస్ మొదటి (ఒకే ఒక్కటి కూడా) సోవియట్ యూనియన్ అధ్యక్షుడికి ఎన్నిక నిర్వహించింది, దీనిలో గోర్బచేవ్ మాత్రమే అభ్యర్థి. అతడికి అనుకూలంగా 1,329, వ్యతిరేకంగా 495 వోట్లు వచ్చాయి; 313 వోట్లు చెల్లలేదు లేదా వోటింగులో పాల్గొనలేదు. దాంతో అతడు సోవియట్ యూనియన్ యొక్క మొదటి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయ్యాడు.[284] పొలిట్‌బ్యూరో స్థానంలో కొత్తగా 18 మంది సభ్యుల ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ ఏర్పడింది.[285] అదే కాంగ్రెస్ సమావేశంలో, సోవియట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ను రద్దు చేయాలనే ఆలోచనను అతడు సమర్పించాడు. కమ్యూనిస్ట్ పార్టీని సోవియట్ యూనియన్ "పాలక పార్టీ"గా ఆమోదించిన అధికరణం అది. కాంగ్రెస్ ఆ సంస్కరణను ఆమోదించి, ఏకపార్టీ స్వభావాన్ని బలహీనపరిచింది.[286]

1990 లో రష్యన్ సుప్రీం సోవియట్‌కు జరిగిన ఎన్నికలలో, కమ్యూనిస్ట్ పార్టీ " డెమోక్రటిక్ రష్యా " అనే ఉదారవాదుల కూటమి నుండి పోటీ ఎదుర్కొంది; కూటమికి పట్టణాల్లో బాగా వోట్లు లభించాయి.[287] యెల్ట్‌సిన్ పార్లమెంటు చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. గోర్బచేవ్ దాని పట్ల అసంతృప్తి చెందాడు.[288] ఆ సంవత్సరంలో జరిపిన అభిప్రాయ సేకరణల్లో సోవియట్ యూనియన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిగా యెల్ట్‌సిన్ గోర్బచేవ్‌ను అధిగమించాడు. [283] బోరిస్ యెల్ట్‌సిన్‌కు ప్రజాదరణ ఎందుకు పెరుగుతోందో గోర్బచేవ్‌కు అర్థం కాలేదు. "అతడు చేప లాగా తాగుతాడు... అర్థం పర్థం లేకుండా వాగుతాడు, అరిగిపోయిన రికార్డు లాగా మాట్లాడతాడు" అని గోర్బచేవ్ వ్యాఖ్యానించాడు [289] రష్యన్ సుప్రీం సోవియట్ ఇప్పుడు గోర్బచేవ్ నియంత్రణలో లేదు; [289] 1990 జూన్‌లో, రష్యన్ రిపబ్లిక్‌లో సోవియట్ కేంద్ర ప్రభుత్వ చట్టాలపై స్థానిక చట్టాలదే ప్రాథమ్యత అని రష్యన్ రిపబ్లిక్‌ ప్రకటించింది. [290] రష్యన్ జాతీయవాద భావన పెరుగుతూ ఉన్న ఆ సమయంలో, సోవియట్ యూనియన్‌ కమ్యూనిస్ట్ పార్టీ శాఖగా రష్యన్ సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్ కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడానికి గోర్బచేవ్ అయిష్టంగానే సమ్మతించాడు. జూన్లో జరిగిన దాని మొదటి కాంగ్రెసుకు గోర్బచేవ్ హాజరయ్యాడు. కాని అతడి సంస్కరణవాద వైఖరిని వ్యతిరేకించిన అతివాదులే అక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు త్వరలోనే అతడు గ్రహించాడు.[291]

జర్మన్ పునరేకీకరణ, ఇరాక్ యుద్ధం

1990 జనవరిలో, పశ్చిమ జర్మనీతో తూర్పు జర్మనీ పునరేకీకరణకు గోర్బచేవ్ ప్రైవేటుగా అంగీకరించాడు, కాని పశ్చిమ జర్మనీకి ఉన్న నాటో సభ్యత్వంలో ఏకీకృత జర్మనీ కొనసాగుతుందనే ఆలోచనను తిరస్కరించాడు. [292] రాజీ మార్గంగా, నాటో, వార్సా ఒప్పందం రెండిట్లోనూ ఏకీకృత జర్మనీకి సభ్యత్వం ఉండాలని గోర్బచేవ్ ప్రతిపాదించాడు గానీ, ఆ ఆలోచనకు ఎవరూ పెద్దగా మద్దతు ఇవ్వలేదు. [293] 1990 మేలో, అధ్యక్షుడు బుష్‌తో చర్చల కోసం గోర్బచేవ్ అమెరికా వెళ్ళాడు. అక్కడ, స్వతంత్ర జర్మనీకి దాని అంతర్జాతీయ పొత్తులను ఎంచుకునే హక్కు ఉంటుందని అతడు అంగీకరించాడు. [293] తాను అందుకు అంగీకరించడానికి కారణం, నాటో దళాలను తూర్పు జర్మనీకి పంపించమని, సైనిక కూటమి తూర్పు ఐరోపాలోకి విస్తరించదనీ అమెరికా విదేశాంగ కార్యదర్శి జేమ్స్ బేకర్ వాగ్దానం చేసినందునేనని గోర్బచేవ్ తరువాత వెల్లడించాడు. [294] ప్రైవేటుగా, బేకర్ ఇచ్చిన హామీలను విస్మరించి బుష్, నాటో విస్తరణను ముందుకు తీసుకెళ్ళాడు. [295] సోవియట్ మిలిటరీ, బహుశా గోర్బచేవ్‌కు తెలియకుండా, జీవాయుధాల తయారీని చేపట్టిందనీ, ఇది 1987 నాటి జీవాయుధాల కన్వెన్షన్ ఉల్లంఘన అనీ అమెరికా ఈ పర్యటనలో గోర్బచేవ్‌కు చెప్పింది. [296] జూలైలో, హెల్ముట్ కోల్ మాస్కో సందర్శించాడు. ఏకీకృత జర్మనీ నాటోలో భాగం కావడాన్ని సోవియట్ వ్యతిరేకించదని గోర్బచేవ్ అతడికి తెలియజేశాడు. [297] దేశీయంగా, గోర్బచేవ్ విమర్శకులు జాతీయ ప్రయోజనాలకు ద్రోహం చేశాడని ఆరోపించారు; [298] మరింత విస్తృతంగా, ఈస్టర్న్ బ్లాక్‌ను ప్రత్యక్ష సోవియట్ ప్రభావం నుండి దూరం కావడానికి అనుమతించాడని గోర్బచేవ్‌పై వారు కోపంగా ఉన్నారు. [299]

1990లో[permanent dead link] గోర్బచేవ్ అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌తో పదేపదే సమావేశమయ్యారు

1990 ఆగస్టులో, సద్దాం హుస్సేన్ నేతృత్వంలో ఇరాక్, కువైట్ పై దాడి చేసింది. అధ్యక్షుడు బుష్ దీనిని ఖండించడాన్ని గోర్బచేవ్ సమర్ధించాడు. ఇది సోవియట్ ప్రభుత్వంలో చాలా మంది నుండి విమర్శలను తెచ్చిపెట్టింది. వారు హుస్సేన్‌ను పెర్షియన్ గల్ఫ్‌లో కీలక మిత్రునిగా చూశారు. ఇరాక్‌లోని 9,000 మంది సోవియట్ పౌరుల భద్రత పట్ల వారు ఆందోళన చెందారు. అయినప్పటికీ ఈ సందర్భంలో ఇరాకీలు స్పష్టమైన దురాక్రమణదారులు అని గోర్బచేవ్ వాదించాడు.[300] ఇరాక్ సైన్యాన్ని కువైట్ నుండి వెళ్ళగొట్టేందుకు బలగాలను అనుమతించే ఐరాస తీర్మానాన్ని నవంబరులో సోవియట్లు ఆమోదించారు. [301] తరువాతి కాలంలో గోర్బచేవ్ దీన్ని ప్రపంచ రాజకీయాల్లో "వాటర్‌షెడ్" అని వర్ణించాడు. "అగ్రదేశాలు మొదటిసారి ఓ ప్రాంతీయ సంక్షోభంలో కలిసి పనిచేశాయి." [302] అయితే, యుఎస్ భూ దండయాత్రకు ప్రణాళికలు ప్రకటించినప్పుడు, గోర్బచేవ్ దాన్ని వ్యతిరేకించాడు. శాంతియుత పరిష్కారం కోరుకున్నాడు. [303] 1990 అక్టోబరులో గోర్బచేవ్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అతడు పొంగిపోయాడు. కానీ దానిపట్ల "మిశ్రమ భావాలు"న్నట్లు చెప్పాడు.[304] 90% సోవియట్ పౌరులు ఈ పురస్కారాన్ని ఆమోదించలేదని సర్వేలు సూచించాయి. ఇది పాశ్చాత్య అనుకూల, సోవియట్ వ్యతిరేక ప్రశంసగా చూసారు. [305]

సోవియట్ బడ్జెట్ లోటు పెరగడంతోటి, రుణాలివ్వడానికి దేశీయంగా డబ్బు మార్కెట్లు లేకపోవడంతోటీ గోర్బచేవ్ బయటి దేశాల వైపు చూపు సారించాడు. [306] సోవియట్ ఆర్థిక వ్యవస్థ మునగకుండా చూసేందుకూ, పెరెస్త్రోయికా విజయం సాధించడం కోసమూ 1991 ఏడాదంతా గోర్బచేవ్ పాశ్చాత్య దేశాలు, జపాన్ నుండి గణనీయమైన రుణాలు కోరాడు. [307] సోవియట్ యూనియన్‌ను G7 నుండి మినహాయించినప్పటికీ, 1991 జూలైలో లండన్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి గోర్బచేవ్‌ ఆహ్వానం సంపాదించాడు.[308] అక్కడ, అతడు ఆర్థిక సహాయం కోసం మళ్ళీ పిలుపునిచ్చాడు; మిట్టరాండ్, కోల్‌లు అతడికి మద్దతు ఇచ్చారు. [309] అప్పటికే పదవి నుండి దిగిపోయిన థాచర్, పాశ్చాత్య నాయకులను కూడా అంగీకరించమని కోరింది. చాలా మంది G7 సభ్యులు దానిపట్ల అయిష్టంగా ఉన్నారు. బదులుగా సాంకేతిక సహాయం అందించడానికీ, సోవియట్‌లు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల్లో పూర్తి సభ్యత్వం కంటే "ప్రత్యేక అసోసియేట్" హోదాను ఇచ్చేందుకూ వారు ప్రతిపాదించారు. గల్ఫ్ యుద్ధానికి 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిన అమెరికా, తన దేశానికి అప్పు ఇవ్వడానికి మాత్రం వెనకాడుతోందని గోర్బచేవ్ నిరాశ చెందాడు. [310] కొన్ని దేశాలు మాత్రం సానుకూలంగా స్పందించాయి; పశ్చిమ జర్మనీ 1991 మధ్య నాటికి సోవియట్ యూనియన్ కు 60 బిలియన్ డాయిష్ మార్కులు అప్పు ఇచ్చింది. [311] ఆ నెల తరువాత, బుష్ మాస్కోను సందర్శించాడు. అక్కడ అతడు, గోర్బచేవ్‌లు పది సంవత్సరాల చర్చల తరువాత, వ్యూహాత్మక ప్రమాదకర ఆయుధాల తగ్గింపు, పరిమితిపై ద్వైపాక్షిక ఒప్పందం అయిన START I పై సంతకం చేశారు.[312]

ప్రభుత్వంలో ఆగస్టు విప్లవం & సంక్షోభం

దస్త్రం:RIAN archive 845843 XXVIII Congress of the CPSU.jpg
ప్రజాదరణ[permanent dead link] క్షీణించినప్పటికీ, గోర్బచేవ్ తన 28 వ కాంగ్రెస్‌లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా తిరిగి ఎన్నికయ్యారు

జూలైలో జరిగిన 28 వ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో, అతివాదులు సంస్కరణవాదులను విమర్శించారు. కాని గోర్బచేవ్ నాలుగింట మూడొంతుల మంది ప్రతినిధుల మద్దతుతో తిరిగి పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యాడు. అతడు డిప్యూటీ జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా ఎంచుకున్న వ్లాదిమిర్ ఇవాష్కో కూడా ఎన్నికయ్యాడు.[313] ఉదారవాదులతో రాజీ కోరుతూ, గోర్బచేవ్ తన సొంత సలహాదారులతో, యెల్ట్‌సిన్ సలహాదారులతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఆర్థిక సంస్కరణ ప్యాకేజీ తయారు చెయ్యమని కోరాడు. దాని ఫలితంగా వెలుగు చూసినదే, "500 రోజులు" కార్యక్రమం. ఇది మరింత వికేంద్రీకరణకు, కొంత ప్రైవేటీకరణకూ పిలుపునిచ్చింది.[314] గోర్బచేవ్ ఈ ప్రణాళికను పెట్టుబడిదారీ విధానానికి తిరిగి రాకుండా "ఆధునిక సామ్యవాదం"గా అభివర్ణించారు. కానీ దాని గురించి చాలా సందేహాలు ఉండేవి. [315] సెప్టెంబరులో, యెల్ట్‌సిన్ ఈ ప్రణాళికను రష్యన్ సుప్రీం సోవియట్‌కు సమర్పించగా, దీనికి వారి మద్దతు లభించింది. కమ్యూనిస్ట్ పార్టీలోను, ప్రభుత్వంలోనూ చాలా మంది దీనికి వ్యతిరేకంగా హెచ్చరించారు. ఇది మార్కెట్ గందరగోళాన్ని, ప్రబలమైన ద్రవ్యోల్బణాన్ని, మున్నెన్నడూ లేనంత స్థాయిలో నిరుద్యోగాన్నీ సృష్టిస్తుందని వారు వాదించారు. [316] 500 రోజుల ప్రణాళికను వదిలేసారు. [317] దీనిపై, యెల్ట్‌సిన్ గోర్బచేవ్‌పై అక్టోబర్ ప్రసంగంలో దాడి చేశాడు. రష్యా ఇకపై సోవియట్ ప్రభుత్వానికి లోబడి ఉండడానికి అంగీకరించదని పేర్కొన్నాడు. [318]

1990 నవంబరు మధ్య నాటికి, చాలా పత్రికలు గోర్బచేవ్ రాజీనామా చేయాలని పిలుపునిచ్చాయి. అంతర్యుద్ధం ఏర్పడ వచ్చని అంచనా వేసాయి. [319] ప్రెసిడెంట్ కౌన్సిల్‌ను రద్దు చేసి, మీడియాలో గొంతు వినిపిస్తున్న ఉదారవాదులను అరెస్టు చేయాలని అతివాదులు గోర్బచేవ్‌ను కోరారు. [320] నవంబరులో, అతడు సుప్రీం సోవియట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఎనిమిది పాయింట్ల కార్యక్రమాన్ని ప్రకటించాడు. ఇందులో అధ్యక్ష మండలి రద్దు వంటి ప్రభుత్వ సంస్కరణలు ఉన్నాయి.[321] ఈ సమయానికి, మాజీ సన్నిహితులు సహాయకులూ దూరం కాగా గోర్బచేవ్ ఏకాకి అయ్యాడు. [322] యాకోవ్లెవ్ అతడి సన్నిహిత బృందం నుండి దూరం జరిగాడు. షెవర్దనడ్జే రాజీనామా చేశాడు.[323] మేధావులలో అతడి మద్దతు క్షీణిస్తోంది. [324] 1990 చివరినాటికి అతడి మద్దతు రేటింగు పడిపోయింది. [325]

1991 జనవరిలో బాల్టిక్స్‌లో, ముఖ్యంగా లిథుయేనియాలో పెరుగుతున్న అసమ్మతుల మధ్య, లిథుయేనియన్ సుప్రీం కౌన్సిల్ స్వాతంత్ర్య అనుకూల సంస్కరణలను ఉపసంహరించుకోవాలని గోర్బచేవ్ డిమాండ్ చేశారు. [326] సోవియట్ దళాలు విల్నియస్‌లో అనేక భవనాలను ఆక్రమించాయి. నిరసనకారులతో ఘర్షణ పడ్డాయి. 15 మంది నిరసనకారులు మరణించారు.[327] ఉదారవాదులు దీనికి గోర్బచేవ్‌ను బాధ్యుణ్ణి చేసి విమర్శించారు. యెల్ట్‌సిన్ అతడు రాజీనామా చెయ్యాలని పిలుపు నిచ్చాడు. [328] సైనిక చర్యకు తాను అనుమతి ఇవ్వలేదని గోర్బచేవ్ చెప్పాడు. అయితే, అతడు అనుమతి ఇచ్చాడని మిలిటరీలో కొందరు పేర్కొన్నారు; ఈ రెంటిలో ఏది నిజమో స్పష్టంగా తేలలేదు. [329] మరింత పౌర ఆందోళనలు జరుగుతాయేమోనని భయపడి, ఆ నెలలో గోర్బచేవ్ ప్రదర్శనలను నిషేధించాడు. సోవియట్ నగరాల్లో పోలీసులతో పాటు గస్తీ తిరగమని దళాలను ఆదేశించాడు. ఈ చర్య ఉదారవాదులను మరింత దూరం చేసింది. అతివాదుల మద్దతు పొందడానికేమో సరిపోలేదు.[330] యూనియన్‌ను పరిరక్షించుకోవడం కోసం, ఏప్రిల్‌లో గోర్బచేవ్, తొమ్మిది సోవియట్ రిపబ్లిక్ నాయకులతో కలిసి సంయుక్తంగా కొత్త రాజ్యాంగం ప్రకారం సమాఖ్యను పునరుద్ధరించే ఒక ఒప్పందాన్ని సిద్ధం చేసుకుందామని ప్రతిజ్ఞ చేశాడు; ఈ రిపబ్లిక్కుల్లో ఆరు-ఎస్టోనియా, లాట్వియా, లిథుయేనియా, మోల్డోవా, జార్జియా, అర్మేనియా-దీన్ని సమ్మతించలేదు.[331] ఈ అంశంపై జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 76.4% మంది యూనియన్‌కు అనుకూలంగా వోటేసారు. కాని ఎదురు తిరిగిన ఆరు రిపబ్లిక్కులూ ఈ సర్వేలో పాల్గొనలేదు.[332] కొత్త రాజ్యాంగం ఏ రూపంలో ఉండాలనే విషయమై చర్చలు జరిగాయి. గోర్బచేవ్, యెల్ట్‌సిన్‌లు మళ్ళీ చర్చ కోసం ఒకచోట చేరారు; ఆగస్టులో అధికారికంగా సంతకం చేయడానికి ప్రణాళిక చేసారు. [333]

వైట్[permanent dead link] హౌస్ చుట్టుపక్కల పదివేల తిరుగుబాటు వ్యతిరేక నిరసనకారులు

ఆగస్టులో గోర్బచేవ్, క్రిమియాలోని ఫోరోస్‌ లోని "జర్యా" ('డాన్') అనే తన డాచాలో కుటుంబంతో సహా సెలవులు గడిపాడు.[334] సెలవులు రెండు వారాల గడిచాక, సీనియరు కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖుల బృందం-"గ్యాంగ్ ఆఫ్ ఎయిట్" - సోవియట్ యూనియన్‌ను స్వాధీనం చేసుకోవడానికి తిరుగుబాటు చేసింది. [335] అతడి డాచాకు ఫోన్ లైన్లు కత్తిరించారు. బోల్డిన్, షెనిన్, బక్లానోవ్, జనరల్ వరేన్నికోవ్‌లతో సహా ఒక బృందం అక్కడికి వచ్చి, దేశాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అతడికి తెలియజేసింది.[336] అధికారికంగా దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని తిరుగుబాటు నాయకులు గోర్బచేవ్‌ను డిమాండ్ చేశారు, కాని అతడు నిరాకరించాడు. [337] గోర్బచేవ్‌ను, అతడి కుటుంబాన్నీ వారి డాచాలో గృహ నిర్బంధంలో ఉంచారు. [338] తిరుగుబాటుదారులు గోర్బచేవ్ అనారోగ్యంతో ఉన్నారనీ, అంచేత ఉపాధ్యక్షుడు యెనయేవ్ దేశ బాధ్యతలు స్వీకరిస్తారనీ బహిరంగంగా ప్రకటించారు.[339]  

అప్పటికే రష్యన్ సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్‌కు అధ్యక్షుడిగా ఉన్న బోరిస్ యెల్ట్‌సిన్, మాస్కో వైట్ హౌస్ లోపలికి వెళ్ళాడు. అతన్ని అరెస్టు చేసేందుకు దళాలు భవనం లోకి చొరబడకుండా నిరోధించడానికి పదుల సంఖ్యలో నిరసనకారులు భవనం వెలుపల గుమిగూడారు.[340] తిరుగుబాటుదారులు తనను చంపమని ఆదేశిస్తారని గోర్బచేవ్ భయపడ్డాడు. అంచేత తన కాపలాదారుల చేత డాచా చుట్టూ అడ్డంకి పెట్టించాడు.[341] అయితే, తిరుగుబాటు నాయకులు తమకు తగినంత మద్దతు లేదని గ్రహించి వారి తిరుగుబాటును ఎత్తేసారు. ఆగస్టు 21 న, వ్లాదిమిర్ క్రుచ్కోవ్, డిమిత్రి యజోవ్, ఒలేగ్ బక్లానోవ్, అనాటోలీ లుక్యానోవ్, వ్లాదిమిర్ ఇవాష్కో గోర్బచేవ్ డాచా వద్దకు వచ్చారు. [341]

ఆ సాయంత్రం గోర్బచేవ్ మాస్కోకు తిరిగి వచ్చాడు. తిరుగుబాటును అణగదొక్కడానికి సహాయం చేసినందుకు యెల్ట్‌సిన్‌కు, నిరసనకారులకూ కృతజ్ఞతలు తెలిపాడు. [342] తరువాత జరిగిన విలేకరుల సమావేశంలో, అతడు సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీని సంస్కరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. [343] రెండు రోజుల తరువాత, అతడు దాని ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు. కేంద్ర కమిటీని రద్దు చేయాలని పిలుపునిచ్చాడు.[344] తిరుగుబాటుదారుల్లో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు; ఇతరులను తొలగించారు. గోర్బచేవ్ ఆగస్టు 23 న రష్యన్ సుప్రీం సోవియట్ సమావేశానికి హాజరయ్యాడు. తిరుగుబాటుదారుల్లో చాలామందిని ఒకప్పుడు నియమించిందీ, పదోన్నతి కల్పించిందీ గోర్బచేవేనని యెల్ట్‌సిన్ ఆ సమావేశంలో అతన్ని తీవ్రంగా విమర్శించాడు. యెల్ట్‌సిన్ ఆ తరువాత రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించాడు.

పతాక దశలో పతనం

సోవియట్[permanent dead link] రిపబ్లిక్ నాయకులు బెలోవెజా ఒప్పందాలపై సంతకం చేశారు. ఇది యుఎస్ఎస్ఆర్ ను తొలగించి, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ను స్థాపించింది. 1991.

అక్టోబరు 30 న, ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతి ప్రక్రియను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా మాడ్రిడ్‌లో ఒక సమావేశం జరిగింది. దీనికి గోర్బచేవ్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమాన్ని యుఎస్, సోవియట్ యూనియన్‌లు రెండూ సహ-స్పాన్సరు చేసాయి. ఇరు దేశాల మధ్య ఇటువంటి సహకారానికి ఇది మొదటి ఉదాహరణ. అక్కడ, గోర్బచేవ్ మళ్ళీ బుష్‌ను కలిశాడు.[345] తిరిగి వెళ్ళేటప్పుడు, గోర్బచేవ్ ఫ్రాన్స్‌లో ఆగాడు. అక్కడ అతడు మిట్టరాండ్‌తో కలిసి బయోన్నే సమీపంలోని అతడి ఇంటిలో ఉన్నాడు.[346]

తిరుగుబాటు తరువాత, యెల్ట్‌సిన్ రష్యా గడ్డపై కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపా లన్నిటినీ నిలిపివేసాడు. సెంట్రల్ కమిటీ కార్యాలయాలను మూసేసాడు. స్టరాయా స్క్వేర్, రెడ్ స్క్వేర్ ల వద్ద సోవియట్ జెండాతో పాటు రష్యన్ త్రివర్ణ జెండాను ఎగరేసాడు. 1991 చివరి వారాల నాటికి, క్రెమ్లిన్‌తో సహా సోవియట్ ప్రభుత్వ అవశేషాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాడు.

దేశంలో ఐక్యతను కొనసాగించడానికి, గోర్బచేవ్ కొత్త యూనియన్ ఒప్పందం కోసం ప్రయత్నాలను కొనసాగించాడు. కాని వివిధ సోవియట్ రిపబ్లిక్కుల నాయకులు తమ ప్రజల్లో పెరుగుతున్న జాతీయవాద ఒత్తిడికి తలొగ్గడంతో యూనియన్‌ పట్ల వ్యతిరేకత పెరుగుతూ పోయింది. [347] ఏకీకృత దేశం గురించి ఏ ఆలోచన నైనా వీటో చేస్తానని యెల్ట్‌సిన్ చెప్పాడు. దాని బదులు తక్కువ అధికారం కలిగిన సమాఖ్యకు అతడు అనుకూలంగా ఉన్నాడు.[348] కజకస్తాన్, కిర్గీజియా నాయకులు మాత్రమే గోర్బచేవ్ విధానానికి మద్దతు పలికారు. [349] డిసెంబరు 1 న ఉక్రెయిన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో యూనియన్ నుండి విడిపోవడానికి 90% మంది వోటేసారు. ఇది యూనియన్‌కు తీవ్రమైన, ప్రాణాంతకమైన దెబ్బ; ఉక్రైనియన్లు స్వాతంత్ర్యాన్ని తిరస్కరిస్తారని గోర్బచేవ్ అనుకున్నాడు.[350]

గోర్బచేవ్‌కు తెలియకుండా యెల్ట్‌సిన్, డిసెంబరు 8 న ఉక్రేనియన్ అధ్యక్షుడు లియొనిద్ క్రావ్‌చుక్‌ను, బేలారష్యన్ అధ్యక్షుడు స్టానిస్లావ్ షుష్కేవిచ్‌ను బెలారస్‌లోని బెలోవెజా అడవిలో కలిసాడు. వారు బెలావిజా ఒప్పందాలపై సంతకాలు చేసారు. సోవియట్ యూనియన్‌ను రద్దు చేసినట్లు, దాని స్థానంలో కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (CIS)ని ఏర్పాటు చేసినట్లూ దానిలో ప్రకటించారు.[351] షుష్కేవిచ్ ఫోన్ చేసి చెప్పేదాకా గోర్బచేవ్‌కు ఈ సంగతి తెలియలేదు; అతడికి బాగా కోపం వచ్చింది. సోవియట్ యూనియన్‌ను రక్షించుకునే అవకాశాల కోసం వెతికాడు. మీడియా, మేధావులూ రద్దు ఆలోచనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారని అనుకున్నాడు గానీ, అది జరగలేదు. [352] ఉక్రేనియన్, బెలారష్యయన్, రష్యన్ సుప్రీం సోవియట్లు CIS స్థాపనను ఆమోదించాయి.[353] డిసెంబరు 10 న, అతడు CIS ఒప్పందం "చట్టవిరుద్ధం, ప్రమాదకరం" అని వర్ణించాడు. [354] డిసెంబరు 20 న, మిగిలిన 12 రిపబ్లిక్కుల్లోను జార్జియా తప్ప మిగతా పదకొండింటి నాయకులు అల్మా అటాలో కలిసి, అల్మా-అటా ప్రోటోకాల్ పై సంతకం చేసారు. సోవియట్ యూనియన్‌ను రద్దు చేసి, లాంఛనంగా CIS ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం ద్వారా అంగీకరించారు. అవశేష సోవియట్ యూనియన్‌కు అధ్యక్షుడిగా ఉన్న గోర్బచేవ్ రాజీనామాను వారు అంగీకరించారు. సిఐఎస్ వాస్తవ రూపం దాల్చిన వెంటనే రాజీనామా చేస్తానని గోర్బచేవ్ వెల్లడించాడు. [355] [356]

గోర్బచేవ్ నుండి సోవియట్ యూనియన్ వారస దేశాలకు అధికారాన్ని బదిలీ చేయడాన్ని పర్యవేక్షించే బాధ్యత యెల్ట్‌సిన్ కు అప్పజెప్పారు. [357] డిసెంబరు 25 న సోవియట్ అధ్యక్ష పదవికి, కమాండర్-ఇన్-చీఫ్ పదవికీ రాజీనామా చేస్తున్నట్లు గోర్బచేవ్ అధికారికంగా ప్రకటించాలని, డిసెంబరు 29 నాటికి క్రెమ్లిన్‌ను ఖాళీ చేయాలనీ యెల్ట్‌సిన్, గోర్బచేవ్‌లు ఒప్పందానికి వచ్చారు. [357] రాజీనామా ప్రసంగం రాయడంలో సాయం చేసేందుకు యాకోవ్లెవ్, చెర్నయేవ్, షెవర్దనడ్జెలు గోర్బచేవ్‌ను కలిసారు. [355] గోర్బచేవ్ క్రెమ్లిన్‌లో టెలివిజన్ కెమెరాల ముందు ప్రసంగించాడు. అది అంతర్జాతీయంగా ప్రసారమైంది.[358] అందులో, "యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అధ్యక్షుడిగా నేను నా కార్యకలాపాలను ఆపివేస్తున్నాను" అని అతడు ప్రకటించాడు. సోవియట్ యూనియన్ విడిపోయినందుకు విచారం వ్యక్తం చేశాడు. కాని తన ప్రభుత్వం సాధించిన విజయాలైన రాజకీయ, మత స్వేచ్ఛ, నిరంకుశత్వానికి ముగింపు, ప్రజాస్వామ్యం, మార్కెట్ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టడం, ఆయుధ పోటీకి, ప్రచ్ఛన్న యుద్ధానికీ ముగింపు వంటివాటిని ఏకరువు పెట్టాడు. [359] కృశ్చేవ్, ఆ తరువాత గోర్బచేవ్ - ఈ ఇద్దరే పదవిలో ఉండగా మరణించని సోవియట్ నాయకులు. [360] [361] సోవియట్ యూనియన్, అధికారికంగా 1991 డిసెంబరు 31 అర్ధరాత్రి నుండి ఉనికి కోల్పోయింది. [362]

అధికారానంతరం

తొలినాళ్ళు: 1991-1999

1992లో[permanent dead link] రాంచో డెల్ సిలోలో పాశ్చాత్య దుస్తులలో రీగన్‌, గోర్బచేవ్.

పదవినుండి తప్పుకున్నాక, భార్యతో, కుటుంబ సభ్యులతో గడపడానికి గోర్బచేవ్‌కు చాలా సమయం దొరికింది. [363] అతడు, రైసా మొదట్లో రుబ్లెవ్స్కో షోస్సేలో శిథిలమైన డాచాలో నివసించారు. అయితే, కోసిగిన్ వీధిలోని వారి చిన్న అపార్ట్మెంటును ప్రైవేటీకరించడానికి అనుమతించారు. [363] అతడు 1992 మార్చిలో ప్రారంభించిన తన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ సోషియో-ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్టడీస్ లేదా "గోర్బచేవ్ ఫౌండేషన్"ను నిలబెట్టడంపై దృష్టి పెట్టాడు;[364] యాకోవ్లెవ్, గ్రిగరీ రెవెంకో దానికి మొదటి ఉపాధ్యక్షులు. [365] పెరెస్త్రోయికా చరిత్రపై విషయాలను విశ్లేషించడం, ప్రచురించడం ఈ ఫౌండేషను చేపట్టిన తొలి పనులు. అలాగే "అపవాదుల నుండి, అపార్థాల నుండి" పెరెస్త్రోయికాను కాపాడి సమర్ధించడం కూడా. సోవియట్ అనంతర రష్యాలో జీవితాన్ని పరిశీలించడం, విమర్శించడం, యెల్ట్‌సిన్ అనుసరించిన విధానాలకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి రూపాలను అందించే పనిని కూడా ఈ ఫౌండేషన్ స్వీకరించింది. [365] 1993 లో, గోర్బచేవ్ గ్రీన్ క్రాస్ ఇంటర్నేషనల్ ను ప్రారంభించాడు, ఇది స్థిరమైన భవిష్యత్తులను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టింది. ఆపై ప్రపంచ రాజకీయ ఫోరం అనే సంస్థను కూడా ప్రారంభించాడు. [366]

తన సంస్థకు ధన సమీకరణ చేసేందుకు గోర్బచేవ్, అంతర్జాతీయంగా ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించాడు. దానికి పెద్ద ఫీజులే వసూలు చేశాడు. [365] జపాన్ సందర్శనలో అతడికి మంచి ఆదరణ లభించింది. చాలానే గౌరవ డిగ్రీలు పొందాడు. [367] 1992 లో, ఫౌండేషన్ కోసం డబ్బును సేకరించడానికి ఫోర్బ్స్ వారి ప్రైవేట్ జెట్‌లో అమెరికాలో పర్యటించాడు. ఈ పర్యటనలో అతడు రీగన్‌ను కలిశాడు. [367] అక్కడ నుండి అతడు స్పెయిన్‌కు వెళ్ళి, సెవిల్లెలో జరిగిన ఎక్స్‌పో '92 ప్రపంచ ఉత్సవానికి హాజరయ్యాడు. అతడి స్నేహితుడిగా మారిన ప్రధాన మంత్రి ఫెలిపే గొంజాలెజ్‌తో కూడా కలిశాడు. [368] మార్చిలో, అతడు జర్మనీ సందర్శించాడు. అక్కడ చాలామంది రాజకీయ నాయకులు అతణ్ణి హృదయపూర్వకంగా ఆహ్వానించారు. జర్మన్ పునరేకీకరణను సులభతరం చేయడంలో అతడి పాత్రను వారు ప్రశంసించారు. [369] తన ఉపన్యాస రుసుము, పుస్తక అమ్మకాలకు అనుబంధంగా, గోర్బచేవ్ పిజ్జా హట్, లూయిస్ విట్టన్ వంటి సంస్థల కోసం వ్యాపార ప్రకటనల్లో కనిపించాడు. తద్వారా తన ఫౌండేషనుకు అవసరమైన ధనాన్ని సమకూర్చుకోగలిగాడు. [370] [361] తన భార్య సహాయంతో, గోర్బచేవ్ తన జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసాడు. ఇవి 1995 లో రష్యన్ భాషలోను, మరుసటి సంవత్సరంలో ఇంగ్లీషు లోనూ ప్రచురించారు.[371] ది న్యూయార్క్ టైమ్స్ కోసం నెలవారీ సిండికేటెడ్ కాలమ్ కూడా రాయడం ప్రారంభించాడు. [372]

ప్రజాస్వామ్య సంస్కరణలు చేపట్టిన యెల్ట్‌సిన్‌ను విమర్శించకుండా ఉంటానని గోర్బచేవ్ వాగ్దానం చేసాడు. కానీ కొద్ది కాలం లోనే, ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకోవడం మొదలైంది. [373] ధరలపై పరిమితులను ఎత్తేయాలనే యెల్ట్‌సిన్ నిర్ణయం తరువాత ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. అనేక మంది రష్యన్లు పేదరికంలో కూరుకుపోయారు. గోర్బచేవ్ దాన్ని బహిరంగంగా విమర్శిస్తూ, దాన్ని స్టాలిన్ చేపట్టిన బలవంతపు సామాజికీకరణతో పోల్చాడు. [373] 1993 శాసనసభ ఎన్నికలలో యెల్ట్‌సిన్ అనుకూల పార్టీలకు ప్రజల మద్దతు లభించనపుడు, అతడు రాజీనామా చేయాలని గోర్బచేవ్ డిమాండు చేసాడు. [374] 1995 లో అతడి ఫౌండేషన్ "ది ఇంటెలిజెన్షియా అండ్ పెరెస్త్రోయికా" పై ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం లోనే యెల్ట్‌సిన్ రూపొందించిన 1993 నాటి రాజ్యాంగం అధ్యక్షుడికి ఇచ్చిన అనేక అధికారాలను తగ్గించాలనే ప్రతిపాదనను డ్యూమాకు (రష్యా పార్లమెంటు) చేసాడు. [375] గోర్బచేవ్ పెరెస్త్రోయికాను సమర్ధించుకోవడం కొనసాగించాడు. కాని తాను సోవియట్ నాయకుడిగా ఉండగా కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేశానని అంగీకరించాడు. [366] రష్యా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉందని అతడు ఇంకా నమ్ముతూనే ఉన్నప్పటికీ, అతడు ఇంతకుముందు అనుకున్నట్లుగా, సంవత్సరాలు కాకుండా దశాబ్దాలు పడుతుందని అతడు తేల్చిచెప్పాడు. [376]

భార్య[permanent dead link] రైసా అంత్యక్రియల్లో గోర్బచేవ్, కుమార్తె ఇరినా, భార్య సోదరి ల్యుద్మీలా. 1999

రష్యా అధ్యక్ష ఎన్నికలు 1996 జూన్‌లో జరపాలని తలపెట్టారు. అతడి భార్య, అతడి స్నేహితులు చాలా మంది అతన్ని పోటీ చేయవద్దని కోరినప్పటికీ, గోర్బచేవ్ పోటీ చేయాలనే నిర్ణయించుకున్నాడు. [377] ఈ ఎన్నికలు యెల్ట్‌సిన్‌కు రష్యన్ ఫెడరేషన్ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అయిన జెన్నడీ జుగనోవ్ కూ మధ్య ద్వంద్వ యుద్ధం అవుతుందనే సంగతి గోర్బచేవ్‌కు నచ్చలేదు. నామినేషనుకు అవసరమైన పది లక్షల సంతకాలను పొందిన తరువాత, మార్చిలో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాడు. [378] తన ప్రచారాన్ని ప్రారంభిస్తూ, అతడు ఇరవై నగరాల్లో ర్యాలీలు చేస్తూ పర్యటించాడు. [378] అతడు గోర్బచేవ్-వ్యతిరేక నిరసనకారులను పదేపదే ఎదుర్కొన్నాడు. అయితే కొంతమంది యెల్ట్‌సిన్-అనుకూల అధికారులు అతడి ప్రచారాన్ని కవర్ చేయకుండా స్థానిక మీడియాను నిషేధించడం ద్వారా, వేదికలకు ప్రవేశం నిరాకరించడం ద్వారా అతడి ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. [379] ఎన్నికలలో, గోర్బచేవ్ 3,86,000 ఓట్లు పొంది (0.5%) ఏడవ స్థానంలో నిలిచాడు. [380] యెల్ట్‌సిన్, జుగనోవ్ రెండవ రౌండుకు వెళ్ళారు, అక్కడ యెల్ట్‌సిన్ విజయం సాధించాడు. [380]

ఓవైపు భర్త రాజకీయ ప్రయత్నాలు చేస్తోంటే,అందుకు భిన్నంగా రైసా, పిల్లల స్వచ్ఛంద సంస్థల కోసం ప్రచారం చేయడంపై దృష్టి సారించింది. [381] రష్యాలో మహిళల సంక్షేమం మెరుగుపరచడంపై దృష్టి పెట్టడానికి ఆమె గోర్బచేవ్ ఫౌండేషన్‌లో రైసా మాక్సిమొవ్నా క్లబ్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. [382] ఫౌండేషన్ మొదట మాజీ సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ భవనంలో ఉండేది. కాని అక్కడ దానికి అందుబాటులో ఉండే గదుల సంఖ్యకు యెల్ట్‌సిన్ పరిమితులు పెట్టాడు; [383] అమెరికన్ దాత టెడ్ టర్నర్ లెనిన్‌గ్రాడ్‌స్కీ ప్రాస్పెక్ట్‌లో కొత్త ప్రాంగణాన్ని నిర్మించుకోడానికి ఫౌండేషన్‌కు 10 లక్షల డాలర్లకు పైగా విరాళం ఇచ్చాడు. [384] 1999 లో, గోర్బచేవ్ తన మొదటి ఆస్ట్రేలియా పర్యటన చేసాడు, అక్కడ అతడు ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించాడు. [385] కొంతకాలం తర్వాత, జూలైలో, రైసాకు లుకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. జర్మన్ ఛాన్సలర్ గెర్హార్డ్ ష్రోడర్ సహాయంతో, ఆమెను జర్మనీలోని మున్స్టర్‌లోని క్యాన్సర్ కేంద్రానికి బదిలీ చేశారు. అక్కడ ఆమెకు కీమోథెరపీ చేసారు. [386] సెప్టెంబరులో ఆమె కోమాలోకి వెళ్ళి మరణించింది. [172] రైసా గతించిన తరువాత, కుమార్తె ఇరినా, ఇద్దరు మనవరాళ్ళు గోర్బచేవ్‌తో నివసించడానికి మాస్కో ఇంటికి వెళ్లారు. [387] జర్నలిస్టులను ప్రశ్నించినప్పుడు, తాను ఎప్పటికీ తిరిగి వివాహం చేసుకోనని చెప్పాడు. [372]

పుతిన్ రష్యాలో సామాజిక ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం: 1999-2008

గోర్బచేవ్[permanent dead link] 2000 మేలో వ్లాదిమిర్ పుతిన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు

1999 డిసెంబరులో, యెల్ట్‌సిన్ రాజీనామా చేసాడు. అతడి డిప్యూటీ వ్లాదిమిర్ పుతిన్ 2000 మార్చి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాడు. [388] గోర్బచేవ్ మేలో పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యాడు. 1991 తరువాత అతడు క్రెమ్లిన్‌లోకి ప్రవేశించడం అదే మొదటిసారి. [389] మొదట్లో గోర్బచేవ్ పుతిన్ ఎదుగుదలను స్వాగతించాడు. అతన్ని యెల్ట్‌సిన్ వ్యతిరేక వ్యక్తిగా చూశాడు. [366] పుతిన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలకు వ్యతిరేకంగా గోర్బచేవ్ మాట్లాడినప్పటికీ, కొత్త ప్రభుత్వంపై ప్రశంసలు కూడా కురిపించాడు; 2002 లో అతడు "ఒకప్పుడు నేనూ అతడున్న పరిస్థితిలోనే ఉన్నాను. అందుకనే [పుతిన్] చేసిన పని మెజారిటీ ప్రయోజనాల కోసమేనని నేను చెప్పగలుగుతున్నాను" అని అన్నాడు. [390] ఆ సమయంలో, పుతిన్ నిబద్ధత కలిగిన ప్రజాస్వామ్యవాది అని అతడు నమ్మాడు. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి, యెల్ట్‌సిన్ శకం తరువాత దేశాన్ని పునర్నిర్మించడానికీ "ఒక నిర్దిష్ట మోతాదు అధికారాన్ని" ఉపయోగించాల్సి వచ్చిందని భావించాడు. [389] పుతిన్ కోరిక మేరకు, గోర్బచేవ్ ఉన్నత స్థాయి రష్యన్లు, జర్మన్ల మధ్య "పీటర్స్‌బర్గ్ డైలాగ్" ప్రాజెక్టుకు సహ-అధ్యక్షుడయ్యాడు. [388]

2000 లో రష్యన్ యునైటెడ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించడంలో గోర్బచేవ్ తోడ్పడ్డాడు. [391] 2002 జూన్‌లో, అతడు పుతిన్‌తో ఒక సమావేశంలో పాల్గొన్నపుడు అతడు ఈ పనిని ప్రశంసించాడు. మధ్య-వామ పార్టీ రష్యాకు మంచిదనీ, దానితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉంటాననీ పుతిన్ సూచించాడు. [390] 2003 లో, గోర్బచేవ్ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీతో విలీనమై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యాను ఏర్పాటు చేసింది. [391] ఇది చాలా అంతర్గత వైరుధ్యాలను ఎదుర్కొంది. ఓటర్ల అభిమానం పొందడంలో విఫలమైంది.[391] 2003 ఎన్నికల ప్రచారంలో తీసుకున్న దిశపై పార్టీ ఛైర్మన్‌తో విభేదించిన గోర్బచేవ్ 2004 మేలో పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశాడు. మెజారిటీ రష్యన్ ప్రాంతాలలో కనీసం 500 మంది సభ్యులతో స్థానిక కార్యాలయాలను స్థాపించడంలో విఫలమైన కారణంగా 2007 లో రష్యన్ ఫెడరేషన్ సుప్రీంకోర్టు పార్టీని నిషేధించింది. రష్యాలో ఒక రాజకీయ సంస్థ, పార్టీగా నమోదు కావాలంటే ఇది తప్పనిసరి.[361] ఆ సంవత్సరం తరువాత, గోర్బచేవ్ ఒక కొత్త ఉద్యమాన్ని స్థాపించారు - యూనియన్ ఆఫ్ సోషల్ డెమొక్రాట్స్. ఇది రాబోయే ఎన్నికలలో పోటీ చేయదని పేర్కొన్న గోర్బచేవ్ ఇలా ప్రకటించాడు: "మేము అధికారం కోసం పోరాడుతున్నాం, కానీ ప్రజల మనస్సులపై అధికారం కోసం మాత్రమే".[392]

పుతిన్ పట్ల అమెరికా శత్రుత్వం వహించడాన్ని గోర్బచేవ్ విమర్శించాడు. అమెరికా ప్రభుత్వానికి "రష్యా ప్రపంచ శక్తిగా ఎదగడం" ఇష్టం లేదని, "ప్రపంచానికి ఏకైక సూపర్ పవర్‌గా తానే కొనసాగాలని" కోరుకుంటోందనీ వాదించాడు. [393] ప్రచ్ఛన్న యుద్ధం తరువాత అమెరికా అవలంబిస్తున్న విధానాన్ని గోర్బచేవ్ విమర్శించాడు. పశ్చిమ దేశాలు "[రష్యా] ను ఒక రకమైన బ్యాక్ వాటర్ గా మార్చడానికి" ప్రయత్నించాయని వాదించారు. [394] ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా "గెలిచింది" అని బుష్ వ్యక్తం చేసిన ఆలోచనను అతడు తిరస్కరించాడు. సంఘర్షణను అంతం చేయడానికి ఇరు పక్షాలు సహకరించుకున్నాయని వాదించాడు. [394] సోవియట్ యూనియన్ పతనం తరువాత అమెరికా, రష్యాతో సహకరించడం కంటే, "తమ నేతృత్వంలో కొత్త సామ్రాజ్యాన్ని" నిర్మించడానికి కుట్ర పన్నారని అతడు పేర్కొన్నాడు. [395] నాటోను విస్తరించమని ముందు చేసిన వాగ్దానాలను విస్మరించిన అమెరికా, రష్యా సరిహద్దుల వరకు నాటోను ఎలా విస్తరించిందో ఉదహరిస్తూ, అమెరికా ప్రభుత్వాన్ని విశ్వసించలేమనడానికి ఇది సాక్ష్యంగా పేర్కొన్నాడు. [394] [396] 1999 లో యుగోస్లేవియాపై NATO చేసిన బాంబుదాడి, 2003 ఇరాక్ అక్రమణ లకు ఐరాస మద్దతు లేదని చెబుతూ అమెరికా చర్యలను విమర్శించాడు. [394] 2004 జూన్‌లో రీగన్ అధికారిక అంత్యక్రియలకు గోర్బచేవ్ హాజరయ్యాడు .[397] 2007 లో కత్రినా హరికేన్ వల్ల కలిగే నష్టాన్ని చూడటానికి న్యూ ఆర్లియన్స్ సందర్శించారు.[398]

పుతిన్ పై పెరుగుతున్న విమర్శలు, విదేశాంగ విధానంపై వ్యాఖ్యలు: 2008–

అధ్యక్షుడిగా వరుసగా రెండుసార్లకుమించి పనిచేయకుండా రాజ్యాంగం నిషేధించినందున పుతిన్ 2008 లో దిగిపోయాడు. అతడి ప్రధానమంత్రి డిమిత్రి మెద్వెదేవ్ అధ్యక్షుడయ్యాడు. పుతిన్ లాగా కాకుండా అతడు గోర్బచేవ్‌తో సఖ్యత చేసుకున్నాడు. [393] 2008 సెప్టెంబరులో గోర్బచేవ్, వ్యాపార వేత్త అలెగ్జాండర్ లెబెదేవ్ లు తాము ఇండిపెండెంట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యాను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.[399] పార్టీని స్థాపించడం తప్పదని 2009 మేలో గోర్బచేవ్ ప్రకటించాడు.[400] 2008 లో రష్యా, దక్షిణ ఒస్సేటియన్ వేర్పాటువాదులు ఒక వైపున, జార్జియా మరోవైపునా, యుద్ధం మొదలైనపుడు జార్జియా అధ్యక్షుడు మిఖైల్ సాకాష్విలికి అమెరికా మద్దతు ఇవ్వడాన్ని గోర్బచేవ్ వ్యతిరేకించాడు. కాకసస్‌ ప్రాంతాన్ని తమ జాతీయ ఆసక్తి అంశంగా భావించడాన్ని విమర్శించాడు.[401][402] అయితే, గోర్బచేవ్ రష్యా ప్రభుత్వంపై విమర్శలను కొనసాగించాడు. 2011 పార్లమెంటు ఎన్నికలను పాలక పార్టీ యునైటెడ్ రష్యాకు అనుకూలంగా రిగ్గింగు చేసారని విమర్శించాడు. ఎన్నికలను తిరిగి నిర్వహించాలని పిలుపునిచ్చారు. [403] ఎన్నికలపై మాస్కోలో నిరసనలు వెల్లువెత్తిన తరువాత, గోర్బచేవ్ నిరసనకారులను ప్రశంసించాడు. [403]

గోర్బచేవ్[permanent dead link] (కుడి) ను US అధ్యక్షుడు బరాక్ ఒబామాకు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ పరిచయం చేశారు, 2009 మార్చి

2009 లో గోర్బచేవ్ తన దివంగత భార్యకు అంకితం చేసిన స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించడానికి సాంగ్స్ ఫర్ రైసా అనే రష్యన్ రొమాంటిక్ బల్లాడ్స్ ఆల్బమ్‌ను సంగీతకారుడు ఆండ్రీ మకరేవిచ్‌తో కలిసి గోర్బచేవ్ పాడాడు.[404] ఆ సంవత్సరం అమెరికా-రష్యా సంబంధాలను "పునస్థాపించే" చేసే ప్రయత్నాలలో భాగంగా, అతడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకున్నాడు.[405] బెర్లిన్ గోడ పతనం యొక్క ఇరవయ్యవ వార్షికోత్సవం సందర్భంగా బెర్లిన్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు.[406] 2011 లో, అతడి కోసం ఎనభయ్యవ పుట్టినరోజు వేడుక లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగింది. ఇందులో షిమోన్ పెరెస్, లెచ్ వలేసా, మిచెల్ రోకార్డ్, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఆదాయం రైసా గోర్బచేవ్ ఫౌండేషన్‌కు వెళ్ళింది. [407] ఆ సంవత్సరం, మెద్వెదేవ్ అతడికి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్-కాల్డ్ అవార్డును ప్రదానం చేశాడు. [403]

2012 లో, పుతిన్ తాను మళ్ళీ అధ్యక్షుడిగా నిలబడుతున్నానని ప్రకటించాడు. గోర్బచేవ్ దీన్ని విమర్శించాడు. [408] [361][409]

గోర్బచేవ్ ఆరోగ్యం బాగా లేదు; 2011 లో అతడికి వెన్నెముక ఆపరేషను, 2014 లో నోటి శస్త్రచికిత్స జరిగింది. [403] విపరీతంగా చేసే తన అంతర్జాతీయ ప్రయాణాలను గోర్బచేవ్ 2015 లో నిలిపివేసాడు. [410] అతడు రష్యాను, ప్రపంచాన్నీ ప్రభావితం చేసే సమస్యలపై మాట్లాడటం కొనసాగించాడు. 2014 లో, క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడానికి దారితీసిన క్రిమియన్ హోదా ప్రజాభిప్రాయ సేకరణను అతడు సమర్థించాడు. [394] 1954 లో క్రిమియాను రష్యా నుండి ఉక్రెయిన్‌కు బదిలీ చేసినపుడు, ఆ రెండూ సోవియట్ యూనియన్‌లో భాగమై ఉండగా, క్రిమియన్ ప్రజలను ఆ సమయంలో అడగలేదు. అయితే 2014 ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలను అడిగారు.[411] స్వాధీనం ఫలితంగా రష్యాపై ఆంక్షలు విధించినపుడు, గోర్బచేవ్ వాటికి వ్యతిరేకంగా మాట్లాడాడు.[412] అతడి వ్యాఖ్యల వలన ఉక్రెయిన్ అతన్ని ఐదేళ్లపాటు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది.[413]

రష్యా ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే విజయం సాధిస్తుంది. రాజకీయ పోటీకి రష్యా సిద్ధంగా ఉంది - సిసలైన బహుళ పార్టీ వ్యవస్థ, స్వేచ్ఛా ఎన్నికలు, ప్రభుత్వాల మార్పిడి వగైరాలతో. అధ్యక్షుడి పాత్ర, బాధ్యతలను ఇది నిర్వచించాలి.

— గోర్బచేవ్, 2017[414]

2014 నవంబరులో బెర్లిన్ గోడ పతనానికి 25 సంవత్సరాలు నిండిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న కార్యక్రమంలో, డాన్బాస్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచాన్ని కొత్త ప్రచ్ఛన్న యుద్ధం అంచుకు తీసుకువచ్చిందని గోర్బచేవ్ హెచ్చరించాడు. పాశ్చాత్య శక్తులు, ముఖ్యంగా అమెరికా, రష్యా పట్ల "విజయగర్వ" వైఖరి వహించినందుకు విమర్శించాడు.[415][416] ఓవైపు నాటోకు, రష్యాకూ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూంటే, తూర్పు ఐరోపా లోకి ఎక్కువ మంది సైనికులను మోహరిస్తున్నదని గోర్బచేవ్ 2016 జూలైలో విమర్శించాడు.[417] 1987 నాటి ఇంటర్మీడియట్-రేంజ్ అణు దళాల ఒప్పందం నుండి వైదొలగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడాన్ని అక్టోబర్లో విమర్శించాడు. ఈ చర్య "బుర్రున్నవాడు చేసే పని కాదు" అని అన్నాడు. అయినప్పటికీ, 2018 జూన్‌లో పుతిన్, ట్రంప్ ల మధ్య జరిగిన 2018 రష్యా-యునైటెడ్ స్టేట్స్ శిఖరాగ్ర సమావేశాన్ని అతడు స్వాగతించాడు.[418] అతడు మాట్లాడుతూ: "అణ్వాయుధ నిరాయుధీకరణ, అణ్వాయుధాల పరిమితిని లక్ష్యంగా చేసుకున్న అన్ని ఒప్పందాలు భూమిపై జీవం కొరకు భద్రపరచాలి." [419]

రాజకీయ భావజాలం

పదవి నుండి దిగిపోక ముందే గొర్బచేవ్ ఓ రకంగా సోషల్ డెమోక్రాట్‌గా మారాడు —అతడే తరువాత చెప్పినట్టు, అవకాశాల్లో సమానత్వం, విద్య, ఆరోగ్యాల్లో ప్రభుత్వ మద్దతు, కనీస సంక్షేమ కార్యక్రమాలు, సోషలిస్టు మార్కెట్ ఆర్థికవ్యవస్థ—అన్నీ ప్రజాఅస్వామ్య రాజకీయ వ్యవస్థలో అంతర్భాగంగా. ఈ పరివర్తన సరిగ్గా ఎప్పుడు జరిగిందో చెప్పడం కష్టం, కానీ కచ్చితంగా 1989, 1990 నాటికి మాత్రం జరిగింది.

— గోర్బచేవ్ జీవితచరిత్రకారుడు విలియమ్ టౌబ్మాన్, 2017[391]

1950 ల ప్రారంభంలో విశ్వవిద్యాలయంలో గోర్బచేవ్ మిత్రుడు జెడ్నెక్ మ్లినే ప్రకారం "ఆ సమయంలో అందరిలాగే గోర్బచేవ్ కూడా స్టాలినిస్టే." [420] అయితే, ఇతర సోవియట్ విద్యార్థుల మాదిరిగా కాకుండా, గోర్బచేవ్ మార్క్సిజాన్ని "బట్టీ పట్టాల్సిన సిద్ధాంతాల సమాహారం"గా చూడలేదని మ్లినే గుర్తించాడు. [421] స్టాలిన్ మరణం తరువాత, గోర్బచేవ్ "భావజాలం మళ్ళీ సిద్ధాంతపరమైన పిడివాదం" నుండి వైదొలగాడని జీవితచరిత్రకారులు డోడర్, బ్రాన్సన్ అన్నారు. [422] కానీ అతడికి సోవియట్ వ్యవస్థలో "ఒక నిజమైన విశ్వాసం" ఉంది. [423] 1986 లో జరిగిన ఇరవై-ఏడవ పార్టీ కాంగ్రెస్‌లో, గోర్బచేవ్ ఒక సనాతన మార్క్సిస్ట్-లెనినిస్ట్‌గా కనిపించాడని డోడర్, బ్రాన్సన్ అన్నారు; [424] ఆ సంవత్సరం, జీవిత చరిత్ర రచయిత జోర్స్ మెద్వెదేవ్ "గోర్బచేవ్ ఉదారవాదీ కాడు, ధైర్యమున్న సంస్కరణవాదీ కాడు" అని పేర్కొన్నాడు. [425]

1980 ల మధ్య, గోర్బచేవ్ అధికారం చేపట్టే నాటికి, సోవియట్ యూనియన్ మూడవ ప్రపంచ దేశ స్థాయికి పడిపోతోందని చాలా మంది విశ్లేషకులు అనేవారు. [426] ఈ సందర్భంలో, కమ్యూనిస్ట్ పార్టీ సృజనాత్మకంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలని గోర్బచేవ్ అన్నాడు. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ రచనలను లెనిన్ 20 వ శతాబ్దం తొలినాళ్ళలో రష్యా పరిస్థితికి అన్వయించడాన్ని ఉదాహరణగా చూపించాడు. [427] ఉదాహరణకు, లెనినిస్టు రాజకీయాల్లో భాగంగా ఉన్న ప్రపంచ విప్లవం, బూర్జువాను పడగొట్టడం వంటివి అణు యుద్ధం మానవాళిని నిర్మూలించగల ప్రస్తుత యుగంలో మాట్లాడడం చాలా ప్రమాదకరం. [428] అతడు వర్గ పోరాటమే రాజకీయ మార్పును నడిపించే ఇంజనని భావించే మార్క్సిస్ట్-లెనినిస్ట్ నమ్మకం నుండి దూరం జరిగాడు; అన్ని వర్గాల ప్రయోజనాలను సమన్వయం చేసే మార్గమే రాజకీయాలని అతడు భావించాడు. [429] అయినప్పటికీ, గూడింగ్ గుర్తించినట్లుగా, గోర్బచేవ్ ప్రతిపాదించిన మార్పులు "మార్క్సిస్ట్-లెనినిస్ట్ భావజాలంలోనే పూర్తిగా వ్యక్తీకరించబడ్డాయి". [430]

డోడర్, బ్రాన్సన్ ప్రకారం, గోర్బచేవ్ "స్వదేశంలో వారసత్వ సైనిక సమాజాన్ని కూల్చివేయాలని, విదేశాలలో ఆడంబరమైన, ఖరీదైన, సామ్రాజ్యవాదాన్ని తొలగిపోవాలని" కోరుకున్నాడు. [431] అయితే, బాల్టిక్ దేశాలు స్వాతంత్ర్యాన్ని ఎందుకు కోరుకుంటున్నాయో అతడు అర్థం చేసుకోలేదు. "హృదయాంతరాళాల్లో ఒకప్పుడు అతడొక రష్యన్ సామ్రాజ్యవాది, ఇప్పుడూ అంతే" అని జోనాథన్ స్టీల్ వాదించాడు. [432] గోర్బచేవ్ "ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాడు" అని గూడింగ్ భావించాడు. ఇది అతడికి తన పూర్వీకుల కంటే విభిన్నమైన గుర్తింపు ఇచ్చింది.. [433] అధికారంలో ఉన్నప్పుడు, గోర్బచేవ్ సోషలిజాన్ని కమ్యూనిజం మార్గంలో ఒక ప్రదేశంగా కాకుండా, ఒక గమ్యస్థానంగా చూడాలని సూచించాడని కూడా గూడింగ్ అన్నాడు. [434]

గోర్బచేవ్[permanent dead link], 1987 లో

గోర్బచేవ్ స్టావ్రోపోల్‌లో పార్టీ అధికారిగా పనిచేసిన 23 సంవత్సరాల్లో అతడి రాజకీయ దృక్పథం రూపుదిద్దుకుంది. [435] ప్రధాన కార్యదర్శి అయ్యే ముందు వరకూ, "బహిరంగంగా అతడు వెలిబుచ్చిన అభిప్రాయాల్లో, ఒక రాజకీయవేత్త ఏం చెప్పాలో అవే చెప్పాడు గానీ, తన వ్యక్తిగత భావాలేంటో చెప్పలేదు.". లేకపోతే రాజకీయాల్లో మనగలిగి ఉండేవాడు కాదు. అని డోడర్, బ్రాన్సన్ లు అన్నారు. [436] చాలా మంది రష్యన్‌ల మాదిరిగానే, గోర్బచేవ్ కొన్నిసార్లు సోవియట్ యూనియన్‌ను రష్యాకు పర్యాయపదంగా భావించాడు. వివిధ ప్రసంగాలలో దీనిని "రష్యా" అని అనేవాడు; ఒకసారి, యుక్రెయిన్ లోని కీవ్‌లో ప్రసంగం చేస్తున్నప్పుడు యుఎస్ఎస్ఆర్ ను "రష్యా" అని సంబోధించి, ఆ తరువాత సరిదిద్దుకోవలసి వచ్చింది. [435]

పెరెస్త్రోయికా "అంతుచిక్కని భావన" అని మెక్‌కాలే పేర్కొన్నాడు, ఇది "పరిణామం చెందుతూ వచ్చింది. కాలక్రమంలో దానికి పూర్తిగా భిన్నమైన అర్థం వచ్చింది." [437] శ్రమశక్తిని ఉత్తేజపరచడానికి, యాజమాన్యాన్ని సమర్థవంతంగా చేయడానికీ గోర్బచేవ్ చేసిన ప్రయత్నంలో భాగమే ఈ భావన. "ఆర్థిక, రాజకీయ వ్యవస్థల సమూల సంస్కరణ"ను ఇది సూచిస్తుందని మెక్‌కాలే పేర్కొన్నారు. [438] దీని అమలులో చేపట్టిన తొలి చర్యలు విజయవంతం కాలేదని తేలిన తరువాతే, గోర్బచేవ్ మార్కెట్ యంత్రాంగాలను, సహకార సంస్థలను పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభించాడు. ప్రభుత్వరంగ ఆధిపత్యం మాత్రం అలాగే కొనసాగింది. [438] రాజకీయ శాస్త్రవేత్త జాన్ గూడింగ్, పెరెస్త్రోయికా సంస్కరణలు విజయవంతమై ఉంటే సోవియట్ యూనియన్, "పాశ్చాత్యుల అర్థంలో ప్రజాస్వామికంగా" మారకపోయినా.., "సంపూర్ణ నియంతృత్వం నుండి స్వల్ప నిరంకుశాధిపత్యంగా" మారి ఉండేది అన్నాడు. [433] పెరెస్త్రోయికాతో, గోర్బచేవ్ ఇప్పటికే ఉన్న మార్క్సిస్ట్-లెనినిస్ట్ వ్యవస్థను మెరుగుపరచాలని అనుకున్నాడు, కాని చివరికి దానిని నాశనం చేశాడు. [439] ఈ క్రమంలో అతడు సోవియట్ యూనియన్‌లో రాజ్య సోషలిజానికి ముగింపు పలికి, ఉదార ప్రజాస్వామ్యం వైపుగా పరివర్తనకు బాటలు వేసాడు. [440]

టౌబ్మాన్ మాత్రం, గోర్బచేవ్ సోషలిస్టుగానే ఉండిపోయాడనే భావించాడు. [441] అతడు "ఒక నిజమైన విశ్వాసి-అతడి విశ్వాసం 1985 లో లాగా పనిచేసే సోవియట్ వ్యవస్థలో కాదు ("పనిచెయ్యని" అనుకోవచ్చు), దాని అసలు ఆదర్శాలు ఏవని తాను భావిస్తున్నాడో వాటిని పాటించడంలో దానికి ఉన్న సమర్ధతపై అతడికి విశ్వాసం ఉంది. [441] "చివరి వరకు, గోర్బచేవ్ సోషలిజంపై తన నమ్మకాన్ని పునరుద్ఘాటించాడు, ఇది నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే తప్ప దాని పేరుకు అర్హమైనది కాదని నొక్కి చెప్పాడు." అని కూడా టౌబ్మాన్ అన్నాడు [442] సోవియట్ నాయకుడిగా గోర్బచేవ్, ఒక విప్లవాత్మక పరివర్తన కంటే కొద్దికొద్దిగా జరిగే సంస్కరణను విశ్వసించాడు; [443] తరువాత అతడు దీనిని "క్రమ పరిణామం ద్వారా జరిగే విప్లవం"గా పేర్కొన్నాడు. [443] 1980 లలో, అతడి ఆలోచన "రాడికల్ పరిణామాని"కి గురైందని డోడర్, బ్రాన్సన్ లు గుర్తించారు. [444] 1989 లేదా 1990 నాటికి గోర్బచేవ్ సామ్యవాద ప్రజాస్వామ్యవాదిగా మారిపోయాడని టౌబ్మాన్ గుర్తించాడు. [391] కనీసం 1991 జూన్ నాటికి గోర్బచేవ్ "పోస్ట్-లెనినిస్ట్" అనీ, మార్క్సిజం-లెనినిజం నుండి "తనను తాను విముక్తి చేసుకున్నాడు" అనీ మెక్‌కాలే సూచించాడు. [445] సోవియట్ యూనియన్ పతనం తరువాత, కొత్తగా ఏర్పడిన రష్యన్ ఫెడరేషన్ కమ్యూనిస్ట్ పార్టీ అతడితో ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు. [446] అయితే, 2006 లో అతడు లెనిన్ ఆలోచనలపై తన నమ్మకం అలాగే ఉందని అన్నాడు: "నేను అతన్ని విశ్వసించాను, ఇంకా విశ్వసిస్తున్నాను". [441] "ప్రజల సజీవ సృజనాత్మక కార్యకలాపాలను" అభివృద్ధి చేయాలనే కోరికే "లెనిన్ తత్వసారం" అని అతడు పేర్కొన్నారు. [441] గోర్బచేవ్ లెనిన్‌తో మానసిక స్థాయిలో గుర్తించాడని టౌబ్మాన్ భావించాడు. [447]

వ్యక్తిగత జీవితం

గోర్బచేవ్[permanent dead link] యొక్క అధికారిక సోవియట్ చిత్రం; అనేక అధికారిక ఛాయాచిత్రాలు, దృశ్య చిత్రణల్లో తలపై ఉండే పుట్టుమచ్చను తీసేసారు [448]

గోర్బచేవ్ 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉండేవాడు. [449] తలపై ముందు భాగంలో ముదురు తేనె రంగులో పొడవాటి పుట్టుమచ్చ ఉండేది. 1955 నాటికి అతడి జుట్టు పలచబడటం మొదలై, [450] 1960 ల చివరినాటికి పూర్తిగా బట్టతల అయింది. 1960 లలో అతడు ఊబకాయాన్ని తగ్గించుకోడానికి కష్టపడ్డాడు. తిండి తగ్గించాడు; [46] డోడర్, బ్రాన్సన్ లు అతన్ని "బొద్దుగా ఉంటాడు గానీ, లావు కాదు" అని వర్ణించారు. [449] అతడు దక్షిణ రష్యన్ యాసలో మాట్లాడుతాడు. జానపద పాటలు, పాప్ పాటలూ పాడతాడు. [451]

అతడు ఫ్యాషన్‌గా ఉండే బట్టలు ధరిస్తాడు. [452] మద్యం పట్ల ఆసక్తి లేదు. [453] అరుదుగా తాగుతాడు. ధూమపానం చేయడు. [454] అతడు వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకుంటాడు. ఇంటికి ఎవరినీ ఆహ్వానించేవాడు కాదు. [74] భార్యను ఎంతో ప్రేమించాడు. [455] ఆమె కూడా అతడి పట్ల చాలా శ్రద్ధగా, రక్షణగా ఉండేది. [65] అతడొక మంచి తండ్రి, తాత కూడా. [456] తన కుమార్తె, తన ఏకైక బిడ్డ,ను పార్టీ శ్రేణుల పిల్లల కోసం ప్రత్యేకించిన పాఠశాలకు కాకుండా స్టావ్రోపోల్‌లోని స్థానిక పాఠశాలకే పంపాడు. [457] సోవియట్ వ్యవస్థ లోని అతడి సమకాలీనుల లాగా అతడు స్త్రీలోలుడు కాడు. మహిళలను గౌరవంగా చూస్తాడు. [42]

గోర్బచేవ్ రష్యన్ ఆర్థడాక్స్ బాప్తిజం తీసుకున్నాడు. అతడు పెరుగుతున్నప్పుడు, అతడి తాత, నాయనమ్మలు క్రైస్తవ మతాచారాలను అవలంబించేవారు. [458] 2008 లో, అతడు సెయింట్ ఫ్రాన్సిస్ అసీసీ సమాధిని సందర్శించాడు. తర్వాత అతడు క్రిస్టియన్ మతావలంబి అని పత్రికల్లో కొన్ని ఊహాగానాలు వచ్చాయి. అప్పుడు, తాను నాస్తికుణ్ణని బహిరంగంగా స్పష్టం చేసాడు.[459] విశ్వవిద్యాలయంలో చదివినప్పటి నుండి, గోర్బచేవ్ తనను తాను మేధావిగా భావించాడు; [460] డోడర్, బ్రాన్సన్, "అతడి తెలివితేటల్లో కొంచెం స్వీయ చేతన ఉంది" అని భావించారు [461] రష్యన్ మేధావి వర్గంలా కాకుండా, గోర్బచేవ్ "సైన్స్, సంస్కృతి, కళలు, లేదా విద్యా ప్రపంచానికి" దూరంగా ఉండేవాడు అని కూడా వారు అన్నారు. [462] స్టావ్రోపోల్‌లో నివసిస్తున్నప్పుడు దంపతులిద్దరూ వందలాది పుస్తకాలను సేకరించారు. [463] అతడి అభిమాన రచయితలలో ఆర్థర్ మిల్లెర్, దోస్తోవ్స్కీ, చింగిజ్ ఐట్మాటోవ్ ఉన్నారు. అతడు డిటెక్టివ్ ఫిక్షన్ కూడా ఇష్టంగా చదివేవాడు. [464] నడకలకు వెళ్ళడం ఇష్టం. [465] ప్రకృతి ప్రేమికుడు. [466] అసోసియేషన్ ఫుట్‌బాల్ అభిమాని కూడా. [467] చిన్న చిన్న గుంపుల్లో పాల్గొని కళ, తత్వశాస్త్రం వంటి అంశాలను చర్చించడం అతడి కిష్టం. సోవియట్ అధికారులలో సాధారణమైన మద్య చోదిత పార్టీలంటే ఇష్టపడడు. [468]

వ్యకిత్వం

గోర్బచేవ్ విశ్వవిద్యాలయ మిత్రుడు మ్లీనే అతన్ని "నమ్మకస్తుడు, వ్యక్తిగతంగా నిజాయితీపరుడు" అని అభివర్ణించాడు. అతడు ఆత్మవిశ్వాసం ఉన్నవాడు, మర్యాదస్తుడు, [454] చతురుడు. [454] సంతోషంగా, ఆశావాదంతో ఉంటాడు. అతడు తనపై తాను జోకులేసుకుంటాడు. [469] కొన్నిసార్లు బూతులు మాట్లాడుతాడు. [469] తనను తాను తృతీయ పురుషలో సంబోధించు కుంటూంటాడు. [470] అతడు నైపుణ్యం కలిగిన మేనేజరు, [42] మంచి జ్ఞాపకశక్తి ఉంది. [471] పనిరాక్షసుడు. ప్రధాన కార్యదర్శిగా ఉండగా, ఉదయం 7 - 8 కి లేచినవాడు, రాత్రి 1 - 2. గాంటల దాకా పడుకునేవాడు కాదు [472] టాబ్మాన్ "ఒక ఉత్కృష్టమైన మర్యాదస్తుడు" అని అన్నాడు. [455] గోర్బచేవ్‌కు "ఉన్నత నైతిక ప్రమాణాలు" ఉన్నాయని అతడు భావించాడు. [473]

గోర్బచేవ్[permanent dead link] జెరూసలెంలోని వెస్ట్రన్ వాల్ వద్ద, 1992 జూన్ 16

జోర్స్ మెద్వెదేవ్ అతన్ని ప్రతిభావంతులైన వక్తగా భావించాడు. బహుశా లియోన్ ట్రాట్స్కీ తరువాత గోర్బచేవే "పార్టీ అగ్రస్థాయి నాయకుల్లో ఉత్తమ వక్త" అని అతడు 1986 లో పేర్కొన్నాడు . [474] మెద్వెదేవ్ గోర్బచేవ్‌ను "ఆకర్షణీయమైన నాయకుడు" అని కూడా భావించాడు. బ్రెజ్నెవ్, ఆండ్రోపోవ్ చెర్నెంకోలకు లేని లక్షణం ఇది. [475] డోడర్, బ్రాన్సన్ అతన్ని "సందేహించేవారిని తెలివిగా బోల్తా కొట్టించగల మాయావి, వాళ్ళను తనవైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తాడు. కనీసం వారి విమర్శల పదును తగ్గిస్తాడు" అని అన్నారు. [476] దీర్ఘ కాలిక వ్యూహాల కంటే, స్వల్పకాలిక ఎత్తుగడలు పన్నడంలో గోర్బచేవ్ నేర్పరి అని మెక్‌కాలే అన్నాడు. [477]

గోర్బచేవ్ "మనసా వాచా కర్మణా ఒక రష్యను, తీవ్రమైన దేశభక్తి పరుడు సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రజలకు మాత్రమే ఉండే లక్షణమిది" అని డోడర్, బ్రాన్సన్ లు భావించారు. [435] మాజీ సోవియట్ నాయకుడికి "తాను ముఖ్యుణ్ణని, నీతిమంతుడననీ" భావన ఉందని టౌబ్మాన్ అన్నాడు. అతడికి "గుర్తింపు, ప్రశంస అవసరం" అని కూడా అన్నాడు. [473] అతడు వ్యక్తిగత విమర్శల పట్ల ఎక్కువగా స్పందించేవాడు, వాటిని తప్పుబట్టేవాడు. అతడు పనులు అసంపూర్తిగా వదిలేస్తాడని సహచరులు నిరుత్సాహపడుతూంటారు [478] ఇతరులను మెచ్చుకోడు, పట్టించుకోడు అని కూడా కొన్నిసార్లు భావిస్తూంటారు [479] జీవితచరిత్ర రచయితలు డోడర్, బ్రాన్సన్ లు గోర్బచేవ్ "తన వ్యక్తిగత జీవితంలో ఒక పద్ధతిగా, క్రమశిక్షణతో" ఉండేవాడని భావించారు. [480] టౌబ్మాన్ "కావాల్సిన ఫలితం కోసం కోపంతో అరిచే సామర్థ్యం అతడికి ఉంది" అని పేర్కొన్నాడు. [481] 1990 నాటికి, దేశంలో తనకు ప్రజాదరణ క్షీణిస్తున్నప్పుడు, గోర్బచేవ్ "విదేశాలలో వచ్చే మెప్పుదలపై మానసికంగా ఆధారపడేవాడు" అని టౌబ్మాన్ భావించాడు. ఈ లక్షణానికి గానూ అతడు దేశంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. [482] "తన చర్యల పరిణామాలను ఊహించలేకపోవడం అతడి బలహీనతలలో ఒకటి" అని మెక్‌కాలే అభిప్రాయపడ్డాడు. [483]

ఆదరణ, వారసత్వం

గోర్బచేవ్‌పై అభిప్రాయాలు చాలా విభిన్నంగా ఉంటాయి. [470] చాలామంది, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో, ఇరవయ్యో శతాబ్దపు రెండవ భాగంలోని గొప్ప రాజనీతిజ్ఞుడిగా అతణ్ణి చూస్తారు. [484] యుఎస్ ప్రెస్ 1980 ల చివరలో, 1990 ల ప్రారంభంలోనూ పాశ్చాత్య దేశాలలో "గోర్బిమానియా" ఉందని సూచించింది. అతడి సందర్శనల్లో పలకరించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరేవారు. టైమ్ పత్రిక అతన్ని 1980 లకు "ఈ దశాబ్దపు వ్యక్తి"గా గణించింది [485] సోవియట్ యూనియన్‌లోనే, 1985 నుండి 1989 చివరి వరకు గోర్బచేవ్ అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడని అభిప్రాయ సేకరణలు సూచించాయి. [486] తన దేశీయ మద్దతుదారులు గోర్బచేవ్ సోవియట్ యూనియన్‌ను ఆధునీకరించడానికి ప్రయత్నిస్తున్న సంస్కర్తగా చూసారు. [487] ప్రజాస్వామ్య సోషలిజం నిర్మాతగా చూసారు. [488] టౌబ్మాన్ గోర్బచేవ్‌ను "తన దేశాన్ని, ప్రపంచాన్నీ మార్చిన దార్శనికుడు-అతడు కోరుకున్నంత కాకపోయినా" అని వర్ణించాడు. [489] టౌబ్మాన్ గోర్బచేవ్‌ను "అసాధారణమైనవాడు ... రష్యన్ పాలకుడిగా, ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా" అని భావించాడు. బ్రెజ్నెవ్ వంటి పూర్వీకుల, పుతిన్ వంటి వారసుల యొక్క "సాంప్రదాయ, అధికార, పాశ్చాత్య వ్యతిరేక కట్టుబాటు"ను అతడు తప్పించాడని హైలైట్ చేశాడు. [490] సోవియట్ యూనియన్‌ మార్క్సిజం-లెనినిజం నుండి దూరం జరగడానికి అనుమతించడంలో, గోర్బచేవ్ సోవియట్ ప్రజలకు "విలువైనది ఇచ్చాడు, ఆలోచించే హక్కు, తమ జీవితాలను తాము జీవించే హక్కును ఇచ్చాడ"ని, మెక్‌కాలే అన్నాడు. [491]

అమెరికాతో గోర్బచేవ్ జరిపిన చర్చలు ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలకడానికి సహాయపడ్డాయి. అణు సంఘర్షణ ముప్పును తగ్గించాయి. [489] తూర్పు బ్లాక్ విడిపోవడానికి అనుమతించాలనే అతడి నిర్ణయం మధ్య, తూర్పు ఐరోపాలో గణనీయమైన రక్తపాతాన్ని నివారించింది; టౌబ్మాన్ గుర్తించినట్లుగా, దీని అర్థం " సోవియట్ సామ్రాజ్యపు" ముగింపు అనేక దశాబ్దాల ముందు బ్రిటిష్ సామ్రాజ్యపు ముగింపు కంటే చాలా శాంతియుతంగా ముగిసింది. [489] అదేవిధంగా, గోర్బచేవ్ ఆధ్వర్యంలో సోవియట్ యూనియన్ అంతర్యుద్ధం బారిన పడకుండా విడిపోయింది, అదే సమయంలో యుగోస్లేవియా విభజన కూడా అలాగే ప్రశాంతంగా జరిగింది. తూర్పు పశ్చిమ జర్మనీల విలీనాన్ని సులభతరం చేయడంలో, గోర్బచేవ్ "జర్మన్ ఏకీకరణకు సహ పిత" అని జర్మనీ ప్రజలలో దీర్ఘకాలిక ప్రజాదరణను పొందారని మెక్‌కాలే గుర్తించారు. [492]

అతడు దేశీయంగా కూడా విమర్శలను ఎదుర్కొన్నాడు. తన కెరీర్లో, గోర్బచేవ్ కొంతమంది సహచరుల ప్రశంసలను పొందాడు, కాని కొందరు అతన్ని ద్వేషించారు. [473] సోవియట్ ఆర్థిక వ్యవస్థ క్షీణతను ఆపడంలో వైఫల్యం సమాజంలో మరింత విస్తృతంగా అసంతృప్తిని తెచ్చిపెట్టింది. [493] మార్క్సిజం-లెనినిజం నుండి విడివడి స్వేచ్ఛా మార్కెట్ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి సరిపడినంత రాడికలిజం అతడికి లేదని లిబరల్స్ భావించారు.[494] దీనికి విరుద్ధంగా, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన విమర్శకులు చాలామంది, అతడి సంస్కరణలు నిర్లక్ష్యంగా చేసినవని భావించారు. అవి సోవియట్ సోషలిజం మనుగడకు ముప్పు తెచ్చాయని అన్నారు; [495] అతడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒరవడిని అనుసరించి ఉండాల్సిందని, ప్రభుత్వ సంస్కరణల కంటే ఆర్థికానికి మాత్రమే పరిమితమై ఉండాల్సిందనీ కొందరు భావించారు. [496] బలప్రయోగం ద్వారా కాకుండా ఒప్పించడంపై అతడు దృష్టి పెట్టడంతో దాన్ని చాలా మంది రష్యన్లు బలహీనతకు చిహ్నంగా తీసుకున్నారు. [442]

కమ్యూనిస్ట్ పార్టీ అధికార వ్యవస్థలో ఎక్కువ భాగానికి, సోవియట్ యూనియన్‌ను రద్దు చేయడం విపత్కరమైనది. ఎందుకంటే ఇందులో వారు అధికారం కోల్పోయారు. [497] సోవియట్ యూనియన్ పతనంలోను, ఆ తరువాతి ఆర్థిక పతనంలోనూ అతడి పాత్రకు గానూ రష్యాలో అతన్ని చీదరించుకున్నారు. [470] గోర్బచేవ్‌పై 1991 తిరుగుబాటు ప్రయత్నాన్ని నిర్వహించిన వారిలో ఒకరైన జనరల్ వారెన్నికోవ్, అతన్ని "మీ స్వంత ప్రజలకు విశ్వాసఘాతకుడివి, ద్రోహివి" అన్నాడు. [375] తూర్పు ఐరోపా అంతటా మార్క్సిస్ట్-లెనినిస్ట్ ప్రభుత్వాల పతనానికి, [498] ఏకీకృత జర్మనీ నాటోలో చేరడానికీ బాధ్యుడిగా, అవి రష్యా జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని భావించే వారు విమర్శించారు. [499]

గోర్బచేవ్‌కు అతడి ముందున్న ఆండ్రోపోవ్‌కూ మధ్య సంబంధాన్ని చరిత్రకారుడు మార్క్ గాలొట్టి నొక్కిచెప్పారు. గాలొట్టి దృష్టిలో, ఆండ్రోపోవ్ "గోర్బచేవ్ విప్లవానికి గాడ్ ఫాదర్". KGB యొక్క మాజీ అధిపతిగా, ఆంధ్రొపోవ్ సోవియట్ పట్ల తన విధేయతను ఎవరికీ సందేహం కలక్కుండా సంస్కరణ కోసం వాదనను ముందుకు తీసుకురాగలిగాడు. గోర్బచేవ్ కూడా ఆ విధానంలోనే ముందుకు పోయాడు. [500] మెక్‌కాలే ప్రకారం, గోర్బచేవ్ "ఎక్కడికి దారి తీస్తాయో కూడా అర్థం చేసుకోకుండా సంస్కరణలను మొదలుపెట్టాడు. పెరెస్ట్రోయికా సోవియట్ యూనియన్ నాశనానికి దారితీస్తుందని కలలో కూడా ఎప్పుడూ ఊహించి ఉండడు". [501]

పురస్కారాలు, అలంకరణలు, గౌరవాలు

యునైటెడ్[permanent dead link] స్టేట్స్ మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ గోర్బచేవ్‌కు రీగన్ లైబ్రరీలో 1992 మే 4 న మొట్టమొదటి రోనాల్డ్ రీగన్ ఫ్రీడమ్ అవార్డును ప్రదానం చేశారు.

1988 లో, భారతదేశం శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధికి గాను గోర్బచేవ్‌కు ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేసింది; [502] 1990 లో "అంతర్జాతీయ సమాజం లోని ముఖ్యమైన భాగాలు ఇవ్వాళున్న స్థితిలో ఉండడానికి కారణమైన శాంతి ప్రక్రియలో అతడు పోషించిన ప్రధాన పాత్రకు" గాను అతడికి నోబెల్ శాంతి బహుమతి లభించింది.[361] పదవి నుండి విరమించుకున్నాక కూడా అతణ్ణి పురస్కారాలు వరిస్తూనే వచ్చాయి. 1992 లో అతడు మొదటి రోనాల్డ్ రీగన్ ఫ్రీడమ్ అవార్డును అందుకున్నాడు.[361] 1994 లో కెంటకీలోని లూయివిల్ల్ విశ్వవిద్యాలయం గ్రావ్‌మేయర్ పురస్కారం ఇచ్చింది.[361] 1995 లో పోర్చుగీస్ ప్రెసిడెంట్ మారియో సోరెస్ గోర్బచేవ్‌కు గ్రాండ్-క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లిబర్టీ ఇచ్చాడు.[361] 1998 లో టెన్నెస్సీ, మెంఫిస్‌లోని నేషనల్ సివిల్ రైట్స్ మ్యూజియం నుండి ఫ్రీడమ్ అవార్డు పొందాడు.[361] 2002 లో, గోర్బచేవ్ డబ్లిన్ సిటీ కౌన్సిల్ నుండి ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ డబ్లిన్ పొందాడు.[361]

2002 లో, గోర్బచేవ్‌కు చార్లెస్ V బహుమతిని యూరోపియన్ అకాడమీ ఆఫ్ యుస్టే ఫౌండేషన్ నుండి అందుకున్నాడు.[503] గోర్బచేవ్, బిల్ క్లింటన్, సోఫియా లోరెన్‌లతో కలిసి, సెర్గీ ప్రోకోఫీవ్ యొక్క పీటర్ అండ్ వుల్ఫ్ రికార్డింగ్ చేసినందుకు పిల్లల కోసం బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్‌ ఫర్ చిల్డ్రన్ 2004 గ్రామీ అవార్డును అందుకున్నాడు.[504] జర్మన్ పునరేకీకరణకు మద్దతు ఇచినందుకు 2005 లో గోర్బచేవ్‌కు పాయింట్ ఆల్ఫా బహుమతి లభించింది.[505]

రచనలు

ప్రచురణ సంవత్సరంపుస్తకం పేరుసహ రచయితప్రచురణకర్త
1996మెమొయిర్స్డబుల్‌డే
2005మోరల్ లెసన్స్ ఆఫ్ ది ట్వెంటియత్ సెంచురీ: గోర్బచేవ్ అండ్ ఇకెడ ఆన్ బుద్ధిజం అండ్ కమ్యూనిజందైసకు ఇకెడఐ.బి.టారిస్
2016ది న్యూ రష్యాపాలిటీ
2018ఇన్ ఎ ఛేంజింగ్ వరల్డ్

మరణం

సోవియెట్ యూనియన్ చివరి అధినేతగా చరిత్రకెక్కిన మిఖాయిల్‌ గోర్బచేవ్‌ 91 ఏళ్ల వయసులో 2022 ఆగస్టు 30న దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచాడు.[506]

నోట్స్

మూలాలు

మూలాలు

బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Interviews and articles