ఫీల్డ్స్ పతకం

ఫీల్డ్స్ పతకం ప్రపంచంలోని యువ గణిత శాస్త్రవేత్తలకు లభించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుమతి. గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా దీనిని పరిగణిస్తారు. 40 ఏండ్లు పైబడని ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు గణిత శాస్త్రవేత్తలకు, ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఇంటర్‌నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేథమేటీషీయన్స్ (ఐసీఎం) సందర్భంగా ఈ పురస్కారం లభిస్తుంది. పతకంతోబాటు 15,000 కెనేడియన్ డాలర్లు కుడా ఇవ్వడం జరుగుతుంది. ఈ బహుమతి యొక్క ఆధికారిక నామం ఇంటర్నేష్నల్ మెడల్ ఫర్ ఔట్ స్టాండింగ్ డిస్కవరీస్ ఇన్ మాథమాటిక్స్ అయినప్పటికీ, దీనిని స్థాపించడానికి కృషి చేసి, ఆర్థిక వనరులను సమకూర్చిన జోన్ చార్ల్స్ ఫీల్డ్స్ యొక్క పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఫీల్డ్స్ పతకంగా గుర్తింపు పొందింది.

ఫీల్డ్స్ పతకం
ఫీల్డ్స్ పతకం యొక్క ముఖ భాగం
వివరణగణిత శాస్త్రం లో చేసిన విశేష కృషికి లభించే పురస్కారం
అందజేసినవారుఇంటర్నేష్నల్ మేథమాటికల్ యూనియన్ ( ఐ ఎం యు)
Reward(s)C$15,000
మొదటి బహుమతి1936 (1936)
Last awarded2010
వెబ్‌సైట్https://mathunion.org/imu-awards/fields-medal Edit this on Wikidata

ఫీల్డ్స్ పురస్కారం మొట్టమొదటి సారి 1936లో ఫిన్లాండుకు చెందిన లార్స్ అల్ఫోర్స్, అమెరికాకు చెందిన జెస్సి డగ్లస్ లకు లభించింది.రెండో ప్రపంచ యుధ్ధం కారణంగా ఐసీఎం జరగకపోవడం చేత 1950 వరకు ఈ బహుమతి ఎవ్వరికీ దక్కలేదు. అటు తరువాత ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వబడుతూ వచ్చింది. ఇటీవలి కాలంలో ఐసీఎం 2010 లో హైదరబాదులో జరిగింది.

చరిత్ర

1923లో టొరొంటొ విశ్వవిద్యాలయం చేత స్థాపించబడిన కమిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ కి ఫీల్డ్స్ అధ్యక్షత వహించారు. ఫీల్డ్స్ పతకం యొక్క ప్రస్తావన మొదటిసారిగా ఫిబ్రవరి 24, 1931న జరిగిన కమిటీ సమావేశంలో వచ్చినట్టుగా నమోదు చేయబడి ఉంది.[1] ప్రారంభంలో రెండు పతకాలు, $2,500 నగదు బహుమానంగా నిర్ణయించడం జరిగింది. ఆ తరువాత ఫ్రాన్స్, జర్మనీ, ఇతర దేశాలలోని గణిత శాస్త్రవేత్తల బృందాల నుండి ఈ ఆలోచనకు మద్దతు లభించింది. ఈ విధంగా ఫీల్డ్స్ తన ఆలోచనను అమలుపరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసాడు. కానీ తన ప్రణాళిక కార్యరూపం దాల్చేముందే ఆగస్టు 9, 1932 న ఫీల్డ్స్ కన్ను మూసాడు. వీలునామాలో తన ఆస్తిలో నుండి $47,000 ఈ పతకం కొరకు ఫీల్డ్స్ సమకూర్చాడు.[1] ఈ పతకం ఏ ఒక్క వ్యక్తికిగానీ, దేశానికిగాని సంబంధం లేకుండా తగినంతవరకు నిష్పాక్షిక స్వభావం కలిగి ఉండాలని ఫీల్డ్స్ భావించాడు. అయినప్పటికీ ఈ పతకం యొక్క పేరు ఫీల్డ్స్ పతకంగా నిలిచిపోయింది.

ఆకృతి

పతకం యొక్క వెనుక భాగం

ఫీల్డ్స్ పతకాన్ని కెనడాకు చెందిన రోబర్ట్ టేట్ మెక్కెంజీ అనే శిల్పి రూపొందించాడు. ఈ పతకం 9 సెంటిమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. పతకానికి ఒక వైపుకుడి వైపుకి తిరిగి ఉన్న గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడెస్ యొక్క ముఖము, గ్రీకు అక్షరములలో అతని పేరు, టేట్ మెక్కెంజీ యొక్క సంతకము ("RTM"), రోమన్ సంఖ్యామానంలో తేది ("MCMXXXIII" అనగా 1930), లాటిన్ అక్షరాలలో సామెత ("Transire suum pectus mundoque potiri" ) ఉంటాయి. పతకానికి మరో వైపు లాటిన్ భాషలో ఈ విధంగ ముద్రించబడి ఉంటుంది: CONGREGATI EX TOTO ORBE MATHEMATICI OB SCRIPTA INSIGNIA TRIBUEREదీని అర్ధము ఈ విధంగా ఉంటుంది: "ప్రపంచమంతటి నుండి హాజరు అయిన గణిత శాస్త్రవేత్తలు అత్యుత్తమ రచనలకు గాను ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు". పతకాన్ని అందుకునే శాస్త్రవేత్త పేరు పతకం అంచులో ముద్రించబడి ఉంటుంది.[2]

గ్రహీతలు

సంవత్సరంఐసిఎం జరిగిన నగరంగ్రహీతలు[3]
1936 ఓస్లోలార్స్ అల్ఫోర్స్
జెస్సి డగ్లస్
1950 కేంబ్రిడ్జ్లారెంట్ స్క్వార్ట్జ్
అట్లె సెల్బెర్గ్
1954 ఆంస్టర్‌డామ్కునిహికొ కొడైర
జాన్-పియెరీ సెర్రీ
1958 ఎడిన్బర్గ్క్లాస్ రోత్
రెనే థామ్
1962 స్టాక్‌హోమ్లార్స్ హోర్మందర్
జాన్ మిల్నోర్
1966 మాస్కోమైఖేల్ ఆటియ
పాల్ జోసెఫ్ కోహెన్
అలెగ్జాండర్ గ్రోథెండీక్
స్టీఫెన్ స్మలె
1970 నైస్అలాన్ బేకర్
హేసుకె హెరొనక
సెర్గీ నొవికవ్
జాన్ జి థాంప్సన్
1974 వాంకోవర్ఎన్రికో బొంబెయెరీ
డేవిడ్ మంఫొర్డ్
1978 హెల్సింకిపియరీ దులిన్య్
చార్ల్స్ ఫెఫెర్మన్
గ్రిగొరీ మర్గులిస్
డేనియల్ క్వెల్లెన్
1982 వార్సాఅలైన్ కొన్న్
విలియం థర్స్టన్
షింగ్ టంగ్ యు
1986 బర్కిలీసైమన్ డొనల్ద్సొన్
గెర్డ్ ఫల్టింగ్స్
మైఖేల్ ఫ్రీడ్మన్
1990 క్యొటొవ్లాదిమిర్ డ్రింఫెల్డ్
వాన్ ఎఫ్ ఆర్ జోన్స్
షెజెఫ్యుమె మొరి
ఎడ్వర్డ్ విట్టెన్
1994 జూరిఖ్జాన్ బోర్గన్
పియరీ-లూయిస్ లయన్స్
జాన్-క్రిస్టోఫ్ యొక్కొజ్
ఎఫిం జెల్మనొవ్
1998 బెర్లిన్రిచర్డ్ బొర్చర్డ్స్
టిమొతి గౌవర్స్
మాగ్జిం కొంట్సెవిచ్
కర్టిస్ మక్ ముల్లెన్
2002 బీజింగ్లారెంట్ లఫోర్గ్
వ్లాదిమిర్ వొవొడ్స్కి
2006 మాడ్రిడ్ఆండ్రె ఒకుంకోవ్
గ్రిగోరి పెరెల్మాన్*
టెరెన్స్ టాఒ
వెండెలిన్ వెర్నెర్
2010 హైదరాబాద్ఈలన్ లిండెన్ స్ట్రౌస్
గొ బొ చౌ
స్టానిస్లావ్ స్మిర్నోవ్
సెడ్రిక్ విల్లని
2014 సియోల్మంజుల్ భార్గవ
మార్టిన్ హైరర్
మరియం మిర్జాఖనీ

*గ్రిగోరి పెరెల్మాన్ ఈ పురస్కారాన్ని తిరస్కరించారు.

మూలాలు